మళ్లీ గెలిపిస్తే ఆర్నెళ్లలో అద్దం లాంటి రోడ్లు.. జగన్ హామీ జనం నమ్మేస్తారనే?

జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలలో ఇవ్వడానికి వేరే హామీలేవీ లేవు. ఎందుకంటే గత ఎన్నికల సమయంలో ఆయన చేసిన వాగ్దానాలలో  పూర్తిగా నెరవేర్చిన హామీ ఒక్కటీ లేకపోవడమే. ఇప్పుడు ఆయన మరో చాన్స్ ఇవ్వండి అంటూ ప్రజల ముందుకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఆయన గత ఐదేళ్లలో హామీల అమలులో విఫలమయ్యాను.. ఈ సారి ఎన్నుకుంటే ఆ హామీలన్నిటినీ ఆరంటే ఆరు నెలల్లో నెరవేర్చి చూపుతాను అంటూ కొత్త పాట మొదలు పెట్టడానికి రెడీ అయిపోయారు.  సరే గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీల గురించి ప్రస్తావించడం కంటే ముందు.. ఈ ఐదేళ్లలో ఆయన హయాంలో రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. పొరుగు రాష్ట్రాల వారు సైతం సెటైర్లు వేసేంత దుస్థితిలో  ఏపీలో రోడ్ల పరిస్థితి ఉంది. గుంతలలో పడి ఎన్ని ఆర్టీసీ బస్సుల చక్రాలు ఊడి రోడ్ల పక్కకు దౌడు తీశాయో లెక్క లేదు. ఎన్ని చోట్ల ఆర్టీసీ సిబ్బంది బస్సులను నడపలేం అంటూ చేతులెత్తేశారో చెప్పడం కూడా సాధ్యం కాదు. రోడ్ల దుస్థితి కారణంగా జరిగిన ప్రమాదాలలో మరణించిన వారు, క్షతగాత్రులైన వారి సంఖ్య లెక్కపెట్టడమే సాధ్యం కాదు.  రోడ్లు బ్రహాండంగా ఉన్నాయని ప్రభుత్వం ఎంతగా సొంత బాకా ఊదుకుందామని ప్రయత్నించినా ఫలితం లేని విధంగా సామాజిక మాధ్యమంలో రోడ్ల దుస్థితిపై వీడియోలు ప్రత్యక్ష సాక్షాలుగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ప్రతి ఐదారు నెలలకూ రాష్ట్రంలో రోడ్లపై సమీక్ష చేసే జగన్ ప్రతి సమీక్షలోనూ,  ఆరు నెలల్లో రాష్ట్రం అంతటా గుంతలు లేని రోడ్లే ఉండాలంటూ ఆదేశాలు ఇవ్వడం, అంతే మళ్లీ ఆరు నెలల వరకూ ఆ ఊసే ఎత్తక పోవడం రివాజుగా మారిపోయింది. ఇక ఇప్పుడు రోడ్ల దుస్థితిపై ఎవరినీ మభ్య పెట్టడానికి వీల్లేని పరిస్థితి వచ్చేసింది. వచ్చే ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే సమయం ఆసన్నమైపోయింది. ఆ తరువాత సమీక్షలు చేయడానికి వీలుండదు. ఇప్పటికిప్పుడు సమీక్షలు పెట్టుకుని రోడ్లు బాగు చేసేశామనో, చేసేస్తామనో చెప్పినా జనం నమ్మేందుకు సిద్ధంగా లేరు. దీంతో జగన్ వాస్తవాన్ని అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈ సారి విఫలమయ్యాను, కానీ మరో చాన్స్ ఇచ్చి చూడండి ఆరు నెలల్లో గుంతలు లేని నున్నటి రోడ్లు నిర్మించి చూపిస్తానని జనాన్ని నమ్మించేయడానికి రెడీ అయిపోయారు. అలా చెబితే నమ్ముతారన్న వెర్రినమ్మకం ఆయనలో ఎక్కడ నుంచి వచ్చిందా అని పరిశీలకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  ఈ సారి నున్నటి రోడ్లు అంశాన్ని మేనిఫెస్టోలో పెడతానని చెబుతున్నారు. అసలు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలకే ఈ ఐదునెలల్లో దిక్కూ దివాణం లేదనీ, అటువంటిది వచ్చే ఎన్నికలలో రోడ్ల ను అద్దంలా చేస్తాను అంటే మేనిఫెస్టోలో పెట్టినంత మాత్రన జనం ఎలా నమ్ముతారని పరిశీలకులు అంటున్నారు. గత ఐదేళ్లలో రోడ్ల లీటర్ పెట్టోల్, డిజిల్ పై అదనంగా రోడ్ల నిర్వహణ కోసం అని రూపాయి చొప్పున అదనంగా వసూలు చేసి చేసిందేమిటన్న ప్రశ్నకే సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్న జగన్, అలా అదనంగా రోడ్ల కోసం అంటూ వసూలు చేసిన సొమ్ములను కూడా అరకొర పందేరాల పేరిట వాడేశారు. అలాగే నిబంధనలను తుంగలోకి తొక్కి తీసుకువచ్చిన కోట్లకు కోట్ల రుణాలు, చెత్త నుంచి మొదలు పెట్టి అయిన దానికీ కాని దానికీ కూడా వసూలు చేసిన పన్నులు ఇలా అసలు రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న సోమ్ముకూ, తీసుకువచ్చిన అప్పులకూ లెక్కాపత్రం లేకుండా చేసిన జగన్ సర్కార్ ఇప్పుడు వచ్చే ఎన్నికలలో గెలిస్తే రోడ్లను మరమ్మతు చేయిస్తానంటూ చెప్పడంపై నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు. మళ్లీ జనాలను మోసం చేయగలరా అని సవాల్ సైతం చేస్తున్నారు. రోడ్ల పేరు చెప్పి  బ్యాంకులు.. అంతర్జాతీయ. సంస్థల నుంచి దొరికినంత అప్పు చేసి ఆ సోమ్ములనూ దారి మళ్లించేశారు. దీంతో మరో సారి రోడ్ల పేరు చెబితే పైసా అప్పు కూడా పుట్టే అవకాశం ఇసుమంతైనా లేదు. అయినా ఎన్నికలకు సిద్ధం అన్న నోటితోనే ఆరు నెలల్లో రోడ్లను అద్దంగా మారుస్తామంటూ చెప్పడానికి సిద్ధం అయిపోతున్నారు జగన్.   అసలు మౌలిక సదుపాయాల గురించి ఐదేళ్లలో ఏ మాత్రం పట్టించుకోని జగన్  సర్కార్ అదేమని అడిగిన వారికి మీకు ఉత్తినే డబ్బులు పంచుతున్నాం కదా అని ఎదురు ప్రశ్నించింది. వైసీపీ నేతలు అయితే జనం రోడ్ల కోసం నిలదీస్తే.. పధకాలు కావాలంటే మీకు సొమ్ములివ్వం జాగ్రత్త అంటూ బెదరించడానికి కూడా వెనుకాడలేదంటే వైసీపీ ఎంతగా బరితెగించేసిందో అర్ధమౌతోంది.  ఈ బరితెగింపును పంటి బిగువున భరించిన ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికలలోగా జగన్ ఆరునెలల్లో రోడ్లు వంటి ఎన్ని హామీలు ఇచ్చినా నమ్మేందుకు సిద్ధంగా లేరు. వైసీపీ బరితెగింపుపై తమ ఆగ్రహాన్ని ఓటు రూపంలో చూపేందుకు రెడీగా ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సొంత సర్వేలతో సహా అన్ని సర్వేలూ అదే విషయాన్ని చెబుతున్నాయి. 

చేవెళ్ల  బరిలో నుంచి  రంజిత్ రెడ్డి  దూరం 

బీఆర్ఎస్ కు రోజుకో ఇబ్బంది వ‌చ్చిప‌డుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి ఆ పార్టీ అధినాయ‌క‌త్వాన్నే కాదు నేత‌ల‌ను కూడా వ‌ణికిస్తోంది. బీఆర్ఎస్ నుండి పోటీ అంటే నేత‌లంతా గ‌తంలో సంతోష‌ప‌డేవారు. టికెట్ కోసం పైర‌వీలు చేసుకునే వారు. కానీ ఇప్పుడు పిలిచి టికెట్ ఇస్తామ‌న్నా ఒక‌టికి రెండుసార్లు ఆలోచించుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది.  అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత కేటీఆర్ లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు రివ్యూలు చేశారు. అందులో ఫ‌స్ట్ రివ్యూ చేసిన స్థానం చేవేళ్ల.  సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి మ‌ళ్లీ పోటీ చేస్తార‌ని ప్ర‌క‌టించారు కూడా. ఆయ‌న కూడా గ్రౌండ్ రెడీ చేసుకున్నారు.  కానీ చేవేళ్ల‌లో ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయి. బ‌ల‌మైన నేత‌గా ఉన్న ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి దంప‌తులు కాంగ్రెస్ కు జైకొట్టారు. మాజీ ఎమ్మెల్యే తీగ‌ల కృష్ణారెడ్డి, ఆయ‌న కోడ‌లు జెడ్పీ చైర్మ‌న్ కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. ఇక బీఆర్ఎస్ లో ఉన్న గ్రూప్ గొడ‌వ‌ల‌కు తోడు, బీజేపీ నుండి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. చేవేళ్ల ఇంచార్జ్ గా సీఎం రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీ తరపున ఉండ‌టంతో ఆ పార్టీ  ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది.  దీంతో, పోటీపై ఎంపీ రంజిత్ రెడ్డి పున‌రాలోచ‌న‌లో ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. త్రిముఖ పోటీ జ‌రిగితే బీఆర్ఎస్ కు ఇబ్బంది  అన్న ఉద్దేశంతో రంజిత్ రెడ్డి  పోటీ నుంచి త‌ప్పుకుంటున్నారు.  అధిష్టానానికి  ఇప్పటికే స‌మాచారం ఇచ్చార‌ని సమాచారం. దీంతో పార్టీ మాజీమంత్రి స‌బితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి అవ‌కాశం ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్రచారం జ‌రుగుతోంది.  స‌బితా ఇంద్రారెడ్డి ఫ్యామిలీ క‌న్నా పెద్ద లీడ‌ర్ ఎవ‌రూ ఇప్ప‌టికిప్పుడు ఎంపీగా నిల్చుకునే ప‌రిస్థితి లేక‌పోవ‌టంతో... పార్టీ కూడా కార్తీక్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయి.  ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ అధిష్టానం ప‌ని చేసుకోవాల‌ని సూచించిన‌ట్లు తెలంగాణ భ‌వ‌న్ వ‌ర్గాల క‌థ‌నం. మొన్న‌టి  వ‌ర‌కు సికింద్రాబాద్ సీటు కోసం ప్ర‌య‌త్నించిన కార్తీక్ రెడ్డి చేవేళ్ల బ‌రిలో ఉంటారో లేదో  వేచి చూడాలి.

డ్రైవర్ లేకుండా  పరుగులు తీసిన గూడ్స్ రైలు

లోకో పైలట్‌ లేకుండా ఓ గూడ్స్ రైలు 78 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి కలకలం సృష్టించింది. జమ్ముకశ్మీర్‌లోని కథువా స్టేషన్‌లో 53 వ్యాగన్ల చిప్ స్టోన్స్ లోడుతో జమ్ముకశ్మీర్ నుంచి పంజాబ్ బయలుదేరిన గూడ్స్ రైలు  జమ్ములోని కథువా రైల్వేస్టేషన్లో ఆగింది. అయితే లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ హ్యాండ్ బ్రేక్ వేయకుండానే బయటకు వెళ్లిపోగా పఠాన్ కోట్ వైపు రైల్వే ట్రాక్ వాలుగా ఉండటం వల్ల రైలు ముందుకు కదిలి గంటకు 100 కిలో మీటర్ల వేగం అందుకుని 84 కిలోమీటర్లు ప్రయాణించింది.చివరికి ఉచ్చి బస్సీ రైల్వే స్టేషన్ వద్ద చెక్క దిమ్మెలు అడ్డుపెట్టి అపాల్సి వచ్చింది.ఈ రైలు ప్రయాణిస్తున్న సమయంలో ట్రాక్ పై ఎదురుగా రైళ్లు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 2020లో జార్ఖండ్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. బర్సువా రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు నిలబడి ఉంది. ఈ సమయంలో రైలు ఒక్కసారిగా బోల్తా పడింది. దీని తరువాత, రైలు బిమల్‌ఘర్ రైల్వే స్టేషన్ వైపు వెనుకకు కదలడం ప్రారంభించింది. గంటకు 100 కి.మీ వేగంతో పరుగెత్తడం ప్రారంభించింది.

శ్రీరెడ్డి పై  షర్మిల కేసు నమోదు 

తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో శ్రీరెడ్డి పోస్టింగ్స్ చేస్తున్నట్లు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.ఈ మేరకు ఆమె సైబర్ క్రైమ్ లో పిర్యాదు చేశారు.  ఉద్దేశపూర్వకంగా తనను భయభ్రాంతులకు గురిచేసేలా పోస్టులు పెడుతూ, తనను మానసికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు నటి శ్రీరెడ్డి, వర్రా రవీందర్ రెడ్డి, పంచ్ ప్రభాకర్ సహా ఎనిమిదిమందిపై వైఎస్ షర్మిల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీలో ప్రజలను కలిసేందుకు ప్రచారం ప్రారంభించానని.. అయితే ఈ సందర్భంగా కొందరు దురుద్దేశంతో తనపైనా, తన సహచరులపై అసభ్య కామెంట్లు పెడుతున్నారని షర్మిల పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. నిరాధారమైన పోస్టులతో తనను అవమానిస్తున్నారని అన్నారు. అలాగే తన గురించి కొన్ని పీడీఎఫ్ పోస్టులను సోషల్ మీడియాలో సర్క్కులేట్ చేస్తున్నారని షర్మిల ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు, పోస్టులతో తన వ్యక్తిత్వాన్ని దిగజార్చుతున్నారని.. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సైబర్‌క్రైమ్ పోలీసులను కోరారు.మరోవైపు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేసిన వారిలో సినీ నటి శ్రీరెడ్డి, వర్రా రవీందర్ రెడ్డి, పంచ్ ప్రభాకర్, మేదరమెట్ల కిరణ్‌కుమార్‌, రమేశ్‌ బులగాకుల, ఆదిత్య, సత్యకుమార్‌ దాసరి, సేనాని, మహ్మద్‌ రెహ్మత్‌ పాషా ఉన్నారు. షర్మిల ఫిర్యాదును ఆమె భర్త అనిల్ కుమార్ పోలీసులకు అందజేశారు. షర్మిల ఫిర్యాదుతో ఎనిమిది మందిపై రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ జీరో.. తెలుగేదేశం కూటమి క్లీన్ స్వీప్ ఖాయం?!

ఆంధ్రప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా కీల‌కం. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ జిల్లాలో ప‌ట్టుసాధించేందుకు అన్ని పార్టీలు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతాయి.  గ‌త ఎన్నిక‌ల్లో నెల్లూరు ఉమ్మ‌డి జిల్లాలో 10 నియోజ‌క‌వ‌ర్గాలకు గాను పది నియోజకవర్గాలలోనూ వైసీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. టీడీపీకి ఇక్క‌డ ఒక్కటంటే ఒక్క  స్థానం కూడా ద‌క్క‌లేదు. అయితే ఐదేళ్లు గిర్రున తిరిగాయో లేదో పరిస్థితి తారుమారైపోయినట్లు కనిపిస్తోంది.  ఉమ్మ‌డి జిల్లాలో వైసీపీకి ఎదురుగా వీస్తున్నది. దీంతో 2024 ఎన్నికలలో ఈ జిల్లాలో తెలుగుదేశం క్లీన్ స్వీప్ ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వైసీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో బ‌రిలో నిలిచిన విజ‌యం సాధించిన నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే, సీనియర్‌ నేత  మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో  చేరారు. దీనికితోడు వైసీపీలో వ‌ర్గ‌విబేధాలు తార స్థాయికి చేరాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ న‌ర‌స‌రావుపేట ఎంపీగా  ఈసారి బ‌రిలోకి దిగ‌నున్నారు. అయితే, నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గానికి  వైసీపీ అధిష్టానం ఖ‌లీల్ అహ్మ‌ద్‌ను ఎంపిక చేసింది. ఖ‌లీల్ నియామ‌కాన్ని స్థానిక వైసీపీ నేత‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. దీనికితోడు అనిల్ కుమార్ యాద‌వ్ వ‌ర్గానికి, మంత్రి కాకాని గోవ‌ర్ధ‌న్ వ‌ర్గీయుల మ‌ధ్య విబేధాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి.  ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా వైసీపీలో కీలక నేతగా కొన‌సాగుతున్న రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సైతం వైసీపీకి రాజీనామా చేశారు. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో టికెట్ల కేటాయింపు విష‌యంలో త‌న‌కు కనీస స‌మాచారం లేకుండా వైసీపీ అధిష్టానం ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యం తీసుకోవ‌టం ప‌ట్ల ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి వైసీపీని వీడ‌టం ఆ పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బేన‌ని చెప్పొచ్చు. వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి తెలుగుదేశంలో చేరితే ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన కూట‌మి అభ్య‌ర్థుల విజ‌యానికి ఎంతో దోహ‌ప‌డుతుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. వేమిరెడ్డి   తెలుగుదేశం గూటికి చేరేందుకే   మొగ్గుచూపుతున్నారు. ఆయ‌న‌కు నెల్లూరు ఎంపీగా, టీటీడీ చైర్మ‌న్ గా అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్నది. మొత్తానికి  ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలో 2024 ఎన్నిక‌ల్లో వైసీపీకి ఘోర‌ ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌న్న భావన రాజ‌కీయ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతున్నది. ఈ జిల్లాల్లో వైసీపీ పూర్తిగా కొలాప్స్ అయింద‌ని,  2024 ఎన్నిక‌ల్లో 10 నియోజ‌క‌వ‌ర్గాల్లో నూ తెలుగుదేశం, జనసేన క్లీన్‌స్వీప్ చేయ‌డం ఖాయ‌మ‌ని ప‌లు    స‌ర్వేల ఫ‌లితాలు సైతం వెల్ల‌డించాయి.  ఇక నియోజకవర్గాల వారీగా చూస్తే.. నెల్లూరు సిటీ ..   నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా త‌యారైంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో అనిల్ కుమార్ యాద‌వ్ బ‌రిలో నిలిచి టీడీపీ అభ్య‌ర్థి నారాయ‌ణ‌పై విజ‌యం సాధించారు. అనిల్ కుమార్ దూకుడు వ్య‌వ‌హారంతో నెల్లూరు జిల్లాలో వ‌ర్గ‌విబేధాలు నెల‌కొన్నాయి. జ‌గ‌న్ నిర్వ‌హించిన స‌ర్వేల్లోసైతం అనిల్ పై స్థానిక ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని తేలింది. దీంతో అనిల్ కుమార్ యాద‌వ్‌ ను ఈసారి న‌ర‌స‌రావుపేట పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గానికి ఇంచార్జిగా అధిష్టానం పంపించింది. సిటీ ఇంచార్జిగా ఖ‌లీల్ అహ్మ‌ద్ ను జ‌గ‌న్ నియ‌మించారు. ఖ‌లీల్ అభ్య‌ర్థిత్వంపై వైసీపీలో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఖ‌లీల్ స్థానంలో సినీ న‌టుడు అలీని బ‌రిలో నిల‌పాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు స‌ర్వేలు నిర్వ‌హిస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి  తెలుగుదేశం, జనసేన కూటమి   అభ్య‌ర్థిగా మ‌రోసారి మాజీ మంత్రి నారాయ‌ణ బ‌రిలోకి దిగుతున్నారు. ఈసారి నారాయ‌ణ విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కే అవుతుంద‌ని నెల్లూరు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.  నెల్లూరు..  నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో  సైతం వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి విజ‌యం సాధించారు.   కొంత‌కాలం క్రితం వైసీపీ అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఆయ‌న ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. దీంతో నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం అభ్య‌ర్థిగా ఆయ‌న బ‌రిలోకి దిగుతున్నారు. శ్రీ‌ధ‌ర్ రెడ్డితోపాటు వైసీపీ వ‌ర్గీయులు అనేక మంది తెలుగుదేశంలో చేరారు. శ్రీ‌ధ‌ర్ రెడ్డి స్థానంలో వైసీపీ అధిష్టానం ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డిని నెల్లూరు రూర‌ల్ వైసీపీ ఇంచార్జిగా నియ‌మించింది. అయితే, ఈ నియోజ‌క‌వ‌ర్గంలో శ్రీ‌ధ‌ర్ రెడ్డి తెలుగుదేశం త‌ర‌పున బ‌రిలో నిల‌వ‌డంతో  తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఫుల్ జోష్ లో ఉన్నారు. అంతే కాకుండా  వైసీపీలోని ఓ వ‌ర్గం ఆయ‌నకు లోపాయికారిగా మ‌ద్ద‌తు తెలుపుతోంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో శ్రీ‌ధ‌ర్ రెడ్డి విజ‌యం  ఖాయమని  ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు. కావ‌లి..  కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ఈసారి తెలుగుదేం, జనసేన విజ‌యం ఖాయ‌మ‌న్న ధీమాను ఆ పార్టీల‌ నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు. కావ‌లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌తంలో వైసీపీ అభ్య‌ర్థి రాంరెడ్డి ప్ర‌తాప్ కుమార్ రెడ్డి విజ‌యం సాధించారు. మ‌ళ్లీ ఆయ‌ననే బరిలోకి దింపే యోచనలో  వైసీపీ అధిష్టానం  ఉంది. 2014, 19 ఎన్నిక‌ల్లో ప్ర‌తాప్ కుమార్ రెడ్డి విజ‌యం సాధించారు.  అయితే ప్రస్తుతం ఆయనకు ఇక్కడ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.  ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు రోజురోజుకు ఎక్కువవుతుండటంతో  ప్ర‌జ‌ల్లో రాంరెడ్డి ప్ర‌తాప్ కుమార్ రెడ్డిపై తీవ్ర వ్య‌తిరేక‌త కనిపిస్తోంది. దీనికితోడు వైసీపీలో వ‌ర్గ‌ విభేదాలు ఆ పార్టీకి పెద్ద స‌మ‌స్య‌గా మారాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్య‌ర్థిగా కావ్య క్రిష్టారెడ్డి బ‌రిలో దిగుతున్నారు. తొలిసారి క్రిష్ణారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం పార్టీకి జ‌న‌సేన బ‌లంతోడు కావ‌డంతో క్రిష్ణారెడ్డి విజ‌యం ఖాయంగా క‌నిపిస్తోంది.  ఉదయగిరి ..  ఇక ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గం విషయానికి వస్తే.. ఇక్కడ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విజ‌యం సాధించారు. సీఎంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో పాల‌న సాగిస్తుండ‌టం, అభివృద్ధిని గాలికొదిలేయ‌డంపై ఆయన ప‌లుసార్లు విమ‌ర్శ‌లు చేశారు. జ‌గ‌న్ తీరులో ఏమాత్రం మార్పురాక‌పోవ‌టంతో ఆయ‌న వైసీపీ వీడారు. ఆ త‌రువాత వైసీపీ అధిష్టానం ఆయన స్థానంలో   మేక‌పాటి రాజ‌గోపాల్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంది. దీనికి తోడు గ్రూపు రాజ‌కీయాలు వైసీపీకి త‌ల‌నొప్పిగా మారాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం,  జ‌న‌సేన అభ్య‌ర్థిగా కాక‌ర్ల సురేష్ బ‌రిలోకి దిగుతున్నారు.  కాక‌ర్ల చారిట‌బుల్ ట్ర‌స్ట్ వ్య‌వ‌స్థాప‌కుడిగా ఆయన  నియోజ‌క‌వ‌ర్గంలో ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో టైల‌రింగ్ కోర్సు, బ్యూటీషియ‌న్  కోర్సుల‌కు శిక్ష‌ణ త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తున్నారు. దీనికితోడు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. దీంతో కాక‌ర్ల‌పై నియోజ‌క‌వ‌ర్గ  ప్ర‌జ‌ల్లో అభిమానం ఉంది. నియోజ‌క‌వ‌ర్గంలో  ఆయనకు ఉన్న‌ మంచిపేరు, తెలుగుదేశం, జ‌న‌సేన ఓటు బ్యాంకు, వైసీపీలో వ‌ర్గ‌విబేధాలు కాక‌ర్ల విజ‌యానికి క‌లిసొచ్చే అంశాలుగా చెప్పొచ్చు.    గూడూరు..  గూడూరు నియోజ‌క‌వ‌ర్గంలో నూ వైసీపీకి ఎదురీదాల్సిన పరిస్థితే నెలకొని ఉంది.  గ‌త ఎన్నిక‌ల్లో  వైసీపీ అభ్య‌ర్థిగా వెలగపల్లి వరప్రసాద రావు బ‌రిలోకి దిగి విజ‌యం సాధించారు. అయితే  ఆయ‌న‌పై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ్య‌క్తమ‌వుతుండ‌టంతో వైసీపీ అధిష్టానంఆయన స్థానంలో నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జి బాధ్య‌త‌ల‌ను మేరిగ ముర‌ళీధ‌ర్ కు అప్ప‌గించింది. ఆయ‌న తోలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేయ‌బోతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీలో వ‌ర్గ‌విబేధాలు తార స్థాయికి చేరాయి. దీనికితోడు ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక పాల‌న ప‌ట్ల‌ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో  తీవ్ర ఆగ్రహం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కు మ‌రోసారి  తెలుగుదేశం అవ‌కాశం ఇచ్చింది. 2019లో తెలుగుదేశం అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగి పాశం సునీల్ ఓడిపోయిన సంగతి విదితమే.  అయితే గ‌త ఐదేళ్లుగా నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో భాగ‌స్వాముల‌వుతున్నారు. ఈ క్ర‌మంలో పాశం సునీల్ పై ప్ర‌జ‌ల్లో సానుకూలత  వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో ఈసారి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ జెండా ఎగర‌డం ఖాయ‌మ‌ని ప‌రిశీల‌కులు పేర్కొంటున్నారు.   సూళ్లూరుపేట..  సూళ్లూరుపేట నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థిగా కిలివేటి సంజీవ‌య్య మూడోసారి బ‌రిలోకి దిగ‌బోతున్నారు. అయితే  వైసీపీలోనే సంజీవ‌య్య‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్నది. ఈ  నియోజ‌క‌వ‌ర్గంలో రెడ్డి సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉంది. అయితే, రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన త‌రువాత నుంచి సంజీవ‌య్య రెడ్డిసామాజిక వ‌ర్గంపై క‌క్ష‌ పూరిత చ‌ర్య‌ల‌కు దిగుతున్నార‌న్న వాద‌న ఉంది. దీంతో ఈసారి వైసీపీలోని ఓ వ‌ర్గం నేత‌లు ఆయ‌న అభ్య‌ర్థిత్వంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో ఈసారి ఎన్నిక‌ల్లో స‌జీవ‌య్య బ‌రిలో నిలిస్తే ఆయ‌న ఓట‌మికి వైసీపీలోని అస‌మ్మ‌తి నేత‌లు కార‌ణం అవుతార‌ని నియోజ‌క‌వ‌ర్గంలో చ‌ర్చ‌జ‌రుగుతుంది. మ‌రోవైపు తెలుగుదేశం, జ‌న‌సేన అభ్య‌ర్థిగా ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నెల‌వ‌ల సుబ్ర‌హ్మ‌ణ్యం కుమార్తె నెల‌వెల విజ‌య‌శ్రీ బ‌రిలోకి దిగుతున్నారు. ఆమె మొద‌టిసారి ఎమ్మెల్యేగా బ‌రిలోకి దిగుతున్నారు. వైసీపీలోని  వ‌ర్గ‌విబేధాలు, తెలుగుదేశం, జ‌న‌సేన ఓటు బ్యాంకు కలిసి ఆమె విజ‌యానికి దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు.  స‌ర్వేప‌ల్లి..  స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నుంచి విజ‌యం సాధించిన కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డి మంత్రిగా కొన‌సాగుతున్నారు. కాకానిపై నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్నది. వైసీపీలో వ‌ర్గ‌ విబేధాలు ఈసారి ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓట‌మికి కార‌ణ‌మ‌వుతాయ‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. తెలుగుదేశం,జ‌న‌సేన కూట‌మి ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఇంకా అభ్య‌ర్థిని ఖ‌రారు చేయ‌లేదు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి  1994, 1999 మిన‌హా  ఆ త‌రువాత వ‌రుస‌గా నాలుగు సార్లు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌వుతూ వ‌స్తున్నారు. ఈసారికూడా ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డికి అవ‌కాశం ద‌క్కుతుంద‌ని టీడీపీ వ‌ర్గాలు భావిస్తున్నాయి.  ఆత్మ‌కూరు..  ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి గుండెపోటుతో మ‌ర‌ణించాడు. దీంతో 2022లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి బ‌రిలో నిలిచి విజ‌యం సాధించారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి త‌ర‌పున ఇంకా అభ్య‌ర్థి ఖరారు కాలేదు. అయితే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి జ‌గ‌న్ పాల‌న‌పై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుండ‌టంతోపాటు.. వైసీపీలోని కీల‌క నేత‌లంతా టీడీపీలోకి రావ‌డంతో ఆ ప్ర‌భావం వైసీపీ అభ్య‌ర్థి విజ‌యానికి అడ్డంకిగా మారే అవ‌కాశం ఉంది. తెలుగుదేశం, జ‌న‌సేన క‌లిసి పోటీ చేస్తుండ‌టంతో కూట‌మి అభ్య‌ర్థిగా ఎవ‌రు నిలిచినా విజ‌యం ఖాయ‌మ‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   వెంక‌ట‌గిరి.. నెల్లూరు జిల్లాలో  తెలుగుదేశం పార్టీకి  క్యాడర్‌ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో వెంకటగిరి ఒకటి. ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించిన  ఆనం.. ఏడాది క్రితం ఆ పార్టీతో విభేదించి తెలుగుదేశంలో చేరారు. ఈసారి తెలుగుదేశం తరఫున  వెంక‌ట‌గిరి అభ్య‌ర్థిగా ఆనం బ‌రిలో నిలుస్తార‌ని అంటున్నారు. ఆనం చేరికతో టీడీపీలో  బలం మరింత పెరిగినట్లైంది. ఇక్క నుంచి ఆనం స్థానంలో వైసీపీ  మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని బరిలోకి దింపుతోంది. ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి ఇక్క‌డి నుంచి బ‌రిలో నిలిస్తే వైసీపీ ఓట‌మి ఖాయమ‌న్న భావన స్థానికంగా  వ్యక్తమౌతోంది.  కోవూరు.. కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి న‌ల్ల‌పునేని ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి విజ‌యం సాధించారు. ఇప్ప‌టికే ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న ఐదుసార్లు విజ‌యం సాధించారు. ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో సొంత పార్టీ నుంచే ఆయన తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.  2024 ఎన్నిక‌ల్లో ప్ర‌స‌న్న కుమార్ రెడ్డి వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగ‌నున్నారు. తెలుగుదేశం త‌ర‌పున  పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తనయుడు దినేష్ రెడ్డి గత మూడు సంవత్సరాలుగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. 2024 ఎన్నిక‌ల్లో పోటీచేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే.. కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థిని టీడీపీ, జ‌న‌సేన కూట‌మి ఇంకా ఖ‌రారు చేయ‌లేదు. వైసీపీకి ఇటీవ‌ల రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి టీడీపీలోకి వ‌స్తే ఆయ‌న స‌తీమ‌ణి ప్ర‌శాంతిరెడ్డికి ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేసే అవ‌కాశం  ఉంటుందన్న ప్ర‌చారం జ‌రుగుతున్నది. ఈసారి  ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డిపై వ్య‌తిరేక‌త‌, వైసీపీలో వ‌ర్గ విబేధాలు, జ‌గ‌న్ పాల‌న‌పై వ్య‌తిరేత అన్నీ క‌లిసి టీడీపీ, జ‌న‌సేన అభ్య‌ర్థి విజ‌యానికి బాట‌లు వేస్తాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

తొలి జాబితాతో తెలుగుదేశంలో జోష్‌.. బెడిసికొట్టిన‌ వైసీపీ ప్లాన్!

తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి తొలి జాబితా విడుదలతో తెలుగుదేశం శ్రేణుల్లో జోష్ నెల‌కొంది. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు భారీ సంఖ్య‌లో తెలుగుదేశంలో చేరుతున్నారు.  తెలుగుదేశం,  జ‌న‌సేన కూట‌మి మొద‌టి జాబితాను 118 మందితో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు. వీరిలో తెలుగుదేశం అభ్య‌ర్థులు  94 మంది, జ‌న‌సేన అభ్య‌ర్థులుగా 24 మంది ఉన్నారు. చంద్ర‌బాబు 94 నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌గా.. జ‌న‌సేనాని ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి.. మిగిలిన 19 నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు చేస్తున్నారు. బీజేపీ సైతం కూట‌మిలో క‌లిసే అవ‌కాశం ఉండ‌టంతో ఆ పార్టీకి కేటాయించ‌గా.. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను వ‌చ్చేనెల మొద‌టి వారంలో చంద్ర‌బాబు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. మొత్తానికి తెలుగుదేశం, జ‌న‌సేన తొలి జాబితా ప్ర‌క‌ట‌న త‌రువాత వైసీపీ శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతుండ‌గా.. జ‌న‌సేన‌, తెలుగుదేశం శ్రేణులు సంబ‌రాలు చేసుకుంటున్నాయి. ఏపీలో ఏప్రిల్ లో సార్వ‌త్రిక‌ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు సీఎం జ‌గ‌న్ మోహన్ రెడ్డి నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే  జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి రాష్ట్రంలో చెప్పుకోద‌గ్గ‌  అభివృద్ధి జ‌ర‌గ‌లేదు. దీనికితోడు క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాలుగున్న‌రేళ్ల పాల‌న సాగింది. జ‌గ‌న్ ప్ర‌జావ్య‌తిరేక‌, క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో ప‌లువురు వైసీపీ ఎమ్మెల్యేలు సైతం ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. కొందరు జనసేన గూటికి చేరారు. మరింత మంది వైసీపీని వీడే యోచనలో ఉన్నారని అంటున్నారు.  రాష్ట్రంలోని 150కిపైగా స్థానాల్లో వైసీపీకి ఎదురుగాలి వీస్తున్న‌ట్లు ఇటీవ‌ల  ఓ స‌ర్వేలో తేలింది.  తాజాగా తెలుగుదేశం, శిన‌సేన కూటమి మొద‌టి జాబితా విడుదల కావ‌డంతో తెలుగుదేశం, జ‌న‌సేన శ్రేణుల్లో జోష్ నెల‌కొంది.  ప‌లు ద‌ఫాలుగా స‌ర్వేలు నిర్వ‌హించి, నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల నుంచి ల‌భిస్తున్న ఆద‌ర‌ణ‌ను బ‌ట్టి చంద్ర‌బాబు తెలుగుదేశం అభ్య‌ర్థుల‌ను ఎంపిక‌ చేసి ప్ర‌క‌టించారు. ఫ‌లితంగా మొద‌టి జాబితా ప్ర‌క‌టించిన త‌రువాత‌ ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ కార్య‌క‌ర్త‌లు భారీ సంఖ్య‌లో తెలుగుదేశం పార్టీలోకి క్యూ కడుతున్న  ప‌రిస్థితి. తెలుగుదేశం, జ‌న‌సేన తొలి జాబితా  విడుద‌ల తో   ఆ పార్టీ నేతల మ‌ధ్య  విబేధాలు నెల‌కొంటాయ‌ని వైసీపీ అధిష్టానం అంచ‌నా వేసింది.  కానీ, ఒక‌టి రెండు నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హా మిగిలిన అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో  తెలుగుదేశం, జనసేన నేత‌లు  కలిసి సంబ‌రాలు చేసుకుంటుండ‌టం వైసీపీ అధిష్టానానికి మింగుడుప‌డ‌టం లేదు. పై పెచ్చు విపక్ష పార్టీల జాబితా తరువాత వైసీపీ నుంచే శ్రేణుల వలస ప్రారంభం కావడం ఆ పార్టీ అధినేతకు మరింత ఆందోళన కలిగిస్తోంది.  అయితే  తెలుగుదేశం, జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయిన వెంట‌నే.. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వ‌రుస‌గా ప్రెస్ మీట్లు పెట్టి జ‌నసేన‌కు అన్యాయం జ‌రిగిందంటూ జ‌నసేన కార్య‌క‌ర్త‌ల‌ను రెచ్చ‌గొట్టేందుకు విఫల ప్ర‌య‌త్నం చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ చంద్ర‌బాబుకు బానిస‌గా మారిపోయాడంటూ విమ‌ర్శ‌లు చేశారు. కానీ, వారి ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌క‌పోవ‌టంతో వైసీపీ పెద్ద‌లకు ఓట‌మి బెంగ ప‌ట్టుకుంది. జన‌సేన అధినేత ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలుగా జ‌న‌సేన పార్టీ శ్రేణుల‌కు క్లారిటీ ఇచ్చారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అనుకున్న స్థానాల్లో విజ‌యం సాధించ‌లేక పోయింద‌ని, క‌నీసం ప‌ది నియోజ‌క‌వ‌ర్గాల్లోనైనా జ‌నసేన అభ్య‌ర్థులు గెలిచి ఉంటే ప్ర‌స్తుతం పొత్తులో క‌నీసం 40 నుంచి 50 సీట్లు డిమాండ్ చేసేవాళ్ల‌మ‌ని, కానీ, ఆ ప‌రిస్థితి లేక‌పోటంతో త‌క్కువ సీట్లే అయినా క‌చ్చితంగా గెలుస్తామనుకున్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనే జ‌న‌సేన అభ్య‌ర్థులు బ‌రిలో నిలుస్తున్నార‌ని ప‌వ‌న్ చెప్పారు. దీంతో జ‌న‌సేన  శ్రేణులు సైతం ప‌వ‌న్ మాటల్లో వాస్త‌వాన్ని గ‌మ‌నించి తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి తీసుకొచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.  తెలుగుదేశం, జ‌న‌సేన తొలి జాబితా విడుద‌లైన నాటి నుంచి ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి  చేరిక‌లు పెరిగాయి. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి  నారా లోకేశ్ స‌మ‌క్షంలో భారీ సంఖ్య‌లో వైసీపీ నుంచి  వచ్చి తెలుగుదేశంలో చేరారు.  మ‌రోవైపు మంత్రి పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీకి భారీ షాక్ త‌గిలింది.  చౌడేప‌ల్లి మండ‌లంలోని ఐదు పంచాయితీల్లోని 150 మందికిపైగా వైసీపీ కార్య‌క‌ర్త‌లు తెలుగుదేశం గూటికి చేరారు. నాలుగున్న‌రేళ్ల‌ పాల‌న‌లో  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ఎలాంటి అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేయ‌లేద‌ని ఈ సందర్భంగా వారు విమ‌ర్శించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో  తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి విజయం ఖాయ‌మ‌ని, చంద్ర‌బాబు సార‌థ్యంలో రాష్ట్రం మ‌ళ్లీ అభివృద్ధి ప‌థంలో ప‌య‌నిస్తుంద‌ని తెలుగుదేశం పార్టీలో చేరిన వారు పేర్కొన్నారు. మొత్తానికి తెలుగుదేశం, జనసేన కూట‌మి  జాబితాను ఆధారం చేసుకుని ఆ రెండు పార్టీల కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ అధిష్టానం ప్ర‌య‌త్నాలు చేయ‌గా.. అవి బెడిసికొట్టాయి. పైపెచ్చు బూమరాంగ్ అయ్యాయి.  వైసీపీ నుంచే భారీ సంఖ్య‌లో కార్య‌క‌ర్త‌లు టీడీపీలో చేరుతున్నారు.

క‌విత అరెస్ట్ త‌ప్ప‌దా..? అదంతా సింప‌తీ డ్రామాయేనా?

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఏడాదిగా స్త‌బ్దుగా ఉన్న కేసు మ‌రోసారి సంచ‌నాలు రేపుతోంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను ఈ స్కాంలో  సీబీఐ ఏకంగా నిందితురాలిగా చేర్చింది. ఇంత‌వ‌ర‌కు సాక్షిగా మాత్ర‌మే క‌విత‌ను  విచారించిన సీబీఐ.. ప్ర‌స్తుతం నిందితురాలిగా చేర్చ‌డంతో బీఆర్ ఎస్ వ‌ర్గాల్లో ఆందోళ‌న వ్య‌క్తం అవుతుంది. గ‌తంలో 41ఏ సీఆర్పీసీ నోటీసుల‌ను స‌వ‌రించి సోమవారం (ఫిబ్రవరి 26) విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని క‌వితకు పంపించిన నోటీసుల్లో సీబీఐ పేర్కొంది. క‌విత‌ను ఇప్ప‌టికే మూడు సార్లు సీబీఐతోపాటు ఈడీ విచార‌ణ చేసింది. అయితే, ఈసారి క‌విత విచార‌ణ‌కు వెళితే అరెస్టు ఖాయ‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇప్ప‌టికే   లిక్క‌ర్ స్కాంలో విచార‌ణ‌కు రావాల‌ని సీబీఐ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు నోటీసులు పంపించింది. ప‌లు సార్లు నోటీసులు అందించినా కేజ్రీవాల్ విచార‌ణ‌కు హాజ‌రు కాలేదు. అయితే ఈసారి కేజ్రీవాల్ తో పాటు క‌విత‌ను కూడా విచార‌ణ అనంత‌రం అరెస్టు చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు సీబీఐ వ‌ర్గాల స‌మాచారం.  తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో బీఆర్ ఎస్ వ‌ర్గాల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్నా.. మ‌రోప‌క్క సంతోషంకూడా వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికి కార‌ణం త్వరలో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌ట‌మేన‌ంటున్నారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసు విచార‌ణ ముదుకు సాగుతున్న కొద్దీ అనేక సంచ‌ల‌నాల‌కు తెర‌లేస్తోంది. ఈ కేసులో ఇప్ప‌టికే వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయ‌న కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డిలు అఫ్రూవర్ గా మారిన విష‌యం తెలిసిందే. ఢిల్లీలోని క‌విత పీఏ అశోక్ కౌశిక్ కూడా అప్రూవ‌ర్ గా మారిపోయారు. ఈ నేప‌థ్యంలో క‌విత‌కు ఈ స్కాంలో ప్ర‌మేయం ఉంద‌ని ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో క‌విత‌ను నిందితురాలిగా చేరుస్తూ సీబీఐ నోటీసులు జారీ చేసింది. మ‌రి కొద్ది నెల‌ల్లో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ అంశం బీఆర్ ఎస్ కు మేలు చేస్తుంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.   సీబీఐ అధికారులు క‌విత‌ను నిజంగానే అరెస్టు చేస్తే..  లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ కు సానుభూతి పవనాలు వీచే అవకాశం ఉందని  ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నార‌ని బీఆర్ ఎస్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. లిక్క‌ర్ స్కాం కేసులో క‌విత పేరును త‌ప్పించేలా ఢిల్లీ కేంద్రంలో కేసీఆర్ పావులు క‌దిపే అవ‌కాశాలు ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే,  ఎన్నిక‌లున్న నేప‌థ్యంలో కేసీఆర్ ఆ ప్ర‌య‌త్నాలు చేయ‌క‌పోవ‌చ్చున‌ని ప‌రిశీలకులు అంటున్నారు.  లోక్‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో క‌విత‌ను నిందితురాలిగా చేర్చుతూ సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేయ‌డం తెలంగాణ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. గ‌త కొంత‌కాలంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లిక్క‌ర్ కేసులో క‌వితను కాపాడుతున్నార‌ని బీజేపీపై ఆరోప‌ణ‌లు చేస్తుంది. బీజేపీ, బీఆర్ ఎస్ రెండు పార్టీలు ఒక్క‌టేన‌ని, అందుకే లిక్క‌ర్ స్కాం కేసులో క‌విత ఇప్ప‌టి వ‌ర‌కు అరెస్టు కాలేద‌ని కాంగ్రెస్ నేత‌లు విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ అధిష్టానం మాత్రం.. విచార‌ణ జ‌రుగుతుంద‌ని, పూర్తి ఆధారాలు సేక‌రించ‌గానే క‌విత అరెస్టు ఉంటుంద‌ని పేర్కొటోంది. అయితే, గ‌త‌ కొంత‌ కాలంగా క‌విత పేరు ఎత్త‌ని సీబీఐ.. తాజాగా లోక్ స‌భ ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ క‌వితను ఏకంగా నిందితురాలిగా చేర్చ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ వ్య‌వ‌హారం మొత్తం పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొందేందుకేన‌ని, బీఆర్ ఎస్, బీజేపీ క‌లిసి ఆడుతున్న నాట‌కంలో ఇదొక భాగ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు పేర్కొంటున్నారు.  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీపై ప్ర‌జ‌ల్లో రోజురోజుకు ఆద‌ర‌ణ పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో అత్య‌ధిక స్థానాల్లో విజ‌యం సాధించ‌డ‌ంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టిసారించారు. గ‌ రోజుల క్రితం జ‌రిగిన కొస్గీ బ‌హిరంగ స‌భ‌లో మ‌హ‌బూబ్ న‌గ‌ర్ అభ్య‌ర్థిని సైతం ప్ర‌క‌టించిన రేవంత్‌.. 14 పార్ల‌మెంట్ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగ‌ర‌వేయాల‌ని కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపు నిచ్చారు. ఇటీవ‌ల ప‌లు సంస్థ‌ల స‌ర్వే ఫ‌లితాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అత్య‌ధిక స్థానాల్లో విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని తేలింది. ఈ నేప‌థ్యంలో బీజేపీ, బీఆర్ ఎస్ లోపాయికారి ఒప్పందం ప్ర‌కారం కాంగ్రెస్ ను ఢీకొట్టేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేసిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. ఈ క్ర‌మంలోనే లిక్క‌ర్ స్కాం కేసులో క‌విత‌ను నిందితురాలిగా చేర్చ‌డంతో పాటు సోమవారం (ఫిబ్రవరి 26)  విచార‌ణ‌కు రావాల‌ని సీబీఐ నోటీసులు అందించింది. క‌విత విచార‌ణ‌కు వెళితే అరెస్ట్ అవ్వ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ ప‌రిణామాల‌ను లోక్ స‌భ ఎన్నిక‌ల వేల బీఆర్ ఎస్‌, బీజేపీ ఆడుతున్న డ్రామాగా కాంగ్రెస్ నేత‌లు బ‌లంగా వాదిస్తున్నారు. క‌విత అరెస్ట్ అయితే సంప‌తీ ఓట్ల‌తో బీఆర్ ఎస్ అధిక స్థానాల్లో విజ‌యం సాధించాల‌ని చూస్తున్నద‌ని, మ‌రోవైపు.. మేము మాట ఇచ్చిన ప్ర‌కారం క‌విత‌ను అరెస్టు చేశామంటూ బీజేపీ ప్ర‌జ‌ల్లోకి వెళ్లి ఎక్కువ స్థానాల్లో  కాషాయం జెండా ఎగుర‌వేయాల‌ని ప్లాన్ చేస్తున్నదని కాంగ్రెస్ నేత‌లు పేర్కొంటున్నారు. ఫ‌లితంగా కాంగ్రెస్ నిర్దేశించుకున్న 10 నుంచి 14 పార్ల‌మెంట్‌ సీట్ల ల‌క్ష్యానికి గండిప‌డుతుంద‌ని బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు భావిస్తున్నాయ‌ని కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మొత్తానికి ఎన్నిక‌ల వేళ లిక్క‌ర్ కేసు వ్య‌వ‌హారం తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కొడాలిపై కొత్త బాణం..!

టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. ఆయా పార్టీల అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ అమరావతిలో ఒకే వేదిక మీద నుంచి ఎన్నికల బరిలో దిగనున్న ఆయా పార్టీల అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అయితే అందులో గుడివాడ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము పేరును ప్రకటించారు. దీంతో గుడివాడ రాజకీయం రసవత్తరంగా మారింది. గుడివాడ టీడీపీ ఇన్‌చార్జీగా వెనిగండ్ల రాము పేరును గతంలోనే ప్రకటించినా.. ఆయన్ని మారుస్తారంటూ ఓ ప్రచారం అయితే అడపా దడపా జరిగినా.. చివరకు రాముకే ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేయడంతో.. స్థానిక సైకిల్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకొంటున్నాయి.  ఇక టీడీపీకి గుడివాడ కంచుకోట అన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి గుడివాడను.. కొడాలి నాని అంటేనే గుడివాడ.. గుడివాడ అంటేనే కొడాలి నాని అన్నట్లుగా స్థానిక రాజకీయాన్ని ఈ మాజీ మంత్రి మార్చేశారని.. అలాంటి వేళ.. వెనిగండ్ల రామును చంద్రబాబు బరిలోకి దింపడం ద్వారా గుడివాడలో కొడాలి నాని రాజకీయానికి చెక్ పెట్టనున్నారనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో చాలా ఆసక్తికరంగా జరుగుతోంది.  గత ఎన్నికల వేళ.. అంటే 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ గెలుపు కోసం.. ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్.. కొత్త క్యాస్ట్ ఈక్వేషన్స్‌తో ముందుకు వెళ్లారని.. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. నాడు శింగనమల, చిలకలూరిపేట, తాడికొండ, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో ఈ ఈక్వేషన్స్‌తోనే పార్టీ అభ్యర్థులను ఆయన గెలిపించుకున్నారని... దాంతో ఆ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడకే అయిందని సదరు సర్కిల్‌లో ఓ చర్చ హల్‌చల్ చేస్తోంది. దాదాపుగా ఇదే ఈక్వేషన్‌ను ఈ సారి గుడివాడలో చంద్రబాబు అమలు చేస్తున్నారని...అందులోభాగంగా వెనిగండ్ల రామును బరిలో దింపినట్లు తెలుస్తోంది.    ఎందుకంటే.. కొడాలి నాని వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలుత టీడీపీ టికెట్‌పై ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసినా.. ఆ తర్వాత.. 2012లో ఆయన ఫ్యాన్ పార్టీలోకి జంప్ కొట్టి.. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి.. అసెంబ్లీకి పంపిన టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగేవారు. ఇక జగన్ పార్టీ అధికారంలోకి రావడంతో.. ఆయన కేబినెట్‌లో పౌరసరఫరాల శాఖ మంత్రిగా కొడాలి నాని బాధ్యతలు చేపట్టిన తర్వాత.. అదే చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్‌పై బండ బూతులతో విరుచుకు పడిపోయేవారు. దీంతో బూతు సరఫరా శాఖ మంత్రిగా ఆయన అపఖ్యాతిని మూట కట్టుకున్నారు.  అయితే వరుసగా అయిదో సారి కూడా గుడివాడ నుంచి గెలిచేందుకు కొడాలి నాని తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. అలాంటి వేళ.. ఈ ఎన్నికల్లో కొడాలి నానికి వెనిగండ్ల రాము సరైన ప్రత్యర్థి అనే ఓ ప్రచారం సైతం సాగుతోంది. అదీకాక.. గుడివాడ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇప్పటికే పలుమార్లు వెనిగండ్ల రాము  పర్యటించారని... అలాగే అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకొని.. వాటిని తనదైన శైలిలో పరిష్కరిస్తూ.. ముందుకు సాగుతున్నారని.. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడలో వెనిగండ్ల రాము సారథ్యంలో టీడీపీ జెండా రెపరెపలాడితే మాత్రం కొడాలి నాని శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకున్నట్లేననే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో వాడి వేడిగా కొన.. సాగుతోంది.  మరి చంద్రబాబు ప్రయోగిస్తున్న ఈ రామ బాణం.. కొడాలి నానిపై ఎంతగా పని చేస్తుందనేది తెలియాలంటే మాత్రం ఎన్నికల ఫలితాల వెలువడే  వరకు వేచి చూడాల్సిందేనని సదరు సర్కిల్‌లో ఓ చర్చ అయితే హాట్ హాట్‌గా సాగుతోంది.

క‌ర్నూల్‌ పై బాబు వ్యూహం... వైసీపీ గిల‌గిల‌!

సీమ ముఖద్వారం కర్నూలు. ఇక్కడి రాజకీయం అంటే ఎప్పటికీ ప్రత్యేకమే ! కర్నూలు పార్లమెంట్ స్థానంతో పాటు.. లోక్‌సభ పరిధిలోని అన్ని 7 అసెంబ్లీలను క్లీన్‌స్వీప్‌ చేసిన వైసీపీ.. ఈసారి సీన్ రిపీట్ చేయాలని ప్లాన్‌ చేస్తుంటే.. కొండారెడ్డి బురుజుపై జెండా పాతాలని టీడీపీ ఫిక్స్ అయింది. దీంతో క‌ర్నూల్‌ రాజకీయం ఆసక్తికరంగా మారింది. అయితే కర్నూలు పొలిటికల్ పిక్చర్ ఏంటి?  వైసీపీని వెంటాడుతున్న టెన్షన్ ఏంటి.. ఇక్క‌డ ప‌ట్టు కోసం టీడీపీ వ్యూహం ఏమిటి?  2024 బరిలో నిలిచే రేసుగుర్రాలు ఎవరు?  కొండారెడ్డి బురుజుపై జెండా పాతేది ఎవరు….ఆసక్తి కరంగా మారిన‌ కర్నూలు రాజకీయంపై తెలుగువ‌న్ గ్రౌండ్ రిపోర్ట్‌. క‌ర్నూల్ పార్ల‌మెంట్‌కు ద‌మ్మున్న అభ్య‌ర్థి ని నిల‌బెట్టాల‌ని టీడీపీ భావిస్తోంది.  రెడ్డి సామాజిక వ‌ర్గం కాకుండా బీసీకి ఇవ్వాల‌ని టీడీపీ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతోంది.  గ‌తంలో బోయ సామాజిక వ‌ర్గానికి ప్రాధాన్య‌త ఇచ్చిన టీడీపీ ఇప్పుడు కురువ సామాజిక వ‌ర్గానికి  ప్ర‌ధాన్య‌త ఇస్తోంది. పంచ‌లింగ‌లా బ‌స్తిపాడు నాగ‌రాజు పేరు దాదాపుగా ఖాయ‌మైన‌ట్లేన‌న్న టాక్ అయితే వినిపిస్తోంది. గ‌తంలో ఆయ‌న ఎంపిటీసీగా గెలిచారు. వైపీసీని ఎదుర్కొవాలంటే ఓ సామాన్యుడికి, బీసీకి ఇవ్వాలనుకుంటోంది టీడీపీ అధిష్టానం. పైగా రైతు కుటుంబం నుంచి వున్నారు కాబ‌ట్టి పంచ‌లింగ‌లా బ‌స్తిపాడు నాగ‌రాజు పేరు దాదాపు ఖాయం అయిన‌ట్లే. వైసీపీకి పెట్టని కోటలా మారింది కర్నూల్‌ లోక్‌సభ స్థానం. 2014, 2019లో వరుసగా విజయం సాధించిన వైసీపీ.. హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదలతో ఉంటే.. ఈసారి గెలిచి కొండారెడ్డి బురుజుపై గెలుపు జెండా ఎగురవేయాలని టీడీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. కర్నూలు పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో.. అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరు వైసీపీని ఇబ్బంది పెడుతున్నాయ్. దీంతో కేడర్‌లో అయోమయం కనిపిస్తోంది. అంతర్గత విభేదాలను చక్కబెట్టేందుకు అధిష్టానం దూతలను పంపినా.. ఫలితం కనిపించడం లేదు. వైసీపీలో ఈ పరిస్థితులను క్యాష్ చేసుకోవాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. ఐతే అనుకున్న స్థాయిలో దాన్ని అందుకోవడంలో సైకిల్ పార్టీ విఫలం అవుతుందనే చర్చ జరుగుతోంది. వైసీపీతో కంపేర్‌ చేస్తే టీడీపీలో వర్గపోరు తక్కువగానే ఉన్నా.. అది కూడా పార్టీకి నష్టం కలిగించే ప్రమాదం లేకపోలేదనే చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిణామాల మధ్య కర్నూలు పార్లమెంట్‌ ఫైట్ ఆసక్తికరంగా మారింది. కర్నూలు పార్లమెంట్ ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. ఎక్కువసార్లు కాంగ్రెస్ విజయం సాధించగా.. టీడీపీ రెండుసార్లు, వైసీపీ రెండుసార్లు గెలిచాయ్‌. కర్నూలు పార్లమెంట్ నుంచి ఎన్నికైన వారు ఎన్నో ఉన్నత పదవులను పొందారు. కోట్ల, కేఈ కుటుంబానికి పెట్టని కోటగా ఉన్న కర్నూలు పార్లమెంట్‌లో రెండు కుటుంబాలకు చెందిన వారు ఎంపీగా గెలుపొందారు. గతంలో ఇక్కడి నుంచి గెలిచిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి.. కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన కుమారుడు కూడా కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయ్‌. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి.. టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. టీడీపీ నుంచి జిల్లాలో మంచి పట్టు ఉన్న మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కూడా టీకెట్ ఆశిస్తున్నారు కేఈ కుటుంబసభ్యులతో పాటు పలువురు బీసీ నేతలు కూడా టీడీపీ నుంచి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.  వైసీపీ ఎంపి అభ్యర్ధిగా గుమ్మనూరు జయరాంను బరిలోకి దింపే ఆలోచనలో వుంది, ప్రస్తుతం ఏపీ రాజకీయం మొత్తం కర్నూలు చుట్టే నడుస్తోంది.   అసెంబ్లీ పరిధిలో వైసీపీలో కనిపిస్తున్న అంతర్గత కలహాలను క్యాష్ చేసుకోవాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. దీంతో 2024 ఎన్నికల ఫైట్ ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. కర్నూలు పార్లమెంట్‌ పరిధిలో కర్నూలుతో పాటు పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయ్. ఇందులో కొడుమూరు ఎస్సీ రిజర్వ్‌డ్‌ కాగా.. మిగతా నియోజకవర్గాలన్నీ జనరల్‌.  1)  కర్నూలు అసెంబ్లీలో అబ్దుల్ హఫీజ్ ఖాన్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. వర్గవిభేదాలు ఇక్కడ వైసీపీని టెన్షన్ పెడుతున్నాయ్. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయ్‌. ఇద్దరు నేతల తీరుతో పార్టీ కేడర్‌లో అయోమయం కనిపిస్తోంది.   ఐతే ఇద్దరి మధ్య వర్గపోరును క్యాష్‌ చేసుకునేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. ఇక్కడ సైకిల్ పార్టీ నుంచి టీజీ భరత్ బరిలో దిగబోతున్నారు.  2) కోడుమూరులోనూ వైసీపీని ఆధిపత్య పోరు ఇబ్బందిపెడుతోంది.  కోడుమూరులో సుధాకర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఐతే ఆధిపత్య పోరు ఇక్కడ వైసీపీకి ఇబ్బందిగా మారింది.  ఇక్క‌డి నుంచి టీడీపీ టికెట్ సాధించాలని.. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి వర్గాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయ్. 3) ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఐతే రాష్ట్ర లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రగౌడ్‌ వర్గానికి.. ఎమ్మెల్యే వర్గానికి మధ్య అంతర్గ విభేధాలు తారాస్థాయికి చేరుకున్నాయ్.  ఎమ్మిగనూరు ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. 2004వరకు ఇక్కడ టీడీపీ హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకుంది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున జయనాగేశ్వర రెడ్డి పోటీ చేశారు. ఐతే వర్గవిభేదాలు సైకిల్‌ పార్టీకి ఇక్కడం ఇబ్బందిగా మారాయ్‌. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున జయనాగేశ్వరరెడ్డి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుండగా.. ఆయనకు టికెట్ రాకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ నడుస్తోంది.  4) ఆలూరులో మంత్రి గుమ్మనూరు జయరాం సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీని ఇక్కడ వర్గవిభేధాలు వెంటాడుతున్నాయ్.  ఐతే ఈసారి మంత్రి గుమ్మనూరును.. కర్నూలు ఎంపీ బరిలో దింపేందుకు వైసీపీ అధిష్టానం ప్లాన్‌ చేస్తోంది. ఆలూరు టీడీపీలో ఇప్పటికే టికెట్ల లొల్లి మొదలైంది. పార్టీ ఇంచార్జిగా ఉన్న కోట్ల సుజాతమ్మతో పాటు.. వైకుంఠ మల్లికార్జున, వీరభద్రగౌడ్ టికెట్ ఆశిస్తున్నారు. ఎవరికి వారు అధిష్టానం మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆలూరులో టీడీపీ మూడు వర్గాలు విడిపోయినట్లు కనిపిస్తోంది.   5)  పత్తికొండలో కంగాటి శ్రీదేవి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ వైసీపీకి వర్గపోరు ఇబ్బందిగా మారింది. ఎమ్మెల్యే శ్రీదేవిపై అవినీతి ఆరోపణలున్నాయి. టీడీపీ నుంచి మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తనయుడు శ్యామ్‌బాబు ఈసారి బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. పత్తికొండ నియోజకవర్గంలో కురువ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ. దీంతో అదే సామాజికవర్గానికి చెందిన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు కూడా పత్తికొండ నుంచి టీడీపీ తరఫున టికెట్ ఆశిస్తున్నారు. 6) ఆదోనిలో సాయిప్రసాద్‌ రెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరుసగా రెండుసార్లు గెలిచిన ఆయన.. హ్యాట్రిక్‌ మీద కన్నేశారు. సాయిప్రసాద్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో వినిపిస్తున్న అవినీతి ఇక్కడ వైసీపీకి ఇబ్బందిగా మారే చాన్స్ ఉంది. ల్యాండ్ సెటిల్‌మెంట్లు, రిజిస్ట్రేషన్‌లో కమీషన్ వంటి ఆరోపణలతో.. వైసీపీ నుంచి ఎవరు పోటీ చేసిన గెలుపు కష్టమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.  టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడుతో పాటు.. నియోజకవర్గ మాజీ ఇంచార్జి గుడిసె కిష్టమ్మ కూడా టికెట్ రేసులో ఉన్నారు.   7)  మంత్రాలయంలో బాలనాగిరెడ్డి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009 నుంచి వరుసగా ఆయనే విజయం సాధిస్తూ వస్తున్నారు. మళ్లీ వైసీపీ తరఫున ఆయనే ఈసారి కూడా బరిలోకి దిగడం ఖాయం.  మంత్రాలయంలో ఎలాగైనా జెండా పాతాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. నియోజకవర్గం ఇంచార్జి తిక్కారెడ్డి.. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఈసారి మళ్లీ ఆయనకే టికెట్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

తెలంగాణా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీలో భారీ గోల్‌మాల్‌

తెలంగాణా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీలో భారీ గోల్‌మాల్‌ జరిగింది.  ఈ కేసులో తీగ లాగితే డొంక కదిలింది. నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. ఈ స్కాంలో పెద్ద పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ వ్య‌వ‌హారంలో ఆసుపత్రి సిబ్బందితో పటు, ప్రజాప్రతినిధుల పీఏల పాత్ర ఉందని తెలుస్తోంది. కేవ‌లం పీఏలే ఉన్నారా లేక ఎమ్మెల్యేల పాత్ర కూడా ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు.  200 కోట్ల రూపాయ‌లు గోల్‌ మాల్‌ అయినట్టు అంచనా. తెలంగాణలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో పెద్ద మొత్తంలో అక్రమాలకు పాల్పడినట్లుగా  విచారణంలో తేలింది. మిర్యాలగూడలో బయడపడ్డ కేసులో తీగ లాగిన అధికారులకు, నమ్మలేని నిజాలు తెలిశాయి. సీఎం రిలీఫ్ ఫండ్ నగదు కోసం నకిలీ పేషెంట్‌లను రూపొందించడమే కాకుండా తప్పుడు బిల్లులు పెట్టుకొని పెద్ద మొత్తంలో నగదు స్వాహా చేసినట్లుగా తేలింది.  నకిలీ బిల్లు సృష్టించి లక్షలు కొద్దీ డబ్బులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని రెండు ఆస్పత్రుల్లో బాధితులకు వైద్య చికిత్స అందించకుండానే.. చేయించినట్లు నకిలీ బిల్లులు సృష్టించారు.  వైద్యం చేయకపోయినా.. చేయించినట్టు నకిలీ బిల్లులు సృష్టించిన ఖమ్మంలోని వినాయక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు.. మిర్యాలగూడలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌పై కేసు నమోదు చేశారు. నల్గొండకు చెందిన జ్యోతి, లక్ష్మి, దిరావత్, శివపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిరుపేదలకు ఉచితంగా వైద్య చికిత్సను అందించడం కోసం ఆరోగ్య పథకాలతో పాటు.. ఇతర సదుపాయాలను కూడా కల్పిస్తున్నాయి. వాటిల్లో ఒక సీఎం రిలీఫ్ ఫండ్..  నిరుపేదలకు ఉచిత వైద్య చికిత్సను ఆరోగ్య శ్రీ ద్వారా అందిస్తున్నాయి. అయితే కొన్ని వ్యాధులకు అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అవి ఆరోగ్య శ్రీ పరిధిలోకి రావు.. అప్పుడు అటువంటి వారికీ ఉపయోగపడే మరొక పథకం.. సీఎం రిలీఫ్ ఫండ్.. 2018లోనే రాష్ట్ర అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యేల సన్నిహిత అనుచరులకు నియోజకవర్గానికి 20 మంది చొప్పున ఎలాంటి మెడికల్‌ బిల్లులు లేకుండా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు చెక్కులను అందించారు. దీంతో ఈ వ్యవహారంలో రూ.200 కోట్లు దుర్వినియోగం అయినట్టు అంచనా వేస్తున్నారు.  అసలు దీని వెనక ఎవరు ఉన్నారు?  ఏ విధంగా ముఖ్యమంత్రి సహాయనిధిని దుర్విని యోగం చేశారు?  ఎవరి ఆదేశాలతో ఈ తతంగం నడిపించారనే దానిపై ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అంతర్గతంగా విచారిస్తున్నది.  గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ పెద్ద సంఖ్యలోనే ఉన్నది.  అయితే అర్హులైన పేదలు రూ.లక్షల్లో పెట్టుకున్న బిల్లులకు రూ.50 వేల లోపే చెక్కుల రూపంలో అందగా.. ఎలాంటి బిల్లులు లేకుండా రూ.లక్షల్లో ఎమ్మెల్యేలకు దగ్గరగా ఉన్నోళ్లకు అందజేశారు. సాధారణంగా ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్న పేదలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఇందుకోసం తెల్ల రేషన్‌ కార్డు ఉన్న పేదలు స్తోమతకు మించి ప్రయివేటు హాస్పిటళ్లలో ఖర్చు పెట్టి చికిత్స చేయించుకుంటే.. అందుకు సంబంధించిన పూర్తి బిల్లులను ప్రభుత్వా నికి సమర్పించాల్సి ఉంటుంది. ముందుగా బాధితులు ఎమ్మెల్యేకు దరఖాస్తు చేసుకుంటే వారు సీఎంవోకు పంపుతారు. అక్కడ సీఎంఆర్‌ఎఫ్‌ సెక్షన్‌లో కమిటీ పరిశీలించి ఆర్థిక సాయం మంజూరు చేస్తుంది. ఆ తరువాత మూడు లేదా నాలుగు నెలలకు చెక్కులను ఎమ్మెల్యేల చేతుల మీదుగా బాధితులకు అందజేస్తారు. అయితే 2018లో మూడు వేలకు పైగా సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల్లో లక్షలాది రూపాయలు అధికార పార్టీ ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లాయి.  వారు ప్రత్యేకంగా సూచించిన పేర్లకే రూ.10 లక్షలు రూ.15 లక్షల దాకా సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందినట్టు తెలిసింది. వ‌డ్డించే వాడు మ‌న‌వాడైతే.... అవినీతికి పాల్పడాలనుకునే వాళ్లకు అడ్డదార్లు ఎన్నో వుంటాయి. సి.ఎం. రిలీఫ్ ఫండ్ నుంచి కూడా నొక్క వ‌చ్చ‌ని అప్ప‌ట్టి పాల‌కులు నిరూపించారు.   అలా  అప్పనంగా డబ్బులు నొక్కేసేందుకు నకిలీ రోగులను సృష్టించడమే కాకుండా..తప్పుడు బిల్లులు పెట్టి కుంభకోణానికి తెరతీశారు.

ఔటర్ రింగ్ రోడ్డుపై య‌ముడి తాండ‌వం   గాలిలో కలుస్తున్న ప్రాణాలు 

హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఎందుకు ఇన్ని ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి? ముఖ్యంగా ప్రముఖులు, వారి పిల్లలే ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నారు?  అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గడం లేదు. అతి వేగంతో కూడిన డ్రైవింగ్‌, నిద్రమత్తు, నిర్లక్ష్యం వల్ల ఎన్నో బతుకులు ఇలా గాలిలో కలిసిపోతున్నాయి.ఈ మధ్య ప్రమాదాలకు సంబంధించిన వార్త లే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట ప్రమాదాలు జరిగి ప్రాణాలను కోల్పోవడం చూస్తూనే ఉన్నాం. అజాగ్రత్తతో వాహనాలు నడపడం, మద్యం మత్తులో వాహనాలు నడపడం, అతివేగం వలన శీతా కాలంలో ఏర్పడే మంచువలన రహదారులు సరిగ్గా కనబడక పోవడం, తెల్లవారుజామున నిద్రమత్తులో వాహనాలు నడపడం, అనుకోకుండా ఏదైనా అకస్మాత్తుగా వాహనాలకు అడ్డు రావడం, రోడ్డు భద్రతకు సంబంధించిన జ్ఞానం లేకపోవడం, అనుకోకుండా వాహనంలో ఏవైనా సమస్యలు ఏర్పడటం, రహదారులు సక్రమంగా ఉండకపోవడం లాంటి కారణాల వలన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ ఔట‌ర్ రింగ్ రోడ్ గురించి చెప్పుకోవాల్సిన అవ‌స‌రం లేదు.  ప్రముఖులు, ప్రముఖుల పిల్లలు చాలా మందే ప్రాణాలు కోల్పోయారు. 1. లాస్య నందిత మరణం ఈరోజ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్‌చెరు సమీపంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన ఓఆర్‌ఆర్‌ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. వాహనం అదుపుతప్పి రోడ్డు మార్జిన్ గడ్డర్లను బలంగా ఢీకొట్టింది. అతివేగం, నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పటాన్‌చెరు సమీపంలోని సుల్తాన్‌పూర్‌ సమీపంలో ఎక్స్‌ఎల్‌6 రోడ్డు రెయిలింగ్‌ను ఢీకొంది.  మేడ్చల్ బయలుదేరే ప్రదేశం సుల్తాన్‌పూర్ ORR ఎగ్జిట్ కు సమీపంలో ఉన్న ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటన జరిగిన సమయంలో ఆ రోడ్డుపై వెళ్తున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. 2. అజారుద్దీన్ ఇంట విషాదం ఔటర్ రింగ్ రోడ్డుపై బైక్ రేసింగ్‌ల్లో పాల్గొన్న భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ కొడుకు మొహమ్మద్ అయాజుద్దీన్(19) మృతి చెందాడు. బైక్‌పై నుంచి పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అయాజుద్దీన్ సెప్టెంబర్ 17, 2011న మృతి చెందాడు. దీంతో అజారుద్దీన్ కుటుంబంలో తీరని శోకం మిగిలింది. 3. కోట శ్రీనివాసరావు ఇంట విషాదం జూన్ 20, 2010న జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో సీనియర్ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కుమారుడు వెంకటసాయి ప్రసాద్‌(39) మృతి చెందారు. కోట వెంకట సాయిప్రసాద్‌ తన స్పోర్ట్స్‌ బైక్ ‌పై ఓఆర్ఆర్ నుంచి శంషాబాద్‌ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఓ వేడుకలో పాల్గొనేందుకు ఫిలింనగర్‌ నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్‌ హోటల్ ‌కు బయల్దేరి ప్రసాద్‌ తన 1000 సీసీ స్పోర్ట్స్‌ బైకు(ఏపీ0938 డీఎక్స్‌-8474)పై ఒంటరిగా వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసు అకాడమీ (అప్పా) దాటిన తరువాత దర్గా మలుపు వద్ద ఓ డీసీఎం(ఏపీ29టీఏ-4656) రింగ్ రోడ్డు పైకి దూసుకొచ్చిన క్రమంలో బైక్ ‌పై వేగంగా వెళుతున్న ప్రసాద్‌ డీసీఎంను గమనించి హఠాత్తుగా బ్రేక్‌ వేశారు. దీంతో బైక్‌ రోడ్డును రాసుకుంటూ వెళ్లి డీసీఎం వ్యానును ఢీకొట్టింది. ప్రసాద్‌ ఎగిరి ఇరవై అడుగుల దూరంలో పడగా తలకు తీవ్ర గాయాలై మరణించారు. 4. కోమటిరెడ్డికి విషాదం మిగిల్చిన కొడుకు మెదక్ జిల్లా రామచంద్రపురం మండలం కొల్లూరు ఓఆర్ఆర్ వద్ద డిసెంబర్ 19, 2011 జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి మరణించారు. ప్రతీక్ రెడ్డితో పాటు సుచిత్ రెడ్డి, చంద్రారెడ్డి అనే యువకులు కూడా ఈ ప్రమాదంలో మరణించారు. వేగంగా వెళ్తున్న ప్రతీక్ రెడ్డి కారు డివైడర్‌కు ఢీకొట్టి నుజ్జు నుజ్జుయింది. హైదరాబాద్ నుంచి పటాన్‌చెరులోని ఓ మిత్రుడి ఇంటికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. 5. రవితేజ సోదరుడు భరత్ రాజు సినీ రవితేజ సోదరుడు, నటుడు భూపతిరాజు భరత్ రాజు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భరత్ కన్నుమూశారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ఆగిఉన్న లారీని భరత్ ప్రయాణిస్తున్న స్కోడా కారు వెనుక నుంచి ఢీ కొట్టగా ఈ ప్రమాదంలో భరత్ ముఖం గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమైంది, ఆయన రవితేజ సోదరుడని గుర్తించలేకపోయారు. కారు నంబర్ ఆధారంగా భరత్‌ను గుర్తించారు. 6.మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు రెయిలింగ్ (క్రాష్ బారియర్)ను ఢీకొని బోల్తా కొట్టిన ఘటనలో ఆయన భార్య సాహిత్యవాణి(52), డ్రైవర్ స్వామిదాసు(40) అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. సీట్ బెల్ట్ ధరించిన కారణంగా పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రాణాలతో బయటపడ్డారు.  శంషాబాద్ విమానాశ్రయానికి వెళుతుండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రయాణిస్తున్న కారు బోల్తా పడటంతో ఆయనకు గాయాలయ్యాయి. ఆయనతోపాటు పార్టీ నేతలు దుర్గా ప్రసాద్, దశరత్ రెడ్డి, డ్రైవర్ ‌కు కూడా గాయాలయ్యాయి.  కోకాపేట వద్ద రెండుకార్లు వేగంగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో సల్మాన్‌ అనే మెడికో మృతి చెందాడు. ఔటర్ రింగ్ రోడ్డు అంటే ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ప్రయాణాలు సులువుగా చేయడానికి, హైదరాబాద్ లోపల రద్దీని తగ్గించడానికి, త్వరగా గమ్యం చేరడానికి ఏర్పాటైన రింగ్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. రింగ్ రోడ్డుపై జరుగుతన్న ప్రమాదాలతో యేటా అనేకమంది మృత్యువాతపడుతున్నారు. అతి వేగం, నిర్లక్ష్యమైన డ్రైవింగ్, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వంటి కారణాల వల్ల ఈ ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

రమణ దీక్షితులుపై పోలీసులు కేసు నమోదు

తిరుమల గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై పోలీసులకు టీటీడీ ఐటీ విభాగం జీఎం సందీప్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు.  టీటీడీతో పాటు ఈవో ధర్మారెడ్డిపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వీడియోలో ఉంది. అయితే ఆ వీడియోపై తాజాగా రమణ దీక్షితులు స్పందించారు. టీటీడీ ఈవోకు లేఖ రాశారు. ఆ వీడియోలో ఉన్నది తన గొంతు కాదని చెప్పుకొచ్చారు.ఇప్పటి వరకు తాను భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్‌ను కలవలేదని తెలిపారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగేలా.. ఈవోకీ వ్యతిరేకంగా తానెప్పుడూ మాట్లాడలేదన్నారు. టీటీడీతో ఉన్న సంబంధాలతో పాటు తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ఆ వీడియో ఉందన్నారు. ఈ అంశంపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని రమణ దీక్షితులు వెల్లడించారు.

వైసీపీకి ఎంపీ రఘురామ రాజీనామా 

వైసీపీకి ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ కు పంపించారు. గజనీలాంటి మనస్తత్వం కలిగిన మీతో కలసి తాను పని చేయలేనని లేఖలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత మూడేళ్లుగా వైసీపీకి వ్యతిరేకంగా రఘురాజు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు తన రచ్చబండ కార్యక్రమం ద్వారా వైసీపీని ఎండగడుతున్నారు.  తనపై ఎంపీగా అనర్హత వేటు వేయించేందుకు మొహమ్మద్ గజినీ మాదిరి మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారని... మీరు కోరుకున్న ఫలితం ఈరోజు వచ్చిందని రాజీనామా లేఖలో రఘురాజు పేర్కొన్నారు. తనపై మీరు దాడి చేసిన ప్రతిసారి, తనను భౌతికంగా నిర్మూలించాలని మీరు ప్రయత్నించినప్పటికీ... తాను కూడా అంతే స్థాయిలో తన నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేశానని చెప్పారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు.  ఈరోజు టీడీపీ - జనసేనలు తమ ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తున్నాయి. టీడీపీ తరపున పోటీ చేయాలని రఘురాజు భావిస్తున్నారు. అయితే, పొత్తులో భాగంగా నర్సాపురం నియోజకవర్గాన్ని ఏ పార్టీ తీసుకుంటే ఆ పార్టీ తరపున ఆయన పోటీ చేసే అవకాశం ఉంది.

జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తుంది : పవన్ కళ్యాణ్ 

జనసేనకు కేవలం 24 సీట్లేనా అని అనుకోవద్దంటూ పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి జనసేనాని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. చాలామంది పెద్దలు, పార్టీ నేతలు 40 - 50 చోట్ల పోటీ చేయాల్సిందేనని చెప్పారని గుర్తుచేశారు. అయితే, 24 అసెంబ్లీ సీట్లకు 3 పార్లమెంట్ సీట్లను కూడా కలుపుకుంటే మొత్తంగా రాష్ట్రంలోని 40 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లేనని పవన్ చెప్పారు. ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామనే ఆలోచన పక్కన పెట్టి, పోటీ చేసిన ప్రతిచోటా జనసేనను గెలిపించాలని పిలుపునిచ్చారు. 2019లో జనసేన కనీసం పది సీట్లైనా గెలుచుకుని ఉంటే ఇప్పుడు ఎక్కువ సీట్లను అడిగి తీసుకునే అవకాశం ఉండేదని పవన్ కల్యాణ్ చెప్పారు. జనసేన పోటీ చేసే 24 సీట్లను కేవలం ఓ  నెంబర్ గానే చూడొద్దని అన్నారు. 98 శాతం స్ట్రైక్ రేట్ ఉండాలనే ఉద్దేశంతోనే టీడీపీ ఆఫర్ చేసిన 24 సీట్లతో సర్దుకుపోతున్నామని వివరించారు. కాగా, 24 అసెంబ్లీ స్థానాలకు గానూ శనివారం ఐదుగురు అభ్యర్థుల పేర్లను పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. జనసేనానితో పాటు నాగబాబు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది.

94 మందితో టిడిపి -జనసేన  అభ్యర్థుల తొలి జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితా వచ్చేసింది. శనివారం మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో మొదటి విడత అభ్యర్థుల పేర్లు వెల్లడించారు. వాస్తవానికి టీడీపీ, జనసేనలతో బీజేపీ కూడా కూటమిలో కలిసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అయితే బీజేపీ అధిష్టానం నుంచి పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది.. అందుకే టీడీపీ, జనసేనలు తొలి జాబితా విడుదల చేశారు. జనసేన 24 అసెంబ్లీ, 3 లోక్ సభ సీట్లలో జనసేన పోటీ చేస్తుందని చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ 94 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అరాచక పాలకు ముగింపు పలకడమే కూటమి లక్ష్యమని చంద్రబాబు అన్నారు.  ప్రయోగాల జోలికి వెళ్లకుండా, తక్కువ సీట్లైనా పర్వేలేదనే, అన్నీ ఆలోచించే తాము ముందడుగు వేశామని చంద్రబాబు  చెప్పారు. నాయకులంతా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి, రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని పవన్ సూచించారు. టీడీపీ ఓటు జనసేనకు ఎంత ముఖ్యమో, జనసేన ఓటు టీడీపీకి అంతే ముఖ్యమని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లో చీలకూడదని అన్నారు. జనసేన - టీడీపీ కూటమికి బీజేపీ మద్దతు ఉందని తెలిపారు. తెలుగుదేశం, జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. జనసేన పార్టీకి 24 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ అభ్యర్థులు ఆముదాలవసల - కూన రవికుమార్ ఇచ్చాపురం - బెందాళం అశోక్ టెక్కలి - అచ్చెన్నాయుడు రాజాం - కొండ్రు మురళీమోహన్ అరకు - దొన్ను దొర కురుపాం - జగదీశ్వరి పార్వతీపురం - విజయ్ బొనెల సాలూరు - గుమ్మడి సంధ్యారాణి బొబ్బిలి - బేబీ నాయన గజపతి నగరం - కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం - పూసపాటి అదితి నర్సీపట్నం - అయ్యన్నపాత్రుడు పాయకరావుపేట - వంగలపూడి అనిత విశాఖ ఈస్ట్ - వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖ వెస్ట్ - గణబాబు ముమ్మిడివరం - దాట్ల సుబ్బరాజు పి గన్నవరం - మహాసేన రాజేష్ కొత్తపేట - బండారు సత్యానందరావు మండపేట - జోగేశ్వరరావు రాజమండ్రి - ఆదిరెడ్డి వాసు జగ్గంపేట - జ్యోతుల నెహ్రూ పెద్దాపురం - చినరాజప్ప తుని - యనమల దివ్య అనపర్తి - నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఆచంట - పితాని సత్యనారాయణ పాలకొల్లు - నిమ్మల రామానాయుడు ఉండి - మంతెన రామరాజు తణుకు - అరిమిల్లి రాధాకృష్ణ చింతలపూడి - సొంగా రోషన్ కుమార్ తిరువూరు - కొలికపూడి శ్రీనివాసరావు నూజివీడు - కొలుసు పార్థసారథి ఏలూరు - బడేటి రాధాకృష్ణ గన్నవరం - యార్లగడ్డ వెంకట్రావు గుడివాడ - వెనిగండ్ల రాము పెడన - కాగిత కృష్ణ ప్రసాద్ మచిలీపట్నం - కొల్లు రవీంద్ర పామర్రు - కుమార్ రాజా విజయవాడ సెంట్రల్ - బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ ఈస్ట్ - గద్దే రామ్మోహన్ జగ్గయ్య పేట - శ్రీరామ్ తాతయ్య నూజివీడు - కొలుసు పార్థసారథి నందిగామ - తంగిరాల సౌమ్య తాడికొండ - తెనాలి శ్రావణ్ కుమార్ మంగళగిరి - నారా లోకేష్ పొన్నూరు - ధూళిపాళ్ల నరేంద్ కుమార్ బాపట్ల - నరేంద్ర వర్మ ప్రత్తిపాడు - బూర్ల రామాంజనేయులు చిలకలూరి పేట - ప్రత్తిపాటి పుల్లారావు సత్తెనపల్లి - కన్నా లక్ష్మీనారాయణ పర్చూరు - ఏలూరి సాంబశివరావు రేపల్లె - అనగాని సత్యప్రసాద్ వేమూరు - నక్కా ఆనందబాబు కనిగిరి - ముక్కు ఉగ్రనరసింహరెడ్డి కొండెపి - డోలా బాలవీరాంజనేయులు ఒంగోలు - దామచర్ల జనార్థన్ ఎర్రగొండపాలెం - ఎరిక్సన్ బాబు మార్కాపురం - కందుల నారాయణరెడ్డి నెల్లూరు సిటీ - పొంగూరు నారాయణ నెల్లూరు రూరల్ - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జనసేన అభ్యర్థులు  కాకినాడ రూరల్ : నానాజీ  నెలిమర్ల: లోకం మాధవి  తెనాలి : నాదెళ్ల మనోహర్  అనకాపల్లి : కొణతాల రామకృష్ణ  రాజనగరం: రామకృష్ణుడు   

నేడు షర్మిల కొడుకు రిసెప్షన్... మరి మేనమామ వైఎస్ జగన్ వెళ్తాడా

మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు లేదా అనేది ముద్దుల మావయ్య సినిమాలోని మాస్ సాంగ్. తెలుగు రాష్ట్రాల్లోని ఈ పాట లిరిక్స్ ఎవరూ మర్చిపోలేరు. ఉమ్మడి రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ జీవం పోసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారాల పట్టి వైఎస్ షర్మిల ఇంట్లో  పెళ్లివేడుకలు జరుగుతున్నాయి ఈ వేడుకలకు  స్వంత అన్న డుమ్మా కొట్టడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. షర్మిల కొడుకు రాజారెడ్డి రిసెప్షన్ వేడుక నేడు(ఫిబ్రవరి24) జరగనుంది. రిసెప్షన్ వేడుక పెళ్లి వేడుకల్లో చివరిది.  ఈ వేడుకకు జగన్ హాజరవుతారా   అనేది పీసీసీ అధ్యక్షురాలి అయిన వైఎస్ షర్మిల ఇంట్లో  ప్రశ్నగా మిగిలిపోయింది.   వైఎస్‌ షర్మిల కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి రిసెప్షన్‌ శనివారం జరగనుంది. హైదరాబాద్‌ శంషాబాద్‌లోని ఫోర్ట్‌ గ్రాండ్‌ హోటల్‌లో ఈ వేడుక జరగనుంది. ఈ వేడుకకు సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్‌ నేతలు కేసీ వేణుగోపాల్‌, డీకే శివకుమార్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. దేశంలోని నలుమూలలనుంచి రాజకీయ, రాజకీయేతర ప్రముఖులు హాజరవుతున్నారు. షర్మిల స్వంత అన్న జగన్ ఈ వేడుకకు హాజరవుతారా అనేది శేష ప్రశ్నగా మిగిలిపోయింది. షర్మిల కొడుకు రాజారెడ్డికి మేనమామ  వైఎస్ జగన్. స్వయంగా మేనమామ హాజరై అన్ని బాధ్యతలు నెరవేర్చాలి. మేనమామ హాదాలో రావాలని రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారు. షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహం ప్రియా అట్లూరితో ఫిబ్రవరి 17వ తేదీన జరిగింది. రాజస్థాన్‌లోని జోధ్‌ఫూర్‌ ప్యాలెస్‌లో కొద్దిమంది కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో హిందూ సంప్రదాయాల ప్రకారం వైభవంగా జరిగింది. ఫిబ్రవరి 18వ తేదీన క్రిస్టియన్‌ సంప్రదాయ పద్ధతిలో వీరి పెండ్లి జరిగింది. పెళ్లికి అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన జగన్ ఈ రిసెప్షన్ కు హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. అమ్మగా లాలించి నాన్నలా పాలించాల్సిన బాధ్యత జగన్ పై ఉంది. తండ్రి చనిపోయిన తర్వాత   షర్మిల బాగోగులు అన్న చూసుకోవాలి. కానీ జగన్ ఆ బాధ్యతను తీసుకోలేదు.  తన  అన్న గెలుపుకోసం గత ఎన్నికల్లో ఆమె చేసిన పాదయాత్రను రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేరు. అధికారంలో రాగానే జగన్ తల్లిని, చెల్లిని తన రాష్ట్ర నుంచే తరిమేసారు. ఎపిలో ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్నాయి. రెండో సారి మళ్లీ అధికారంలో వచ్చి అరాచక పాలన చేయాలని జగన్  చేస్తున్న వ్యూహాన్ని పిసిసి అధ్యక్షురాలి హోదాలో  షర్మిల నిలువరించబోతున్నారు. ఎపిలో ప్రజా రంజక పాలన పోయి ప్రజా కంటక పాలనను అడ్డుకోవాలని ఆమె పోరాడుతోంది.   షర్మిల కొడుకు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయ రీతిలో జరిగినప్పుడు స్వంత మేన మామ అయిన జగన్ డుమ్మా కొట్టాడు. ఆత్మీయత కన్నా జగన్ కు  అధికారమే  గొప్పది.  కాబట్టి ఈ రిసెప్షన్ వేడుకకు కూడా డుమ్మా కొడతాడని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

మేడారం జాతరకు హాజరైన రేవంత్ రెడ్డి

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ ఉత్సవంగా పేరుగాంచిన మేడారం జాతర అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం మేడారం చేరుకున్నారు.  హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో వచ్చిన ఆయనకు మంత్రి సీతక్క, అధికారులు ఘనస్వాగతం పలికారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను సీఎం రేవంత్ రెడ్డి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆచార సంప్రదాయాలను అనుసరించి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించారు.  మేడారం జాతరలో సీఎంతో పాటు అమ్మవార్ల దర్శనం చేసుకున్నవారిలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, రాష్ట్ర సీఎస్ శాంతికుమారి కూడా ఉన్నారు.

భర్తకు  భరణం: ఇండోర్ కోర్టు  సంచలన తీర్పు 

తన నుంచి విడిపోయిన నిరుద్యోగి అయిన భర్తకు ప్రతినెల రూ. 5 వేల చొప్పున భరణం చెల్లించాలంటూ ఇండోర్‌లోని కుటుంబ న్యాయస్థానం ఓ మహిళను ఆదేశించింది. కట్నం కోసం  భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రతిగా, ఆమె భర్త కోర్టుకు ఫిర్యాదు చేస్తూ.. పెళ్లి తర్వాత ఆమె తనను వేధించిందని, భరణం డిమాండ్ చేసిందని పేర్కొన్నాడు. భార్య కోసం చదువును మధ్యలోనే ఆపేయాల్సి రావడంతో నిరుద్యోగిగా మిగిలిపోయానని తెలిపాడు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం నిరుద్యోగి అయిన భర్తకు ప్రతినెల రూ. 5000 భరణం చెల్లించాలని ఆదేశించింది.  ఆమె వాంగ్మూలం పరస్పర విరుద్ధంగా ఉండడాన్ని ఈ సందర్భంగా న్యాయస్థానం గుర్తించింది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తానో బ్యూటీ పార్లర్ నడుపుతున్నట్టు తొలుత పేర్కొంది. అయితే, ఆ తర్వాత కోర్టులో మాత్రం తానో నిరుద్యోగినని తెలిపింది. ఈ నేపథ్యంలో బలమైన సాక్ష్యం లేకపోవడంతో విడిపోయిన భర్తకు ప్రతినెల రూ. 5 వేల చొప్పున చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది. భర్తకు భరణం చెల్లించాలని భార్యను కోర్టు ఆదేశించడం మధ్యప్రదేశ్‌లో ఇదే తొలిసారి కావడం గమనార్హం. సాధారణంగా ఇలాంటి కేసుల్లో భర్తలే భరణం చెల్లించాల్సి వస్తుందని న్యాయవాది తెలిపారు.