సీట్ల సర్దుబాటు ఖరారు..జగన్ శిబిరంలో కంగారు!
సార్వ్రతిక ఎన్నికల షెడ్యూల్ విడుదల రోజుల వ్యవధిలోకి వచ్చేసింది. దీంతో దేశం అంతా ఎన్నికల హీట్ పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇక్కడ గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత పీక్స్ లో ఉందన్న అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో ప్రతిపక్ష తెలుగుదేశం గత ఎన్నికల పరాజయం నుంచి కోలుకుని బలంగా పుంజుకుందని పరిశీలకులు చెబుతున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీతో కలిసి నడవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించడంతో ఏపీలో తెలుగుదేశం, జనసేన కూటమిలో జోష్ కనిపిస్తోంది. రెండు పార్టీల శ్రేణులూ క్షేత్ర స్థాయి నుంచీ సమన్వయంతో కదులుతున్నాయి.
ఏపీలో అటువైపా, ఇటువైపా తేల్చుకునే విషయంలో ఇంత కాలం ఊగిసలాటలో ఉన్న బీజేపీ అధిష్ఠానం కూడా తెలుగుదేశం, జనసేన కూటమితోనే కలిసి నడవాలన్న నిర్ణయాన్ని ప్రకటించేసింది. ఆ కూటమితో సీట్ల సర్దుబాటుపై కూడా ఒక ఒప్పందానికి వచ్చేసిందని హస్తినలో అమిత్ షా, నడ్డాలతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీతో ఒక క్లారిటీ వచ్చేసింది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇహనో, ఇప్పుడో వెలువడే అవకాశాలు ఉన్నాయి. పొత్తులో భాగంగా ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్న విషయంలో శుక్రవారమే కూటమి, బీజేపీల మధ్య ఒక ఒప్పందం కుదిరిందని హస్తిన వర్గాలు చెబుతున్నాయి. అయితే సంఖ్య మాత్రమే కాదు, పోటీ చేసే స్థానాలు, పోటీలో ఉండే అభ్యర్థుల విషయంలో కూడా తమకు ఆమోదయోగ్యమైనట్లుగానే ఉండాలన్న తెలుగుదేశం, జనసేన కూటమి డిమాండ్ పట్ల కూడా బీజేపీ పెద్దలు సానుకూలంగా స్పందించారని అంటున్నారు. ఎందుకంటే.. ఏపీలో బీజేపీ ఓటు స్టేక్ కనీసం ఒక శాతం కూడా లేదు. ప్రజల మొగ్గు ఉన్న తెలుగుదేశం, జనసేనలతో కలిసి నడిస్తేనే బీజేపీకి రాష్ట్రంలో అంతో ఇంతో ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనానికి తోడు తెలుగుదేశం, జనసేన కూటమి గెలుచుకునే ఎంపీ స్థానాలు కూడా బీజేపీకి కీలకమే. అందుకే రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులను పరిగణనలోనికి తీసుకుని గెలుపు గుర్రాలెవరన్న విషయాన్ని బేరీజు వేసుకుని పొత్తులో భాగంగా బీజేపీ పట్టు విడుపులు ప్రదర్శించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మొత్తంగా పొత్తులో భాగంగా బీజేపీ జనసేనలు 30 అసెంబ్లీ, ఎనిమిది లోక్ సభ స్థానాలలో పోటీలో ఉంటాయనీ, మిగిలిన 140 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాలలో తెలుగుదేశం అభ్యర్థులు రంగంలో నిలుస్తారన్న ఒప్పందం ఖరారైపోయిందని చెబుతున్నారు. వీటిలో ఇప్పటికే 24 అసెంబ్లీ, మూడు లోక్ సభ స్థానాలలో జనసేన పోటీ చేస్తుందన్న విషయం తేటతెల్లమైపోవడంతో ఇక ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో ఆరు అసెంబ్లీ, ఐదు ఎంపీ స్థానాలలో అభ్యర్థులను నిలుపుతుందన్న స్పష్టత వచ్చేసింది. అసలు తొలుత బీజేపీ ఎక్కవ స్థానాలను కేటాయించాలంటూ డిమాండ్ చేసినప్పటికీ చర్చలలో పరిస్థితిని అవగాహన చేసుకుని మెట్టు దిగిందని, ఇది శుభపరిణామమని పరిశీలకులు అంటున్నారు.
ఎక్కువ స్థానాలు డిమాండ్ చేసి సాధించుకున్నా నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించుకోవడంలో విఫలమైతే ప్రయోజనం ఉండదు. అమిత్ షా, నడ్డాలతో చర్చల్లో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇదే విషయాన్ని గట్టిగా చెప్పి వారిని కన్విన్స్ చేశారని అంటున్నారు. అలాగే.. పోటీ చేసే స్థానాలలో బీజేపీ నిలబెట్టే అభ్యర్థుల విషయంలో కూడా తమ అభిప్రాయాన్ని పరిగణనలోనికి తీసుకోవాలని చంద్రబాబు గట్టిగా పట్టుబట్టినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం, జనసేన మధ్య ఓటు ట్రాన్స్ ఫర్ లో ఎటువంటి ఇబ్బందులూ ఉండవనీ, చాలా కాలంగా ఇరు పార్టీలూ కూడా సమన్వయంతో పని చేస్తున్నాయనీ, క్షేత్ర స్థాయిలో ఇరు పార్టీల శ్రేణులూ ప్రజాసమస్యలపై సమష్టి పోరాటాలతో ప్రజలలో ఉన్నాయనీ వివరించిన చంద్రబాబు, ఇంత కాలం బీజేపీ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వానికి వత్తాసుగా ఉందన్న అభిప్రాయం ప్రజలలో బలంగా ఉందనీ, అంతే కాకుండా ఇప్పటి వరకూ తెలుగుదేశంపై ఇష్టారీతిగా విమర్శలు గుప్పించిన రాష్ట్ర బీజేపీ నాయకులను పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దింపితే ఓటు బదలీ సమస్యగా మారుతుందని చంద్రబాబు వివరించినట్లు తెలుస్తోంది. అందుకే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలంగా గళమెత్తిన రాష్ట్ర బీజేపీ నేతలనే కమలం పార్టీ అభ్యర్థులుగా ఎంపిక చేయాలన్న చంద్రబాబు సూచన పట్ల అమిత్ షా, నడ్డాలు సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. దీంతో ఎలాంటి ఇబ్బందులూ, సమస్యలూ లేకుండా సీట్ల సర్దుబాటు జరిగిపోయిందని అంటున్నారు.