ఒకరి వెంట ఒకరు.. వైసీపీ నుంచి వలసల జోరు!
అధికార పార్టీ నుంచి వలసల జోరు చూస్తుంటే 1977లో మోరార్జీ సర్కార్ పతనానికి ముందు జనతా పార్టీ నుంచి ఎంపీలు ఒక్కరొక్కరుగా బయటకు వచ్చిన నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. అప్పట్లో జనతా పార్టీ నుంచి బయటకు వచ్చే ఎమ్మెల్యేల సంఖ్య గంటగంటకూ పెరుగుతూ వచ్చింది. చివరికి మొరార్జీ సర్కార్ పతనమైంది. సరిగ్గా ఇప్పుడు వైసీపీలో అటువంటి పరిస్థితే కనిపిస్తోంది.
ఇక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి బయటకు వస్తున్నారు. వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ వస్తున్నది. వీరు కాక పదుల సంఖ్యలో పార్టీ క్యాడర్ వైసీపీకి గుడ్ బై చెబుతోంది. ఈ పరిస్థితి ఎన్నికల నాటికి వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదన్నట్లు తయారైంది. తాజాగా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్, కమ్మ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ సోమవారం( ఫిబ్రవరి 26) వైసీపీకి రాంరాం చెప్పేశారు. వీరంతా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరారు. వీరికి . లోకేష్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
రాష్ట్రం తిరిగి అభివృద్ధి బాట పట్టాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమన్న నమ్మకంతో తాము తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వారు పేర్కొన్నారు. బిడ్డల భవిష్యత్తు కోసం రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ రాష్ట్ర భవిష్యత్ కోసం టిడిపితో కలసి పనిచేసేందుకు వచ్చిన పార్థసారధి, భవకుమార్, చంద్రశేఖర్ తో చేరిన వారందరికీ అభినందనలు తెలిపారు. తెలుగుదేశంపార్టీలో అన్నివర్గాలకు సముచిత ప్రాధాన్యత, గౌరవం ఉంటాయన్నారు.
వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరిన వారిలో పెనమలూరు నియోజకవర్గం నుండి వల్లభనేని సత్యనారాయణ(ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్), నెరుసు రాజ్యలక్ష్మీ(కంకిపాడు ఎంపీపీ) ధూళిపూడి కృష్ణకిషోర్(కంకిపాడు వైస్ ఎంపీపీ), రొండి కృష్ణా యాదవ్(జిల్లా లైబ్రరీ మాజీ చైర్మన్), మాడలి రామచంద్రారావు(మండల వైసీపీఅధ్యక్షుడు), లోయ ప్రసాద్(బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), లింగమనేని సత్యవేణి(సీతారామపురం సర్పంచ్), పోలవరపు బొబ్బి(తాడిగడప మాజీ ఎంపీటీసీ), పార్టీ నేతలు కొలుసు పోతురాజు, నిడుమోలు పూర్ణచంద్రరావు, కొడాలి రవి, మండవ ప్రగతి, నలి మాధవ్, దుద్దుకూరి వెంకటకృష్ణారావు, బోడపాడు శంకర్, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి తుపాకుల మహేష్ (వైసిపి రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి), పుప్పాల వెంకటసుబ్బారావు (సీనియర్ నాయకులు), మేకల విజయలక్ష్మి (గొల్లపూడి మార్కెట్ యార్డు డైరక్టర్), చెన్ను సురేష్ (విజయవాడ నగర వైసిపి యూత్ జనరల్ సెక్రటరీ), ఇజ్జడ ప్రదీప్ (సిటీ వైసిపి పబ్లిసిటీ విభాగం కార్యదర్శి),ఉప్పులేటి అనిత (నగర వైసిపి లీగల్ సెల్ విభాగం కార్యదర్శి), పొలిమెట్ల డానియేల్ (అఖిలభారత క్రిస్టియన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్), నర్రా అరుణ్ బాబు (వైసిపి సిటీ యువజనవిభాగం కార్యదర్శి), సోనా సునీత, సోనా జయకుమార్, సోనా రాజేశ్వరి, కురుముల రాజా, షేక్ నాగూర్ తదితరులు ఉన్నారు.