అన్నింటికీ చంద్రబాబేనా? ప్రజలను ఎన్నాళ్లు నమ్మిస్తారు సజ్జలా!
posted on Mar 2, 2024 8:21AM
ఏపీ రాజకీయాల్లో వైసీపీ నేతల విచిత్ర ప్రవర్తన ప్రజలకు వెగుటు పుట్టిస్తోంది. తప్పు చేయడం పక్క పార్టీల మీద నెట్టడం.. ఇదే ఫార్ములాను వైసీపీ అధిష్టానం నుంచి కార్యకర్తల వరకూ తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. అధికారంలోకి రాకముందు, వచ్చిన తరువాత కూడా వారి బుద్దిలో ఏమాత్రం మార్పు రాలేదు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలోనూ జగన్ మోహన్ రెడ్డి అచ్చుగుద్దినట్లు ఇదే ఫార్ములాను అనుసరిస్తూ వస్తున్నారు. గత ఎన్నికల సమయంలో వివేకా హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసును సునాయాసంగా అప్పటి సీఎం చంద్రబాబుపై నెట్టేసి జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లో సానుభూతి పొంది అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత వివేకా హత్య జగన్ వర్గీయుల పనేనంటూ ఒక్కో విషయం వెలుగులోకి రావడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. స్వయాన వివేకానందరెడ్డి కూతురు, సీఎం జగన్ చెల్లెలు నర్రెడ్డి సునీతారెడ్డి మా నాన్నను హత్యచేసింది వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలేనని స్పష్టంగా చెబుతున్నారు. వారిని కాపాడేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారనీ, ఆయన్ను కూడా విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ చెల్లెలు రోదనలు పట్టించుకోని జగన్.. తన సిపాయిలను మీడియా ముందుకు పంపించి సునీత చెప్పేదంతా చంద్రబాబు డ్రామాలో భాగమే అంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
గత ఐదేళ్లుగా వివేకా హత్య గురించి ఒక్కో విషయం వెలుగులోకి వస్తున్నాయి. ప్రజలకు వివేకా హత్య కేసు సూత్రధారులు, పాత్రధారుల విషయంలో స్పష్టత వచ్చింది. ఈ హత్య కేసులో అరెస్టయి జైలుకెళ్లిన వాళ్లుసైతం నిందితులు జగన్ మనుషులే అని చెబుతున్నారు. అయినా, ప్రజలంతా పిచ్చోళ్లు అన్నట్లుగా నిజాలను అబద్దాలుగా చిత్రీకరించే ప్రయత్నం సజ్జల రామకృష్ణారెడ్డి చేయడం నీచ రాజకీయాలకు పరాకాష్ట అంటూ పరిశీలకులు విశ్లేషకులు అంటున్నారు. ఇక్కడ ప్రజలు గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే, చంద్రబాబు ముసలోడు.. ఆయన రాజకీయాలకు, వ్యూహాలు పన్నడానికి పనికిరారు అంటూ పబ్లిక్ మీటింగ్ లపై చెప్పే వైసీపీ నేతలు.. వివేకానంద హత్యకేసులో జగన్, ఆయన వర్గం వారి ప్రమేయం ఉందని జగన్ చెల్లెలే స్వయంగా మొత్తుకుంటుంటే మాత్రం.. దానికి కారణం చంద్రబాబు అని సజ్జల, వైసీపీ నేతలు అంటుండటం విడ్డూరంగా ఉంది. తాజా పరిణామాలతో వివేకా హత్య మరకను తుడుచుకునేందుకు జగన్, సజ్జల చేస్తున్న ప్రయత్నాలు చూసి విస్తుపోవటం ఏపీ ప్రజల వంతవుతున్నది.
అసలు విషయానికి వస్తే, వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి తన తండ్రి హత్యకు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డే అని వారిద్దరినీ జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారని నేరుగా తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు, హంతకులు ఎక్కడో లేరు మన మధ్యనే ఉన్నారు. హత్యా రాజకీయాలు చేసే వైసీపికి ఎవరూ ఓట్లు వేయవద్దని సునీతారెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సునీతారెడ్డి ప్రెస్ మీట్ ఢిల్లీలో అయిపోయిన వెంటనే.. వైసీపీ తరపున సజ్జల రామకృష్ణా రెడ్డి తాడేపల్లిలో మీడియా ముందు కొచ్చారు. సునీతారెడ్డి మాటలన్నీ అబద్దం. మేము చెప్పేదే నిజం.. ప్రజలంతా మేము చెప్పిందే నమ్మాలి అన్నంత పనీ చేశారు సజ్జల. అంతేకాక ఇన్నాళ్ళకు సునీతారెడ్డి తన ముసుగును తీసేసి తన అసలు రూపం బయటపెట్టుకున్నందుకు ముందుగా ఆమెకు చాలా థాంక్స్ చెపుతున్నాను అంటూనే, ఇన్నేళ్ళుగా మాట్లాడని ఆమె ఎన్నికలకు ముందు ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రెస్‌మీట్ పెట్టి తన తండ్రి హత్య కేసు గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని, మా ఎంపీ అవినాష్ రెడ్డిని నిందిస్తున్నారంటూ అరిగిరిన క్యాసెట్ నే మళ్లీ వినిపించారు సజ్జల. ఇక్కడ సజ్జలకు తెలియాల్సిన విషయం ఏమిటంటే.. సునీతారెడ్డి గత నాలుగేళ్లుగా తన తండ్రిని చంపిన నిందితులకు శిక్షలు వేయాలని మీడియా ముందు అనేకసార్లు ప్రస్తావించారు.. ఆమె ప్రత్యేకంగా ఎన్నికల ముందు వచ్చి మాట్లాడలేదు. అంతేకాదు, చంద్రబాబు ముసలోడు అంటూ ప్రచారం చేసిన చేయించిన సజ్జల.. ఇప్పుడు మాత్రం సునీతా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టగానే అదంతా చంద్రబాబు పనేనంటూ చెప్పడం వైసీపీ శ్రేణులనుసైతం విస్మయానికి గురిచేస్తున్నది.
వివేకా హత్య కేసుని వారంరోజుల్లో తేల్చేయవచ్చని సునీతారెడ్డి అంటున్నారు.. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోఎందుకు అడగలేదు? వివేకా హత్య జరిగిన తర్వాత దాదాపు రెండు నెలలుపైగా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా? అప్పుడే కేసుపై దర్యాప్తు జరిపించి దోషులను ఎందుకు పట్టుకోలేదు? అంటూ సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే, ఈ ప్రశ్నలన్నిటికీ చాలా ఎదురు ప్రశ్నలున్నాయి. వాటన్నిటికీ సజ్జల రామకృష్ణా రెడ్డి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వివేకాని తెలుగుదేశం నేతలే హత్య చేసిన్నట్లయితే, ఎన్నికల సమయంలో అదే విషయం చాటింపు వేసుకుంటే వైసీపీకే లబ్ధి కలిగేది కదా? కానీ గుండెపోటుతో చనిపోయారని ఎందుకు అబద్దం చెప్పారు? హత్య జరిగినట్లు తెలీయకుండా బ్యాండేజీలు ఎందుకు చుట్టారు? ఎవరు చుట్టారు? పోస్ట్ మార్టం నిర్వహించకుండా అంత్యక్రియలు నిర్వహించడానికి ఎందుకు ప్రయత్నించారు? తెలుగుదేశం నేతలే ఈ హత్య చేసిన్నట్లయితే రాష్ట్రంలో వైసీపీయే అధికారంలో ఉంది కదా? మొదట ఈ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసుల వద్ద ఉన్న సాక్ష్యధారాలన్నిటినీ సీబీఐకి సమర్పించి తెలుగుదేశం నేతలను లోపల వేయించేయొచ్చు కదా? కానీ వివేకా హత్య కేసు ముందుకు సాగనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? ఈ ప్రశ్నలకు సజ్జల సమాధానం చెప్పగలరా అని జనం ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి సునీతా రెడ్డి ఢిల్లీలో లేవనెత్తిన ప్రశ్నలకు సజ్జల సమాధానాలు చెప్పలేక అంతా చంద్రబాబు చేశారంటూ పాతపాటే పాడుతూ.. తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం ఏపీ ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది.