ముస్లిం రిజర్వేషన్ చట్ట విరుద్ధం హైకోర్టు సంచలన తీర్పు!
posted on May 23, 2024 @ 3:53PM
ముస్లిం ఉప కులాలకు రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం 2010 తరువాత ప్రభుత్వ ఉద్యోగాలు, సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు 77 ముస్లిం ఉప కులాలను ఓబీసీలుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన ఉత్తర్వులు చట్ట విరుద్ధమని ధర్మాసనం తెలిపింది. ముస్లిం సమాజాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వస్తువుగా పరిగణిస్తున్నారని జస్టిస్ తపబ్రత చక్రవర్తి, జస్టిస్ రాజశేఖర్ మంథా ధర్మాసనం తెలిపింది. అయితే, ఇప్పటికే ఈ విధమైన రిజర్వేషన్లు పొందినవారు, ప్రభుత్వ ఉద్యోగాలు, సర్వీసులకు ఎంపికైనవారికి తమ తీర్పు వర్తించదనీ.. వారు ఉద్యోగాల్లో యథావిధిగా కొనసాగవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.
2010 సంవత్సరం తర్వాత నుంచి జారీ చేసిన ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) సర్టిఫికెట్లన్నీ రద్దు చేస్తూ కోల్‌కతా హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత 14 ఏళ్ళ వ్యవధిలో జారీ అయిన దాదాపు 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లన్నీ రద్దయ్యాయి. అయితే, ఓబీసీ సర్టిఫికెట్లను వాడుకొని ఇప్పటికే ఉద్యోగాలు పొందిన వారిపై, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న వారిపై ఈ ఆదేశాల ప్రభావం ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. అలాంటి వారంతా ఓబీసీ కోటాలోనే కొనసాగుతరాని వెల్లడించింది. 2010 సంవత్సరం తర్వాత మమతా సర్కారు జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లు 1993 చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని న్యాయమూర్తులు జస్టిస్ తపోబ్రత చక్రవర్తి, జస్టిస్ రాజశేఖర్ మంథర్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 2010 ఏప్రిల్ – సెప్టెంబరు మధ్య 77 కులాలను ఓబీసీలుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను, 2012 చట్టం ఆధారంగా కొత్తగా చేర్చిన మరో 37 కులాల ఓబీసీ హోదాను కోర్టు కొట్టివేసింది.
2012లో చేసిన ఒక చట్టం కింద కొన్ని కులాలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కలకత్తా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
- ఎం.కె. ఫజల్