ముద్దు పెట్టినందుకు బాదేశారు!
posted on May 23, 2024 @ 6:01PM
అంగరంగ వైభవంగా పెళ్ళి జరుగుతోంది. వేదిక మీద వున్న వధూవరులు చిలకాగోరింకల మాదిరిగా చూడముచ్చటగా వున్నారు. వాతావరణం అంతా సందడిగా వుంది. పెళ్ళికూతురు తరఫు వాళ్ళు భారీ స్థాయిలో పెళ్ళి ఏర్పాట్లు చేశారు. పెళ్ళికొడుకు తరఫు వాళ్ళకు అన్ని రకాల మర్యాదలూ చేస్తున్నారు. ఇంతలో ఊహించని సంఘటన జరిగింది. పెళ్ళి కూతురు బుగ్గ మీద అతను ముద్దు పెట్టాడు. అది చూసిన ఆడపెళ్ళివారికి ఆగ్రహం ముంచుకొచ్చింది. పెళ్ళికూతురికి ముద్దు పెట్టడానికి నువ్వెవడ్రా అంటూ పెళ్ళికూతురికి ముద్దుపెట్టిన వ్యక్తిని చావబాదారు. దాంతో అతను లబోదిబో, కుయ్యోమొర్రో అన్నాడు.. ఇంతకీ పెళ్ళికూతురికి ముద్దుపెట్టింది ఎవరో దారినపోయే దానయ్య కాదు.. సాక్షాత్తూ పెళ్ళికొడుకే. ఇవాళా రేపు పెళ్ళి వేదికల మీద పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ముద్దు పెట్టుకోవడం మామూలు విషయమే.. పాపం పెళ్ళికొడుకు కూడా అదే పని చేశాడు. దాంతో పెళ్ళికూతురు తరఫు వాళ్ళ చేతిలో చావుదెబ్బలు తిన్నాడు. పెళ్ళికొడుకుని అలా కొట్టినందుకు అతని తరఫు వాళ్ళు రెచ్చిపోయారు. పెళ్ళికూతురు ఫ్యామిలీవాళ్ళని కూడా తుక్కుతుక్కుగా ఇరగొట్టేశారు. వీళ్ళు కూడా తిరగబడ్డారు. దాంతో రెండు వర్గాల వాళ్ళూ విరగబాదుకుంటూ పెళ్ళికి వచ్చిన జనం మీద పడ్డారు. పెళ్ళికి వచ్చిన జనం ఇదేంట్రా కొత్తరకం గొడవ అనుకుంటూ పరుగులు తీసి, తినడానికి సిద్ధంగా వున్న ఆహార పదార్థాల మీద పడ్డారు. దాంతో కంగాళీ, గందరగోళం, సర్వనాశనం..
ఈ సందర్భంగా జరిగిన తన్నులాటలో మొత్తం ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళలో పెళ్ళికూతురు తండ్రి కూడా వున్నాడు. గాయపడినవాళ్ళందరూ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. వీళ్ళలో ఒక వికెట్ అయినా లేచే అవకాశం వుందని అంటున్నారు. తన్నుకునే శక్తి తగ్గిపోయిన తర్వాత రెండు వర్గాలూ మాటల యుద్దం ప్రారంభించాయి. పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకు ముద్దుపెట్టుకుంటే తప్పేంటయ్యా అని వీళ్ళు అంటే, మా అమ్మాయిని అందరి ముందూ ముద్దు పెట్టుకుంటే మేం ఊరుకోం అని వాళ్ళు అన్నారు. చివరికి పెళ్ళికొడుకు అసలు విషయం బయటపెట్టాడు. పెళ్ళికూతురు ముద్దు పెట్టుకోమంటేనే ఈ అందగాడు ముద్దు పెట్టుకున్నాడట. అలా ఒక్క ముద్దు పెట్టిన పాపానికి వంద గుద్దులు తినాల్సి వచ్చింది. అసలు విషయం తెలిసి అందరూ నోళ్ళు తెరిచారు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని హాపూర్‌లో జరిగింది.