అన్న చాలా మంచోడు.. పిన్నెల్లికి జగన్ కితాబు.. వైరల్ అవుతున్న పాత వీడియో
posted on May 23, 2024 @ 11:43AM
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఈ పేరు ఇప్పుడు హాట్ టాపిక్. అరాచకాలు, అకృత్యాలు, దాడులు, ఈవీఎంల విధ్వంసం ఇలా ఆయన చేయని దారుణం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే, అధికార పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పైగా ఆయన పోలీసులను తప్పించుకుని పరారైపోయారు. అజ్ణాతంగా ఉన్నారు. ఆయనపై లుక్ ఔట్ నోటీసు కూడా జారీ చేశారు. ఈ సంఘటనలన్నీ ఆయన ఎంతటి నేరస్తుడో ఎవరికైనా అర్ధం అయిపోతుంది. పిన్నెళ్లిపై పది సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కనీసం ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని సాక్షాత్తూ డీజీపీయే చెప్పారు. అటువంటి నేరస్థుడికి సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఇచ్చిన కితాబుకు సంబంధించిన పాత వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది.
ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓ రేంజ్ లో పొగిడేస్తున్న వీడియోను నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ గూండాయిజాన్ని ప్రోత్సహిస్తుందనడానికి ఇంతకు మించిన సాక్ష్యం ఎందుకంటూ ఏకి పారేస్తున్నారు.
ఇంతకీ ఆ వీడియోలో జగన్ ఏమన్నారంటే.. పిన్నెల్లి అన్న తనకు సోదర సమానుడు. చాలా మంచి వ్యక్తి. ఆయనను మంచి మెజారిటీతో గెలిపిస్తే ఆయనకు ఉన్నత స్థానం హోదా కల్పిస్తాను. అంటే మంత్రిని చేస్తాను. మీరంతా ఆయన వెనుకే ఉన్నారని ఆశిస్తున్నాను. ఈ మాటలన్నీ జగన్ స్వయంగా అన్నవి. వాస్తవానికి పిన్నెల్లి మంచి తనం ఏమిటో ఈవీఎం ధ్వంసం ఘటనతో, అదేమని ప్రశ్నించిన ఒక మహిళపై దుర్భాషలాడిన వీడియోతోనే తేలిపోయింది. దీంతో ఇప్పుడు వైసీపీ నోరు మూతపడిపోయింది. పిన్నెల్లిని సమర్ధించుకునేందుకు అవకాశం కూడా లేకుండా పోయింది. ఇటువంటి పిన్నెల్లిని చాలా మంచి వ్యక్తి అంటూ పొగిడిన జగన్ కు జనం ముందు దోషిగా, రౌడీలకూ, గూండాలకూ కొమ్ముకాసే వ్యక్తిగా ముద్రపడిపోయింది.