ఫలితాల్లో ఫస్ట్ ఓటమి రోజాదే!
posted on May 23, 2024 @ 4:40PM
వైసీపీ నాయకురాలు రోజాకి ‘ఐరన్ లెగ్’ అనే బిరుదు మొట్టమొదటిసారి ఎవరు ఇచ్చారోగానీ, ఆ ఇచ్చినోడి నాలుక మీద మచ్చలు వుండే వుంటయ్ నో డౌట్. ఎందుకంటే, ఆ మాట ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతూ వస్తోంది. రోజా రెండుసార్లు ఎమ్మెల్యే అయినా, మంత్రి పదవిలోకి వచ్చినా సదరు ‘ఐరన్ లెగ్’ అనే మాట మాత్రం ఆమె జీవితంలో నుంచి తొలగిపోవడం లేదు. నగరి నియోజకవర్గం నుంచి హాట్రిక్ సాధించడానికి ప్రయత్నిస్తున్న రోజా ఈ సారి తుక్కుతుక్కుగా ఓడిపోవడం ఖాయమనే విషయంలో పోలింగ్ రోజు క్లారిటీ వచ్చేసింది. తనను ఓడించడానికి తన పార్టీ నాయకులే పనిచేస్తున్నారని రోజా బాహాటంగా చెప్పుకుని లబోదిబో అనడం గురించి అందరికీ తెలిసిందే. దీన్నిబట్టి ఏంటంటే, నగరిలో రోజా ఓడిపోవడం ఖాయం. ఓడిపోవడం మాత్రమే కాదు.. ఫలితాలలో మొదటగా వచ్చే ఫలితం నగరిదే.. అంటే, వైసీపీకి ఓటమి బోణీ కొట్టేది రోజా నియోజకవర్గమేనన్నమాట.. పాపం వైసీపీ, అయ్యో పాపం రోజా!
ఎన్నికల ఫలితాలలో మొదటి ఫలితం తనదే అయ్యే అదృష్ణం రోజాకి ఎందుకు పట్టిందంటే, నగరి నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య తక్కువ. ఇక్కడ మొత్తం 2,02,574 మంది ఓటర్లు వున్నారు. పోలింగ్ బూత్‌ల సంఖ్య కూడా తక్కువ (231). అలాగే పోటీలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య కూడా తక్కువే. ఇక్కడ కేవలం ఏడుగురు అభ్యర్థులు మాత్రమే రంగంలో వున్నారు. సంఖ్యాపరంగా అన్నిరకాలుగా తక్కువలో వున్న నగరి నియోజకవర్గం రోజాకి, వైసీపీకి మొదటి షాక్ ఇవ్వబోతోంది.