జగన్ మేనమామ కూడా చెప్పేశారు.. ఫలితాలపై ఆశలొద్దని!
posted on May 23, 2024 @ 2:12PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్ ఐదేళ్ల దుష్టపాలనను వదిలించేసుకుందా? ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెల్లడి కాకపోయినప్పటికీ వైసీపీ నేతల మాటలు, వారి బాడీ లాంగ్వేజ్, వారి ఉక్రోషం చూస్తుంటే.. విజయంపై నమ్మకాన్ని వాళ్లు వదిలేసుకున్నారని అనిపించక మానదు. ఎంత గంభీరంగా ఉందామని ప్రయత్నించినా, విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ ముఖం సంతోషంతో వెలిగిపోతున్నట్లు నటిద్దామని ప్రయత్నించినా, వారికి తెలియకుండానే మాటల్లో నిరాశ, ముఖంలో నిర్వేదం కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి.
నగరి వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి రోజా పోలింగ్ రోజునే మీడియా ముందకు వచ్చి తనను తన పార్టీ వారే ఓడించడానికి ప్రయత్నించారని ఎవరూ అడగకుండానే తన ఓటమి మాట చెప్పేశారు. ఆ తరువాత సత్తెనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబు అయితే పోలీసులు తెలుగుదేశం వారితో కుమ్మక్కైపోయారని విమర్శలు గుప్పించి, తనలోని ఓటమి భయాన్ని బయటపెట్టుకున్నారు. అంతే కాకుండా రీపోలింగ్ డిమాండ్ చేసి తనకు జనం ఓట్లు వేయలేదని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు తగదునమ్మా అని రీపోలింగ్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఇక సకల శాఖల మంత్రి, ప్రభుత్వ సలహాదారు, ఒక విధంగా చెప్పాలంటే జగన్ ఆత్మ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి పోలింగ్ సరళి తమకు అనుకూలంగా లేదని పరోక్షంగా చెప్పేశారు. తన కుమారుడు, వైసీపీ సోషల్ మీడియా వింగ్ చీఫ్ అయిన సజ్జల భార్గవ్ రెడ్డిని చడీచప్పుడు లేకుండా రాష్ట్రం దాటించేశారు. పోలింగ్ రోజు నుంచి సజ్జల భార్గవ్ మాట ఎక్కడా వినిపించడం లేదు. ఆయన ఎక్కడా కనిపించడం లేదు. పోలింగ్ ఇలా పూర్తయ్యిందో లేదో వైసీపీ సోషల్ మీడియా కార్యాలయానికి తాళాలు పడిపోయాయి.
ఇక జగన్ భజనలో ఆరితేరిన కొమ్మినేని శ్రీనివాసరావు అయితే తొందరపడి బెట్టింగులూ గట్రా కట్టి సొమ్ములు పోగొట్టుకోకండి అంటూ అడగకుండానే వైసీపీ అభిమానులు, కార్యకర్తలకు ఒక ఉచిత సలహా పారేసి, వైసీపీ విజయంపై ఆశలు పెట్టుకోవద్దని చెప్పకనే చెప్పేశారు. నిజానికి వైసీపీ గెలుపుపై బెట్టింగులు కాయడానికి వైసీపీ వారెవరూ సిద్ధంగా లేరనుకోండి అది వేరే విషయం.
మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని వంటి అనుచిత భాషా ప్రవీణులు తమ నోళ్లకు తాళం వేసుకున్నారు. వల్లభనేని వంశీ గోడెక్కేశాడు. ఎటు దూకాలో తేల్చుకునే పనిలో ఉన్నారు.
ఇక ఆపద్ధమర్మ ముఖ్యమత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత మేనమామ, పార్టీ కమలాపురం అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి అయితే తన మేనల్లుడి పార్టీ రాష్ట్రాన్ని గబ్బుపట్టించేసిందని వ్యాఖ్యానించి మొత్తం గాలి తీసేశారు. పోలింగ్ పూర్తయిన తరువాత తాపీగా ఆయన తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అనుకోకుండా మనసులో మాట బయటపెట్టేశారు. రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైసీపీ అని మీడియాకు చెప్పేసి ఆ తరువాత నాలుక్కరుచుకున్నారు, అయితే అప్పటికే ఆలస్యమైపోయింది. ఆయన మాటలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయిపోయాయి. స్వయంగా జగన్ మేనమామ రవీంద్రనాధరెడ్డే వైసీపీ ఈ రాష్ట్రాన్ని గబ్బుపట్టించిందంటూ నిజం కక్కేయడంతో వైసీపీ శ్రేణులలో కాస్తో కూస్తో ఉన్న గెలుపు నమ్మకం పూర్తిగా పోయిందని పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.