పిన్నెల్లి వీడియో లీక్ చేసింది పోలీసులేనా? సీఈవో మాటలకర్ధం అదేనా?
posted on May 23, 2024 @ 3:00PM
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో వెలుగులోకి వచ్చిన క్షణం నుంచీ అధికార వైసీపీ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. స్వయంగా అభ్యర్థే పోలింగ్ బూత్ లో దౌర్జన్యం చేసి, అందరినీ బెదరించి ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జాతీయ మీడియా సైతం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. అయితే ఈ విషయాన్ని వైసీపీ సమర్ధించుకోవడానికి చేసిన ప్రయత్నం ఆ పార్టీపై మరిన్ని విమర్శలు వెల్లువెత్తడానికే దోహదపడింది. అంబటి వంటి నాయకులైతే నిస్సిగ్గుగా ఈవీఎం పగులగొట్టడాన్ని పక్కన పెట్టి అసలా వీడియో ఎలా వెలుగులోకి వచ్చింది అంటూ ప్రశ్నించడం విస్మయపరిగింది. అంబటి అయితే ఒక అడుగు ముందుకు వేసి ఆ వీడియో ఫేక్ అని చెప్పడానికి కూడా వెనుకాడలేదు.
అయితే ఆ వీడియో ఎలా వెలుగులోకి వచ్చి ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సూచన ప్రాయంగానైనా సరే వెల్లడించేశారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింసపై దర్యాప్తు చేయడానికి ఏర్పాటైన సిట్ కు వీడియో ఫుటేజిలు అప్పగించామని చెప్పారు. అంటే సిట్ అధికారులే ఈ వీడియోను లీక్ చేశారని ఆయన చెప్పకనే చెప్పేశారు. అదే జరిగితే అధికారులే విపక్షానికి మేలు చేసే విధంగా వీడియో లీక్ చేశారంటే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్నదానికి ఇంత కంటే బలమైన సంకేతం ఏముంటుంది?
క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది కనిపెట్టే అవకాశం ఇంకెవరికన్నా పోలీసు శాఖకే అధికంగా ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకుంటున్నది ఒక ఎమ్మెల్యేను ఏడేళ్ల పాటు జైలుకు పంపిం చేందుకు సాక్ష్యంగా ఉన్న వీడియో గురించి. ఈ వీడియో ఎమ్మెల్యేను నేరస్తుడిగా నిరూపించడమే కాదు, వైసీపీ ప్రతిష్టను కూడా కొలుకోలేనంతగా దెబ్బతీసింది. నిజంగా క్షేత్ర స్థాయిలో జగన్ పార్టీకి ప్రజా మద్దతు ఉండి ఉంటే, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి ఎన్నికౌతారనుకుంటే కచ్చితంగా పోలీసలు ఈ వీడియోను లీక్ చేయరు. గత ఐదేళ్లుగా పోలీసు శాఖ జగన్ కు అనుకూలంగా ఎంతగా నింబంధనలకు కూడా తిలోదకాలిచ్చేసి పని చేసిందో చూశాం.
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సీఐడీ పోలీసులు ఎంత అడ్డగోలుగా అరెస్టు చేశారో చూశాం. అలాగే చంద్రబాబు అరెస్టు కు సంబంధించి సీఐడీ చీఫ్ మీడియా సమావేశాలు పెట్టి మరీ రాజకీయాలు మాట్లాడిన వైనాన్ని గమనించాం. అటువంటి పోలీసు శాఖ జగన్ కు జగన్ పార్టీకీ భారీ నష్టం చేకూరుస్తుందని తెలిసి కూడా లీక్ చేశారంటే.. రాబోయే సర్కార్ కచ్చితంగా వైసీపీ సర్కార్ కాదన్న నిర్ధారణకు వచ్చేశారనే భావించాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇప్పుడు కూడా వైసీపీ చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీకి ఈసీ ద్వారా బీజేపీ సహకారం అందిస్తోందంటూ ఆరోపణలు గుప్పించడం మొదలు పెడితే అది తనను తాను మోసం చేసుకోవడం తప్ప మరొకటి కాదు. ఎందుకంటే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని గట్టిగా విశ్వసిసించినా కూడా బీజేపీ తెలుగుదేశంకు ఈ రకంగా సహకారం అందించే అవకాశాలు ఇసుమంతైనా లేవు. ఉండవు, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమిలో భాగస్వామి అయినప్పటికీ బీజేపీ ఏపీలో జగన్ సర్కార్ ను విమర్శించే విషయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరించిందో ఎన్నికల ప్రచార సమయంలో చూశాం. స్వయంగా ప్రధాని మోడీయే తన ప్రసంగంలో ఎక్కడా జగన్ పేరు ప్రస్తావించకుండా చాలా జాగ్రత్తగా వైసీపీ సర్కార్ పై విమర్శలు చేశారు. తెలుగుదేశం కచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉన్నా కూడా బీజేపీ తెలుగుదేశం పార్టీకి సహకరించేందుకు ముందుకు రాదు. అయినా ఎన్డీయే కూటమిలో తన తరువాత అతిపెద్ద పార్టీ తెలుగుదేశం అన్న సంగతి తెలిసిన బీజేపీ, జగన్ రెడ్డి పార్టీని నిర్వీర్యం చేయడానికి ఎంత మాత్రం సాహసించే అవకాశాలు లేవు. ఈ విషయాలన్నీ పరిగణనలోనికి తీసుకుని పరిశీలిస్తే పోలీసుల ద్వారానే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం వీడియో విడుదలైందంటే.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు వైసీపీ కొంప ముంచేసేవిగానే ఉన్నాయని అర్ధం. పరిశీలకులు దీనినే ఉటంకిస్తూ జగన్ పార్టీ ఓటమి ఖాయమైపోయిందని అంటున్నారు.