పిన్నెల్లి ఆస్తుల్ని సీజ్ చేయాలి! ఉక్కుపాదంతో అణిచేయాలి!
posted on May 23, 2024 @ 3:18PM
పల్నాడు ప్రాంతంలో జరిగిన పోలింగ్ హింసను చూసి వామ్మో అనుకుంటున్నాం కానీ... ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో జరిగే నేరపూరిత చర్యలు వింటేనే వళ్ళు జలదరిస్తుంది. తుపాకులు ధరించి యదేచ్చగా తిరిగే రాజకీయ నాయకుల అనుచరులను ఎదిరించి బ్రతికేవారు ఉండరు. వీళ్ళని స్వయంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులే పొంచి పోషిస్తూ ఉంటారు. ప్రత్యర్ధి అనేవాడు లేకుండా చేసి ఎన్నికల్లో "ప్రజాస్వామ్యబద్ధంగా" గెలుస్తారు.
కొంతకాలం క్రితం ఉత్తరప్రదేశ్ లో, పోలీస్ కస్టడిలో ఉండగా, మీడియా లైవ్ లో కాల్చి చంపబడ్డ ఆతిక్ అహ్మద్ అనే రాజకీయ నాయకుని చరిత్ర తెలుసుకున్నప్పుడు.... అధికారం చేతిలో ఉన్న రాజకీయ రౌడీల ముందు... ఎన్నికల కమిషన్, న్యాయవ్యవస్థ, భారత రాజ్యాంగం ఏమి చేయలేక చూస్తూ ఉండిపోతున్నాయి అనే విషయం మనకి అర్థం అవుతుంది. హింస, హత్య రాజకీయాలతో 40 సంవత్సరాలపాటు ఎం.పీ, ఎమ్మెల్యేగా కొనసాగిన ఈ గ్యాంగస్టర్ ను ఏ ప్రభుత్వము, ఏ వ్యవస్థ ఏమి చేయలేకపోయాయి. జడ్జీలు కూడా అతని కేసు తీసుకోవడానికి భయపడేవారట. "నీకు వ్యవస్థలు, చట్టం అంటే గౌరవం లేనప్పుడు... నీకు జీవించే హక్కు లేదు" అనే విధానాన్ని యూపీ ప్రభుత్వం అమలు చేయటం మొదలుపెట్టి, గ్యాంగస్టర్ లను నిర్ధాక్షిణ్యంగా ఎన్ కౌంటర్ చేయడం మొదలుపెట్టిన తర్వాత, ఈ నేరపురిత విష సంస్కృతి అదుపులోకి వచ్చింది.
మన ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే... ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నంత మాఫియా పోకడ ఇక్కడ లేకపోయినప్పటికీ... రెండు పార్టీలలో రౌడీయిజాన్ని నమ్ముకుని రాజకీయాలు చేసే వారికి కొదవలేదు. తమ వ్యాపార, ఆధిపత్య పోకడలను బలోపేతం చేసుకోవడానికి, వ్యవస్థలను... ముఖ్యంగా పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయటంలో నైపుణ్యమున్న శాసనసభ్యులు అనేకమంది రెండు పార్టీలలోనూ ఉన్నారు.
నేడు పల్నాడు ప్రాంతంలో జరుగుతున్నది, పూర్తిగా నిర్వీర్యమైన పోలీసు వ్యవస్థ కారణంగా వస్తున్న ఫలితం. ఒకప్పుడు రాయలసీమ, గుంటూరు పల్నాడు ప్రాంతంలో ప్రముఖంగా కనిపించిన దుర్మార్గమైన ఫ్యాక్షన్ హింస, ఇప్పుడు లేదు. ఎన్నికల సమయంలో పల్నాడు ప్రాంతంలో బయటపడిన దాడులు, ప్రతి దాడులు పోలీసుల వైఫల్యంతో జరిగినవి. ఏమాత్రం శ్రద్ధ తీసుకుని ఉన్నా ... అలాంటి హింసను అరికట్టే అవకాశం పోలీసుల చేతుల్లో ఉంది.
మే 13వ తేదీ నాడు పోలింగ్ జరుగుతున్న సమయంలో మాచర్ల ఎమ్మెల్యే, వైసిపి అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 202 పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లారు. అక్కడ EVMను ఎత్తి పడేసి నానా బీభత్సం సృష్టించారు. ఈ దృశ్యాలు సీసీ కెమేరాలో రికార్డయ్యాయి. ఎమ్మెల్యే ధ్వంసం చేస్తున్న సమయంలో పోలింగ్ ఏజెంట్ అడ్డుకునే ప్రయత్నం చేసారు. అతడిపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి చేసారు. పోలింగ్ కేంద్రంలోని ఈవీఎం ధ్వంసం చేయడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. మాచర్ల నియోజకవర్గం పరిధిలో 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేసినట్లు సీసీ కెమేరాల్లో రికార్డయ్యింది.
ఇవాళ ఒక ఎమ్మెల్యే ఒక ఈవీఎం ను పగల కొట్టిన దృశ్యం సంచలనంగా కనిపిస్తుంది కానీ... గతంలో బ్యాలెట్ బాక్స్ లను ఎత్తుకెళ్లి బావుల్లో పారవేసిన, ధ్వంసం చేసిన కేసులు అనేకం ఉండేవి. వెబ్ కాస్టింగ్, సిసి కెమెరాలు, మొబైల్ ఫోన్ కెమెరాల సాంకేతిక పరిజ్ఞానం అందులోకి వచ్చినాక.... ఇలాంటి దౌర్జన్యాలు దాదాపు కనుమరుగయ్యాయి.
ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఇది తరచూ మనం వినే మాట. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండినా...ప్రజాస్వామ్యం నిర్దేశించిన పద్ధతులు, ఫలాలు జనాలకు ఇంకా పూర్తిగా చేరలేదు అని చెప్పొచ్చు. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రజాస్వామ్యం ముసుగు వేసుకుని అనేక రకాల హింసాయుత పద్ధతులను ఆచరించి ప్రజాస్వామ్య వ్యవస్థను, దేశ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే వారికి ఈ దేశంలో కొదవలేదు.
- ఎం.కె. ఫజల్