యువరాజా వారికి అక్కయ్య బ్యాక్ సపోర్ట్
రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టి చూసుకోవాలని సోనియాగాంధీ తల్లి మనసు కొట్టుకొంటుంటే, ఆ తల్లి ముచ్చట తీర్చేందుకు ప్రియాంక వాధ్ర తమ్ముడి కోసం తెరవెనుక మంత్రాంగం నడిపిస్తూ చాలా కష్టపడుతున్నారని ఈమధ్య తరచూ వార్తలలో చూస్తున్నాము.
తల్లి కొడుకులిద్దరూ ఊరూరు తిరుగుతూ తమని గెలిపించమని ప్రచారం చేసుకొంటుంటే, ప్రియంక తమ్ముడి ఇంట్లో కూర్చొని అతను ఎక్కడ, ఏ విషయాలపై, ఏవిధంగా ప్రసంగించాలి? ఏ సభలో ఎటువంటి బాడీ లాంగ్వేజ్ ప్రదర్శించాలి? ఏ సభకు ఎప్పుడు వెళ్ళాలి? అక్కడ ఏ కులస్తులు లేదా మతస్తులు అధికంగా ఉన్నారు? వారు విద్యావంతులా లేక నిరక్షరాస్యులా? అక్కడ స్థానిక సమస్యలేమిటి? వాటికి రాహుల్ సూచించవలసిన పరిష్కారాలేవిధంగా ఉండాలి?వంటి అన్ని వివరాలను క్రోడీకరించి అతని ప్రసంగాలకు తుదిమెరుగులు దిద్దుతూ, తమ్ముడి సభకు అవసరమయిన ఏర్పాట్లను ఇంటి నుండే పర్యవేక్షిస్తున్నారు. ఇదంతా చూసి రాహుల్ గాంధీ కంటే అతని విజయం కోసం తెరవెనుక శ్రమిస్తున్న ఆ అక్కయ్యని చూసి ఎవరయినా మెచ్చుకోవడం సహజమే.
అయితే, భారతదేశం వంటి ఒక సువిశాలమయిన దేశాన్ని ప్రధాని కుర్చీలో కూర్చొని పరిపాలించాలనుకొంటున్న యువరాజవారిని నేటికీ ఎవరో ఒకరు వేలు పట్టుకొని నడిపిస్తే తప్ప తనంతట తానుగా నడవలేరని దీనితో స్పష్టం అవుతోంది. సోనియాగాంధీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ ని రిమోట్ కంట్రోల్ తో నడిపిస్తూ దేశాన్ని పాలిస్తున్నట్లుగానే, ఒకవేళ రేపు ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచి రాహుల్ ప్రధాని కుర్చీలో కూర్చొంటే, అప్పుడు ఆయనను కూడా ఎవరో ఒకరు రిమోట్ ఆపరేషన్ చేయవలసి వస్తుందేమో!
నరేంద్ర మోడీ తొలుత దేశవ్యాప్తంగా ప్రజలందరి నుండి తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కొన్నారు. ఆ తరువాత ప్రధాని అభ్యర్ధిగా ప్రకటింపబడిన తరువాత పార్టీలో చాలా మంది సీనియర్ల నుండి కూడా తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కొన్నారు. నేటికీ దేశంలో సగం మంది ఆయనను వ్యతిరేఖిస్తునే ఉన్నారు. కానీ ఆయన చాలా నేర్పుతో పట్టుదలగా ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ ఇప్పుడు దేశ ప్రజలందరి చేత, చివరికి తనను వ్యతిరేఖించిన తన పార్టీ నేతల చేత కూడా ‘నమో నమో’ అనిపించుకొంటూ అప్రతీహతంగా ముందుకు సాగిపోతున్నారు.
ఇక రాహుల్ గాంధీ విషయానికి వస్తే ఆయన ముందు కాంగ్రెస్ పార్టీలో ప్రతీ ఒక్కరు సాగిలపడి దాసోహమని ఆయనను భుజానెత్తుకొని భజన చేస్తుంటే, సాక్షాత్ ప్రధానమంత్రి డా.మన్మోహన్ సింగ్ ఆయన కోసం కుర్చీలో నుండి దిగిపోయేందుకు సిద్దమని పదేపదే చెప్పడమే కాక చివరికి మొన్న “ఎన్నికల తరువాత మరిక ప్రధాని కుర్చీలో కూర్చోబోను” అని ప్రకటించేసి యువరాజవారికి దారి నుండి అడ్డు తప్పుకొన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీలో కురువృద్దుడనిపించుకొన్న డా.మన్మోహన్, తను రాహుల్ గాంధీ క్రింద పనిచేయడానికి కూడా వెనుకాడనని నిసిగ్గుగా చెప్పుకొన్నారు.
ఇంతటి సానుకూల వాతావరణం ఉన్నపటికీ యువరాజవారు నెగ్గుకు రాలేకపోవడంతో ఎవరో ఒకరు ఆయన వేలు పట్టుకొని నడిపించక తప్పడం లేదు. పైగా ప్రియంకా గాంధీ ఆవిధంగా తమ్ముడికి సహాయపడటం ఏదో చాలా గొప్ప విషయమన్నట్లు దేశంలో మీడియా అంతా కోడై కూస్తోంది. మోడీ రాజకీయానుభవం, కార్యదక్షత, పరిపాలనానుభావం, తెలివి తేటలు తదితర అంశాలతో రాహుల్ గాంధీని ఎలాగూ పోల్చి చూడటానికి లేదు. కనీసం తనంతట తానుగా మాట్లాడగల తెలివి తేటలు, తన సభలను, కార్యక్రమాలను తానే చక్కబెట్టుకోగల నేర్పు, అందుకు అనుసరించవలసిన వేష బాషలు వంటి చిన్న చిన్నవిషయాలకు సైతం ఎవరో ఒకరి సలహాలు, సహకారం అవసరం పడటం చూస్తుంటే రేపు ఈయన ఇంత పెద్ద దేశాన్ని ఏవిధంగా ఏలుతారు? అనే ధర్మ సందేహం ఎవరికయినా కలగడం సహజమే. అటువంటప్పుడు ఇంట్లోంచి కాలు బయటపెట్టకుండా అన్నీ చక్కబెడుతున్న ప్రియాంక గాంధీయే (యువరాజవారి కంటే) ప్రధాని పదవికి బాగా సరిపోతారేమో సోనియమ్మ ఆలోచించితే మేలేమో.