తెదేపా-బీజేపీ పొత్తులతో ప్రత్యర్ధ పార్టీలకు భయమేలనో?
posted on Apr 7, 2014 8:05AM
తెదేపా-బీజేపీ ఎన్నికల పొత్తులు బెడిసికోడితే బీజేపీతో తామే పొత్తులు పెట్టుకోవచ్చని ఇంతకాలం ఆశగా ఎదురుచూసిన తెరాస, వైకాపాలు వారి పొత్తులను అనైతిక పొత్తులని ఒక్క ముక్కలో తేల్చేసాయి. తెదేపాకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము, దైర్యం లేనందునే బీజేపీతో పొత్తులకి తహతహలాడిందని, కాంగ్రెస్, వైకాంగ్రెస్ పార్టీలు విమర్శించాయి. కానీ, తెదేపా కూడా తమలాగే ఒక రాజకీయ పార్టీ గనుక దానికి ఏ ఇతర పార్టీతోనయినా పొత్తులు పెట్టుకొనే అధికారం హక్కు ఉంటుందని ఏ ఒక్క పార్టీ భావించలేదు, అనలేదు. తమ పొత్తులు చారిత్రిక అవసరం అని చెప్పే పార్టీలు, తెదేపా-బీజేపీల పొత్తులను చూసి ఎందుకు అంత తీవ్రంగా దాడి చేస్తున్నాయి? అంటే, ఆ పొత్తుల వలన రెండు రాష్ట్రాలలో మారే బలాబలాలతో అవి తమపై చేయి సాధిస్తాయనే అభద్రతా భావంతోనే.
కేసీఆర్ దురాశకు పోకుండా కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొని ఉండి ఉంటే, వారి కూటమి తెదేపా-బీజేపీ కూటమి కంటే చాలా బలంగా ఉండేది. కానీ కేసీఆర్ పదవీ కాంక్షతో కాంగ్రెస్ పార్టీని కాలదన్నుకొన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం కూడా కేసీఆర్ ని నమ్ముకొని తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకి సిద్దపడింది తప్ప తన స్వంత పార్టీ నేతలకి ఎన్నడూ ప్రాధాన్యం ఈయలేదు. ఇచ్చి ఉండి ఉంటే కాంగ్రెస్ పార్టీ తెరాసను పొత్తుల కోసం ఇంతగా దేబిరించవలసిన అవసరం ఉండేదే కాదు. ఏ పొత్తులు లేకుండానే తెరాస, తెదేపా-బీజేపీ లకు గట్టి పోటీ ఇవ్వగలిగేది.
సీమాంద్రాలో కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే తప్పు చేసింది. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని స్వంత పార్టీలో హేమాహేమీలయిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరి రాజకీయ భవిష్యత్తుతో చెలగాటమాడుకొని వారినందరినీ దూరం చేసుకొని, ఈరోజు పార్టీలో నాయకుల కోసం వెతుకోవలసిన దుస్థితిలో ఉంది. వారే గనుక ఈరోజు పార్టీకి అండగా నిలబడి ఉండి ఉంటే, తెదేపా-బీజేపీ పొత్తులను చూసి ఇంతగా బెదిరిపోనవసరం ఉండేదే కాదు.
ఇక జగన్మోహన్ రెడ్డి నేటికీ కూడా తండ్రి (సానుభూతి, సంక్షేమ పధకాలు) పేరు చెప్పుకొని ఓట్లు కోరాల్సిన దుస్థితిలో ఉన్నారు. ఆయన తన సమయాన్ని ప్రజలలో సానుభూతిని నిలుపుకొనేందుకు వెచ్చించే బదులుగా పార్టీ నిర్మాణం కోసం వినియోగించి ఉండిఉంటే పార్టీయే ఆయనకు కొండంత బలంగా నిలిచేది. జగన్మోహన్ రెడ్డికి ప్రజలలో కావలసినంత సానుభూతి ఉంది. పార్టీలో చాలా బలమయిన నేతలు కూడా ఉన్నారు. కానీ ఆయన ఎవరినీ లెక్కచేయకుండా తన దుందుడుకు నిర్ణయాలతో పార్టీకి శల్యసారధ్యం చేస్తున్నందునే పార్టీ ఆశించినంత బలం పుంజుకోలేకపోయింది. అందుకే అతను కూడా వారి పొత్తులు చూసి భయపడవలసి వస్తోంది.
రాష్ట్రంలో ఈ మూడు ప్రధాన రాజకీయ పార్టీలు స్వీయ తప్పిదాల వలననే ఈరోజు తెదేపా-బీజేపీల పొత్తులు పెట్టుకోవడం చూసిభయపడవలసి వస్తోంది, లేకుంటే దాని గురించి ఆలోచించే అవసరమే ఉండేదే కాదు.