మోడీ అంటే మండిపడుతున్న నలుగురు అమ్మలు

      దేశమంతటా మోడీ హవా నడుస్తోంది. మోడీకే ఓటేద్దాం అనే మాట వినిపిస్తోంది. ఎవర్ని కదిలించినా మోడీ గురించి చెబుతున్నారు. దేశానికి కాబోయే ప్రధానమంత్రి మోడీయే అని చెబుతున్నారు. ఇలా అన్ని చోట్లా మోడీ గురించి బాగానే అనుకుంటున్నారు. కానీ దేశంలో నాలుగు మూలల్లో వున్న నలుగురు అమ్మలు మాత్రం మోడీ గురించి తమకు చేతనంతగా బ్యాడ్ ప్రాపగాండా చేస్తున్నారు. ఆ నలుగురు అమ్మలు ఎవరయ్యా అంటే, సోనియాగాంధీ, జయలలిత, మమతా బెనర్జీ, మాయావతి. ఈ నలుగురు అమ్మలూ మోడీ అంటే ఎందుకు మండిపడుతున్నారంటే....   సోనియాగాంధీ: ఈ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేసి తాను రిటైరై రెస్టు తీసుకోవాలని అనుకున్నారు. అయితే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీ ఎంటర్ కావడంతో సీన్ రివర్సయిపోయింది. మోడీ ఎంత సమర్థుడో దేశానికి తెలియడంతోపాటు ఆయనతో పోల్చి రాహుల్‌ గాంధీని ఎవరూ లెక్కచేయడం లేదు. అక్కడొచ్చింది. తేడా. జయలలిత, మమతా బెనర్జీ, మాయావతి: ఈసారి తానే ప్రధానమంత్రి కాబోతున్నానని కలలు కంటోన్న జయలలిత, మమతా బెనర్జీ, మాయావతి కలల మీద మోడీ నీళ్ళు కుమ్మరించాడు. ఈ ముగ్గురమ్మలూ ఎన్ని తంటాలు పడినా పీఎం అయ్యే అవకాశం లేకుండా చేశాడు. దాంతో ఈ ముగ్గురు కూడా అకారణంగా మోడీ మీద విరుచుకుపడుతున్నారు.  

ఇక జగన్ తో చంద్రబాబు ఢీ

    తెలుగుదేశం పార్టీ సీమాంద్రాతో పోలిస్తే తెలంగాణాలో చాలా బలహీనంగానే ఉందని చెప్పక తప్పదు. పైగా చంద్రబాబు అనుసరించిన వైఖరి వలన తెలంగాణాలో పార్టీకి కొంత వ్యతిరేఖత కూడా ఉంది. మాటల మాంత్రికుడు కేసీఆర్ తెదేపాపై చేసిన విషప్రచార ప్రభావం కూడా ఎంతో కొంత తప్పకుండా ఉంటుంది. ఈవిధంగా తెలంగాణాలో తెదేపాకు అన్ని విధాల వ్యతిరేఖత కనబడుతుంటే, కాంగ్రెస్, తెరాసలకు మాత్రం తెలంగాణా సాధించిన భుజకీర్తులు అదనంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణాలో కాంగ్రెస్, తెరాసలకు ధీటుగా తెలుగుదేశం పార్టీని నిలబెట్టగలిగిన ఘనుడు చంద్రబాబు. అక్కడ ఎన్నికల ప్రచారం ముగించుకొని ఇక ఇప్పుడు తనకు బాగా పట్టున్న ఆంధ్ర ప్రాంతంపై చంద్రబాబు దృష్టి సారించనున్నారు. ఈసారి ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ లెక్కలో లేకపోయినప్పటికీ, దానికి బదులుగా వైకాపాను, ముఖ్యంగా దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు ఎదుర్కోవలసి ఉంటుంది. తెలంగాణాలో కాంగ్రెస్, తెరాసలపై బీసీ అస్త్రం ప్రయోగించి నిలువరించ గలిగిన చంద్రబాబు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పై ఎటువంటి అస్త్రాలు సంధిస్తారో అందరికీ తెలుసు. ఆయన ప్రధానంగా జగన్ పై ఉన్న సీబీఐ కేసులు, ఆయన తండ్రి హయాంలో జగన్ చేసిన అవినీతి భాగోతాలు, కాంగ్రెస్ పార్టీతో ఆయనకున్న రహస్య అవగాహన వంటివి ప్రస్తావించడం తధ్యం. అటువంటి అవినీతిపరుడు, పరిపాలనానుభవం లేనివాడికి ఓటేస్తే అది కొరివితో తల గోక్కోన్నట్లే అవుతుందని ప్రజలకు హితబోధ చేయవచ్చును.

24 గంటలు అయిపోయాయి హరీష్‌రావ్?!

      పవన్ కళ్యాణ్ హరీష్ రావు మీద కొన్ని ఆరోపణలు చేశాడు. హరీష్ రావుకి బొత్సతో వ్యాపార సంబంధాలున్నాయని ఆరోపించాడు. వాటికి హరీష్ రావు వీరావేశంగా స్పందించాడు. తనకు బొత్సతో ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని రంకెలేసి మరీ చెప్పాడు. తన లాంటి అమాయకుడి మీద పవన్ కళ్యాణ్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని హరీష్ విరుచుకుపడ్డాడు. పవన్ కళ్యాణ్ అర్జెంటుగా బుద్ధి తెచ్చుకుని, 24 గంటల్లోగా తనకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే తాను పవన్ కళ్యాణ్ మీద పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించేశాడు. హరీష్ రావు ఈ భారీ ప్రకటన చేసి 24 గంటలు ఎప్పుడో గడిచిపోయాయి. ఇంతవరకు హరీష్ రావు పవన్ కళ్యాణ్ మీద పరువునష్టం దావా వేయలేదు. ఎందుకు వేయలేదో.. తనకు పరువే లేదని హరీష్ అనుకున్నాడో ఏంపాడో. అయినా రాజకీయ నాయకులు ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వడం, ఆ తర్వాత వాటిని పట్టించుకోకుండా వుండటం మామూలే కదా. అందువల్ల హరీష్ రావు స్టేట్‌మెంట్‌ని మనమూ పట్టించుకోకుండా వుంటే సరి.

ఆళ్ళగడ్డ ఎన్నిక: కన్ఫ్యూజ్ చేస్తున్న ఎన్నికల కమిషన్

      ఆళ్ళగడ్డ ఎన్నిక విషయంలో ఎన్నికల సంఘం జనాన్ని అయోమయానికి గురి చేస్తోంది. ఆళ్ళగడ్డ నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆమె మరణించడంతో ఆళ్ళగడ్డ ఎన్నికను వాయిదా వేస్తారని అందరూ భావించారు. అయితే ఎన్నికల కమిషన్ ఎక్కడో వున్న ఒక లా పాయింట్ బయటకి తీసుకొచ్చి, వైసీపీ ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ చేసుకున్న పార్టీయే తప్ప గుర్తింపు వున్న పార్టీ కాదు కాబట్టి శోభా నాగిరెడ్డి మరణించినా అక్కడ ఎన్నిక వాయిదా వేయాల్సిన అవసరం లేదని తీర్మానించింది. సరేలే అన్నీ తెలిసిన ఎన్నికల కమిషన్ చెప్పింది కదా అని అందరూ ఊరుకున్నారు.  ఈ పాయింట్ చెప్పిన ఎన్నికల కమిషనే మరో పాయింట్ కూడా చెప్పింది. ఈవీఎంలో శోభా నాగిరెడ్డి పేరు వున్న బటన్ పని చేయదని మొదట్లో చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ శోభా నాగిరెడ్డి పేరు మీద బటన్ నొక్కితే ఆ ఓటు ‘నోటా’ అకౌంట్లో చేరుతుందని చెప్పింది. మళ్ళీ ఇంకోసారి శోభా నాగిరెడ్డి తర్వాతి స్థానంలో నిలిచిన వ్యక్తి ఆళ్ళగడ్డ ఎన్నికలో గెలిచినట్టు ప్రకటిస్తామని తెలిపింది. ఇప్పుడు తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఎన్నికలల ఆళ్ళగడ్డలో శోభా నాగిరెడ్డికి అత్యధిక.. అంటే మరో అభ్యర్థికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన పక్షంలో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తుందట. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ వైసీపీకి రాసిన లేఖలో తెలిపింది. అసలు మరణించిన వ్యక్తి పేరును ఈవీఎంలో ఉంచడం ఎందుకు? ఆ వ్యక్తికి ఎక్కువ ఓట్లు వస్తే ఉప ఎన్నిక నిర్వహించడం ఎందుకు? ఈ ఎన్నికల కమిషన్ ఎవరికీ అర్థంకాదు.

పవన్ కళ్యాణ్ బకరా కానున్నారా?

  ఇటీవల తెలంగాణాలో వరుసపెట్టి నాలుగు సభలలో మాట్లాడిన నరేంద్ర మోడీ, తన ప్రసంగాలలో తెరాసను కానీ, దాని అధ్యక్షుడు కేసీఆర్ ను గానీ గట్టిగా విమర్శించలేదు. అందువల్ల శాస్త్రం కోసమనట్లు ఏదో మొక్కుబడిగా తెరాస గురించి ఓ రెండు ముక్కలు మాట్లాడి సరిబెట్టేసారు. అయితే, ఈమధ్యనే జనసేన పార్టీతో రాజకీయాలలో ప్రవేశించిన పవన్ కళ్యాణ్ తెదేపా-బీజేపీ కూటమికి తన మద్దతు తెలుపడమే కాకుండా వారి అభ్యర్ధుల తరపున తెలంగాణా లో చాల గట్టిగానే ప్రచారం చేస్తున్నారు.   ఆ ప్రచారంలో ఆయన కాంగ్రెస్, తెరాసలపై చాలా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. “కేసీఆర్! పిచ్చిపిచ్చి కూతలు కూస్తే నీ తాట తీస్తా!” అంటూ తీవ్రంగా హెచ్చరించారు కూడా. అయితే కాంగ్రెస్ పార్టీ ఆయన విమర్శలను ఎంత మాత్రం పట్టించుకొన్నట్లు కనబడలేదు, కానీ కేసీఆర్ మాత్రం అంతే దీటుగా ప్రతిస్పందిస్తూ ‘నేను చిటికేస్తే కనబడకుండా పోతావని’ గట్టిగానే హెచ్చరించారు. పనిలోపనిగా చంద్రబాబుని, నరేంద్ర మోడీని కూడా మరోమారు తీవ్రంగా విమర్శించారు.   ప్రస్తుతం చంద్రబాబు, కేసీఆర్ ఒకరినొకరు ఎంతగా విమర్శించుకొన్నా, ఎన్నికల తరువాత ఒకవేళ ఇరువురూ ఆంధ్ర తెలంగాణాలలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలిగితే అప్పుడు వారు ఒకరికొకరు సహకరించుకొన్నా ఆశ్చర్యం లేదు. లేదా అసలు ఒకరినొకరు ఎంత మాత్రం పట్టించుకోకపోవచ్చును. అదేవిధంగా ఒకవేళ కేంద్రంలో మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం, తెలంగాణలో తెరాస అధికారంలోకి వచ్చినట్లయితే, అప్పుడు తెలంగాణా అభివృద్ధికి కేంద్రం నుండి నిధులు, సహకారం కావలసి ఉంటుంది గనుక, కేసీఆర్ తాను ఇప్పుడు నోరారా తిడుతున్న మోడీకే తప్పనిసరిగా మద్దతు ఈయవచ్చును. బహుశః ఎన్నికల తరువాత తెరాస మద్దతు అవసరం ఉండవచ్చనే ముంచు చూపుతోనే మోడీ కూడా కేసీఆర్ పై ఎటువంటి విమర్శలు చేయలేదనుకోవాలి. ఒకవేళ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాలేకపోతే అప్పుడు మోడీ గుజరాత్ తిరుగు ప్రయాణమయిపోవడం తధ్యం. అప్పుడు మధ్యలో నష్టపోయేది ఈ రాజకీయాలు తెలియని పవన్ కళ్యాణ్ మాత్రమే. అంటే వీరందరరి కోసం మధ్యలో పవన్ కళ్యాణ్ బకరా అయ్యేరనుకోవచ్చును.   ఎన్నికల తరువాత ఒకవేళ తెరాస ప్రభుత్వ పగ్గాలు చేపట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన తన తాట తీస్తానని హెచ్చరించినందుకు పవన్ కళ్యాణ్ పై కక్ష సాధింపు చర్యలు చేపడితే, మరి అప్పుడు మోడీ కానీ చంద్రబాబు గానీ ఆయనను ఆదుకొనేందుకు వస్తారో లేదో పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవడం మేలు.

మోడీని అడ్డుకొనేందుకు రాహుల్ త్యాగానికి సిద్దం?

  ఎదుటవాడివి రెండు కళ్ళు పోతాయంటే అందు కోసం తనది ఒక కన్నుపోగొట్టుకోవడానికి సిద్దపడే నేతలు పార్టీలు మనకి చాలానే ఉన్నాయి. వాటిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ 100 సీట్లు, బీజేపీకి 200 సీట్లు వరకు రావచ్చని, ఎట్టిపరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అటు కేంద్రంలో, ఇటు ఆంధ్ర, తెలంగాణాలలో కానీ అధికారంలోకి వచ్చే అవకాశంలేదని సర్వేలన్నీ ఘోషిస్తున్నా కూడా విజయం తమదే అంటూ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.   రాష్ట్రంలో సంగతి ఎలా ఉన్నప్పటికీ, ఈసారి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాలేకపోయి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కుర్చీలో స్థిరపడితే, బహుశః రాహుల్ గాంధీ ఇక తన జీవితంలో ఎన్నడూ ప్రధానమంత్రి అయ్యే అవకాశం దక్కకపోవచ్చును. అందువల్ల ఒకవేళ తమకు అధికారం దక్కకపోతే, నరేంద్ర మోడీకి కూడా ఆ అవకాశం దక్కనీయకూడదనే కృత నిశ్చయంతో కాంగ్రెస్ సరికొత్త వ్యూహం అమలుచేయడానికి సిద్దం అవుతోంది.   బీజేపీ స్వయంగా 272 సీట్లు సాధించాలననే లక్ష్యంతో గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. కానీ తాజా లెక్కలు ప్రకారం బీజేపీకి 200 యంపీ సీట్లు, ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు అన్నీకలిసి మహా అయితే మరో 40-50 సీట్లు మాత్రమే సాధించగలవని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. 552 సీట్లున్న లోక్ సభలో, కనీసం 272 సీట్లు సాధించిన పార్టీ లేదా కూటమికి మాత్రమే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేసే అవకాశం దక్కుతుంది. అంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి కనీసం మరో 20-30 సీట్లు అవసరం ఉంటాయి. ఇటువంటి పరిస్థితి ఎదురయితే, దేశంలో చిన్న చితకా పార్టీలను, తమిళనాడులో రెండు పార్టీలలో దేనినో ఒకదానిని దువ్వి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ తెర వెనుక ప్రయత్నాలు మొదలుపెట్టింది.   కాంగ్రెస్ కూడా సరిగ్గా ఇదే వ్యూహం అమలు చేసేందుకు అప్పుడే పావులు కదుపుతోంది. మతతత్వ బీజేపీని, నరేంద్రమోడీని అధికారం చేపడితే అది దేశానికే చాలా ప్రమాదమని, అందువల్ల సెక్యులర్ పార్టీలన్నీ తమతో చేతులు కలిపాలని, అందుకు వారు అంగీకరిస్తే, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాము థర్డ్ ఫ్రంట్ కి మద్దతు ఇచ్చేందుకు కూడా సిద్దమని కాంగ్రెస్ ప్రకటించింది. థర్డ్ ఫ్రంట్ నేతలు కాంగ్రెస్ ప్రతిపాదనను స్వాగతించడం, హర్షం ప్రకటించడం కూడా జరిగిపోయాయి.   థర్డ్ ఫ్రంటులో ములాయం సింగు, మాయావతి, జయలలిత, నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి కనీసం ఒక అరడజను మంది నేతలు తమ జీవితంలో ఒక్కసారయినా ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవాలని తహతహలాడిపోతున్నారు. అయితే థర్డ్ ఫ్రంట్ కూడా ఎట్టి పరిస్థితుల్లో మెజార్టీ సాధించలేదు కనుక వారి కలనెరవేరే అవకాశం కూడా లేదు. అందువల్ల అటువంటి వారితో కూడిన థర్డ్ ఫ్రంట్ కి మద్దతు ఇస్తే, ప్రస్తుతం రాహుల్ గాంధీ ప్రధాని కాలేకపోవచ్చునేమో కానీ మోడీ కూడా ప్రధాని కాకుండా అడ్డుకోవచ్చును.   దురాశాపరులయిన థర్డ్ ఫ్రంట్ నేతల చేతిలో అధికారం పెట్టినట్లయితే వారు దేశాన్ని మరింత భ్రష్టు పట్టించడం ఖాయం. కనుక అప్పుడు ప్రజలు వారికంటే కాంగ్రెస్ పాలనే నయమనుకొనే రోజులు మళ్ళీ తప్పక వస్తాయి. ప్రస్తుతం మోడీని ప్రధాని కాకుండా అడ్డుకోగలిగితే, ఆయన గుజరాత్ తిరిగి వెళ్లిపోవడం తధ్యం. ఆనక థర్డ్ ఫ్రంట్ లో కొన్ని పార్టీలను తనవైపు తిప్పుకొని, వారి ప్రభుత్వాన్ని కూల్చి రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారం చెప్పట్టవచ్చునని కాంగ్రెస్ అధిష్టానం దూర దురాలోచన చేస్తోంది.   కానీ ఒకవేళ మోడీ చెపుతున్నట్లుగా బీజేపీయే స్వయంగా 272 సీట్లు సాధించగలిగితే కాంగ్రెస్ వేసుకొంటున్న ఈ లెక్కలు, వ్యూహాలు పనిచేయవు. అదే జరిగితే రాహుల్ గాంధీ ఇక ఎన్నడూ ప్రధాని కాలేకపోవచ్చును.

కేవీపీ చక్రం తిప్పుతున్నారా

  వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చినట్లుంది కేవీపీ పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయంలో తెర వెనుకే ఉంటూ ఆయన గిరగిరా చక్రం తిప్పారు. ఆ తరువాత రాష్ట్ర విభజన వ్యవహారంలో కూడా ఆయన గిరగిరా చక్రం తిప్పి అందరినీ ఆకట్టుకొన్నారు. అధిష్టాన దేవత ఆగ్రహానికి గురయిన తోటి కాంగ్రెస్ యంపీలు అందరూ పార్టీ నుండి సస్పెండ్ అయ్యి చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా చెల్లాచెదురయి అగమ్య గోచరంగా తిరుగుతుంటే, రాజ్యసభలో ప్లకార్డులు పట్టుకొని నిరసనలు తెలిపినప్పటికీ ఆయన మాత్రం మళ్ళీ అదే రాజ్యసభలో సీటు దక్కించుకోగలగడం ఆయన చక్రం మహిమేననుకోవాలి. రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా ఆయనే చక్రం తిప్పి పొన్నాల లక్ష్మయ్యను తెలంగాణా పీసీసీ కుర్చీలో కూర్చోబెట్టారని కేసీఆర్ అంతటివాడు ప్రకటించడం ఆయన చక్రం పవరేమిటో తెలియజేస్తోంది. అదేవిదంగా, తనను ప్రలోభ పెట్టడానికి ఆయన ‘వేల కోట్లు’ ఆఫర్ చేసారని కేసీఆర్ చెప్పుకోవడం కూడా ఆయన ‘గొప్ప ధనాన్ని’ తెలియజేస్తోంది.   ఇంతటి గొప్ప వ్యక్తి కూడా ఎక్కడో సప్త సముద్రాల అవతల ఉన్న అమెరికాలో యఫ్.బీ.ఐ. అనే ఒక దర్యాప్తు సంస్థ టైటానియం కుంభకోణంలో తనను నిందితుడని ప్రకటించినపుడు మొదట మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినప్పటికీ, ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ అయ్యి అది నేరుగా వయా డిల్లీ ఏకంగా తన కొంపకే వచ్చేయడంతో ఆయన ‘శరణు శరణు’ అంటూ హై కోర్టును ఆశ్రయించారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో జారీ అయిన రెడ్ కార్నర్ నోటీసు నుండి నిన్ను కాపాడలేమని కోర్టువారు కూడా తప్పుకోవడంతో, తన లాయర్ల సలహా మేరకు మళ్ళీఅదే కోర్టులో తనను సీబీఐ లేదా సీ.ఐ.డీ వారు అరెస్టు చేయకుండా స్టే ఇమ్మని కోరుతూ మరో పిటిషను పడేసి లౌక్యం ప్రదర్శించారు. అది కోర్టు పరిధిలోకే వస్తుంది గనుక ఆయన పిటిషన్ను విచారణకు స్వీకరించి కేసును సోమవారానికి వాయిదా వేసింది హై కోర్టు.   మరి మళ్ళీ ఆయన తన చక్రం అడ్డువేసారో ఏమో కానీ, రెడ్ కార్నర్ నోటీసు అందుకొన్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించిన సీఐడీ వారు, తమకు అందిన నోటీసులో కేవీపీ గారిని అరెస్టు చేయమని ఎక్కడా ఒక్క అక్షరం ముక్క కూడా కనబడలేదని, అందువల్ల ఆ నాలుగు ముక్కలు ప్రత్యేకంగా పేర్కొంటే తప్ప ఆయనను అరెస్టు చేయడానికి తమ రూల్స్ ఒప్పుకోవంటూ డిల్లీకి ఓ లెటర్ కొట్టి చేతులు దులుపుకొన్నారు.   అయితే సదరు నోటీసు హైదరాబాదుకి పంపించి చేతులు దులుపుకొన్న సీబీఐ వారు, అసలు రెడ్ కార్నర్ నోటీసు అంటేనే అరెస్టు వారెంట్ అనే ఇంగిత జ్ఞానం కూడా మీకు లేకపోతే ఎలా? అని విసుకొంటూ, విదేశాంగ శాఖ వారికి ‘ఆ నాలుగు ముక్కలు’ వ్రాసుకోనేందుకు అనుమతి కోరుతూ మరో లెటర్ కొట్టేసి చేతులు దులుపుకొన్నారు. ఒకవేళ కేవేపీ వారి చక్రం గిరగిరా తిరుగుతుంటే ఆ రెడ్ కార్నర్ నోటీసు ఒక కార్యాలయం నుండి మరొక దానికి, ఒక మంత్రిత్వ శాఖ నుండో మరొక దానికి, హైదరాబాదు నుండి డిల్లీకి, డిల్లీ నుండి హైదరాబాదుకి మళ్ళీ వెనక్కి అక్కడి నుండి మళ్ళీ అమెరికాకి, అమెరికా నుండి డిల్లీ మధ్యన తిరుగుతూనే ఉండిపోయినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ ఏ కారణం చేతయినా ఆయన చక్రం పనిచేయక అరెస్టు అనివార్యమయితే అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యపాడయిపోయినా పోవచ్చును. ప్చ్..ప్చ్..

కాంగ్రెస్ హస్తంలో వైకుంటం చూపిన రాహుల్

  రాహుల్ గాంధీ నాలుగు రోజుల వ్యవదిలో తెలంగాణాలో మూడు సభలలో పాల్గొన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణా వచ్చిందనేది మూడు సభల సారాంశం. కాంగ్రెస్ లేకుంటే తెలంగాణా ప్రజల 60 ఏళ్ల కల ఎన్నటికీ నెరవేరేదేకాదని ఆయన గ్యారంటీ ఇచ్చారు. తెరాస కంటే తమ పార్టీ నేతలే తెలంగాణా ఇవ్వమని డిమాండ్ చేసారని, ఆ తరువాతే తెరాస పార్టీ ఏర్పడిందని ఆయన కనిపెట్టిన కొత్త విషయం ప్రజలకు చాటి చెప్పారు. తెరాస నేతలు కనీసం తెలంగాణా బిల్లు డ్రాఫ్ట్ రూపకల్పనలో కూడా కల్పించుకోలేదని, ఇక పార్లమెంటులో తెలంగాణా కోసం వారు చేసిన ప్రయత్నాలు ఏమీ లేవని తెలియజెప్పారు.   పది సం.ల క్రితం సోనియాగాంధీ తెలంగాణా ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడినందునే తెలంగాణా ఏర్పడిందని ఆయన నొక్కి చెప్పారు. అంతే గాక రాగల పది సం.లలో తాము తెలంగాణకు ఏమేమి చేయబోతున్నమో కూడా చెప్పారు. ఇంతవరకు తెలంగాణా ప్రజలు చైనా దేశంలో తయారయిన మొబైల్స్, వాచీలు, బూట్లు, బట్టలు వాడుతున్నారని కానీ తాను మాత్రం త్వరలోనే ‘మేడ్ ఇన్ తెలంగాణా’ వాచీని ధరించేందుకు ఉవ్విళ్ళూరుతున్నాని ఆయన అన్నారు.   తెరాస లక్ష రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తే, తాము రెండు లక్షలు మాఫీ చేస్తామని, ఇతర పార్టీలు ఎటువంటి అవగాహన లేకుండా విద్యుత్ సరఫరాపై ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారని, తాము మాత్రం దేశంలోకెల్లా అతిపెద్ద పవర్ ప్లాంట్ 4000 మెగావాట్ల సామర్ధ్యం గల విద్యుత్ ఉత్పత్తి సంస్థను స్థాపించి తెలంగాణకు విద్యుత్ కోరతనేది లేకుండా చేస్తామని, వ్యవసాయానికి రోజుకి 9గంటలు పగలే విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ పనులన్నీ గత పదేళ్ళలో ఎందుకు చేయలేకపోయారో చెప్పగలిగితే ప్రజలు కూడా విని సంతోషించేవారు.

కేసీఆర్ టీమ్‌పై సీబీఐ కోర్టు కేసు: ఎన్నెన్నో సందేహాలు!

      కేసీఆర్, హరీష్‌రావు, విజయశాంతి సంపాదన మీద విచారణ జరిపించాలని సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ఈ ఆదేశాల మీద స్పందిస్తూ హరీష్‌రావు ఇది కాంగ్రెస్ పార్టీ కుట్రే అని గగ్గోలు పెట్టగా, విజయశాంతి మాత్రం తనకేం భయం లేదని చెప్పారు. అయితే టోటల్‌గా ఈ అంశంలో సమాధానాలు దొరకని కొన్ని సందేహాలున్నాయి. కేసులు పెడితే, తెలంగాణ ఉద్యమం పేరుతో వసూళ్ళు చేశారన్న ఆరోపణలు కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మీద, కేసీఆర్ కుమార్తె కవిత మీద కూడా వున్నాయి. అయితే వాళ్లిద్దరినీ ఈ కేసు నుంచి ఎందుకు తప్పించారనేది ఒక పెద్ద సందేహం. హరీష్‌రావు ఆక్రోశించినట్టు ఇది కాంగ్రెస్ కుట్ర అయితే కేసీఆర్, హరీష్‌రావు పేరుతోపాటు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే వున్న విజయశాంతి మీద కూడా ఎందుకు కేసు పెట్టారు? కేసీఆర్, హరీష్‌రావుతోపాటు విజయశాంతి మీద కూడా కేసు పెడితే ఇది కాంగ్రెస్ కుట్ర అని ఎవరూ అనుకోరని ముందు జాగ్రత్త చర్యగా ఆమెను కూడా ఈ కేసులో ఇరికించారా? మరో ఐదు రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో పోలింగ్ జరగబోతూ వుండగా, ఇప్పుడే ఈ కేసుని ఎందుకు వెలుగులోకి తెచ్చారు? ఇలాంటి సందేహాలు ఎన్నెన్నో కలుగుతున్నాయి. ఈ సందేహాలకు సమాధానాలు దొరకాలంటే మరికొంతకాలం ఆగాలి.

సోనియా, రాహుల్ ప్రచారంతో ఓట్లు రాలుతాయా?

  ఈరోజు రాహుల్ గాంధీ మరోమారు తెలంగాణాలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. ఆయన మొదట వరంగల్‌లో పార్టీ తరపున ప్రచార సభలో పాల్గొన్న తరువాత హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. రాహుల్ క్రిందటి సారి తన పర్యటనలో కేసీఆర్ నే ప్రధాన లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించి, టీ-కాంగ్రెస్ నేతల ఆత్మవిశ్వాసం పెంచగలిగారు. అదేవిధంగా జాతీయ పార్టీ అయిన తమ పార్టీ మాత్రమే తెలంగాణా త్వరగా అభివృద్ధి చేయగలదని, ప్రాంతీయ పార్టీ అయిన తెరాస వల్ల సాధ్యం కాదని గట్టిగా నొక్కి చెప్పారు. అనేక ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీయే దేశంలో, రాష్ట్రంలో కూడా అధికారం చలాయిస్తున్నపటికీ చేయలేని అనేక అభివృద్ధి పనులను ఇప్పుడు తమకు ఓటేస్తే చేసి చూపుతామని చెపుతూ, వాటికి మరికొన్ని కొత్తగా జోడించి తెలంగాణ ప్రజలకు తమ హస్తంలో వైకుంటం చూపించేరు. బహుశః ఈరోజు సభలలో కూడా అవే విషయాలు మరోమారు వల్లెవేయవచ్చును.   అయితే ఆయన వెళ్ళిన తరువాత మోడీ తెలంగాణాలో ప్రచారసభలు నిర్వహించి, తెలంగాణా కోసం వందల మంది యువకులు చనిపోతున్నపటికీ, పదేళ్ళ పాటు నిర్లిప్తంగా చూస్తూ కూర్చొని 1100 మంది యువకులను పొట్టన పెట్టుకొన్న పాపాత్మురాలు కాంగ్రెస్ పార్టీ అని, ఆ పార్టీ తెలంగాణాను, ప్రజలను నిర్లక్ష్యం చేయడం వల్లనే ఉద్యమాలు మొదలయ్యాయని తీవ్ర విమర్శలు గుప్పించారు. కనుక రాహుల్ గాంధీ ఈరోజు సభలలో బీజేపీ దానితో పొత్తులు పెట్టుకొన్న తెదేపాపై బాణాలు వేయవచ్చును. పనిలోపనిగా కేసీఆర్ చేసిన ప్రతివిమర్శలకు కూడా ధీటుగా బదులివ్వవచ్చును.   అయితే రాహుల్ గాంధీ తన పార్టీ శ్రేణులకు, నేతలకు తన ప్రసంగంతో ఉత్సాహం కలిగించవచ్చునేమో కానీ, కేసీఆర్, తెలంగాణా సెంటిమెంటు ప్రభావంలో ఉన్న తెలంగాణా ప్రజలను కాంగ్రెస్ పార్టీకే ఓటేసేలా చేయలేరని చెప్పవచ్చును. ఆ పని కేవలం టీ-కాంగ్రెస్ నేతల వలననే సాధ్యమవుతుంది. వారు కాంగ్రెస్ జెండా, సోనియా, రాహుల్ గాంధీల ఫోటోలు పట్టుకొని తిరుగుతున్నపట్టికీ, వారు ప్రధానంగా తమ స్వశక్తి, పలుకుబడితోనే ఎన్నికలలో విజయం సాధించగల సమర్ధులు. ప్రస్తుతం వారందరూ తమ తమ నియోజకవర్గాలలో ఆ పని మీదనే ఉన్నారు. అందువల్ల రాహుల్, సోనియాగాంధీల ప్రచారం కేవలం కాంగ్రెస్ ప్రత్యర్ధులను బలంగా డ్డీకొని, ప్రజలకు అరచేతిలో వైకుంటం చూపించడానికే తప్ప వేరెందుకు ఉపయోగపడదనే భావించవచ్చును.

చంద్రబాబు హామీతోనే పోటీపై పట్టు సడలించా: కంఠంనేని

      ఎక్కడ నెగ్గాలో మాత్రమే కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినవాడే నిజమైన నాయకుడు. అలాంటి వ్యక్తే కృష్ణాజిల్లా అవనిగడ్డకి చెందిన తెలుగుదేశం నాయకుడు కంఠంనేని రవిశంకర్. ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేసి, స్థానికంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన కంఠంనేని రవిశంకర్‌కి ఈ ఎన్నికలలో అవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి టిక్కెట్ ఇస్తానని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అయితే చివరి నిమిషంలో మండలి బుద్ధ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడంతో చంద్రబాబు కంఠంనేని రవిశంకర్‌ని కాదని బుద్ధ ప్రసాద్‌కి టిక్కెట్ ఇచ్చారు. దాంతో మనస్తాపం చెందిన రవిశంకర్ అవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం రెబల్‌గా నామినేషన్‌ వేశారు.   కంఠంనేని రవిశంకర్ నామినేషన్ వేయడానికి వెళ్తున్నప్పుడు దాదాపు పదివేలమంది మద్దతుదారులు ఆయనవెంట నడిచారు. స్థానిక తెలుగుదేశం కార్యకర్తలందరూ మేమంతా కంఠంనేని వెంటే వుంటామని ముక్తకంఠంతో చెప్పారు. ఎలాంటి అధికారం లేకపోయినా తమకు ఎంతో సేవ చేసిన కంఠంనేనిని గెలిపించుకుంటామని స్థానిక ప్రజలు కూడా ఆయనకు బలమిచ్చారు. రాజకీయ వర్గాలు కూడా అవనిగడ్డ నియోజకవర్గంలో కంఠంనేని రవిశంకర్ గెలుపు ఖాయమని నిర్ధారణకి వచ్చాయి. అవనిగడ్డ సీటు తెలుగుదేశం అకౌంట్‌లోంచి జారిపోయినట్టేనని తీర్మానించేశాయి. అందుకే కంఠంనేని నామినేషన్‌ వేసినప్పటి నుంచి సుజనాచౌదరి లాంటి అనేకమంది నాయకులు ఆయనన్ని పోట నుంచి విరమించుకోవాల్సిందిగా కోరారు.  అయితే కంఠంనేని అందుకు నిరాకరించి ప్రచారంలో నిమగ్నమయ్యారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజున తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రవిశంకర్‌కి ఫోన్ చేసి పోటీనుంచి విరమించుకోవాలని కోరడంతో ఎప్పుడు తగ్గాలో కూడా తెలిసిన రవిశంకర్ తన నామినేషన్‌ని ఉపసంహరించుకుని మండలి బుద్ధ ప్రసాద్ గెలుపుకి మార్గం సుగమం చేశారు. తనవెంట వున్న కార్యకర్తలకు న్యాయం చేస్తానని చంద్రబాబు నుంచి, బుద్ధ ప్రసాద్ నుంచి స్పష్టమైన హామీ రావడంతో పోటీ నుంచి వెనక్కి తగ్గానని రవిశంకర్ చెప్పారు.  ఇక అవనిగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి తనవంతు కృషి చేస్తానని ప్రకటించారు. నామినేషన్ ఉపసంహరించుకున్న కంఠంనేనికి మండలి బుద్ధ ప్రసాద్‌ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రవిశంకర్ వెంట నడిచిన తెలుగుదేశం కార్యకర్తలను తన సొంత మనుషుల మాదిరిగా చూసుకుంటానని బుద్ధ ప్రసాద్ హామీ ఇచ్చారు.  కంఠంనేని పోటీ నుంచి తప్పుకోవడంతో అవనిగడ్డ నుంచి తన విజయం ఖాయమైందని ఆయన సంతోషాన్ని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి కంఠంనేని రవిశంకర్ చేసిన సేవలను చంద్రబాబు నాయుడు గుర్తించారని, రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక కంఠంనేని రవిశంకర్‌కి ప్రాధాన్యం వున్న పదవి ఇవ్వడానికి చంద్రబాబు సుముఖంగా వున్నారని, ఈ విషయంలో తనవంతు సహకారాన్ని మనస్పూర్తిగా అందిస్తానని అన్నారు.

శోభానాగిరెడ్డి మృతి: రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక శైలి

      రాష్ట్ర రాజకీయాలలో ప్రత్యేక శైలి కలిగిన రాజనీతివేత్తగా శోభానాగిరెడ్డి నిలిచారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శోభా నాగిరెడ్డి మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. యాక్సిడెంట్‌కి గురైన వెంటనే కోమాలోకి వెళ్ళిపోయిన ఆమె రక్తపోటు, పల్స్ నార్మల్‌గానే ఉన్నాయని మొదట వైద్యులు ప్రకటించినప్పుడు ఆమె కోలుకుంటారన్న ఆశ కలిగింది. అయితే అంతలోనే ఆమె కన్నుమూసినట్టు వైద్యులు ప్రకటించడం విషాదాన్ని కలిగించింది.   శోభానాగిరెడ్డి రాజకీయ నేపథ్యం వున్న కుటుంబం. ఆమె తండ్రి ఎస్.వి.సుబ్బారెడ్డి కాకలు తీరిన రాజకీయవేత్త, రాష్ట్రానికి మంత్రిగా కూడా పనిచేశారు. ఇంటర్మీడియట్ వరకూ చదువుకున్న శోభ వివాహం 1986లో భూమా నాగిరెడ్డితో జరిగింది. శోభానాగిరెడ్డిగా మారిన శోభ గృహిణిగా తన కుటుంబాన్ని ఆదర్శవంతంగా నడిపారు. ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు. ఇటీవలే కుమార్తె వివాహం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఎంతమాత్రం లేని ఆమె తన భర్త ప్రోత్సాహంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తన భర్త, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి నంద్యాల లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఉప ఎన్నికలో ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు.  తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆమె ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. ఛైర్మన్‌గా రెండేళ్ళపాటు ప్రశంసనీయంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఇమడలేక చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 ఎన్నికలలో రాయలసీమలో ప్రజారాజ్యం తరఫున ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేగా శోభా నాగిరెడ్డి నిలిచారు.  ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మారారు. ప్రస్తుత ఎన్నికలలో ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. శోభా నాగిరెడ్డి ఏ పార్టీలో వున్నా అగ్రశ్రేణి  నాయకురాలిగానే  ఉన్నారు. చక్కని మాట తీరుతో, సంస్కారం ఉట్టిపడేలా మాట్లాడేవారు. రాష్ట్ర రాజకీయాలలో ఉజ్వలమైన భవిష్యత్తు వున్న శోభా నాగిరెడ్డి ఇలా ఆకస్మిక మరణం చెందటం ఆమె కుటుంబాన్ని, ఆమె నియోజకవర్గ ప్రజలను మాత్రమే కాకుండా ఆమె రాజకీయ ప్రత్యర్థులను కూడా షాక్‌కి గురి చేసింది.  

ఏపీఎన్జీవోలను దువ్వుతున్న జైరాం

      ప్రస్తుతం తెలుగుదేశానికి దగ్గరై వున్న ఏపీఎన్జీవోలను దువ్వడానికి కేంద్ర మంత్రి జైరాం రమేష్ పెద్ద దువ్వెనతో సిద్ధమయ్యారు. సీమాంధ్రలో ఉద్యోగులందరూ తెలుగుదేశం, బీజేపీ కూటమికి ఓటు వేయడానికి మానసికంగా సిద్ధమైపోయారు. కాంగ్రెస్ పార్టీ పేరు చెబితేనే ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగుల మద్దతు లేని పార్టీ గెలిచిన దాఖాలాలు చరిత్రలో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీఎన్జీవోలను మచ్చిక చేసుకోవడం ద్వారా సీమాంధ్రలో గండం నుంచి గట్టెక్కాలని జైరాం రమేష్ ప్లాన్ వేశారు. ఈ ప్లాన్‌లో భాగంగా ఏపీఎన్జీవోలతో సమావేశం ఏర్పాటు చేశారు.   ప్రస్తుతం ఏపీఎన్జీవోలు ‘ఆప్షన్లు ఉండాల్సిందే’ అనే పట్టు మీద వున్నారు. వారికి ఏం కావాలో వారికి ఇచ్చి తమకు ఏంకావాలో అది తీసుకునే ఇచ్చిపుచ్చుకునే ధోరణితో జైరాం రమేష్ వ్యవహరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చి తీరతామని వాళ్ళకి హామీ ఇచ్చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని వాళ్ళకి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర ఉద్యోగులకు అన్యాయం జరగకుండా వుండాలంటే కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించాలని  ఉద్యోగ సంఘాల నాయకులను కోరినట్టు సమాచారం. రాష్ట్రాన్ని అడ్డంగా విభజించి సీమాంధ్రులకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని సీమాంధ్రులెవరూ నమ్మరన్న విషయాన్ని జైరాం రమేష్ మరచిపోయినట్టున్నారు. కాంగ్రెస్ సిద్ధాంతమే విభజించి పాలించు. అందుకే రాష్ట్రాన్ని విభజించి కూడా రెండు ప్రాంతాలనీ పాలించాలని అనుకుంటోంది. ఈ విషయంలో ఏపీఎన్జీవోలని కూడా అనాలి. రాష్ట్రం అడ్డగోలు విభజనకు జైరాం రమేష్ కూడా కారణమని తెలిసి కూడా, ఆయన పిలవగానే కలవటానికి వెళ్ళారు. వినతిపత్రాలు సమర్పించారు. ఆయన చెప్పిన సోది అంతా విని వచ్చారు.  

టీఆర్ఎస్‌కి ఓటమి భయం పట్టుకుంది

      ఈ ఎన్నికలలో 90 అసెంబ్లీ స్థానాలు తమ పార్టీ సంపాదించుకుంటుందని, తెలంగాణలో ప్రభుత్వం స్థాపించడంతోపాటు కేంద్రంలో కూడా చక్రం తిప్పుతుందని టీఆర్ఎస్ నాయకులు పైకి చెబుతున్నారు. మొన్నటి వరకూ 60 సీట్లు వస్తాయని అనుకున్నామని, ఇప్పుడు 90 వస్తాయని అనుకుంటున్నామని ప్రకటిస్తున్నారు. అయితే బయట పరిస్థితి చూస్తే టీఆర్ఎస్‌కి అంత సీన్ కనిపించడంలేదు. అందుకే పైకి ఎంత డాంబికాలు పలుకుతున్నా, లోలోపల మాత్రం టీఆర్ఎస్ నాయకులను ఓటమి భయం పట్టి పీడిస్తోంది.   అందుకే అప్పుడప్పుడు నోరు జారి నిర్వేదంగా మాట్లాడుతున్నారు. టీడీపీ, బీజేపీ పొత్తు పక్కాగా కుదరడంతో ఆ రెండు పార్టీలకి తెలంగాణ ప్రజల్లో మద్దతు పెరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీ లేనిపోని ఉద్రికత్తలు పెంచి లాభపడటం తప్ప తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయదని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చే సమయంలో మోడీని తిట్టిపోసే టీఆర్ఎస్‌కి ఓటేస్తే భవిష్యత్తులో మోడీ ప్రభుత్వం టీఆర్ఎస్‌కి సహకరించదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే టీఆర్ఎస్ కేవలం ఉత్తర  తెలంగాణలో మాత్రమే బలంగా కనిపిస్తోంది. దక్షిణ తెలంగాణలో ఆ పార్టీని పట్టించుకునేవారే కనిపించడంలేదు. ఖమ్మం జిల్లాలో అయితే టీఆర్ఎస్ ఊసే లేదు. దీంతోపాటు తెలంగాణ అంతటా టీఆర్ఎస్ అభ్యర్థుల్లో చాలామంది బలహీనంగా వున్నారు. ఇలా అనేక కారణాలు టీఆర్ఎస్‌ని ఓటమి వైపు తీసుకెళ్తున్నాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న టీఆర్ఎస్ నేతలు వారం రోజుల నుంచి నిర్వేదంగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ అయితే నన్ను గెలిపిస్తే తెలంగాణని పాలిస్తా, లేకపోతే రెస్ట్ తీసుకుంటానని నిర్మొహమాటంగా ప్రకటించేశారు. టీఆర్ఎస్ మిగతా నాయకులు కూడా అంత ఉత్సాహంగా కనిపించడం లేదు. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే టీఆర్ఎస్ ఎన్నికల ముందే ఓటమిని ఒప్పుకోక తప్పేట్టులేదు.  

కేవీపీ అరెస్టు నోటీసు ఏ పార్టీకి చేటు?

      రెండు వారాల క్రితం అమెరికా దర్యాప్తు సంస్థ రాజ్యసభ సభ్యుడు కే.వీ.పీ. రామచంద్రరావుపై టైటానియం కుంభకోణంలో మోపిన అభియోగాలను చికాగో కోర్టు దృవీకరించినప్పుడు, అదొక పెద్ద సంచలనం సృష్టించింది. అయితే షరా మామూలుగానే అప్పుడు కేవీపీ తనపై అటువంటి నిరాధారమయిన ఆరోపణలు రావడం దురదృష్టకరమని, చికాగో కోర్టు, సదరు దర్యాప్తు సంస్థ వెంటనే తమ నివేదికలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేసారు. ఆ నివేదిక చూసిన తరువాతనే తాను స్పందిస్తానని అప్పటికి తప్పుకోగలిగారు. అయితే కదా అక్కడితో ముగిసిపోలేదు.   ఆ తరువాత కొద్ది రోజులకే, అమెరికా సంస్థ కేవీపీ అరెస్టు కోరుతూ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసి భారత ప్రభుత్వానికి ఆ నోటీసులు అందజేసి ఆయనను తమకు అప్పగించమని కోరింది. ఇదంతా జరిగి అప్పుడే పది రోజులయిన సంగతి ఈరోజే బయట పడింది. ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయిన కేవీపీ ఈరోజే ప్రమాణ స్వీకారం చేసారు. బహుశః అందుకోరకే ఇంతకాలం ఈ విషయాన్ని ప్రభుత్వం త్రొక్కిపెట్టి ఉండి ఉండవచ్చును. తమకు పది రోజుల క్రితం అందిన రెడ్ కార్నర్ నోటీసును సీబీఐ, ఈరోజు రాష్ట్ర సీఐడీ పోలీసు శాఖకు పంపినట్లు సమాచారం.     భారత పార్లమెంటు సభ్యుడయిన ఆయనను అమెరికా దర్యాప్తు సంస్థ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ద్వారా అరెస్టు చేయడం సాధ్యమా కాదా అనేది న్యాయ నిపుణులు తేల్చవలసిన విషయం గనుక అది అప్రస్తుతం. ఈ నోటీసు వలన ఆయనను పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదా? ఆయన తనకున్న అపారమయిన రాజకీయ పలుకుబడి, పరపతిని వినియోగించి అరెస్టు నుండి తప్పించుకొంటారా? లేక ఆయన కూడా తెలివిగా కోర్టును ఆశ్రయించి తప్పుకుంటారా? అనేవి కూడా అప్రస్తుత విషయాలే. సరిగ్గా ఎన్నికలకు ముందు ఇటువంటి వ్యవహారం వల్ల ప్రధానంగా కాంగ్రెస్, వైకాపాలపై ప్రభావం ఏవిధంగా ఉంటుంది? దాని నుండి ఆ రెండు పార్టీలు ఏవిధంగా తప్పుకొనే ప్రయత్నాలు చేస్తాయి? వంటివే ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించబోతున్నాయి.

మెగా సోదరులు...మెగా డిఫరెన్స్...

  కాంగ్రెస్ పార్టీని ఎలాగయినా గెలిపించి తీరుతానని చిరంజీవి డిల్లీలో శపథం చేసి ప్రచారానికి బయలుదేరితే, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీని దేశం నుండి తరిమికొట్టేందుకే తాను రాజకీయాలలోకి రావలసి వచ్చిందని చెప్పడం విశేషం. అయితే వీరిరువురిలో చిరంజీవి స్థిరంగా కాంగ్రెస్ టైటానిక్ పడవ మీదనే నిలబడి గంట కొడుతుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం నేటికీ ‘ఎన్డీయే అభ్యర్ధులకే నా మద్దతు!’ అంటున్నారు తప్ప, స్వయంగా చంద్రబాబే ఆయనింటికి వచ్చి మరీ తమ పార్టీకి మద్దతు ఇమ్మని కోరినా ఆయన నోటంట ‘తెలుగుదేశం పార్టీకే నా మద్దతు’ అనే ముత్యాలవంటి ఆ మూడు ముక్కలు రాలలేదు. అంటే ఆయనకి తెదేపా పట్ల నేటికీ ఇంకా ఏవో అభ్యంతరాలున్నట్లు భావించవలసి ఉంది. ఏమయినప్పటికీ పవన్ కళ్యాణ్ త్వరలోనే ఆంధ్ర, తెలంగాణా రెండు ప్రాంతాలలో ‘ఎన్డీయే అభ్యర్ధులకు’ ప్రచారం చేసి పెట్టబోతున్నట్లు రూడీ అయ్యింది.   ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ నేటికీ తెలంగాణాలో ప్రచారం చేయడానికి వెళ్ళగలుగుతున్నారు. ఆయనకి అక్కడ ప్రజల నుండి అభిమానుల నుండి నేటికీ మంచి ఆదరణ కనబడుతోంది. కానీ కేంద్రమంత్రి అయిన చిరంజీవి హైదరాబాదులోనే నివాసం ఉంటున్నప్పటికీ, కాంగ్రెస్ తరపున తెలంగాణాలో ప్రచారం చేయలేని దుస్థితి. ఆయన ప్రచారానికి వెళితే పడే ఓట్లు కూడా పడవని గ్రహించిన టీ-కాంగ్రెస్ నేతలు చిరంజీవి ‘నో ఎంట్రీ’ బోర్డు ఎప్పుడో పెట్టేసారు. నిజానికి తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా ఇచ్చిన కారణంగా ఎంతో కొంత అనుకూల పరిస్థితి ఉంది. కానీ, అక్కడ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు చిరంజీవి వంటి ప్రజాకర్షక నేత ఒక్కడూ లేడు. అయినప్పటికీ మా తిప్పలేవో మేమే పడతాము తప్ప ఆ జీవి మాత్రం మాకొద్దు మహాప్రభో! అంటున్నారుట.    పోనీ ఆయనకు సీమాంద్రాలో ప్రజలు ఏమయినా బ్రహ్మ రధం పడుతున్నారా.. అంటే అదీ లేదు. అక్కడా ఆయన సభలకు జనాలు మొహాలు చాటేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన నిర్వహించిన బస్సు యాత్రలోను అదే స్థితి, నేడు ఆయన చేస్తున్న ప్రచారంలోనూ అదే పరిస్థితి. చిరంజీవి రెండు ప్రాంతాల ప్రజలకు కాని వాడయిపోతే, ఆయన తమ్ముడు మాత్రం అందరివాడు, అందరికీ కావలసినవాడు అనిపించుకొంటున్నారు. చిరంజీవిని సీమాంద్రాలో ప్రజలు సైతం పట్టించుకోకపోయినా ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ వచ్చి తమకోసం తెలంగాణాలో కూడా ప్రచారం చేయాలని ‘ఎన్డీయే అభ్యర్ధులు’ కోరుకోవడం గమనిస్తే ప్రజలలో మెగా సోదరుల వ్యక్తిత్వాలకున్న విలువ ఏమిటో స్పష్టంగా అర్ధమవుతుంది. చివరికి ఇతర రాష్ట్రాలలో తెలుగు ప్రజలు సైతం ఇదేవిధంగా స్పందించడం మరో విశేషం.   అయితే అందుకు కేవలం వారి వ్యక్తిత్వాలు మాత్రమే ప్రధాన కారణమని చెప్పలేము. వారి ప్రసంగ శైలి, వారు ఎన్నుకొన్న పార్టీలపై ప్రజలకున్న అభిప్రాయాలు కూడా వారి ప్రజాధారణలో తీవ్ర అంతరాన్ని కలిగిస్తున్నాయి. చిరంజీవి తన సినిమాలలో ప్రజలను ఆకట్టుకొనే విధంగా చాలా గొప్పగా డైలాగ్స్ చెపుతూ నటించి ఉండవచ్చును. కానీ నేటికీ ఆయన తన తమ్ముడు పవన్ కళ్యాణ్ లాగ అలవోకగా ప్రసంగించలేరు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేఖత, ముఖ్యంగా రాష్ట్ర విభజన వ్యవహారంలో ఆయన అనుసరించిన ద్వంద వైఖరి ఇత్యాది కారణాలు కూడా ఆయన పట్ల ప్రజలలో విముఖత ఏర్పడేందుకు కారణమవుతోందని చెప్పవచ్చును.   ఒకవైపు చిరంజీవి కాంగ్రెస్ పార్టీ కోసం సీమాంద్రాలో ప్రచారం చేస్తూ గెలుపు తమదేనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటే, మరో వైపు ఆ పార్టీ తరపున నామినేషన్లు వేసిన అభ్యర్ధులు ఓటమి భయంతో తమ నామినేషన్లు ఉపసంహరించుకొని పోటీ నుండి తప్పుకోవడం ఆయన ప్రచారం యొక్క గొప్పదనానికి మరో నిదర్శనం. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ సీమాంద్రాలో కూడా ‘ఎన్డీయే అభ్యర్ధుల’ తరపున ప్రచారానికి దిగినట్లయితే కాంగ్రెస్ పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవచ్చును.   పాపం ఆ ఒంటరి జీవి కష్టం చూసి చలించిపోయిన కాంగ్రెస్ టైటానిక్ షిప్ కెప్టెన్స్- సోనియా రాహుల్ గాంధీలు కూడా త్వరలోనే సీమాంద్రాలో పర్యటించి ‘మిగిలిన పని’ పూర్తి చేయడానికి వస్తున్నట్లు తాజా సమాచారం. శుభం.

పొన్నాలకి హై బీపీ!

      పాపం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకి వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు.  మంత్రిగాఉన్నంతకాలం ఎంచక్కా జోకులేసుకుంటూ, డాన్సులు చేసుకుంటూ, పాటలు, పద్యాలు పాడుతూ ఉత్సాహంగా గడిపిన ఆయన నెత్తిన ఇప్పుడు తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి బండలా మారింది. ఏ బ్యాడ్ ముహూర్తంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారోగాని అప్పటి నుంచి ఆయనకి బ్యాడ్ టైమ్ స్టార్టయినట్టు కనిపిస్తోంది.   ఒకప్పుడు ఎంతో కూల్‌గా వుండే ఆయన ఇప్పుడు గరమ్ గరమ్‌గా కనిపిస్తున్నారు. ప్రెస్ వాళ్ళు గతంలో ఏదైనా ప్రశ్నిస్తే చిరునవ్వుతో సమాధానం చెప్పే ఆయన ఇప్పుడు అంతెత్తున విరుచుకుపడుతున్నారు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు నెరవేర్చడంలో ఆయన పూర్తిగా స్ట్రెస్‌కి గురై, హైబీపీకి లోనయినట్టుగా పరిస్థితి చూస్తే అనిపిస్తోంది. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే మీకు సీన్ సితారైపోద్దని సోనియా మేడమ్ వార్నింగ్ ఇచ్చారో ఏమోగానీ, ఆయన మీద ఏదో ఒత్తిడి బాగా వున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. మంగళవారం నాడు ఆయన బీపీ ఏ స్థాయికి చేరిందో తెలిస్తే ఆశ్చర్యపోయారు. ఎన్నికల ప్రచారం కోసం హెలికాప్టర్ ఎక్కిన ఆయన ఒకచోట ప్రచారం పూర్తి చేసుకున్నారు. మరోచోటకి పోదామని అంటే, ఆ ప్రాంతానికి వెళ్ళడానికి నాకు పర్మిషన్ లేదని సదరు హెలికాప్టర్ పైలెట్ చెప్పాడట. అంతే, పొన్నాల గారికి హైబీపీ పెరిగిపోయి ఆ పైలెట్‌ని నానా మాటలూ అనేసి హెలికాప్టర్ దిగేసి కారులో వెళ్ళిపోయారట. ఇలా వుంది పొన్నాల గారి బీపీ వ్యవహారం.

ఎన్నికల సంఘం: ఓటేస్తే బహుమతులిచ్చే ఖర్మేంటి?

      ఓటర్లని రాజకీయ నాయకులు ఎప్పుడో బిచ్చగాళ్ళని చేసేశారు. మా పార్టీకి ఓటేస్తే ఫలానా ఫలానా విధంగా మీకు లాభం కలిగిస్తానని రాజకీయ నాయకుడు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తూ వుంటారు. చాలామంది ఓటర్లు ఆ ఆఫర్లు నిజమేననుకుని పొంగిపోతూ వుంటారు. ఇక ఎలక్షన్లు వచ్చాయంటే ఓటర్లకి డబ్బులు పంచడం కామన్. ఓటు ఒక శక్తి.. ఓటు ఒక ఆయుధం అని స్టేట్ మెంట్లు కొంతమంది అభ్యుదయవాదులు ఇస్తూ వుంటారుగానీ, ఇప్పుడు దేశంలో జనం డబ్బు తీసుకుని ఓట్లు వేయడానికి ఎంతమాత్రం సిగ్గుపడటం లేదు.   అసలు డబ్బు ఇచ్చే నాయకులని అని లాభం లేదు. చేతులు జాస్తున్న ఓటర్లనే అనాలి. అన్ని పార్టీల దగ్గర డబ్బులు తీసుకుని ఎవరికో ఒకరికి ఓటు వేసే ప్రబుద్ధులు, అందరి దగ్గరా చేతులు చాచి అసలు ఎవరికీ ఓటు వేయని మహానుభావులు కూడా ఓటర్లలో వున్నారు. వాళ్ళు ఇస్తునందుకు వీళ్ళు తీసుకుంటున్నారు. వీళ్ళు తీసుకుంటున్నందుకు వాళ్ళు ఇస్తున్నారు. ఇందులో తప్పు ఎవరిదో వెతకడం దేవుడనేవాడుంటే ఆయనగారి వల్ల కూడా కాదు. కోడి ముందా గుడ్డు ముందా.. చెట్టు ముందా విత్తు ముందా అనే ప్రశ్న ఎంత కఠినమైనదో ఇదీ అంతే. సరే ఈ గోల ఇలా వుంటే, రాజకీయ నాయకులకు తోడుగా ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా ఓటర్లని ముష్టోళ్ళని చేయడానికి తనవంతు కృషి చేస్తోంది.  ఈసారి 90 శాతానికి మించి పోలింగ్ జరపాలని అధికారుల లక్ష్యంగా పెట్టుకున్నారట. దానికోసం ఓటర్లని ఓటు వేయించేలా మోటివేట్ చేయడానికి స్కీములు ప్రకటించారు. ఓటు వేసిన ఓటర్ల నుంచి డ్రా తీసి, సదరు డ్రాలో పేర్లు వచ్చిన ఓటర్లకు కార్లు, ఇంకా ఏవేవో వస్తువులు ముష్టిగా పడేస్తారట. అసలు మీపని ఎలక్షన్లు సక్రమంగా నిర్వహించడం ఎలక్షన్ కమిషన్ పని. ఎంత శాతం ఓట్లు పడితే మీకెందుకంటా? ఓటర్ల శాతం పెంచడానికి లక్కీ డ్రాలు.. బంపర్ బహుమతులు.. ఈ దరిద్రం అంతా ఎందుకంటా?  ఈ తతంగమంతా నిర్వహించే ఖర్మ మీకెందుకంటా? రాజకీయ నాయకులతో కలసి తిరిగీ తిరిగీ ఈ ప్రభుత్వ అధికారులకి కూడా ఓటర్లు ముష్టోళ్ళలాగా కనిపిస్తున్నట్టున్నారు.

ఎన్టీఆర్ ని పట్టించుకోని నందమూరి ఫ్యాన్స్..!

      నటరత్న, విశ్వవిఖ్యత నవరస నటనా సార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ అంది పుచ్చుకున్నారు. సినిమా రంగంతోపాటు రాజకీయ రంగంలో కూడా నాన్న వారసత్వాన్ని బాలకృష్ణ కొనసాగిస్తున్నారు. ఈ వారసత్వాన్ని జూనియర్ ఎన్టీఆర్‌ కొనసాగిస్తారని నందమూరి అభిమానులు గతంలో భావించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారశైలి కొరుకుడు పడని విధంగా, నందమూరి కుటుంబానికి దూరంగా వెళ్తున్న విధంగా వుండటంతో నందమూరి వంశాభిమానులందరూ క్రమంగా జూనియర్ ఎన్టీఆర్‌కి దూరమవుతున్నారు.   నందమూరి ఫ్యాన్స్ జూనియర్‌కి దూరం కావడం వల్లే ఇటీవలి కాలంలో ఆయన సినిమాలకు ప్రేక్షకాదరణ లభించడం లేదన్న అభిప్రాయాలు వున్నాయి. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదలైతే భారీ స్థాయిలో హడావిడి చేసే నందమూరి వంశాభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు ఇప్పుడు తమకేమీ సంబంధం లేదన్నట్టుగా ఊరుకుంటున్నారు. దీనివల్ల ఆయన సినిమాలు రిలీజైన థియేటర్లు మొదటి రోజు నుంచే చల్లగా వుంటున్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్‌కి, తమకి ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా నందమూరి వంశాభిమానులు వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ ఎన్నికలలో కూడా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రచార బాధ్యతని భుజాల మీదకి ఎత్తుకోకపోవడం, ఆయన నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎలాంటి స్పందన లేకపోవడంతో నందమూరి వంశాభిమానులతో ఆయనకున్న దూరం మరింత పెరిగింది. వీరి మధ్య ఏర్పడిన గ్యాప్‌లో నందమూరి వంశాకురం నందమూరి మోక్షజ్ఞ ఎంటరవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నందమూరి మోక్షజ్ఞను అభిమానించే వారి సంఖ్య బాగా పెరిగింది. నందమూరి వంశానికి అసలైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ కాదని, సినిమా వారసత్వాన్ని, రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న బాలకృష్ణ కుమారుడైన మోక్షజ్ఞే అసలైన వారసుడని అభిమానులు అంటున్నారు. తాజాగా మోక్షజ్ఞ తెలుగుదేశానికి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ వుండటం కూడా ఆయన మీద అభిమానుల అభిమానం మరింత పెరగడానికి కారణమైంది. మోక్షజ్ఞ వెండితెర మీదకి ఎంట్రీ ఇచ్చి, ఒక్క భారీ హిట్ కొట్టాడంటే చాలు నందమూరి వంశాభిమానులందరూ మోక్షజ్ఞ వైపు పూర్తిగా షిఫ్ట్ అయిపోయే అవకాశం వుంది.