కావూరి కుంటిసాకులు!

      కాంగ్రెస్ పార్టీలో వుంటే వచ్చే ఎన్నికలలో ఎంపీగా గెలిచే అవకాశం లేదని అర్థం చేసుకున్న కావూరి సాంబశివరావు కేంద్రమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరే ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీలో చేరినప్పటికీ కావూరికి ఎవరు ఓటు వేస్తారో దేవుడికే తెలియాలి. కావూరి రాజీనామా వెనుక వున్నది పదవీ కాంక్షేనని క్లియర్‌గా తెలుస్తున్నప్పటికీ కావూరి తన రాజీనామా వెనుక అసలు కారణాలంటూ ఏవేవో కుంటి సాకులు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయకపోవడంతో ఆయన చాలా హర్టయిపోయి రాజీనామా చేశాడట, అంతేతప్ప పదవీ కాంక్షతో కాదట. పోలవరం ఆర్డినెన్స్ జారీ చేయాలని తాను అనేకసార్లు ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసినా ఆయన పట్టించుకోకపోవడంతో రాజీనామా చేశానని కావూరి కుంటిసాకులు చెబుతున్నారు. నాయనా కావూరీ, నీ మాటలు నమ్మడానికి సీమాంధ్రుల చెవుల్లో పూలు లేవు.

కాంగ్రెస్, వైసీపీకి కేవీపీ గండం!

      ఎన్నికల వేళ అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక భారీ గండం వచ్చి పడింది. ఆ గండం పేరు కేవీపీ రామచంద్రరావు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆయన ‘ఆత్మ’గా పేరుపొందిన కేవీపీ ఎన్నో ముడుపుల భాగోతాలు నడిపినట్టు ఆరోపణలున్నాయి. ఆ ఆరోపణలకు ఇప్పుడు మరింత బలం చేకూరింది. అమెరికాకి చెందిన దర్యాప్తు సంస్థ ఎఫ్‌బిఐ కేవీపీ నడిపిన ఒక ముడుపుల భాగోతాన్ని బయట పెట్టింది.   ఆంధ్రప్రదేశ్‌లో వున్న  టైటానియం ఖనిజాన్ని తవ్వుకోవడానికి అనుమతి కోసం అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ, ఉక్రెయిన్‌కి చెందిన డీఎఫ్ సంస్థ కేవీపీతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు మొత్తం 111 కోట్లు ముడుపులుగా చెల్లించాయని ఎఫ్‌బీఐ నిర్ధారించింది. సదరు రెండు సంస్థలతోపాటు కేవీపీ, మరో ఆరుగురి మీద కేసులు నమోదు చేసింది. ఈ ఆరుగురి నుంచి 64 కోట్ల రూపాయల జరిమానాని విధించాలని ఎఫ్‌బీఐ షికాగో న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. త్వరలో దీనికి సంబంధించిన చర్యలు తీసుకునే అవకాశం వుంది. అప్పుడు కేవీపీతోపాటు ఆయన వెనుక వున్న ‘ముఖ్యులు’ బయటపడతారు. కేవీపీ ఆత్మ అయితే, ఆయన అంతరాత్మ వైఎస్ రాజశేఖరరెడ్డి. వీళ్ళిద్దరూ ఈ కేసు ద్వారా బద్నామ్ అయితే అటు కాంగ్రెస్ పార్టీతోపాటు ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా భారీగా నష్టపోయే అవకాశం వుంది. ఈ కేసును దర్యాప్తు చేసేది మన సీబీఐ అయితే కేసు ఎప్పటికి తేలేనులే అనుకోవచ్చు. ఎఫ్‌బీఐ అంటే ఆషామాషీ సంస్థ కాదు. మెరుపు వేగంతో దర్యాప్తు చేసి కుంభకోణానికి కారకులైన వారి ఆట కట్టించే వరకూ వదిలిపెట్టదు. అందుకే కాంగ్రెస్, వైకాపా గుండెలు అదిరిపోతున్నాయి.

‘లెజెండ్’ తీర్థయాత్ర దేనికి?

      నందమూరి బాలకృష్ణ ఇప్పుడు విజయానందంలో వున్నారు. ఆయన చాలాకాలంగా ఎదురుచూస్తున్న విజయం ‘లెజెండ్’ ద్వారా దక్కడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా వుంది. ‘లెజెండ్’ బాలకృష్ణకు సరైన సమయంలో దక్కిన సరైన విజయంగా రాజకీయ, సినీ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ సినిమా బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయ రంగప్రవేశానికి ఎంతో ఉత్సాహాన్నిచ్చిందని, తెలుగుదేశం కార్యకర్తల్లో ఈ విజయం ఉత్సాహాన్ని పెంచిందని అంటున్నారు.   గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ‘లెజెండ్’ విజయ యాత్ర చేస్తూ బాలకృష్ణ బిజీగా వున్నారు. ఆయన విజయ యాత్రను చేయడంతోపాటు పనిలోపనిగా తీర్థయాత్రను కూడా చేస్తున్నారు. విజయ యాత్రలో ఏ ప్రాంతానికి వెళ్ళినా సమీపంలోని ప్రసిద్ధ దేవాలయాలను దర్శిస్తున్నారు. యాదగిరిగుట్ట, విజయవాడ కనకదుర్గమ్మ గుడి, మంగళగిరి పానకాల స్వామి, తిరుమల వేంకటేశ్వరాలయం తదితర పుణ్యక్షేత్రాలకు బాలకృష్ణ వెళ్ళారు. ఈ విజయయాత్ర కమ్ తీర్థయాత్రలో భాగంలో బాలకృష్ణ మరిన్ని పుణ్యక్షేత్రాలను సందర్భించే అవకాశం వుందని తెలుస్తోంది. బాలకృష్ణ తీర్థయాత్ర చేస్తోంది కేవలం ‘లెజెండ్’ విజయం సాధించినందుకు మాత్రమే కాదని, ఈ ఎన్నికల నుంచి తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగబోతూ ముందుగా దేవతామూర్తుల ఆశీస్సులు తీసుకోవడానికే బాలకృష్ణ తీర్థయాత్రలు చేస్తున్నారని అంటున్నారు. ఒకే టూర్‌లో రెండు పనులూ పూర్తి చేస్తున్నారని అభిమానులు, పరిశీకులు చెబుతున్నారు.

కృష్ణాతీరంలో తెదేపాపై వాలుతున్న కాంగ్రెస్ వలస పక్షులు

  సీమాంద్రాలో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖాళీ అయిపోయింది. పార్టీ నుండి బయటకు వెళ్ళిన వారిలో దాదాపు 75శాతం మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. కొత్తగా కృష్ణా జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు పిన్నమనేని వెంకటేశ్వర రావు, మండలి బుద్ధ ప్రసాద్ నిన్నతెదేపా కండువాలు కప్పుకొన్నారు. వారిని చంద్రబాబు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించినా, జిల్లా నేతలు మాత్రం వారిపై చాలా గుర్రుగా ఉన్నారు. నిన్న వారిరువురు పార్టీలో చేరుతున్న సమయంలో జిల్లాకు చెందిన ప్రముఖనేతలెవరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆసక్తి చూపలేదు.   కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నంతకాలం ఆయన చుట్టూ ఉపగ్రహంలా ప్రదక్షిణాలు చేసి పదవులు సంపాదించుకొన్న మండలి బుద్ధ ప్రసాద్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి, కిరణ్ కుమార్ రెడ్డికి కూడా హ్యాండిచ్చి ఎన్నికలలో గెలిచే అవకాశం ఉన్న తెదేపా టికెట్ కోసమే పార్టీలో చేరుతున్నారని జిల్లా నేతలు భావిస్తున్నారు.   తెదేపా-బీజేపీ పొత్తులలో భాగంగా తమ సీట్లకు ఎక్కడ ఎసరు వస్తుందో అని ఆందోళన చెందుతుంటే, ఇప్పుడు ఈ కాంగ్రెస్ వలస పక్షుల కారణంగా తాము నష్టపోవలసి వస్తుందని జిల్లా నేతలు ఆక్రోశిస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన దేవినేని ఉమా మహేశ్వర రావు, కొనకళ్ళ నారాయణ రావు తదితరులు, పార్టీ కార్యకర్తలు కూడా వీరి రాకను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. ఇంతకాలం తాము వ్యతిరేఖించిన, తెదేపాను వ్యతిరేఖించిన ఈ నేతలకు మద్దతుగా మాట్లాడుతూ ఇప్పుడు ప్రజల వద్దకు ఏ మొహం పెట్టుకొని వెళ్లి వాళ్లకు ఓట్లేయమని అడగగలమని వారు ప్రశ్నిస్తున్నారు. కానీ, చంద్రబాబు నాయుడు జిల్లా నేతలతో స్వయంగా మాట్లాడి ఒప్పించడంతో వారు అయిష్టంగా ఒప్పుకోవలసి వచ్చింది.   వీరిరువురి రాకతో జిల్లాలో పార్టీ మరింత బలపడుతుందని చంద్రబాబు సంతోషిస్తుంటే, ఇటువంటివారితో కలిసి పనిచేయడం అసాధ్యమని జిల్లా నేతలు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన వ్యవహారంలో తీవ్ర ఆటుపోటులకు గురయ్యి ఇప్పుడిప్పుడే కొల్కొంటున్న తెదేపా, విభజనకు కారకులయిన కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకొంటే కాంగ్రెస్ పార్టీపై ఉన్న ప్రజావ్యతిరేకత, ప్రజాగ్రహం పార్టీపై తప్పక పడుతుందని, దానివలనపార్టీ తీవ్రంగా నష్టపోవలసి రావడమే కాకుండా, వైకాపా వంటి ప్రత్యర్ద పార్టీలు బలపడవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.   తీవ్ర ప్రజా వ్యతిరేఖతను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేతలను పార్టీలోకి ఆహ్వానించి టికెట్స్ కట్టబెట్టడం కొరివితో తల గోక్కోన్నట్లే అవుతుందని పార్టీ నేతలు, కార్యకర్తలే హెచ్చరించడం గమనార్హం. గత రెండు ఎన్నికలలో ఇటువంటి వింత వింత ప్రయోగాలు చేయడం వలన పార్టీ ఓటమి పాలయిన సంగతిని ఈ సందర్భంగా జ్ఞప్తికి తెచ్చుకొని మళ్ళీ అటువంటి ప్రయోగాలు చేయవద్దని పార్టీ పాత కాపులు అందరూ కోరుకొంటున్నారు. తాను చాలా మారానని చెప్పుకొంటున్న చంద్రబాబు మరి వారి సలహాలను, సూచనలను చెవికెక్కించుకొంటారో లేదో చూడాలి.

మోడీ కుక్కపిల్ల అట!

      ప్రధానమంత్రి రేసులో ముందుండటంతోపాటు, దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీయడానికి కారకుడైన నరేంద్రమోడీని అటు కాంగ్రెస్‌తో పాటు ఇటు కాంగ్రెస్ మిత్రపక్షాలు, యుపి.ఎ భాగస్వామ్య పార్టీల నాయకులు నరేంద్ర మోడీ మీద కారాలు, మిరియాలు నూరుతున్నారు. అవకాశం దొరికితేచాలు మోడీని తమ స్థాయి నుంచి నేలబారుకు దిగజారి మరీ విమర్శిస్తున్నారు.   తాజాగా సమాజవాది పార్టీ నాయకుడు ఆజమ్ ఖాన్ నరేంద్రమోడీని ‘కుక్కపిల్ల’తో పోల్చాడు. ఆ కుక్కపిల్ల తమనేమీ చేయలేదన్న ధైర్యాన్ని ప్రదర్శించాడు. ఇక కాంగ్రెస్ నాయకుడు, నోటికొచ్చినట్టు వాగడంలో సిద్ధహస్తుడైన బేణీ ప్రసాద్ వర్మ కూడా నరేంద్ర మోడీ మీద మాటలదాడి చేశాడు. నరేంద్రమోడీని ఆయన ఆర్ఎస్ఎస్ గూండాగా అభివర్ణించారు. మహాత్మాగాంధీని హత్యచేసిన ఆర్ఎస్ఎస్‌కి ప్రతినిధి మోడీ అన్నాడు. అలాంటి ఆర్ఎస్ఎస్ గూండా అయిన నరేంద్ర మోడీకి బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ బానిసలాంటి వాడని అభివర్ణించాడు. నరేంద్రమోడీ గూండాయిజానికి భయపడిన భారతీయ జనతాపార్టీ నాయకులు పార్టీలో వున్న అద్వానీ లాంటి సీనియర్ నాయకులను అవమానిస్తున్నారని బేణీ ప్రసాద్ వర్మ తెగ బాధపడిపోతూ అన్నాడు.

కేసీఆర్ ఉత్తుత్తి వాగ్దానాలు!

      కేసీఆర్‌కి ఎవరైనా సాంస్కృతిక సంస్థల వాళ్ళు బిరుదు ఇవ్వదలుచుకుంటే ‘వాగ్దాన కర్ణుడు’ అని ఇస్తే బెటర్. ఎందుకంటే వాగ్దానాలు చేయడంలో ఈ సారుని మించిన దిట్ట భారత రాజకీయాల్లోనే ఉండరేమో. అలాగే ఇచ్చిన మాటని తప్పడంలో కూడా కేసీఆర్ గారు ఏనాడో డాక్టరేట్ చేసేశారు. లేటెస్ట్ గా మెదక్ జిల్లా జోగిపేటలో అయ్యగారు చేసిన వాగ్దానాల లిస్టు చూస్తే పెద్దపెద్ద ఆర్థికవేత్తలకైనా కళ్ళుతిరిగి స్పృహ తప్పి పడిపోతారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అవగానే ఆకాశంలోంచి అక్షయ పాత్రలాంటిదేమైనా ఊడి కేసీఆర్ తలమీదగానీ పడుతుందా అనే సందేహాలు కూడా పుట్టుకొస్తాయి. తాజాగా కేసీఆర్ చేసిన అమలుకాని వాగ్దానాల లిస్టు పరిశీలిద్దాం.   1 – గత సర్కారు అక్రమాలపై విచారణ. 2 – అధికారంలోకి వచ్చిన నెలలోనే రైతు రుణాల రద్దు. 3 – గృహ నిర్మాణ రుణాలు కూడా రద్దు. 4 – ఎవరూ ప్రభుత్వం దగ్గర తీసుకున్న రుణాలు చెల్లించాల్సిన అవసరం లేదు. 5 – తెలంగాణ వస్తే లక్షా 25 వేల ఉద్యోగాలు వస్తాయి. 6 – మా ప్రభుత్వంలో రూపాయి అవినీతి కూడా జరగదు. 7 – అవినీతికి పాల్పడితే కన్నవారిని కూడా జైలుకు పంపిస్తా. 8 – సింగూర్ జలాలను రైతుల సేద్యానికి ఇప్పిస్తా. 9 – పేదలకు సంవత్సరానికి మూడు వేల కోట్లతో పిల్లర్లతో ఇళ్ళు నిర్మిస్తాం. 10 – పోలీసు కుటుంబాలకు ఇళ్ళస్థలాలిస్తాం. 11 – రాబోయే మూడేళ్ళలో 13 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తాం. 12 – 14 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తాం. 13 – ప్రతి జిల్లాలో నిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తాం. 14 – తెలంగాణ ఉద్యోగులను చీటికి మాటికి బదిలీ చేయం. 15 – తెలంగాణ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ స్థాయి జీతాలు ఇస్తాం. 16 – రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్లు ఇస్తాం. 17 - ఏటా 40లక్షల మందికి ఉచిత విద్య.

‘ఆమ్ ఆద్మీ’కి డూప్లికేట్!

      అన్ని విషయాల్లో డూప్లికేట్లు వున్నట్టే రాజకీయ పార్టీలలో కూడా డూప్లికేట్లు బయల్దేరాయి. నిన్న మొన్నటి వరకూ ఏమీ కాని అరవింద్ కేజ్రీవాల్ ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ పెట్టి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు. అది చూసి స్ఫూర్తి పొందాడేమోగానీ, ముంబైకి చెందిన మిర్జా దస్ హజారే (పేరు అన్నా హజారేలా వుంది) అనే పెద్దాయన ‘ఖాస్ ఆద్మీ పార్టీ’ అనే పార్టీని స్థాపించేశాడు. ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు గుర్తులోకి జనంలోకి వెళ్ళింది కాబట్టి ఈయన డస్ట్ బిన్ గుర్తుతో జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. సమాజంలో బడుగు బలహీన వర్గాలు డస్ట్ బిన్‌లోనే వుండిపోతున్నాయని, వాళ్ళందరినీ ఉద్ధరించాలనే, ఆమ్ ఆద్మీని ఖాస్ ఆద్మీగా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ ‘ఖాస్ ఆద్మీ పార్టీ’ పెట్టానని మిర్జా దస్ హజారే అంటున్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ మొదట ఢిల్లీ అసెంబ్లీకి మాత్రమే పోటీ చేశాడు. ఆ తరహాలోనే ఈ ఎన్నికలలో తమ పార్టీ మహారాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేయాలని అనుకుంటోంది. వచ్చే ఎన్నికలలో పార్లమెంట్‌కి కూడా పోటీ చేసే ఆలోచనలో ఖాస్ ఆద్మీ పార్టీ వుంది. తనంటే గిట్టని వాళ్ళు తాను ఆమ్ ఆద్మీ పార్టీని అనుకరిస్తున్నానని అంటున్నారని, అలాంటిదేమీ లేదని మిర్జా అంటున్నాడు. ఇంతకీ ఈ మిర్జా తక్కువ వాడేం కాదు.. దిలీప్ కుమార్, దేవానంద్ లాంటి బాలీవుడ్ నటులకు, రామ్ జఠ్మలానీ వంటి సుప్రసిద్ధ న్యాయవాదికి పర్సనల్ టైలర్.

పవన్ ‘ఇజం’ అర్ధం కాలేదు: వర్మ

      మీరు పుస్తకాల ప్రియులా? పుస్తకాల పురుగులా? మార్కెట్లోకి ఏ పుస్తకం రిలీజైనా కొనుక్కునో, అద్దెకి తెచ్చుకునే మంచి అలవాటు మీకు వుందా? అయితే మీకు హెచ్చరిక.. కొత్తగా మార్కెట్లోకి వచ్చింది కదా.. బాగాప్రచారం కూడా వచ్చింది కదా.. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఆలోచనలు అందులో వుంటాయి కదా అని ‘ఇజం’ పుస్తకాన్ని చదివే సాహసాన్ని చేయకండి. ఎందుకంటే ఈ పుస్తకాన్ని చదివిన అనేకమంది ఇప్పటికే ఎందుకు చదివాం దేవుడా అని తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది.   మిగతావాళ్ళ సంగతి అలా వుంటే, పవన్ కళ్యాణ్‌ని ఎంతగానో అభిమానించే రామ్ గోపాల్ వర్మకి కూడా ఈ పుస్తకంలో ఏం రాశారో అర్థం కాక జుట్టు పీక్కున్నాడు. ప్రపంచంలో చాలా కాంప్లికేట్‌గా వుండే సాహిత్యాన్ని కూడా అర్థం చేసుకునే శక్తి వుండటంతోపాటు ఎన్నో పుస్తకాలు చదివిన తనకి ఈ పుస్తకం ఎంతమాత్రం అర్థం కాలేదని ట్విట్టర్‌లో మొత్తుకుంటున్నాడంటే పుస్తకంలో మేటర్ ఎంత కంగాళీగా వుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పుస్తకాన్ని రాసిన రాజు రవితేజ్ పవన్ కళ్యాణ్‌ని తప్పుదోవ పట్టిస్తున్నాడన్న అభిప్రాయాన్ని వర్మ వ్యక్తం చేశాడంటే, వర్మ సదరు ‘ఇజం’ పుస్తకం చదివి ఎంత హర్టయ్యాడో అర్థం చేసుకోవచ్చు. ఈ పుస్తకాన్ని తాను చదవడానికి శాయశక్తులా ప్రయత్నించానని, తనకి ఎంతమాత్రం అర్థం కాలేదని, ఒక  పట్టాన కొరుకుడు పడలేదని వర్మ అన్నాడు. అసలు ఈ పుస్తకాన్ని రాసిన రాజు రవితేజ్‌కైనా ఈ పుస్తకం అర్థమై ఉంటుందని అనుకోనని వర్మ అన్నాడు. పుస్తకం రాసిన రచయితకే అర్థమై వుంటుందా అనే డౌట్ క్రియేట్ చేసిన పుస్తకం మనలాంటి సామాన్యులకు అర్థమవుతుందంటారా? పుస్తక ప్రపంచంలో టెర్రర్ పుట్టిస్తోన్న ఈ ‘ఇజం’ పుస్తకం తాలూకు టెర్రరిజానికి పుస్తక ప్రియులు ఎందుకు బలికావాలి? బుక్ లవర్స్.. బీ కేర్‌ఫుల్!  

ఉండవల్లీ.. కంట్రోల్.. కంట్రోల్!

      రాష్ట్ర విభజన జరగకముందు తెలుగు ప్రజలకు ఉండవల్లి మాటల మీద బాగా నమ్మకం వుండేది. బాగా చదువుకున్నవాడు కాబట్టి బాగా ఆలోచించి, పరిశోధించి మాట్లాడతాడన్న అభిప్రాయం వుండేది. అందుకే ఉండవల్లి రాష్ట్ర విభజన జరగదు.. జరగదు.. అని బల్లగుద్ది చెబుతుంటే నిజమేనని నమ్మేశారు. చివరికేమైంది. ఉండవల్లి అండ్ బ్యాచ్‌ని నమ్మిన తెలుగు ప్రజలు.. ముఖ్యంగా సీమాంధ్రుల నెత్తిన విభజన బండ పడింది. ఇంత జరిగినా, తన మాటని జనం నమ్మడం లేదని తెలిసినా ఉండవల్ల తన గారడీ మాటలు మాట్లాడ్డం మానలేదు.   ఈసారు ఇప్పటికీ రాష్ట్ర విభజన జరిగిందని నమ్మడట. రాజ్యాంగ సవరణ జరగకుండా రాష్ట్ర విభజన జరగడానికి అవకాశం లేదట. గతంలో అయితే ఉండవల్లి మాటలు జనం నమ్మేవారేమోగానీ, ఇప్పడు మాత్రం ఆ పరిస్థితి లేదు. ఉండవల్లి మాట్లాడ్డం మానేస్తే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనం తన మాటల మీద ఆసక్తి చూపించడం లేదన్న ఫస్ట్రేషన్‌లో ఉండవల్లి వున్నట్టున్నాడు. అందుకే మళ్ళీ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ తెలుగు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. లేటెస్ట్ గా ఆయన వాక్రుచ్చిన పాయింట్ ఏంటంటే, రాష్ట్ర విభజన జరిగినట్టు కాదంట.. ఇంకా రాజ్యాంగపరంగా రాష్ట్రాన్ని కలిపి వుంచడానికి బోలెడన్ని అవకాశాలు వున్నాయట. ఉండవల్లి ఇక్కడితో ఆగితే పాడిన పాటే పాడుతున్నాడులే అని సరిపెట్టుకోవచ్చు. అయితే ఉండవల్లి ఘాటైన వ్యాఖ్యలు చేసేశాడు. అధికారపక్షం, ప్రతిపక్షం ఒక్కటైతే పార్లమెంట్‌లో మర్డర్లు, మానభంగాలు జరిగినా బయటి జనానికి తెలియదంటూ కామెంట్ చేశాడు. పార్లమెంట్‌లో తెలుగు ప్రజలకి అన్యాయం, అవమానం జరిగితే జరిగి వుండొచ్చు. అయితే ఉండవల్లి లాంటి విజ్ఞుడు పార్లమెంట్‌ని ఉద్దేశించి మర్డర్లు, మానభంగాలు లాంటి భాష మాట్లాడ్డం మంచిది కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఉండవల్లికి అనువదించి మాట్లాడ్డం తప్ప సొంతగా మాట్లాడ్డం రాదా అని ప్రశ్నిస్తున్నారు. ఉండవల్లి తన నోటిమీద కంట్రోల్ తెచ్చుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు.

మీ బిల్డప్పులు మండ!

      సీమాంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, సీమాంధ్రకు సీఎం అయిపోవాలని కలలు కంటున్న ఆనం సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మీద ఇస్తున్న బిల్డప్పుడు చూస్తుంటే మెడకాయ మీద తలకాయ ఉన్న ఎవరికైనా చిరాకు పుట్టడం ఖాయమని రాజకీయ పరిశీకులు అంటున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ యాసిడ్ పోసి క్లీన్ చేసినట్టు క్లీన్ అయిపోయింది. ఇంకో నాలుగైదు ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ కోలుకునే ఛాన్స్ లేదని సీమాంధ్రలో ఎవర్నడిగినా చెబుతారు. పాపం ఆ విషయం రఘువీరారెడ్డికి, ఆనం రామనారాయణరెడ్డికి తెలియదంటారా? తెలిసిన విషయాన్ని తెలియనట్టు, తెలియని విషయాన్ని తెలిసినట్టు నటించడమే రాజకీయ నాయకుల ప్రాథమిక లక్షణం కాబట్టి వీళ్ళిద్దరూ అలాగే యాక్ట్ చేస్తున్నారు.   వాళ్ళ మాటలు విని జనం నవ్వుకుంటున్నారని తెలిసినా వాళ్ళిద్దరు చాలా వెరైటీగా మాట్లాడుతూ బిల్డప్పులు ఇచ్చుకుంటున్నారు. వీళ్ళిద్దరూ చెప్పిన దాని ప్రకారం సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్‌గా వుందట. పార్టీ నుంచి నాయకులందరూ వెళ్ళిపోయినా కార్యకర్తలు మాత్రం బోలెడంతమంది పార్టీలోనే వున్నారట. సీమాంధ్ర నుంచి పోటీ చేయడానికి వేలల్లో దరఖాస్తులు వస్తున్నాయట. అసెంబ్లీకి పోటీ చేస్తామని ఉవ్విళ్ళూరుతూ 1160 మంది దరఖాస్తు చేశారట. అలాగే పార్లమెంట్‌కి పోటీ చేస్తామంటూ 175 మంది దరఖాస్తు చేసుకున్నారట. వీళ్ళల్లో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలో తమకి అర్థం కాకపోవడంతో ఈ దరఖాస్తులన్నీ తీసుకుని ఢిల్లీ వెళ్ళి అక్కడ అభ్యర్థులను ఖరారు చేస్తారట. అన్ని దరఖాస్తులు వచ్చాయి, ఇన్ని దరఖాస్తులు వచ్చాయి అని అనడం తప్ప దరఖాస్తు చేసినవాళ్లెవరో చెప్పే ధైర్యం మాత్రం వీళ్ళిద్దరికీ లేకుండా పోయింది. సీమాంధ్రలో నిండా మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీని భుజాల మీదకి ఎత్తుకుని లేనిపోని బిల్డప్పులు ఇస్తున్న వీళ్ళిద్దరి మీద జాలి పడటం ప్రతి సీమాంధ్రుడి కర్తవ్యం.

కోపమేలయ్యా.. కోదండరామయ్యా!

      కొండా సురేఖమ్మ తన భర్త కొండా మురళితో కలసి ఏ దుర్ముహూర్తంలో తెరాసలో చేరారోగానీ ఆ క్షణం నుంచి ఆమె మీద విమర్శలు వెల్లువెత్తుతూనే వున్నాయి. నోరు, దాంట్లో నాలుక వున్న ప్రతి వాడూ మానుకోట సంఘటనను ప్రస్తావించి సురేఖమ్మని విమర్శించేవాడే! కొండా దంపతులను తెలంగాణ ద్రోహులుగా పేర్కొంటూ, వాళ్ళని టీఆర్ఎస్‌లో చేర్చుకోవడం తప్పు అనేవారు. మొన్నటి వరకూ కేసీఆర్‌ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన సురేఖని పార్టీలో చేర్చుకోవడం దారుణమనేవారే! ఈ విమర్శలన్నీ బయటి పార్టీల వాళ్ళు చేస్తే ఓ పద్ధతిగా వుండేది, తెరాసలో వుండేవాళ్ళే సురేఖని వ్యతిరేకిస్తూ వుండటం ఆమెకి బాధ కలిగిస్తోంది.   ఇదిలా వుంటే పొలిటికల్ జేఏసీ నాయకుడు కోదండరామ్ కూడా సురేఖకి వ్యతిరేకంగా కామెంట్లు చేయడం ఆమెకు ఎంతో బాధని కలిగించినట్టుంది. కోదండరామ్ తనమీద ఆగ్రహాన్ని ప్రకటించడం అన్యాయమని ఆమె ఆక్రోశిస్తున్నారు. కోదండరామ్ మీద మాటల దాడికి దిగారు. తానేదో తెలంగాణ ద్రోహి అన్నట్టు మాట్లా తున్న కోదండరామ్‌ తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికి ఏంచేశారో చెప్పాలని నిలదీశారు. గతంలో రాజకీయ జేఏసీ, దాని నాయకుడు కోదండరామ్ ఆదేశించినందువల్లే తాము తమ పదవులకు రాజీనామా చేశామని, అలాగే తెలంగాణ  విషయంలో యు టర్న్ తీసుకున్నందువల్లే వైసీపీ నుంచి వైదొలగామని,  అలాంటి త్యాగమూర్తులైన తనని, తన భర్తని ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు, జేఏసీ నాయకులు విమర్శించడం దారుణమని ఆమె వాపోతున్నారు. కొండా సురేఖ ఆవేదనని ఎవరైనా పట్టించుకుంటారో లేక ఆమె ఆవేదన అరణ్య రోదనగానే మిగిలిపోతుందో చూడాలి.

నెక్ట్స్ వికెట్ కె.కె.?

      తెలంగాణ క్రికెట్ గ్రౌండ్‌లో కాంగ్రెస్, టీఆర్ఎస్‌ల మధ్య జరుగుతున్న ‘జంప్ జిలానీ’ కప్‌లో తాజాగా అందరూ ముద్దుగా ‘వీ బ్రదర్స్’ అని పిలుచుకునే కాకా వెంకటస్వామి తనయులు వినోద్, వివేక్‌ల వికెట్లు డౌన్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నెక్ట్స్ వికెట్ మీద కాన్సంట్రేట్ చేసింది. టీఆర్ఎస్‌ని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని ఆడిన మాట తప్పిన కేసీఆర్‌ని తుక్కుతుక్కుగా ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ ఏనాడో వందేళ్ళు దాటిపోయిన సీనియర్ బుర్రని చాలా తెలివిగా ఉపయోగిస్తోంది.   తెరాస నాయకుల మీద ‘ఆకర్ష’ మంత్రాన్ని ఉపయోగించి కాంగ్రెస్ పార్టీలోకి లాక్కునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మొదట కాంగ్రెస్‌లో నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్ళిన నాయకుల మీద దృష్టి కేంద్రీకరించిన కాంగ్రెస్ చాలామందిని తనలోకి తిరిగి లాక్కుంది. ఇప్పుడు వీబ్రదర్స్ సొంతగూటికి చేరుకున్నారు. వెంటవెంటనే రెండు వికెట్లు సాధించిన ఆనందంలో వున్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం హ్యాట్రిక్ సాధించే ప్రయత్నంలో వుంది. మూడో వికెట్‌గా కేకేని పడేయాలన్న ఆలోచనలో వుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం లేదన్న ఆవేదనతోనే కే. కేశవరావు కాంగ్రెస్ పార్టీ నుంచి తెరాసలో చేరారు. ఎప్పటి నుంచో తెరాస పంచన పడి వుంటే కేసీఆర్ ఆయన మొహాన ఒక రాజ్యసభ సీటు పారేశారు. ఎప్పుడైనా పార్టీ మీటింగ్స్ జరిగితే కేసీఆర్ కేకేని తన పక్కనే ఒక చిన్న కుర్చీ వేసి కూర్చోబెడతారు. అంతకు మించి కేకేకి ఒరిగిందేమీ లేదు. ఒకప్పుడు జాతీయ స్థాయిలో ఉన్నత పదవులు నిర్వహించిన కేకే ఇప్పుడు ఉప ప్రాంతీయ పార్టీ అయిన తెరాసలో చిన్న చిన్న పంచాయితీలు చేసుకుంటూ గడపాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతోపాటు కాంగ్రెస్‌లో విలీనం విషయంలో కేసీఆర్ మాట తప్పడం కూడా కేకేకి ఎంతమాత్రం నచ్చలేదని సమాచారం. అలాంటి కేకేని మళ్ళీ తనలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కేకేకి గవర్నర్ లాంటి కీలక పదవి లేదా ఏదైనా రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ గా నియమించే ఆశ కల్పిస్తూ రాయబారాలు నడుపుతున్నట్టు తెలుస్తోంది. తెరాసలో అసంతృప్తిగా వున్న కేకే కాంగ్రెస్ గూటిలోకి త్వరలో చేరబోతున్నట్టుగా సంకేతాలు అందుతున్నాయి. ఇదే జరిగితే కాంగ్రెస్ ట్రిక్ ఫలించి ‘జంప్ జిలానీ’ కప్‌లో కాంగ్రెస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం.

రెండు మానిఫెస్టోల సిద్ధాంతం

  ఎన్నికల వేళ టీడీపీ తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. రెండు ప్రాంతాల అవసరాలు, ప్రజాభిప్రాయాలు, అవకాశాలకు తగ్గట్టు రెండు మేనిఫెస్టో లు విడుదల చేసింది. అవశేష ఆంధ్రప్రదేశ్ గర్వించే రాజధాని నిర్మాణం మేనిఫెస్టో లో అగ్రభాగాన ఉంది. వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీ, పించన్ పెంపు, నాణ్యమైన విద్యుత్ సరఫరా, పేదపిల్లలకు కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య, మహిళల భద్రతకు ప్రత్యేక వ్యవస్థ, బెల్ట్ షాపుల రద్దు, ఎన్టీఅర్ హెల్త్ కార్డులతో ఉచిత వైద్యంతోపాటు సీమాంధ్ర ఓటర్లను ఆకట్టుకునేలా మేనిఫెస్టో లో వరాలు పొందుపరిచారు బాబు.   తెలంగాణకు వచ్చేసరికి దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్నిచర్యలూ తీసుకుంటామని మేనిఫెస్టో లో హామీలు గుప్పించారు. విద్యుత్ కోతలు అధిగమించడం, సాగునీటి సమస్యల పరిష్కారం, అమరుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం, పరిహారం, ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత, పరిశ్రమలకు ప్రోత్సాహంతోపాటు మరిన్ని వరాలు తెలంగాణా ఎన్నికల ప్రణాళికలో ఉన్నాయి.   రాష్ట్ర విభజనకు ముందు రెండు ప్రాంతాలు తనకు సమానమే అని ప్రకటించిన బాబు ఎన్నికల మేనిఫెస్టో రూపొందించడంలోనూ ఇరు ప్రాంతాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చి మరో సారి తన సమ న్యాయ సిద్ధాంతాన్ని ప్రజల ముందుంచారు.

సార్వత్రిక ఎన్నికలపై మునిసిపల్ ప్రభావం?

  రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వలన సార్వత్రిక ఎన్నికలకు ముందు వరుసపెట్టి మున్సిపల్ ఎన్నికలు, యంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చిపడ్డాయి. ఇవి ఎన్నికల అధికారులపై, ప్రభుత్వ, పోలీసు వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడి ఏర్పరచడమే కాక, ప్రజలకు, రాజకీయపార్టీలకు కూడా ఇబ్బందికరంగా మారాయి. కానీ కోర్టు కొరడా జళిపించడంతో తప్పనిసరిగా వరుసపెట్టి ఎన్నికలు నిర్వహించవలసి పరిస్థితి ఏర్పడింది. మొన్న మునిసిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహన పూర్తయింది. తరువాత మరొక పదిరోజుల్లో యంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించవలసి ఉంది. మరో పదిహేను రోజుల తరువాత మొదట తెలంగాణాలో (ఏప్రిల్ 30న), మళ్ళీ వారం రోజుల తరువాత (మే7న) ఆంధ్రాలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి.   ఎన్నికల కమీషన్ వరుసపెట్టి ఇన్ని ఎన్నికలను నిర్వహించడం కష్ట సాధ్యమే అయినా, నిర్వహించేందుకు సంసిద్దంగా ఉంది. కానీ, మొన్న జరిగిన మునిసిపల్ ఎన్నికల ఫలితాలు, త్వరలో జరుగబోయే యంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు వెలువరచినట్లయితే ఆ ప్రభావం తరువాత జరుగబోయే సార్వత్రిక ఎన్నికలపై కూడా పడుతుందని, అందువల్ల ఫలితాలు వెలువరచకుండా నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై హైకోర్టు ఈరోజు విచారణ చేప్పట్టడంతో వాదనలు కొనసాగుతున్నాయి.   ఒకవేళ పిటిషన్లను హైకోర్టు గనుక కొట్టివేస్తే, మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడవచ్చు గనుక అవి ఓటర్ల నాడిని కొంతవరకు పట్టి ఈయవచ్చును. దానిని బట్టి రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీకి విజయావకాశాలున్నాయో చూచాయగా తెలియవచ్చును. దానివలన సదరు పార్టీ సమరోత్సాహంతో ఎన్నికలలో దూసుకుపోతే, మిగిలిన పార్టీలు మేకపోతు గాంభీర్యం నటిస్తూ ప్రజలకు సంజాయిషీలు చెప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. బహుశః మధ్యాహ్నం తరువాత కోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉంది.

రాయపాటి ఇన్.. మోదుగుల ఔట్

  నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం. గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు సోమవారం నాడు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. అదే ముహుర్తానికి మోదుగుల టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నరసరావుపేట ఎంపీగా ఉన్న మోదుగుల తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. ఆ స్థానం నుంచి పార్టీలోకి కొత్తగా వస్తున్న ఎంపీ రాయపాటి సాంబశివరావును బరిలోకి దించాలని అధిష్టానం నిర్ణయించింది. మోదుగులకు గుంటూరు పశ్చిమ, లేదా బాపట్ల అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయాలని పార్టీ భావిస్తోంది.   నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి బావ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి బరిలో ఉండటంతో మోదుగులకు ఆ టిక్కెట్టు ఇచ్చేది లేదని చంద్రబాబు తేల్చారు. ఆ స్థానం నుంచి రాయపాటికి అవకాశం కల్పించారు. పోటీలో ఉన్నది బావే అయినా తాను వెనకాడేది లేదని, పార్టీ తరఫున గట్టిగా పోరాడతానని మోదుగుల చెప్పినా ఫలితం లేకపోయింది. దాంతో ఇక పార్టీని వీడాల్సిందేనని ఆయన నిర్ణయించుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా అదే స్థానం నుంచి లోక్ సభకు పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

తెరాస చెవిలో వీ బ్రదర్స్ గులాబీ పువ్వు

  పెద్దపల్లి ఎంపీ వివేక్, ఆయన సోదరుడు వినోద్ మళ్ళీ తమ సొంత గూటికి చేరారు. కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ ను వీడి తెరాసలో చేరిన ఈ "వీ" సోదరులు ..తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చినప్పుడు వేరే పార్టీలో ఉండడం ఎందుకు దండగ అని సెలవిస్తున్నారు. అయితే మొదట్నించీ వివేక్, వినోద్ లను తెరాస నేతలు దూరంగానే ఉంచారని సమాచారం. ఎప్పటికైనా కాంగ్రెస్ గూటికి చేరే పక్షులే అని వీ బ్రదర్స్ ను అనుమానించిన గులాబీ బాస్ పార్టీలో వీరికి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని తెలంగాణా భవన్ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు తెలంగాణా వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీయార్ .. ఇప్పుడు మాట మార్చి తెలంగాణా పునర్ నిర్మాణం తనతోనే సాద్యమంటున్నారు. ఇక తెరాసలో ఉంటే తమకు ఎటువంటి ముఖ్య పదవులు దక్కవని భావించిన వీ బ్రదర్స్ సొంత గూటికి చేరుకున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   వివేక్ కు అత్యంత సన్నిహితంగా ఉండే మరో ఎంపీ మందా జగన్నాధం కూడా కారు దిగి కాంగ్రెస్ అభయ హస్తం అందుకోనున్నాడని తెలుస్తోంది. ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు కూడా. ఎంపీ వివేక్ కాంగ్రెస్ లో చేరడంపై ఈటెల స్పందిస్తూ..వివేక్‌ కాంగ్రెస్‌లోకి వెళ్లినా టీఆర్ఎస్ పై ప్రభావం ఉండన్నారు.

పొత్తు పెట్టుకుందాం.. ప్లీజ్

  ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది టీడీపీ - బీజేపీ పొత్తుల వ్యవహారం. టీడీపీతో తమకు పొత్తు ఉండబోదని బీజేపీ తెలంగాణా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కుండబద్దలు కొట్టేసినా, ఇంకా ఆ వ్యవహారం ముగిసిపోలేదని, కొనసాగుతోందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. పొత్తుల విషయమై పైకి ఏమీ మాట్లాడకుండా గుంభనంగా వ్యవహరిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ జాతీయనేతలతో తన మంతనాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇక్కడి నాయకులు తమ బలమేంటో తెలుసుకోకుండా ఎక్కువ సీట్లు అడుగుతున్నారని, అయినా తాము కూడా పట్టు విడుపులకు సిద్ధమేనంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీలకు బాబు ఫోన్ చేశారు. ఒంటరి పోరాటంపై తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని కోరుతూ పొత్తుపై చర్చలు జరిపినట్లు సమాచారం.   సోమవారం ఢిల్లీలో పార్టీ ఎన్నికల కమిటీ సమావేశంలో పొత్తుపై చర్చించి స్పష్టమైన ప్రకటన చేస్తామని రాజ్‌ నాథ్ బదులిచ్చినట్లు తెలిసింది. తర్వాత బీజేపీ అగ్రనేతలు ఇద్దరూ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత వెంకయ్యనాయుడుకు ఫోన్ చేసి.. టీడీపీతో పొత్తుపై పట్టు విడుపులు ఉండేలా చూడాలని సూచించినట్లు తెలిసింది. పొత్తులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ, సీమాంధ్ర బీజేపీ శాఖలు రెండూ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి. పొత్తులో భాగంగా తెలంగాణలో 40 అసెంబ్లీ సీట్లు, హైదరాబాద్‌తో పాటు 8 పార్లమెంటు సీట్లు బీజేపీకి ఇవ్వటానికి అభ్యంతరం లేదని చివరిమాటగా చెప్పానని చంద్రబాబు వెల్లడించారని అంటున్నారు. ఇంతకు మించి వారికి సీట్లు ఇవ్వడం కుదరదని, ఆయా సీట్లలో టీడీపీ నేతలు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని బాబు సూచించినట్లు సమాచారం. సీమాంధ్రలో 10 అసెంబ్లీ, మూడు లోక్‌సభ సీట్లతోనే సరిపుచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది.

తెరాస బీజేపీవైపు చూస్తోందా?

  తెదేపా-బీజేపీ, కాంగ్రెస్-తెరాసల మధ్య ఎన్నికల పొత్తుల విషయం ఇంకా నలుగుతూనే ఉంది. అయితే తెదేపా-బీజేపీలు సానుకూల వాతావరణంలో పొత్తులు కుదుర్చుకొనే దిశలో ముదుకు కదులుతుంటే, కాంగ్రెస్-తెరాసలు మాత్రం ఇంకా తమ టామ్ & జెర్రీ షో కొనసాగిస్తూ ప్రజలకు వినోదం కలిగిస్తూనే ఉన్నాయి. తెదేపా-బీజేపీ పొత్తుల సంగతి తేలిపోతే దానిని బట్టి ఏదోఒక నిర్ణయం తీసుకోవచ్చని తెరాస భావించడమే అందుకు ప్రధాన కారణమయి ఉండవచ్చును. ఒకవేళ ఆ రెండు పార్టీల మధ్య పొత్తులు కుదరకపోయినట్లయితే, అప్పుడు తామే బీజేపీతో పొత్తులు పెట్టుకోవచ్చునని తెరాస ఎదురుచూస్తోందేమో. లేదా ఒకవేళ ఆ రెండు పార్టీలు పొత్తులు కుదుర్చుకోలేకపోయినట్లయితే ఆ కారణంగా తెలంగాణాలో బలహీనంగా మారే ఆ రెండు పార్టీలను తేలికగా ఎదుర్కోవచ్చనే భ్రమలో ఉండి ఉండవచ్చును.   అదే తెరాస ఆలోచనయితే అది వాపును చూసి బలుపు అని భ్రమస్తున్నట్లే అవుతుంది. ఎందువలన అంటే తెరాసకు కేవలం నాలుగయిదు జిల్లాలపైనే మంచి పట్టు ఉంది. మిగిలిన జిల్లాలలో కొన్ని చోట్ల తెదేపా, కాంగ్రెస్ పార్టీలు మరికొన్ని చోట్ల బీజేపీ, లెఫ్ట్ పార్టీలు, ఇంకొన్ని చోట్ల వైకాపా బలంగా ఉన్నాయి. తెరాస ఇంతవరకు తెలంగాణా సెంటిమెంటుపైనే ఆధారపడి నడుస్తోంది తప్ప గ్రామస్థాయి వరకు పార్టీ నిర్మించుకోలేదు. అందుకే గత ఏడాది జరిగిన సహకార, పంచాయితీ ఎన్నికలలో తెరాస చతికిలబడితే, గ్రామస్థాయి వరకు పార్టీని నిర్మిచుకొన్న కాంగ్రెస్,తెదేపాలు విజయకేతనం ఎగురవేసాయి.   అంతేగాక తెరాసలో యంపీ స్థానాలకు పోటీ చేయగల సత్తా, ఆర్ధిక, అంగ బలం గల నేతలు ఎక్కువమంది లేరు. అందువల్ల తెరాస దురాశాకుపోయి కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకోకపోతే రెండు పార్టీలు నష్టపోక తప్పదు. ఒకవేళ కాంగ్రెస్ తో పొత్తులు ఇష్టం లేకపోతే కనీసం బీజేపీతో అయినా పొత్తులు పెట్టుకోవడం ఆ పార్టీకి అన్ని విధాల శ్రేయస్కరం. లేకుంటే, కాంగ్రెస్, తెదేపా, బీజేపీ, ఓయూ విద్యార్ధులు, స్వతంత్ర అభ్యర్ధులతో జరిగే ఈ పోటీలో సర్వేలు చెపుతున్నట్లుగా తెరాస తిరుగులేని మెజార్టీ సాధించడం అసంభవం అవుతుంది.   ఈసారి ఎన్నికలలో తెరాస పూర్తి విజయం సాధించలేక చతికిల పడినట్లయితే,దాని ప్రాభవం కోల్పోయి విధిలేని పరిస్థితుల్లో సిగ్గువిడిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో విలీనానికి సిద్దపడవలసి వస్తుంది. అందువల్ల తెరాస తనను తాను మరీ ఎక్కువగా ఊహించుకొని కాంగ్రెస్ ను దూరం చేసుకొంటే దానికే నష్టం.

అన్నాదమ్ముల సవాల్

  తమిళనాడులో కరుణానిధి తనయులు అళగిరి, స్టాలిన్ మధ్య విభేదాలు వచ్చి ఇద్దరూ కొట్టుకున్నంత పని చేస్తే, కర్ణాటకలో మరో మాజీ ముఖ్యమంత్రి కుమారులు ఇదే బాట పట్టారు. అయితే తమ తండ్రి, కర్ణాటక మాజీ సీఎం బంగారప్ప చనిపోయిన తర్వాతే ఆయన కొడుకులు మధు బంగారప్ప, కుమార బంగారప్ప కొట్టుకుంటున్నారు. బంగారప్ప కుమారుల మధ్య పోరు తారస్థాయికి చేరుకుంది. ఇప్పటి వరకు ఆరోపణలకే పరిమితమైన మాటల యుద్ధం చివరకు రోడ్డున పడింది. మధు బంగారప్పకు వ్యతిరేకంగా కుమార బంగారప్ప ధర్నాకు దిగడంతో వీరి కలహాలు మరో మలుపు తిరిగాయి. ఈడిగ సమాజం ఆస్తులను మధు బంగారప్ప దుర్వినియోగం చేస్తున్నాడంటూ శివమొగ్గ ప్రాంతంలో ఉన్న గాడికొప్పలోని శరావతి డెంటల్ కళాశాల ఎదుట కుమార బంగారప్ప ధర్నా చేశారు. శరావతి డెంటల్ కాలేజీ ఉన్న స్థలం ఈడిగ సమాజానికి చెందినదని, సమాజ శ్రేయస్సు కోసం ఈ ఆస్తిని అప్పట్లో కేటాయించారని గుర్తు చేశారు. సుమారు 150 ఎకరాల విస్తీర్ణమున్న ఈ స్థలాన్ని 15 ఎకరాలు మాత్రమే ఉందంటూ మధు బంగారప్ప పేర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి సమాజం ఆస్తిని ప్లాట్లుగా విభజించి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బంగారప్ప కొడుకులిద్దరి మధ్య ఎప్పటినుంచో విభేదాలున్నాయి. పదవుల కోసం, అధికారం కోసం వీళ్లిద్దరి మధ్య ఆధిపత్య పోరాటం నడుస్తూనే ఉంది. అయినా, బంగారప్ప ఉన్నన్నాళ్లు అది నివురుగప్పిన నిప్పులా ఉండిపోయిందే తప్ప బయటకు రాలేదు. ఇప్పుడు కాస్తా అది భగ్గుమంటూ కార్చిచ్చులా వ్యాపిస్తోంది.