కాంగ్రెస్‌లో ‘1’ నేనొక్కడినే!
posted on Apr 5, 2014 @ 4:42PM
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తట్టాబుట్టా సర్దుకోవడం ఖాయమని ఇప్పటి వరకూ జరిగిన అన్ని సర్వేలూ చెప్పాయి. లేటెస్ట్ గా ఎన్డీటీవీ నిర్వహించిన సర్వేలో కూడా కాంగ్రెస్ అడ్రస్ గల్లంతేనని సదరు సర్వే చెప్పింది. దేశం సంగతి అలా వుంచితే, సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఖతమ్ అయిపోవడం ఖాయమని, సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క పార్లమెంట్ స్థానం మాత్రమే దక్కే అవకాశం వుందని సర్వే తేల్చి చెప్పింది.
ఇదిలా వుంటే కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో పదకొండు లోక్‌సభ అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాని ప్రకటించింది. వీళ్ళలో శ్రీకాకుళం- కిల్లి కృపారాణి, విజయనగరం- బొత్స ఝాన్సీ, కర్నూలు- కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, అరకు- కిషోర్ చంద్రదేవ్, కాకినాడ- పళ్ళం రాజు, అనకాపల్లి- తోట విజయలక్ష్మి, నరసాపురం- కనుమూరి బాపిరాజు, నెల్లూరు- వాకాటి నారాయణరెడ్డి, విజయవాడ- దేవినేని అవినాష్, బాపట్ల- పనబాక లక్ష్మి, తిరుపతి- చింతా మోహన్ వున్నారు.
ఎన్డీటీవీ సీమాంధ్రలో కాంగ్రెస్ ఒక్క సీటే గెలుస్తుందని ఎన్డీటీవీ చెప్పింది కాబట్టి.. ఆ గెలిచే ఒక్కడు నేనొక్కడినే అని ఈ పదకొండు మంది అభ్యర్థులు అనుకుంటూ వుండొచ్చు. మిగతా 14 మంది పేర్లను ప్రకటిస్తే వాళ్ళు కూడా గెలిచేది నేనొక్కడినే అనుకుంటారేమో! సీమాంధ్ర ప్రజలు మాత్రం ఈసారి సీమాంధ్రలో ఒక్క కాంగ్రెస్ ఎంపీ కూడా గెలిచే ఛాన్సే లేదని అంటున్నారు.