బాజిరెడ్డిది కాంగ్రెస్..కాదు..కాదు.. తెరాస గోత్రమేనట!
posted on Apr 4, 2014 7:34AM
నిత్యం నీతి సూత్రాలు, ధర్మ పన్నాలు వల్లెవేసే మన రాజకీయనాయకులకు సిద్దాంతాలు ఉండవని, పార్టీ ఏదయినా టికెట్స్ పొందడం, మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడమే ముఖ్యమని చకచకా కండువాలు మారుస్తూ నిరూపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు వైకాపాలో ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఆ పార్టీ సమైక్యరాగం అందుకొని సీమాంద్రాలోకి దూకేయడంతో ఆయన కూడా అనేకమంది వైకాపా నేతలలాగే ఆయన కూడా తెలంగాణా క్రాస్ రోడ్ల వద్ద ఆగిపోయి దిక్కులు చూడవలసిన పరిస్థితి ఏర్పడింది.
మంచిపేరు, అర్ధబలం ఉన్న ఆయనను తమ వైపు లాక్కోవాలని కాంగ్రెస్, తెరాసలు చాలా గట్టిగానే ప్రయత్నించాయి. ఇంతకాలం ఆయన తెలంగాణను తీవ్రంగా వ్యతిరేఖించిన జగన్ తో కలిసి వైకాపాలో పనిచేసినా, ఇప్పుడు ఆయనను తమ పార్టీలో చేర్చుకోవడానికి ఆ రెండు పార్టీలకు ఎటువంటి అభ్యంతరమూ లేకపోగా ఆయన కోసం పోటీ పడ్డాయి కూడా. అంటే యదా నేత తదా పార్టీలన్నమాట.
బాజిరెడ్డి ముందుగా తెరాస వైపు మ్రోగ్గు చూపడంతో ఆయనకి నిజామాబాద్ రూరల్ లేదా ఆర్మూర్ అసెంబ్లీ సీట్లలో ఏదో ఒకటి ఖరారు చేసేందుకు తెరాస సిద్దమయిపోయింది. ఒకవేళ ఆయన కాంగ్రెస్ అభ్యర్ధి డీ.శ్రీనివాస్ పై పోటీలో ఓడిపోతే ఆయనను రాజ్యసభకు పంపిస్తామని తెరాస కౌంటర్ గ్యారంటీ కూడా ఇచ్చింది. కానీ, ఆ తరువాత వరుసపెట్టి తెదేపా నేతలు తెరాసలోకి వచ్చిపడుతుండటంతో కేసీఆర్ బాజిరెడ్డిని, ఆయనకి ఇచ్చిన హామీని కూడా మరిచిపోయారు. దానితో ‘అనుచరుల ఒత్తిడి’ మేరకే కాంగ్రెస్ హ్యాండ్ అందుకొనేందుకు పొన్నాలతో టచ్చులోకి వచ్చేరు బాజిరెడ్డి. ఆయన రాక చూసి పొన్నాల కూడా చాలా సంతోషిస్తూ నువ్వొస్తానంటే..నేనొద్దంటానా...అని పాటందుకొని బాజిరెడ్డికి బాన్సువాడ సీటులో కర్చీఫ్ వేసేసుకోవచ్చని హామీ ఇచ్చారు. మరింకెందుకు ఆలస్యం అనుకొన్న ఆయన దిగ్విజయ్ చేత కాంగ్రెస్ కండువా కప్పించుకొని వచ్చేందుకు డిల్లీ విమానం ఎక్కేసారు.
కాంగ్రెస్, తెదేపాలను తిట్టిపోయడంలో తీరికలేకుండా ఉన్న కేసీఆర్, తను ఏమరపాటుగా ఉన్న సమయం చూసి కాంగ్రెస్ ఈవిధంగా తన కాలి క్రింద చాపనే లాగేయడం చూసి షాక్ అయ్యారు. బాజిరెడ్డి గనుక బాన్సువాడ నుండి పోటీ చేసినట్లయితే అక్కడ నుండి పోటీకి దిగుతున్న తమ సిటింగ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి తట్టుకోలేరని కంగారుపడిన కేసీఆర్, బాజిరెడ్డి ఎక్కిన విమానం ఇంకా డిల్లీలో ల్యాండ్ అవకముందే ఆయనను గాలిలోనే వలేసి పట్టుకొని, ఆయన చేతిలో నిజామాబాద్ రూరల్ టికెట్ పెట్టేసారు. దానితో ఆయన అదే విమానంలో మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చేసి విమానాశ్రయం దగ్గర సిద్దంగా ఉన్న గులాబీ కారులో ఎక్కేసారు.
ప్రజాసేవ చేసుకోవాలంటే ఈ మాత్రం టెన్షన్లు, హడావుడి మామూలే. అందుకే పార్టీలుమారి చూడు... ప్రజాసేవ చేసి చూడు అంటారు రాజకీయ విశ్లేషకులు.