కాంగ్రెస్ కి నిజంగానే టైమ్ దగ్గరపడిందా
posted on Apr 7, 2014 @ 3:11PM
ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధులు నామినేషన్లు వేయడానికి ఇంకా కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలుంది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధుల పేర్లను ప్రకటించలేని దుస్థితిలో ఉంది. తెలంగాణాలో పార్టీకి విజయావకాశాలు కొంచెం మెరుగుగా ఉన్నందున టీ-కాంగ్రెస్ నేతలందరూ తమ బంధు మిత్ర పరివారాలకు టికెట్స్ ఇప్పించుకొనే ప్రయత్నంలో అధిష్టానంపై తెస్తున్న తీవ్ర ఒత్తిళ్ళ కారణంగా ఇప్పటికి ఇప్పటికి రెండు సార్లు అభ్యర్ధుల పేర్లను ప్రకటించబోయి ఆగిపోయింది.
ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్న ఈ తరుణంలో ప్రత్యర్ధ పార్టీలు అభ్యర్ధుల జాబితాలను విడుదల చేసిన తరువాతనే తాము విడుదల చేస్తామని రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. సరిగ్గా ఎన్నికల దగ్గరపడుతున్నతరుణంలో టికెట్స్ ఎరగా చూపించి ప్రత్యర్ధ పార్టీ నేతలను కాంగ్రెస్ పార్టీలోకి ఆకర్షించి, ప్రత్యర్ధ పార్టీలను బలహీనపరిచేందుకే ఈ ఎత్తుగడ వేసి ఉండవచ్చును. ఇప్పటికే, తెదేపా, తెరాస, వైకాపా, బీజేపీలలో టికెట్స్ దొరకక అసంతృప్తితో రగిలిపోతున్న నేతలు చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి దూకేస్తున్నారు. ఇంకా చాల మంది దూకవచ్చు కూడా.
కాంగ్రెస్ పార్టీకి ఎన్నిసార్లు ఎదురుదెబ్బలు తగిలినా, మొట్టికాయలు పడినా తన ఆలోచనా ధోరణిని, పద్దతులను ఎన్నడూ మార్చుకోబోదని చెప్పడానికి ఇదే ఒక మంచి ఉదాహరణ. అందువల్ల ఈసారి కూడా ప్రతీసారిలాగే ప్రత్యర్ధుల కోసం త్రవ్వుతున్న గోతిలో మళ్ళీ తానే పడేందుకు రంగం సిద్దం చేసుకొంటోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సీమాంద్రాలో అభ్యర్ధులను వెతుకోవలసిన అవసరం ఉందేమో గానీ తెలంగాణాలో లేదు. అక్కడ అవసరమయిన వారికంటే చాలా ఎక్కువ మందే ఉన్నారు. పైగా టీ-కాంగ్రెస్ నేతలు స్వయంగా తమ పిల్లజెల్లాకి కూడా టికెట్స్ ఇమ్మని కోరుతున్నారు. అటువంటప్పుడు ఉన్నవారికే టికెట్స్ ఇవ్వలేనప్పుడు కొత్తగా వచ్చిన వారికి ఏవిధంగా టికెట్స్ కేటాయించగలదు?అని ప్రశ్నిస్తే దానికి సమాధానం దొరకదు. ఇతర పార్టీలలో నుండి టికెట్స్ దొరకనందునే కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నవారు, ఒకవేళ అక్కడ కూడా టికెట్ దొరకని పరిస్థితి ఏర్పడితే అప్పుడు వారు కాంగ్రెస్ లో కొనసాగరు కదా! ఒకవేళ కొనసాగినా అసంతృప్తితో ఉన్న వారివల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం ఏమిటి? అని ఆలోచిస్తే వారు ప్రత్యర్ధ పార్టీకి మద్దతు ఇవ్వకుండా అడ్డుకోనేందుకేనని భావించవలసి ఉంటుంది.
ఉదాహరణకి తెదేపా-బీజేపీ పొత్తుల కారణంగా మల్కాజ్ గిరీ టికెట్ పోగొట్టుకొన్నమెదక్ యం.యల్యే. మైనంపల్లి హన్మంత రావు తెదేపాకు గుడ్ బై చెప్పేసి ఈరోజే కాంగ్రెస్ లో చేరారు. ఆయనకి మల్కాజ్ గిరీ టికెట్ ఇచ్చేందుకు దిగ్విజయ్ సింగ్ హామీ ఇచ్చారు. బాగానే ఉంది. కానీ ఇటీవల కాంగ్రెస్ నుండి తెరాసకు వెళ్లి మళ్ళీవెనక్కి వచ్చిన ఆకుల రాజేందర్ కి కూడా మల్కాజ్ గిరి టికెట్ ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏవిధంగా నిలబెట్టుకోగలదు? అంటే లేదనే అర్ధమవుతుంది.
అప్పుడు మళ్ళీ వారిరువురితో కలిసి పార్టీలో అక్కడి నుండి టికెట్ ఆశిస్తున్న మిగిలిన అభ్యర్ధుల మధ్య యుద్దం మొదలయితే అంతిమంగా నష్టబోయేది కాంగ్రెస్ పార్టీయే. ఎదుటవాడివి రెండు కళ్ళు పోగొట్టాలని కాంగ్రెస్ పార్టీ, ఉన్న తన ఒక (తెలంగాణా) కన్ను పోగొట్టుకోవడానికి ప్రయత్నించడం చాలా నవ్వు తెప్పిస్తుంది. వినాశకాలే విపరీత బుద్ధి అంటే బహుశః ఇదేనేమో!