మోడీ ప్రచారంతో మారనున్న బలాబలాలు
రాహుల్ గాంధీ నిన్న తన ప్రసంగంలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని, తెలంగాణా ప్రజలను కూడా ఏవిధంగా మోసం చేసారో చాలా సమర్ధంగా చెప్పుకోగలిగారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం చెప్పట్టగల సత్తా ఉన్న జాతీయపార్టీ అయిన తమకి ఓటు వేయడం ద్వారానే తెలంగాణా అభివృద్ధి సాధ్యం అవుతుంది, తప్ప ప్రాంతీయ పార్టీ అయిన తెరాస వలన సాధ్యంకాదని గట్టిగా నొక్కి చెప్పారు. అదేవిధంగా తమ పార్టీ గెలిస్తే తెలంగాణకు ఏమేమి చేయబోతున్నామో కూడా చాలా చక్కగా, గొప్పగా వివరించి ప్రజలను ఆకట్టుకోగలిగారు. మళ్ళీ చాలా కాలం తరువాత రాహుల్ గాంధీ, ప్రజలను ఆకట్టుకొనేలా ప్రసంగించడంతో కాంగ్రెస్ శ్రేణులు కూడా సమరోత్సాహంతో ఉన్నాయి.
సరిగ్గా ఇటువంటి సమయంలోనే, నరేంద్ర మోడీ కూడా ఈరోజు తెలంగాణాలో వరుసగా నాలుగు సభలలో ప్రసంగించనున్నారు. ఆయన కూడా కేసీఆర్ లాగే మాటల మాంత్రికుడనే సంగతి అందరికీ తెలిసిందే. అందువల్ల ఆయన కూడా తమ ప్రధాన ప్రత్యర్దులయిన కాంగ్రెస్, తెరాసల పైనే, ముఖ్యంగా తమ విజయానికి అడ్డుగోడగా నిలుస్తున్న కేసీఆర్ మీదనే తన అస్త్ర శస్త్రాలన్నీ ప్రయోగించవచ్చును.
కొత్తగా ఏర్పడుతున్న తెలంగాణా రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి జరగాలంటే, తమ కూటమికే ఓటేసి అధికారం కట్టబెడితేనే సాధ్యమవుతుందని, ఎటువంటి పాలనానుభావం లేని ప్రాంతీయ పార్టీ అయిన తెరాస వల్ల కాదని గట్టిగా నొక్కి చెప్పవచ్చును. నరేంద్ర మోడీ కూడా సరిగ్గా ఇదే పాయింటు మీద గట్టిగా మాట్లాడినట్లయితే, అది తప్పకుండా ప్రజలపై చాలా ప్రభావం చూపవచ్చును. అయితే దేశ వ్యాప్తంగా ప్రస్తుతం మోడీకి అనుకూల పరిస్థితులు కనబడుతున్నందున, ఆ ప్రభావం బీజేపీ-తెదేపా కూటమికి కూడా చాలా లబ్ది చేకూర్చవచ్చునని సర్వే సంస్థల నివేదికలు చాటి చెపుతున్నందున, (తెలంగాణాలో) ఎన్నికలకు ఇంకా కేవలం వారం రోజుల సమయం మాత్రమే మిగిలిఉన్న ఈ తరుణంలో నేడు నరేంద్ర మోడీ స్వయంగా చేయబోయే ప్రచారం వలన తెదేపా-బీజేపీ కూటమికి సానుకూల వాతావరణం సృష్టించవచ్చును.
అయితే, ఇదే కారణంగా అంటే ఈవిధంగా నాలుగు బలమయిన రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రచారం వలన, ప్రజల ఓట్లు చీలి ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే జరిగితే తెలంగాణ ముఖ్యమంత్రిగా రాజ్యం ఏలాలని కేసీఆర్ కంటున్న కలలు కలలుగానే మిగిలిపోవచ్చును. కానీ, అధికార దాహంతో తహతహలాడిపోతున్న కేసీఆర్, ఇంతకాలం తాను ఏ కాంగ్రెస్ పార్టీని ‘చ్చీ’ కొట్టారో మళ్ళీ అదే పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకి సిద్దపడినా ఆశ్చర్యం లేదు.