జనసేన పార్టీకి దారేది?
మనుషులు తాము అభిమానించేవారిలో ఎన్ని లోపాలు ఉన్నా వాటిని పట్టించుకోరు. అదే నచ్చని వ్యక్తి తుమ్మినా, దగ్గినా పెద్ద తప్పుగానే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తాను కూడా దీనికి అతీతుడను కానని పొట్లూరి వరప్రసాద్ ని వెనకేసుకొని రావడం ద్వారా నిరూపించారు. కొన్ని కేసులు నడుస్తున్న పొట్లూరిని తాను సమర్దించడాన్ని, కేశినేని నాని తదితరులు తప్పుపట్టినట్లు తెలుసుకొన్న పవన్ కళ్యాణ్, పొట్లూరిని సమర్దించుకొనేందుకు జగన్ని ఉదాహరణగా పేర్కొనడం హాస్యాస్పదం. పవన్ కళ్యాణ్ తన తొలి ప్రసంగంలో “ఒకరు తప్పు చేసారు కదాని, దానిని సాకుగా చూపించి మరొకరు కూడా తప్పు చేయడం తప్పని, దానిని అందరూ ఖండించాలని” అన్నారు. కానీ ఇప్పుడు తనే స్వయంగా అటువంటి తప్పు చేస్తున్నారు. జైల్లో ఉండి వచ్చిన జగన్ ఎన్నికలలో పోటీ చేయగా తప్పులేనప్పుడు పొట్లూరి పోటీ చేస్తే తప్పేమిటి అని నిలదీశారు. అంటే తప్పు చేసిన జగన్ పోటీ చేస్తున్నాడు గనుక, పొట్లూరి కూడా చేయవచ్చని వాదించడం తన మాటలని తానే స్వయంగా ఖండించుకొన్నట్లయింది.
దేశంలో అవినీతి పెరిగిపోయింది, దానికి వ్యతిరేఖంగా పోరాటం చేసేందుకే జనసేన పార్టీని స్థాపించానని చెప్పుకొంటున్న పవన్ కళ్యాణ్ దానికి పొట్లూరి చేతనే పునాది వేయించుకొన్నారు. పొట్లూరికి విజయవాడ నుండి లోక్ సభకు పోటీ చేసేందుకు ఏ పార్టీలో టికెట్ దొరకనందున తన ద్వారా టికెట్ సంపాదించు కోవాలనే ఉద్దేశ్యంతోనే తనను ఆశ్రయించి, పార్టీ లాంచింగ్ కి పెట్టుబడి పెట్టినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఎటువంటి తప్పు కనబడలేదు. పైగా పొట్లూరికి తనే స్వయంగా టికెట్ కోరడం, ఆయనని సమర్దించడాన్నిమళ్ళీ సమర్దించుకోవడం అన్నీకూడా పవన్ చెపుతున్న నీతి సూత్రాలకు విర్ద్దమయిన చర్యలే.
అదేవిధంగా పవన్ కళ్యాణ్ బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు మద్దతు ప్రకటించారు. కానీ, మల్కాజ్ గిరీలో మాత్రం తెదేపా అభ్యర్ధితో పోటీ పడుతున్న లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు. అంటే తేదేపాకు మద్దతు ఇస్తూనే దాని అభ్యర్ధికి వ్యతిరేఖంగా పనిచేస్తారన్న మాట!
ఇక ‘వన్ మ్యాన్ ఆర్మీ’లా నడిపిస్తున్నతన జనసేన పార్టీ, ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంటుందని ఆయన చెప్పిన మాట వాస్తవమయితే అంతకంటే పెద్ద జోక్ మరొకటి ఉండబోదు. ఆయన పార్టీ నయితే స్థాపించినట్లు ప్రకటించారు కానీ, దానిని కనీసం ఎన్నికల కమీషన్ దగ్గర నమోదు చేయించారో లేదో కూడా తెలియదు. పార్టీలో తను తప్ప పాలకవర్గం కూడా ఏర్పాటు చేసుకోలేదు. అటువంటి ఏకోనాయక పార్టీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంటుందని చెప్పడం హాస్యాస్పదం.
అందువల్ల పవన్ కళ్యాణ్ ఇక ముందు రాజకీయాలలో తను ఎటువంటి పాత్ర పోషించాలనుకొంటున్నాడో ముందుగా నిర్ణయించుకొన్నాక, అందుకు తగ్గటుగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని, వారితో సవివరంగా చర్చిన తరువాత నిర్ణయాలు తీసుకొంటే అభాసుపాలవరు. లేకుంటే తనకు తోచినదే రాజకీయమని భావిస్తూ, మాట్లాడుతుంటే అందువల్ల నలుగురిలో ఆయనే నవ్వులపాలవుతారు. అందుకు చక్కటి ఉదాహరణ ఆయన అన్నగారే. ఐదేళ్ళుగా రాజకీయాలలో నలుగుతున్నపటికీ నేటికీ ఆయన అప్రస్తుత ప్రసంగమే చేస్తుంటారు.