ప్రజలతో డబల్ గేమ్ ఆడుతున్న కాంగ్రెస్
posted on Apr 15, 2013 8:06AM
ఆర్ధిక శాఖా మంత్రి ఆనం రామినారాయణ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి మరియు అతని కుటుంబ సభ్యులపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేసిన తరువాత, కాంగ్రెస్ మంత్రులు ఒకరొకరిగా ఆయనతో గొంతు కలుపుతున్నారిప్పుడు. మంత్రి ఆనం జగన్ మోహన్ రెడ్డి జైలు నుండే పార్టీని చక్క బెడుతున్నాడని ప్రకటించిన తరువాత, తెదేపా ఆయన మాటలు తము చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తున్నాయని, ఇప్పటికయినా ప్రభుత్వం మేల్కొని జగన్ మోహన్ రెడ్డి సేవలో తరిస్తున్న చంచల్ గూడా జైలు సిబ్బందిపై, ముఖ్యంగా జైలు సుపరిండెంట్ సైదయ్య పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కానీ, ప్రభుత్వం మాత్రం ఇంత వరకు ఈ విషయంలో స్పందించలేదు. కానీ, తాజాగా పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ కూడా తెదేపా ఆరోపణలను దృవపరుస్తూ జగన్ మోహన్ రెడ్డి చంచల్ గూడా జైలును తన పార్టీ కార్యాలయంలా మార్చేశాడని ఆరోపించారు. అదే సమయంలో, వైకాపా డబ్బు మదంతో మిడిసిపడుతోందని, ఆ పార్టీకి ఓటేసి గెలిపిస్తే వచ్చేది దోపిడీ రాజ్యమని తీవ్ర విమర్శలు కూడా చేసారు.
ఒకవైపు జగన్ మోహన్ రెడ్డిని అతని కుటుంబ సభ్యులను, అతని పార్టీని ప్రజల ముందు తీవ్రంగా విమర్శిస్తూనే, మరో పక్క అతనికి జైల్లో రాచమర్యాదలకు లోటు లేకుండా చూసుకొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు, నేడు కాకపోతే రేపయినా జగన్ మోహన్ రెడ్డి అవసరం తమ పార్టీకి ఉంటుందనే దూరాలోచనతోనే ఈ విధంగా ప్రజలతో డబల్ గేమ్ ఆడుతున్నారేమో.