వైయస్సార్ తో కాంగ్రెస్ తెగతెంపులకి రెడీ
posted on Apr 13, 2013 @ 5:49PM
నిన్న నెల్లూరులో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయడం, అతని కొడుకు జగన్ మోహన్ రెడ్డిని ఉరి తీసినా తప్పులేదని చెప్పడంతో సహజంగానే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతల నుండి ఎదురు దాడి మొదలయింది. ఇక సాక్షి టీవీ చానెల్ అయితే మరో అడుగు ముందుకు వేసి, రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత ఆనం రామనారాయణరెడ్డి ‘ఆయన లేని లోటు తీరదని, జగన్ మోహన్ రెడ్డి తమకు నాయకత్వం వహించాలంటూ కన్నీరు పెట్టుకొని మరీ చేసిన ప్రసంగాన్ని ప్రసారం చేసి, నాడు మంచివాడయిన మనిషి నేడు హట్టాతుగా ఎందుకు చెడ్డవాడయిపోయాడో తెలపాలంటూ చురకలు కూడా వేసింది.
ఇక, ఈ వేడి చల్లారక మునుపే పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ కూడా అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లు మంత్రి ఆనం మాట్లాడిన మాటలలో తప్పేమీ లేదని అంటూనే, ఆయన మాటలకి తను కూడా మరో నాలుగు ముక్కలు కలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డబ్బుమదంతో దేనినయినా సాదించగలనని భ్రమల్లో అహంకారంతో విర్రవీగుతోందని, కానీ ప్రజల నుండి అధికారం మాత్రం కొనుక్కోలేదని గ్రహించే సమయం వస్తుందని, అప్పుడు కానీ ఆ పార్టీకి బుద్ధి రాదని ఆయన అన్నారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చేది దోపిడీ రాజ్యమని దానినే ఇప్పుడు షర్మిల రాజన్నరాజ్యం అని వేరేలా చెపుతోందని, ఆమె మాటలను ప్రజలు అర్ధం చేసుకోవాలని ఆయన అన్నారు.
ఇంత వరకు వైయస్సార్ కుటుంబంపై కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఏవిధంగా విమర్శలు చేసినా దానికి ప్రాదాన్యం ఉండకపోవచ్చును. కానీ శంఖంలో పోస్తేనే నీళ్ళు తీర్ధం అయినట్లు ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ స్వయంగా ఆనం మాటలకు వత్తాసు పలకడంతో ఇక కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర్ రెడ్డితో, అతనివల్ల పార్టీకి వచ్చిన గొప్ప పేరు ప్రతిష్టలతో(?) సంబంధాలు తెంపుకోవడానికి సిద్దపడినట్లే భావించవచ్చును. గనుక, ఇక మిగిలిన కాంగ్రెస్ నాయకులు కూడా త్వరలో ఒకరొకరు జగన్ మోహన్ రెడ్డి, అతని కుటుంబ సభ్యుల మీద, అతని పార్టీ మీద దాడి మొదలుపెట్టవచ్చును. కాంగ్రెస్ పార్టీ గనుక ఒకసారి మైండులో ఫిక్స్ అయితే ఇక జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడప్పుడే జైలు నుండి బయట పడటం గురించి ఆలోచనలు మానుకోవచ్చును.