ఒక షేర్ ఖాన్ కి పురస్కారం మరొకరికి తిరస్కారం
posted on Apr 13, 2013 @ 1:03PM
అలనాటి మేటి బాలివుడ్ నటుడు ప్రాణ్ అత్యంత ప్రతిష్టాత్మకమయిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రకటించడం అందరికీ సంతోషం కలిగించింది. కొంచెం ఆలస్యమయినప్పటికీ ఆయనకి సముచిత గౌరవం దక్కిందని అందరూ కూడా చాలా సంతోషించారు. దాదాపు 5 దశాబ్దాలపాటు 400 హిందీ సినిమాలలో నటించిన ప్రాణ్ తన విశిష్టమయిన నటనతో ‘విలన్ పాత్రకి’ కూడా ఆరోజుల్లోనే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఆయన తన సుదీర్ఘ సినీ పయనంలో అనేక రకాలయిన పాత్రలు పోషించినప్పటికీ, విలన్ పాత్రలే ఆయనకు పేరు తెచ్చాయని చెప్పవచ్చును. వచ్చేనెల 3వ తేదీన భారతీయ సినీ పరిశ్రమ నూరు వసంతాల పండుగ చేసుకోనున్న సందర్భంగా, ఈ 93 సం.ల కురు వృద్దునికి కూడా ఆనాడే ఈ అవార్డును ప్రధానం చేయాలని నిర్ణయించారు.
ఆయన ‘70లలో విడుదలయిన జంజీర్ సినిమాలో షేర్ ఖాన్ పాత్ర పోషించారు. ఆ సినిమా ఆయనకే కాకుండా ఆయనతో కలిసి నటించిన అమితాబ్ బచ్చన్ కూడా చాలా పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత తన పాత్రను సంజయ్ దత్త్ చేస్తున్నాడని తెలిసి ఆయన చాలా ఆనందించారు కూడా. కాకపోతే విచారకరమయిన విషయం ఏమిటంటే ఒక ఆయన సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమయిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ను అందుకోబోతుంటే, సంజయ్ దత్త్ అక్రమాయుధాల కేసులో త్వరలో జైలుకి తిరిగి వెళ్లనున్నారు. ఒక షేర్ ఖాన్ తన జీవితంలో అత్యన్నత శిఖరాలు చేరుకొంటుంటే మరో షేర్ ఖాన్ తన జీవితంలో అత్యంత దుర్భరమయిన పరిస్థితిని ఎదుర్కోనబోవడం విధిలీల కాక మరేమిటి?