నైతికవిలువలకు తిలోదకాలు
ఇటీవల కాలంలో వివిధ పార్టీల శాసనసభ్యులు, యంపీలు పార్టీలు మారుతున్నపటికీ తమ శాసన సభ, పార్లమెంటు సభ్యత్వాలు మాత్రం వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎవరయినా ఒక పార్టీని వద్దనుకొన్నపుడు, ఆ పార్టీ ద్వారా దక్కిన శాసనసభ, పార్లమెంటు సభ్యత్వం కూడా వదులుకొంటే హుందాగా ఉండేది. కానీ, నేడు రాజకీయ పార్టీలలో అటువంటి నైతిక విలువలు పాటించేవారు అరుదుగా కనిపిస్తుంటారు.
నిజానికి అటువంటి వారిపై సదరు పార్టీలు స్పీకర్ కు పిర్యాదు చేసిన వెంటనే విచారణ జరిపి అనర్హత వేటు వేయాలి. కానీ, కేంద్రంలో,రాష్ట్రంలో కూడా అధికారంలోఉన్న కాంగ్రెస్ పార్టీ, అటువంటి వారి మద్దతుతోనే మనుగడ సాధిస్తున్నందున వారిపై పిర్యాదు చేయకుండా వారిపై అనర్హత వేటు పడకుండా చూసుకొంటూ లోపాయికారిగా వారి మద్దతు పొందుతోంది.
ఉదాహరణకు ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పితెరాసలో చేరిన కాంగ్రెస్ యంపీలు మందా జగన్నాధం, వివేక్ ఇద్దరూ కూడా ఇంత వరకు తమ పదవులను అంటిపెట్టుకొనే ఉన్నారు. నిజానికి వారు పార్టీ వీడిన వెంటనే వారిపై కూడా అనర్హత వేటు వేయాలి. కానీ ఈ కారణాలతోనే వారిపై వేటు వేయలేదు. కేంద్రం యొక్క ఆ బలహీనత కారణంగానే వారు ఒకవైపు తెరాస సభ్యులుగా, మరో వైపు కాంగ్రెస్ యంపీలుగా కొనసాగుతున్నారు. వారు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళే ఆలోచనలు చేస్తున్నాట్లు సమాచారం. ఉద్యమం కోసమే తెరాసలో జేరమని చెపుతున్నవారు, తమకు పదవులు తృణప్రాయమని ఎన్ని గొప్పలు చెప్పుకొన్నపటికీ, నేటికీ వారు తమ పదవులను భద్రంగా అట్టేపెట్టుకొన్నారు. వాటిని పొందడం కోసం తాము ఎన్నికలలో చేసిన ఖర్చులను, తమ పదవులవల్ల వచ్చే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వారు ద్వంద పార్టీ విధానం అవలంబిస్తుంటే, ప్రభుత్వ మనుగడకు వారి మద్దతు ఎంతో అవసరం గనుక వారిపై వేటు వేయకుండా ప్రభుత్వం కూడా ఈ అనైతిక విధానాలకు ఆమోదం తెలుపుతోంది.
ఈవిధంగా ఒక వ్యక్తి ఏక కాలంలో రెండు పార్టీలలో సభ్యత్వం కలిగి ఉండటం అనైతికమేనని అందరికీ తెలిసినప్పటికీ, ఆ అనైతికతను కూడా నేడు ఆమోదించే స్థాయికి మన రాజకీయాలు దిగజారిపోయాయి. శాసనసభ జరిగినంత కాలం అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరినొకరు దూషించుకొంటూ, వాగ్వాదాలు చేసుకొంటూ విలువయిన సభాకాలాన్ని, అంత కంటే విలువయిన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంటారు. కానీ సభ నిరవధిక వాయిదా పడినప్పుడు ప్రభుత్వం అందించే వేల రూపాయల నజరానాలు నిస్సిగ్గుగా అందుకొంటారు. పూర్తి పతనావస్థకు చేరుకొన్న మన రాజకేయాలలో నైతిక విలువలు ఆశిస్తే భంగపాటు తప్పదు.