కాంగ్రెస్ ఆఫర్ ని బీజేపీ అందుకోగలదా
posted on Jul 24, 2013 @ 2:12PM
కర్ణుడి చావుకి వేయి శాపాలు, వేయి కారణాలు అన్నట్లు, మోడీకి కూడా బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా పేరు ఖాయం చేసుకోవడానికి అన్నిఅవాంతరాలు, అభ్యంతరాలు, విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే, ఆ అవకాశం ఇతరులకు ఎందుకు ఈయడమని బీజేపీ నేతలే ఆపని స్వయంగా చక్కబెడుతున్నారు. ప్రస్తుతం బీజీపీని ఎన్నికలలో గెలిపించగలమని భరోసా ఇచ్చే నాయకుడు ఆ పార్టీలో ఒక్కడు కూడా లేకపోయినప్పటికీ, అందుకు సిద్దపడిన మోడీని అందరూ కలిసి క్రిందకి లాగుతున్నారు. మోడీ విషయంలో బీజేపీ రెండుగా చీలిపోయి కొట్టుకొంటుంటే, ఒడ్డున కూర్చొన్న కాంగ్రెస్, జేడీ (యు) వంటి పార్టీలన్నీఅవకాశం దక్కినప్పుడల్లా యధాశక్తిన మోడీపై నాలుగు రాళ్ళు వేస్తున్నాయి.
మరో ఐదు నెలల్లో మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ‘జన్ ఆశీర్వాద్ యాత్ర’ పేరుతో ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పార్టీ సీనియర్ నేతలయిన అద్వానీ, వాజ్‌పేయి, మురళిమనోహర్ జోషీ, సుష్మ స్వరాజ్ ఫొటోలతో కూడిన బ్యానర్లు, గోడ పత్రికలు ఏర్పాటు చేశారు. కానీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న నరేంద్రమోడీ ఫొటో మాత్రం ఎక్కడా కనపడలేదు. ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఉన్న మోడీని ఆ సభకు ఆహ్వానించలేదు. ఇదే విషయం గురించి మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే, “ఇది రాష్ట్రానికి సంబందించిన కార్యక్రమం,” అని క్లుప్తంగా జవాబిచ్చారు. “మోడీని ఆహ్వానించారా?” అంటే జాతీయ నేతలందరికీ ఆహ్వానాలు పంపామని చెప్పడం చూస్తే మోడీ పట్ల ఆయన అభిప్రాయం ఏమిటో అర్ధం అవుతుంది. శివరాజ్‌సింగ్ చౌహాన్ అద్వానీ అనుచరుడిగా అందరికీ సుపరిచితుడు. అందువల్ల అతను కూడా మోడీని వ్యతిరేఖించడంలో ఆశ్చర్యం లేదు.
పార్టీలో ఇటువంటి రాజకీయాలు కొనసాగడం వలన, బీజేపీ పట్ల ప్రజలలో అపనమ్మకం కలగడం సహజం. కాంగ్రెస్ తన ఐదేళ్ళ పాలనలో అన్నిరంగాలలో తీవ్ర వైఫల్యాలు చవిచూస్తూ, అనేక కుంభకోణాలలో చిక్కుకొని అవినీతి మరకలు అంటించుకొని అత్యంత బలహీన పరిస్థితిలో ఉన్న ఈ తరుణంలో, దానికి ఏకైక ప్రత్యామ్నాయంగా ఉన్న బీజేపీ ఈవిధమయిన అంతః కలహాలతో కాంగ్రెస్ అందిస్తున్న ఒక సువర్ణావకాశాన్నిదూరం చేసుకోబోతున్నట్లు కనబడుతోంది.