శంకర్ రావు కేసులో కొత్త మలుపు

      మాజీ మంత్రి శంకర్ రావు పై పెట్టిన కేసులను ఆయన కోడలు వంశీ ప్రియ ఉపసంహరించుకున్నారు. శంకర్ రావు, ఆయన కుటుంబ సభ్యులపైన పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు ఆమె హైకోర్టులో ఈ రోజు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసులో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది. ఇటీవల ఈ కేసుపై శంకర్ రావును పోలీసులు అరెస్ట్ చేసి, అనారోగ్యం కారణంగా ఆయనను కేర్ ఆస్పత్రికి తరలించారు. శంకర రావు ఆరోగ్యం దృష్ట్యా కేసులు ఉపసంహరించుకోవాలని కుటుంబ పెద్దలు మధ్యవర్తిత్వం నెరపడంతో వంశీప్రియ వెనక్కి తగ్గిందని అంటున్నారు. వంశీప్రియ పిటిషన్ ఉపసంహరించుకోవడంతో సిసిఎస్ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసు కూడా విత్ డ్రా చేసుకోనున్నారు. కాగా శంకర రావు ప్రస్తుతం బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను పలు కేసులు వెంటాడుతున్నాయి.ఆ కేసులలో శంకరరావును అరెస్టు చేస్తారా?లేక వదిలేస్తారో చూడాలి

మజ్లిస్ మళ్ళీ కాంగ్రెస్ పంచన జేరబోతోందా

  కొంత కాలం క్రితం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ తో గిల్లి కజ్జాలు పెట్టుకొని, కుంటిసాకులు చూపి కాంగ్రెస్ పార్టీకి తలాకులు చెప్పుకొని బయటపడిన మజ్లిస్ పార్టీ అధినేతలు ఓవైసీ సోదరులు ఆ తరువాత జరిగిన పరిణామాలతో వాపు, బలుపు రెండు వేర్వేరని బాగా అర్ధం చేసుకోవడంతో పూర్తిగా చల్లబడిపోయారు. ‘కిరణ్ కంటే జగన్ బెటర్’ అని వారు జగన్ మోహన్ రెడ్డి కి ఒక కాండక్ట్ సర్టిఫికేట్ జారీ చేసినప్పటికీ, వారి నోటి దురద ఏనాటికయినా తనకు ప్రమాదం తెచ్చిపెడుతుందని భయపడిన జగన్ కూడా వారిపట్ల సానుకూలంగా స్పందించలేదు. అప్పుడు ఓవైసీ సోదరులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కొన్ని సిగ్నల్స్ ప్రసారం చేసినప్పటికీ వాటిని అటువైపు నుండి ఎవరూ రిసీవ్ చేసుకోకపోవడంతో వారు అయోమయంలో పడ్డారు. ఇక వారు గతంలో కబ్జా చేసిన ఓవైసీ ఆసుపత్రికి ఆనుకొని ఉన్నరెండున్నర ఎకరాల ప్రభుత్వ స్థలంను ఇప్పుడు స్వాదీనం చేసుకోవడానికి కిరణ్ ఆదేశించడంతో, ఇక లాభంలేదని భావించిన మజ్లిస్ అధినేత సోదరుడు అక్బరుద్దీన్ నేరుగా ఉపముఖ్యమంత్రి దామోదర రాజానరసింహను నిన్న కలిసారు.   దాదాపు అర్ధగంట సేపు సాగిన వారి సమావేశం తరువాత మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర విభజనను మేము వ్యతిరేఖిస్తున్నాము. గానీ తప్పనిసరి అయితే కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్న రాయల తెలంగాణా అయితే మేము మద్దతు ఇస్తామని తెలియజెప్పడానికే వచ్చాము” అని చెప్పారు. ఇప్పుడు మజ్లిస్ పార్టీ ఆమోదం తెలుపనంత మాత్రాన్న కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజనపై నిర్ణయం తీసుకోకుండా ఆగిపోదు. ఆ విషయం తెలిసి ఉన్నపటికీ పనికట్టుకొని మరీ వెళ్ళింది తమ అమూల్యమయిన అభిప్రాయం తెలియజేయడానికి కాదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మళ్ళీ కాంగ్రెస్ తో ముందుగానే పొత్తుల సంగతి మాట్లాడుకోకపోతే, ఆనక డిల్లీలో టికెట్స్ ఖరారు అయిపోతే అప్పుడు చేయగలిగేదేమీ ఉండదని గ్రహించడం వలనే ఓవైసీ సోదరులు ఓమెట్టు దిగివచ్చి దామోదరుడిని ప్రసన్నం చేసుకొనే పనిలో పడ్డారు. పనిలోపనిగా తాము కబ్జా చేసిన రెండెకరాల భూమిని తమకే వదిలిపెట్టమని అడిగినా అడిగి ఉండవచ్చును.   కిరణ్ కుమార్ రెడ్డిని వ్యతిరేఖించే ఆయనను కలవడం ద్వారా తమ పని సానుకూలం అవుతుందని వారు మళ్ళీ దురాలోచన చేసినట్లు కనబడుతోంది. కానీ, దానివల్ల వెళ్ళిన పని సానుకూలం కాకపోగా మరింత క్లిష్టం అయ్యే అవకాశం ఉంది. అంతకంటే నేరుగా పీసీసీ అధ్యక్షుడు బొత్సని కలిసినా వెళ్ళిన పని అయ్యేదేమో!

విద్యార్థుల మరణాలపై నీచ రాజకీయాలు చేస్తున్నబీజేపీ

  బీహార్ లో నిన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంతో 20మంది చిన్నారులు చనిపోగా, మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. హృదయవిదారకమయిన ఈ సంఘటనకి ఎటువంటి వ్యక్తులయినా చలించకమానరు. కానీ, ఈ ఘోర దుర్ఘటనకు మానవత్వంతో స్పందించవలసిన రాజకీయ పార్టీలు మాత్రం ఇదే అదునుగా తీసుకొనినితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తున్నాయి.    (యు)పార్టీ నితీష్ కుమార్ ఒత్తిడి కారణంగా ఎన్డీయే నుండి విడిపోయిన తరువాత ఇప్పుడు క్రమంగా కాంగ్రెస్ పార్టీకి చేరువవుతుండటంతో రగిలిపోతున్న బీజేపీ ఇదే అదునుగా భావించి శరన్ జిల్లా బందుకు పిలుపునిచ్చింది. అదేవిధంగా నితీష్ చేతిలో ఓడిపోయి అధికారం కోల్పోయిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ కూడా చిరకాలంగా ఇటువంటి అవకాశం కోసమే ఓపికగా ఎదురు చూస్తున్నాడు. ఆతని ఆర్.జే.డీ. పార్టీ కూడా ఈ రోజు చప్రా మరియు శరన్ జిల్లాల బంద్ కు పిలుపునిచ్చింది.   లాలూ ప్రసాద్ యాదవ్, బీజేపీ రెండూ కలిసి నితీష్ కుమార్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకు పడుతూ ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖా మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

సం'గ్రామం'లో టిడిపి టాప్

      రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న పంచాయితీ ఎన్నికల్లో పోలింగ్ కి ముందే టిడిపి పార్టీ దూసుకెళ్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి పార్టీ బలపరిచిన అభ్యర్ధులు ప్రస్తుతానికి మెజార్టీ స్థానాల్లో పాగా వేశారు. టిడిపి బలపరిచిన అభ్యర్ధులే అత్యధిక స్థానాల్లో ఏకగ్రీవం కావడంతో తెలుగు తమ్ముళ్ళ ముఖాల్లో ఆనందోత్సవాలు కనిపిస్తున్నాయి.   మంగళవారం నాటికి 1219 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, 457 టీడీపీ మద్దతుదారులకు దక్కడంతో ఆ పార్టీ ముందంజ వేసింది. టీడీపీ రాష్ట్ర కార్యాలయం సేకరించిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ 240, వైసీపీ 142తో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. టీఆర్ఎస్‌కు 36, న్యూ డెమోక్రసీకి 12, సీపీఎంకు 6, సీపీఐకి 2, బీజేపీకి 2 పంచాయతీలు లభించాయి.   జిల్లాలవారీగా... చిత్తూరు-80, గుంటూరు-43, ప్రకాశం-39, నెల్లూరు-36, శ్రీకాకుళం-34, కృష్ణా-29, ఆదిలాబాద్-28, పశ్చిమ గోదావరి-23, విజయనగరం-22, మహబూబ్‌నగర్-21 వంతున టీడీపీకి దక్కాయి. చిత్తూరు-28, శ్రీకాకుళం-20 వంతున కాంగ్రెస్‌కు లభించాయి. వైసీపీకి చిత్తూరు-27, కడప-24 చొప్పున వచ్చాయి. టీఆర్ఎస్‌కు నిజామాబాద్ జిల్లాలో 23 వచ్చాయి.

తెలంగాణాపై సోనియా మాటే ఆలస్యం!

      తెలంగాణాపై సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటే దానిని అమలు చేయడానికి కేంద్ర హోం శాఖ సిద్దంగా ఉందని కేంద్ర హోం మంత్రిసుశీల్ కుమార్ షిండే కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. సోనియాగాంధీ అన్నింటికంటే ఎక్కువగా తెలంగాణకు ప్రాధాన్యతనిస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమస్యకు సాధ్యమైనంత త్వరలో స్పష్టమైన పరిష్కారం చూపాల్సిందిగా ఆదేశించారని షిండే చెప్పినట్లు సమాచారం. తెలంగాణపై సీడబ్ల్యూసీలో నిర్ణయం ప్రకటించవచ్చునని అంటున్నారు. తెలంగాణతో సీమకు చెందిన 2 జిల్లాలు కలిపి హైదరాబాద్‌ను రాజధానిగా కొనసాగించడమా, లేక హైదరాబాద్‌ను 'యూటీ'గా కొనసాగించడమా, లేక మరో ప్రతిపత్తి కలిగించడమా అన్న అంశంపై తర్జన భర్జనలు జరిగాయని, ఈ విషయంలో ఒక స్పష్టత రాలేదని ఈ వర్గాలు అంటున్నాయి.

బీహార్ లో 20మంది చిన్నారులు మృతి

  బీహార్‌లోని శరణ్ జిల్లా మష్రాఖ్ బ్లాక్ గందావన్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆరగించిన 20మంది విద్యార్థులు మరణించారు. మరో 21 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో 22ప్రాణాపాయ పరిస్థితి నుండి బయటపడినప్పటికీ తీవ్ర అస్వస్థతో ఉన్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే బాధిత విద్యార్ధులను సమీపంలో ఉన్న చాప్రా సదర్ ఆస్పత్రికి తరలిస్తుండగానే పదకొండు మంది దారిలోనే మరణించిగా మరి కొందరు ఆసుపత్రిలో మరణించారు. నిన్నమధ్యాహ్నం విద్యార్ధులకు వడ్డించిన భోజనంలో క్రిమిసంహరక మందు ఆర్గానో పాస్పరస్ కలసి ఉండవచ్చని బీహార్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అమర్ జీత్ సిన్హా అనుమానిస్తున్నారు. బాధిత విధ్యార్ధులకు పాట్నామెడికల్ కాలేజీలో చికిత్సఅందిస్తున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు. చనిపోయిన విద్యార్ధులకు ఒక్కొక్కరికి రూ.2లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు.

ఆగస్టు 24 నుండి బాబు బస్సు యాత్ర

      తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు తన 63 ఏళ్ల వయసులో దాదాపు 7 నెలలు పైగా రాష్ట్రంలో పలు జిల్లాలలో పాదయాత్ర చేసి పార్టీ శ్రేణులలోఉత్సాహం నింపారు. అదే సమయంలో ఆయన కూడా పాదయాత్ర తరువాత మరింత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో బస్సుయాత్రకు సిద్దం అవుతున్నారు. ఆయన చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను మాత్రం తన పాదయాత్రలో పర్యటించలేకపోయారు. అందువల్ల వచ్చేనెలలో బస్సుయాత్ర చేప్పట్టి ఆ జిల్లాలను కూడా పర్యటించాలని ఆయన సిద్దపడుతున్నారు. ఒకవేళ పంచాయితీ ఎన్నికల ఫలితాలు పార్టీకి సానుకూలంగా వస్తే అది తన యాత్రకు మంచి ఊపునిస్తుందని, అప్పుడు తన బస్సు యాత్ర ద్వారా ఆ తరువాత జరగనున్నమునిసిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నధం చేయవచ్చునని చంద్రబాబు ఆలోచన. ఆగస్టు 24 నుండి ఈ యాత్ర మొదలు కానుంది. ఈ మేరకు ఇంతకుముందే పార్టీ వర్గాలు ప్రకటన చేశాయి. వచ్చే సాధారణ ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండి వారికి దగ్గరగా ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు.

కాంగ్రెస్ నేతలు ప్రజలను ఏమార్చడానికే తిట్టుకొంటున్నారా?

  తెలంగాణా, రాష్ట్ర విభజన అంశాల మీద రోజుకొక వార్తని మీడియాకి లీక్ చేయడం మళ్ళీ దానిని ఆ మరునాడు ఖండించడం, లేకుంటే రోజుకొక వ్యాఖ్య చేయడం దానిని పట్టుకొని అటు మీడియాలో తీవ్రంగా చర్చలు, ఇటు కాంగ్రెస్ నేతలు మాటలు రువ్వుకోవడం, గత రెండు మూడేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ చాలా తెలివిగా ఈ తంతు నడిపిస్తూ రోజులు దొర్లించేస్తోంది.   త్వరలో రాష్ట్ర విభజన అంశంపై ఖచ్చితమయిన నిర్ణయం ప్రకటిస్తానని దిగ్విజయ్ సింగ్ చెప్పినప్పుడు, రెండు ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నేతలను నియంత్రించి ఉండాలి. కానీ, చేయలేదు. వారు రెండు గ్రూపులుగా విడిపోయి బద్ధ శత్రువులవలే కత్తులు దూసుకొంటూ పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తుంటే, కాంగ్రెస్ అధిష్టానం చోద్యం చూస్తోంది. అసలు ఇదంతా ప్రజలను, ప్రతిపక్షాలను ఏమార్చడానికి కాంగ్రెస్ ఆడుతున్ననాటకంలో భాగమేనేమో అనే అనుమానం కూడా కలుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ నేతలు కీచులడుకొంటూ ప్రజల దృష్టిని మళ్ళిస్తుంటే, అక్కడ డిల్లీ పెద్దలు రకరకాల వ్యాక్యాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారేమోనని అనుమానం కలుగుతుంది.   ఇక నేడో రేపో తెలంగాణా అంశాన్ని తేల్చేస్తామని ఒక పక్క చెపుతూనే, ‘తెలంగాణా ప్యాకేజి’, ‘రాయల తెలంగాణా’ వంటి లీకులు ఎందుకు చేస్తున్నారో కాంగ్రెస్ పెద్దలకే తెలియాలి. ఈ రోజు దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ “హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే ఆలోచన ఏమీ లేదని, మీడియాలో వస్తున్న వార్తలు కేవలం ఊహాజనిత వార్తలేనని” చెప్పడం చూస్తే, ఆయన మళ్ళీ మరో కొత్త చర్చకు అవసరమయిన ముడిసరుకు అందజేస్తునట్లు భావించాలి. ఆయన ఆవిధంగా అన్నారు గనుక, ‘బహుశః హైదరాబాదుతో కూడిన తెలంగాణా ఏర్పాటు చేయవచ్చునేమో’, లేకపోతే ‘హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఉంచి రాష్ట్ర విభజన చేయవచ్చునేమో’, లేకపోతే ‘అసలు రాష్ట్ర విభజన చేసే ఆలోచన లేనందునే ఆయన ఆవిధంగా అన్నారేమో’ అంటూ ఆయన తాజా వ్యాఖ్యలపై అనేక కోణాలలో చర్చలు మొదలవుతాయి.   అదే అంశం పట్టుకొని రేపటి నుండి ఉభయ ప్రాంతాలకి చెందిన కాంగ్రెస్ కూడా ఎవరికి అనుకూలమయిన వాదనలు వినిపించవచ్చును. అసలు ఒక సమస్యని పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీకి ఇంతకంటే మంచి పద్ధతి లేదా? లేక ఈ సమస్యను మరింత కాలం సాగదీసేందుకు కోరుండే ఈ విధంగా ప్రవర్తిస్తోందా? అత్యంత సున్నితమయిన అంశాన్ని పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ చాలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం వలననే సమస్య ఇంతవరకు వచ్చింది. కనీసం ఇప్పటికయినా ఆ పార్టీ మేల్కొందా అంటే లేదనే అనిపిస్తోంది.

నక్సలిజం పుట్టింది సీమాంధ్రలోనే!

      తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే నక్సలిజం పెరుగుతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోర్ కమిటిలో తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఎంపీ మందా జగన్నాథం మండిపడ్డారు. నక్సలిజం పుట్టింది సీమాంధ్రలోనని ఆయన అన్నారు. కిరణ్ సీఎంలా కాకుండా సీమాంధ్ర నేతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో ఉగ్రవాదాన్ని నియంత్రించడంలో సీఎంగా కిరణ్ విఫలమయ్యారని విమర్శించారు. కోర్‌ కమిటీకి ఇచ్చిన నివేదికను సీఎం కిరణ్ లీక్ చేసి అనైతికతకు దిగుతున్నారని అన్నారు. సీఎం నివేదికను తెలంగాణ నేతలు ఖండించాలని కోరారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని అన్నారు.

బార్లలో డాన్సులకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

      ముంబై బార్లలో డాన్సులను అనుమతినిస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. బోంబే పోలీస్ చట్టం 2005 ప్రకారం బార్ లలో నృత్యాలు చెయ్యటాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ చట్టం ఆహారపానీయాలు సేవించే చోట, పర్మిట్ రూం లేదా బార్ లేక బీర్ రూంలలో డ్యాన్స్ లు చెయ్యటాన్ని నిషేధించింది కానీ త్రీస్టార్ అంతకంటే పై స్థాయి హోటళ్ళు, కొన్ని పెద్ద సంస్థలలో అందుకు మినహాయింపు ఇచ్చింది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా మత్తు పదార్థాల సేవించే చోటు నృత్యాలు తగవని, అనైతికమని, అశ్లీలమని, వ్యభిచారానికి దారితీసే అవకాశముందని, మహిళలపట్ల దురాచారమని మహారాష్ట్ర ప్రభుత్వం వాదించింది. కానీ చట్టం ఎక్కడైనా ఒక్కటే కాబట్టి కొన్ని చోట్ల అనుమతులు మరికొన్ని చోట్ల నిషేధాలుండటం సరికాదని 2006 లో డ్యాన్సర్లు బార్ యజమానులు ఎపెక్స్ కోర్టు ని ఆశ్రయించగా కోర్టు వారి వాదనతో ఏకీభవించింది.  ఈ లోపు బొంబాయి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం డాన్సర్లకు వారి వృత్తిని వారు చేసుకునే హక్కుని కాలరాస్తోందని అభిప్రాయపడింది.  దానిని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ని కొట్టివేస్తూ సుప్రీం కోర్టు నిషేధాన్ని ఎత్తివేసింది.

తెలంగాణ ఇస్తే నక్సల్స్ సమస్య ఉండదు

      తెలంగాణపై అధిష్టానం తీసుకోబోయే నిర్ణయానికి పార్టీకి చెందిన ఇరుప్రాంతాల నేతలు కట్టుబడి ఉండాలని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. పంచాయితీ ఎన్నికలు ప్రభుత్వ పాలనకు రెఫరెండమన్నారు. తెలంగాణ ఇస్తే నక్సల్స్ సమస్య వస్తుందని అనుకోవడంలేదని అన్నారు. నక్సల్ సమస్య గతంలో ఉండేదని, కాని ఆ తర్వాత జరిగిన మార్పులు, సామాజిక ప్రగతి వంటి కారణాలతో నక్సల్ ఉద్యమం లేదని గండ్ర అన్నారు. కేరళ వంటి రాష్ట్రాల్లో నక్సల్స్ సమస్య లేదని గుర్తు చేశారు. విభజనపై పార్టీ పెద్దల నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మోడీ ప్రసంగం విలువ ఐదు రూపాయలేనా?

      కేంద్రమంత్రి మనీష్ తివారి బీజేపీ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని విమర్శించడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. నరేంద్రమోడీతో హైదరాబాద్ లో బీజేపీ యువ సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించింది. అయితే దానికి ఎంట్రీఫీజుగా ఐదు రూపాయలను నిర్ణయించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. స్వాముల ప్రవచనాలకు వంద నుండి లక్ష రూపాయలు ఉంటుందని, పరాజయం పాలయిన సినిమాకు కూడా రూ. రెండు వందల నుండి ఐదు వందలు ఉంటుందని, అలాంటిది మోడీ ప్రసగం విలువ రూ.5 మాత్రమేనా ? అని ట్విట్టర్ లో ఆశ్చర్యపోయారు. వినడానికే బీజేపీ ఐదు రూపాయల పన్నువిధిస్తే.. ఇక 120 కోట్ల మందిపై మాట్లాడే పన్ను ఇంకెంత విధిస్తారోనని ఆయన ఎద్దేవాచేశారు. యువజన సదస్సుకు వసూలుచేసే ఫీజు మొత్తాన్ని ఉత్తరాఖండ్ బాధితులకు విరాళంగా ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది.

తెలంగాణను మత రాజకీయాలు శాసిస్తాయి: జగ్గారెడ్డి

      రాష్ట్ర విభజన అంటూ జరిగితే తెలంగాణ అల్లకల్లోలమవుతుందని ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణను మత రాజకీయాలు శాసిస్తాయని అన్నారు. కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో కిరణ్ మావోయిస్టుల అంశాన్ని ప్రస్తావించడాన్ని ఆయన సమర్ధించారు. సీఎం కిరణ్ ప్రతిపాదించిన భారీ ప్యాకేజీ తెలంగాణకు వారం అని పేర్కొన్నారు. సీఎం ప్రయత్నం సఫలమయితే తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. అలా కాకుండా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ప్రజల పరిస్థితి దుర్భరంగా మారుతుందని ఓ ప్రైవేటు వార్తా చానల్ తో అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఉద్యమాలు చేస్తున్న వాళ్లు ప్యాకేజీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని జగ్గా రెడ్డి ప్రశ్నించారు.

తేల్చే దాకా ఆగండి: సీఎం కిరణ్

      తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానం ఏదో ఒకటి తేల్చేద్దాం అనుకుంటున్న తరుణం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి మరో నాటకానికి తెర తీశారు.. రాష్ట్రాన్ని విభజించడం కన్నా భారీ ప్యాకేజీతో సరెపెట్టోచ్చని కిరణ్‌ కోర్‌ కమిటీకి విన్నవించినట్టుగా వచ్చిన వార్తలు రాజకీయవర్గాల్లో తీవ్ర దుమారాన్ని లేపాయి.. అంతేకాదు అధిష్టానం కూడా ఈ విషయం పై ఆలోచిస్తుందన్న వాదన కూడా బలంగా వినిపిస్తుంది..   ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యవహారాల ఇంచార్ట్‌ దిగ్విజయ్‌ సింగ్‌ కేంద్రమంత్రి జైపాల్‌ రెడ్డితో భేటి కావడం ప్రాదాన్యత సంతరించుకుంది.. జైపాల్‌ నివాసంలో ఆయన్ను కలిసిన దిగ్విజయ్‌ దాదాపు 40 నిమిషాల పాటు ఆయనతో చర్చలు జరిపారు.. ఈ చర్చల్ల కోర్‌కమిటీ బేటితో పాటు, ప్యాకేజీల ప్రకటన రాష్ట్ర ఏర్పాటుకు ఆవశ్యకత లాంటి ఎన్నో విషయాలను చర్చించినట్టుగా తెలుస్తుంది.. అంతేకాదు అధిష్టానం నిర్ణయం వెలువడే వరకు తెలంగాణ నేతలను సంయమనంతో ఉంచే బాధ్యతను కూడా దిగ్విజయ్‌ జైపాల్‌ రెడ్డి కే అప్పగించారు.. అయితే ఇద్దరు నేతలు భేటి విషయలను తెలియజేయకపోవడంతో ఇరు పక్షాల వారు భేటి తమకు అనుకూలంగానే జరిగిందని చెప్పుకుంటున్నారు..

బ్యాంక్‌లపై జరిమానా

      రూల్స్‌ను పక్కన పెట్టిన బ్యాంక్‌లపై చర్యలు మొదలు పెట్టింది ఆర్‌బిఐ.. నోయువర్‌ కస్టమర్‌, యాంటీ మనీలాండరింగ్‌ నిబందనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరించిన 22 బ్యాంకులకు దాదాపు 50 కోట్ల రూపాయల వరకు జరిమాన విధించింది..   ఎస్‌బిఐ, పిఎన్‌బి, యస్‌ బ్యాంక్‌తో పాటు చాలా బ్యాంక్‌లు ఈ లిస్ట్‌లో ఉన్నాయి.. అంతే కాదు సిటిబ్యాంక్‌ లాంటి మరి కొన్ని సంస్ధలను భవిష్యత్తులో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని హెచ్చరిస్తూ లేఖలను కూడా పంపింది.. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో మనీలాండరింగ్ పెద్ద ఎత్తున జరుగుతోందంటూ ఆన్‌లైన్ పోర్టల్ కోబ్రాపోస్ట్ ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో దశలవారీగా స్టింగ్ ఆపరేషన్‌తో బయటపెట్టింది. దీనిపై దర్యాప్తునకు ఆదేశించిన ఆర్‌బిఐ ఇందులో భాగంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఐసిఐసిఐ, యాక్సిక్ బ్యాంకులలో యాంటీ మనీలాండరింగ్, కెవైసి నిబంధనల ఉల్లంఘన జరిగిందని వాటికి రూ.10.50 కోట్ల జరిమానా విధించింది. ఇప్పుడు మరికొన్ని బ్యాంక్‌లపై కూడా చర్యలు చేపట్టింది. 22 బ్యాంకులలో ఖాతాల నిర్వహణ, పుస్తకాలు, అంతర్గత నియంత్రణ, నిబంధనల అమలు తీరు తదితర వివరాలను ఆర్‌బిఐ విచారణ బృందం ఏప్రిల్‌లో సమగ్రంగా పరిశీలించాక కెవైసి/యాంటీ మనీలాండరింగ్ నిబందలను సదరు బ్యాంక్‌లు ఉల్లంగిచాయని తేల్చింది. ఇవే కాదు ఇలాగే భవిష్యత్తులో మరిన్ని బ్యాంక్‌లపై ఆర్‌బిఐ చర్యలకు రెడీ అవుతుంది..

త్వరలో చంద్రబాబు ‘బస్సు యాత్ర’ షురూ

  తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు తన 63 ఏళ్ల వయసులో దాదాపు 7 నెలలు పైగా రాష్ట్రంలో పలు జిల్లాలలో పాదయాత్ర చేసి పార్టీ శ్రేణులలోఉత్సాహం నింపారు. అదే సమయంలో ఆయన కూడా పాదయాత్ర తరువాత మరింత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. సుదీర్ఘమయిన తన పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలలో తన పార్టీ పరిస్థితిని ఆయన స్వయంగా అధ్యయనం చేయగలిగారు. అనారోగ్యం, కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నపటికీ ఆయన దిగ్విజయంగా తన పాదయాత్రను ముగించారు. పార్టీపై, ప్రజలపై ఆయన పాదయాత్ర ప్రభావం ఎంత ఉందో త్వరలో జరగనున్న పంచాయితీ ఎన్నికలే తెలియజేస్తాయి.   ఆయన చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను మాత్రం తన పాదయాత్రలో పర్యటించలేకపోయారు. అందువల్ల వచ్చేనెలలో బస్సుయాత్ర చేప్పట్టి ఆ జిల్లాలను కూడా పర్యటించాలని ఆయన సిద్దపడుతున్నారు. ఒకవేళ పంచాయితీ ఎన్నికల ఫలితాలు పార్టీకి సానుకూలంగా వస్తే అది తన యాత్రకు మంచి ఊపునిస్తుందని, అప్పుడు తన బస్సు యాత్ర ద్వారా ఆ తరువాత జరగనున్నమునిసిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నధం చేయవచ్చునని చంద్రబాబు ఆలోచన. కానీ, కాంగ్రెస్ పార్టీ ఈనెలాఖరులోగా రాష్ట్ర విభజనపై ప్రకటన చేసినట్లయితే, తదనుగుణంగా పార్టీని సన్నధం చేసేందుకు చంద్రబాబు తన బస్సు యాత్ర ఆలోచనను తాత్కాలికంగా వాయిదా వేసుకోవచ్చును.

తెలంగాణ పై జైపాల్ తో దిగ్విజయ్ చర్చ

      రాష్ట్ర విభజన సమస్య పై కేంద్రం భవిష్యత్తు కార్యాచరణపై కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తో సమావేశం కావడం ప్రాధాన్యం సత్కరించుకుంది. గతకొంతకాలంగా జైపాల్ రెడ్డి తెలంగాణకు అనుకూలంగా పనిచేస్తున్నారు. దిగ్విజయ్ సింగ్ భేటి తరువాత జైపాల్ రెడ్డి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, సీనియర్ మంత్రి జానా రెడ్డితో పాటు మరికొందరితో ఫోన్ లో మంతనాలు జరిపారు. ఈ సారి తెలంగాణ రావడం ఖాయమని జైపాల్ రెడ్డి బలంగా విశ్వసిస్తున్నారని సమాచారం. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ బహరింగంగా చర్చలు జరపడం శుభసంకేతం అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తెలంగాణ అంశంలో ఇప్పటి వరకూ తెర వెనుక ఉంటూ వచ్చిన జైపాల్ తో అధిష్టానం పెద్దలు చర్చలు జరపడం సానుకూల సంకేతంగా భావిస్తున్నారు. 

నెల గడిచిన మానని గాయాలు

      కైలాస నాథుని సాక్షిగా ఉత్తరాఖండ్‌ వరద బీభత్సం దేశానికి తీరని నష్టం మిగిల్చింది. చార్‌ధామ్‌ యాత్రకని వెళ్లిన వారిలో చాలా మందే మృత్యువాత పడగా ఇంకా ఎంతో మంది జాడ కూడా తెలియటం లేదు... నెల క్రితం వరకు కేధర్‌నాద్‌, బద్రీనాధ్‌, గంగ్రో తి, యమునోత్రి, లాంటి పుణ్యక్షేత్రాలు భక్తులతో కళకల లాడాయి. కానీ ఇప్పుడు ఆ ప్రాంతం అంతా స్మశాన నిశబ్దం ఆవహించింది..   సోమవారంతో ఈ వరద బీభత్సానికి నెల రోజులు పూర్తయ్యాయి. దీంతో వరదల్లో గల్లంతయిన వారిని గుర్తించేందుకు లక్ష్యంగా పెట్టుకున్న టైం  ముగిసిందని ఉత్తరాఖండ్‌ సీఎం విజయ్‌బహుగుణ చెప్పారు. ఇప్పటికి 5వేల 748 మంది యాత్రికుల జాడ తెలియట్లేదని చెప్పారు. అయితే వారందరు చనిపోయినట్టు నిర్ధారించటం లేదని ఇంకా వారికోసం గాలింపు కొనసాగుతుందని చెప్పారు. ఐతే తాము అనుకున్న గడువు ముగిసినందున గల్లంతైన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఎక్స్  గ్రేషియా చెల్లిస్తామని సీఎం స్పష్టం చేశారు. కానీ భవిష్యత్తులో ఈ గల్లంతయిన వారిలో ఎవరైన తిరిగి వస్తే ఎక్స్‌క్రేషియా మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని చెప్పారు.. చనిపోయిన వారి కుటుంబాలకు కేంద్రం ప్రభుత్వం మూడున్నర లక్షలు చెల్లిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఒకటిన్నర లక్షల పరిహారం అందిస్తోంది. ఐతే బాధిత కుటుంబాలు తమవారు చనిపోయినట్లు అంగీకరిస్తూ సంతకం చేస్తేనే వారికి పరిహారం అందిస్తున్నట్లు బహుగుణ తెలిపారు. మరోవైసు ఇంకా ఆళయ పరిసర ప్రాంతాల్లో శిథిలాలు అలాగే ఉన్నాయి.. అయితే వాతావరణ ప్రతికూల పరిస్థితులతో ఆ శిధిలాలను తొలగించలేకపోతున్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో చార్‌దామ్‌ యాత్ర తిరిగి ప్రారంభం అయ్యే అవకాశం కనిపించటం లేదు..