రాయలసీమలో మొదలయిన రాజకీయ అల్పపీడనం

  కమలాపురం కాంగ్రెస్ శాసనసభ్యుడు వీరశివారెడ్డి రాజీనామాతో రాయలసీమలో రాజకీయ అల్పపీడనం మొదలయి, పదకొండు మంది వైయస్సార్ కాంగ్రెస్ శాసన సభ్యుల రాజీనామాలతో పెను తుఫానుగా మారి, అది తెలంగాణాలో ఉరుములు, మెరుపులు సృష్టిస్తోంది.   సమైక్యాంధ్ర కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం 11మంది శాసన సభ్యులు రాజీనామాలు చేసారు. వారు: శోభా నాగిరెడ్డి(ఆళ్లగడ్డ); బాలినేని శ్రీనివాసరెడ్డి(ఒంగోలు); గుర్నాథరెడ్డి (అనంతపురం); అమర్ నాథరెడ్డి(రాజంపేట); భూమన కరుణాకరరెడ్డి( తిరుపతి); మేకపాటి చంద్రశేఖరరెడ్డి(ఉదయగిరి); శ్రీనివాసులు(రైల్వేకోడూరు); శ్రీకాంత్ రెడ్డి(రాయచోటి); పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల); కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం) మరియు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (కోవూరు). వీరందరూ తమ రాజీనామా లేఖలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు ఫాక్స్ ద్వారా ఈ రోజు పంపారు.   ఇక నేడో రేపో తెలంగాణా రాబోతోందని ఆత్రుతగా ఎదురు చూస్తున్న తెలంగాణా ప్రజలకు, తెలంగాణా వాదులకు, ముఖ్యంగా టీ-కాంగ్రెస్ నేతలకు, తెలంగాణా విద్యార్ధులకు ఇది తీవ్రఆగ్రహం కలిగించింది. వైసీపీ శాసన సభ్యులు రాజీనామాలు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఓయూ జేఏసీ అందుకు నిరసనగా తెలంగాణాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తెలంగాణా కార్యకర్తలు, నేతలు అందరూ కూడా పార్టీని వీడాలని కోరింది. జగన్, విజయమ్మల దిష్టి బొమ్మలు దగ్ధం చేసి వారు తమ నిరసన తెలిపారు. తెలంగాణను అడ్డుకొనే ఆ పార్టీలో ఎవరూ కొనసాగరాదని, వెంటనే పార్టీని వీడి ఉద్యమంలోకి రావాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని వారు హెచ్చరించారు. బహుశః త్వరలో ఆ పార్టీకి చెందిన తెలంగాణా కార్యకర్తల, నేతల రాజీనామాలు మొదలయ్యే అవకాశం ఉంది.   ఇక, ఈ వేడి తెలుగుదేశం పార్టీని కూడా తాకితే, ఆ పార్టీ నేతలు ఏవిధంగా స్పందిస్తారో, రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించిన చంద్రబాబు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

విభజిస్తే ఎంతకైనా తెగిస్తాం

      రాష్ట్రాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తే దాన్ని అడ్డుకోవడానికి ఎంతకైనా తెగిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రాన్ని, రాయలసీమను విభజించే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఎవరిచ్చారని శ్రీకాంత్ ప్రశ్నించారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్నారు. రాజకీయ స్వార్థం కోసం రాష్ట్రాన్ని విభజించవద్దని ఆయన కోరారు. విభజన విషయంలో నిర్ణయం తీసుకునే ముందు అన్ని పార్టీల నిర్ణయం తెలుసుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల మనోభావాలతో ఆటాడుకుంటోందని ఆయన విమర్శించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తాను ఎప్పుడో రాజీనామా లేఖ ఇచ్చానని, ఈ విషయంలో తన చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే రాజీనామా చేస్తామని సీమాంధ్ర మంత్రులు చెప్పడం ఓ డ్రామా అన్నారు. ఆ నేతలకు ఈ విషయంలో చిత్తశుద్ధి ఉంటే వెంటనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని సవాల్ చేశారు.

ఎమ్మెల్యే బాలినేని రాజీనామా!

      ఒంగోలు ఎమ్మెల్యే వైఎస్ఆర్.కాంగ్రెస్ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రాన్ని సమైఖ్యంగా ఉంచాలని కోరుతూ ఎమ్మెల్యే బాలినేని పదవికి రాజీనామా చేసినట్లు ఒంగోలులోని తన కార్యాలయంలో నుంచి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రవిభజన కాంగ్రెస్ అగ్రనాయకత్వం రాష్ట్ర నేతలతో చర్చలు జరిపే నేపధ్యంలో ఈ రాజీనామా ప్రకటన వెలువడింది. రాష్ట్రాన్ని సమైఖ్యంగా ఉంచాలనే డిమాండుతో తాను రాజీనామా చేసినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా కడప జిల్లా కమలాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

చంద్రబాబు కష్టం ఫలించిందా

  గత రెండేళ్లుగా గడ్డు కాలం ఎదుర్కొన్నతెలుగుదేశం పార్టీ ఎట్టకేలకు మొన్న జరిగిన పంచాయితీ ఎన్నికలలో ఘన విజయం సాధించడంతో మళ్ళీ ఆ పార్టీ దారిన పడుతున్నట్లు కనబడుతోంది. ఇందుకు ప్రధాన కారణాలు ఆ పార్టీ తెలంగాణా అనుకూల వైఖరి ప్రకటించడం, అదే సమయంలో చంద్రబాబు తన సీమంధ్ర నేతలని అదుపుతప్పకుండా ఉంచగలగడం, ఆయన తన శక్తికి మించి శ్రమపడి పాదయాత్ర చేయడం, పంచాయితీ ఎన్నికలను కూడా సాధారణ ఎన్నికలంత సీరియస్ గా తీసుకొని పకడ్బందీ వ్యూహాలతో పార్టీ శ్రేణులకు మార్గదర్శనం చేయడం, అంతే స్పూర్తితో పార్టీ క్యాడర్లు కూడా పనిచేయడంవంటివన్నీకలిసి పంచాయితీ ఎన్నికలలో ఆ పార్టీకి ఘనవిజయం సాధించిపెట్టాయి.   మొదట్లో తెదేపా రెండు ప్రాంతాలలో పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర విభజనపై రెండు కళ్ళ సిద్ధాంతం పాటించినప్పటికీ, అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా తీసుకోవడంతో తెలంగాణా ప్రాంతంలో ఆ పార్టీ పరిస్థితులు క్రమంగా మెరుగుపడ్డాయి. (నేటికీ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర విభజనపై కుమ్ములాడుకొంటుంటే, వైకాపా తన వైఖరి ప్రకటించడానికి కూడా జంకుతోంది.) అదే సమయంలో ఆయన తెలంగాణాలో పాదయాత్ర చేయడం కూడా పార్టీకి కలిసివచ్చింది.   ఆ సమయంలో తెరాస, తెదేపాను దాని అధ్యక్షుడు చంద్రబాబును ఎంతగా విమర్శలు చేసినప్పటికీ, ఆయన తన సీమంద్రా నేతలను కట్టడి చేయడంతో, తెలంగాణా ప్రజలు తెరాస మాటలు నమ్మలేదు. దానితో చంద్రబాబులో, తెదేపా నేతలలో, క్యాడర్లలో కొత్త ఉత్సాహం వచ్చింది. తత్ఫలితంగా సీమంధ్ర ప్రాంతంలో కంటే తెలంగాణాలోనే ఆయన పాదయాత్ర మరింత ఉత్సాహభరితంగా, దిగ్విజయంగా సాగింది. ఆయన తన పాదయాత్రలో మారుమూల గ్రామాలలో కార్యకర్తలను కూడా కలుస్తూ, జిల్లాలవారిగా సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తూ ముందుకు సాగడం వలన పాదయాత్ర వలన పార్టీకి ప్రయోజనం చేకూరింది.   ఇక, విశాఖలో నిర్వహించిన బహిరంగ సభ ఊహించిన దానికంటే చాలా విజయవంతం అయ్యింది. పాదయాత్ర ముగించిన తరువాత చంద్రబాబు కార్యాలయానికి చేరుకొన్న వెంటనే ముందుగా పార్టీని చక్కదిద్దే పనిలో పడ్డారు. నేతలకి, కార్యకర్తలకి మధ్య చక్కని సమన్వయం ఏర్పరచి పంచాయితీ ఎన్నికలకి ముందు నుండే అందరినీ సన్నధం చేయడంతో విజయం సాధించగలిగారు.

రాజీనామా చేస్తామని ప్రకటించలేదు

      సీమాంధ్ర మంత్రులు రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను మంత్రి టిజి వెంకటేష్ ఖండించారు. రాష్ట్ర విభజనపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. తమ ప్రాంత ప్రజల అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని...రాజీనామాలు చేస్తామని ప్రకటించలేదన్నారు.   నాలుగు గోడల మధ్య జరిగిన భేటీపై వివరణ తీసుకొని వార్తలు రాస్తే బాగుండేదన్నారు. సమైక్య రాష్ట్రమే తాము కోరుతున్నామన్నారు.  వెనుకబాటుతనం విషయానికి వస్తే మాత్రం ప్రత్యేక రాయలసీమను ఏర్పాటు చేయాలని వారు అన్నారు. సమైక్యాంధ్ర కోసం ఏ త్యాగానికైనా సిద్ధమన్నామే గానీ రాజీనామాలను చెప్పలేదన్నారు. విభజన పైన కోర్ కమిటీ నిర్ణయం తీసుకున్నదనే గానీ.. విభజన ఇప్పుడే అని చెప్పలేదని అన్నారు.

కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదు

      కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే అవకాశమే లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ తేల్చి చెప్పారు. తెలంగాణ దిశగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో నారాయణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే ఉద్దేశమే లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఐతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన గట్టిగా డిమాండ్ వినిపించారు.   హైదరాబాద్ రాజధానిగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నారు. రాయల తెలంగాణ, హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడం వంటి ప్రతిపాదనలను అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మరోవైపు సీపీఏ అగ్రనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కూడా తెలంగాణ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణపై తుది నిర్ణయం ఖరారు చేసే ముందు ఈ డిమాండ్‌ను బలపరిచిన అన్ని రాజకీయ పార్టీలతో, ఆందోళనకు సారథ్యం వహిస్తున్న రాజకీయ జేఏసీతో సంప్రదింపులు జరపాలని ఆయన సూచించారు.

కాంగ్రెస్ కి వీరశివారెడ్డి రాజీనామా

      తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా కడప జిల్లా కమలాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు రాజీనామా చేస్తున్నట్లు లేఖ పంపించారు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సమైక్యాంధ్ర భావన మరీ బలంగా ఉన్న నేపధ్యంలో వీరశివారెడ్డి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడానికి ముందుగా చొరవ తీసుకున్నారనుకోవాలి. వీరశివారెడ్డి రాజీనామా ప్రకటనను అనుసరించి మరికొంతమంది కూడా వస్తారా?లేదా అన్నది చూడాల్సి ఉంటుంది.

కాంగ్రెస్‌కు గడ్డు కాలమే

      దేశవ్యాప్తంగా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సర్వేల హడావిడి మొదలైంది.. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రల్లో ప్రస్థుత రాజకీయ పరిస్థితిపై సీఎన్‌ఎన్‌ ఐబీఎన్‌ సర్వే నిర్వహించింది. వచ్చే సాధారణ ఎన్నికల్లో తమిళనాడు మినహా దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కాంగ్రెస్‌ పార్టీ, ప్రాంతీయ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని ఈ సర్వే తేల్చింది. గతంలో జరిగిన ఎలక్షన్స్‌లో వచ్చిన రిజల్ట్స్‌ ఈ సారి రాబోయే రిజల్ట్స్‌ పూర్తీ భిన్నంగా ఉండబోతున్నాయని తేల్చింది సర్వే..   ఆంద్రప్రదేశ్‌లో కూడా అధికార కాంగ్రెస్‌కు ఎదురు గాలి వీస్తుందని ఈ సారి ఎలక్షన్స్‌లో కాంగ్రెస్‌ గెలువటం చాలా కష్టమని తేల్చింది.. తెలంగాణ ఏర్పాటు తో పాటు జగన్‌ అంశం స్కాం లు ఇలా పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌కు ఎన్నికలు సవాల్‌ గా మారనున్నాయి. రాష్ట్రంలోని 55 శాతం మంది ప్రజలు... కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణపై తీసుకోబోయే నిర్ణయం ఆధారంగానే తమ నిర్ణయం ఉంటుందని చెప్పినట్లు సర్వేలో వెల్లడైంది.     రాష్ట్రంలో కాంగ్రెస్‌ సీట్ల సంఖ్య భారీగా పడిపోతుందని సీఎన్‌ఎన్‌ ఐబీఎన్‌ సర్వే స్పష్టంచేసింది. ప్రస్తుతం 33 సీట్లున్న అధికార కాంగ్రెస్‌ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 11 నుంచి 15 సీట్లకే పరిమితం కానుందని సర్వే తేల్చేసింది. అదే సమయంలో 2009లో పోటీలో లేని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ 11 నుంచి 15 స్థానాలు, ప్రస్తుతం 6 స్థానాలున్న ప్రతిపక్ష టీడీపీ 6 నుంచి 10 స్థానాలు గెలుస్తాయని సర్వే వెల్లడించింది.

సోనియా, మన్మోహన్ లకు రూ.33 మనియార్డర్‌

      తాజాగా ప్రణాలికా సంఘం ఇచ్చిన నివేదిక పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.. దేశంలో పేదరికం తగ్గిపోయిందని చెపుతున్న ప్రణాలికా సంఘం కేవలం 33రూపాయల 30 పైసలతో ఒక వ్యక్తి ఒక రోజు బతకవచ్చంటూ తేల్చింది.. దీనిపై బిజెపి సహా మిగతా పక్షాలని మండి పడుతున్నాయి..   ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు విజయ్‌ గోయల్‌ ఒక అడుగు ముందుకు వేసి వినూత్న నిరసనకు దిగారు. ప్రదాని మన్మోహన్‌ సింగ్‌తో పాటు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రణాలికా సంఘుం ఉపాధ్యక్షుడు మాంటెక్‌ సింగ్‌ అహ్లువాలియాలకు 33 రూపాయల 30 పైసలు మనీయార్డర్‌ చేశారు.. మీరు ఈ డబ్బుతో ఒక్క రోజంతా ఎలా బతకాలో చేసి చూపించాలని కొరారు.. ప్రస్ధుతం ప్రణాలికా సంఘం అంచనాలకు వాడుతున్న పద్దతులను మార్చాలని డిమాండ్‌ చేశారు.. ప్రభుత్వ పథకాలను పేదలకు అందకుండా చేసేందుకే ప్రభుత్వం ఇలాంటి తప్పుడు లెక్కలు చూపిస్తుందని ఆరోపించారు..

అప్పుడు కావాలని ఇప్పుడు వద్దంటున్న సిబిఐ

      అసలే స్కాములతో సతమతమవుతున్న కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పుడు మరో ఎదురు దెబ్బ తగిలింది.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనిమా గాందీ సన్నిహిత సహాయకుడు విన్సెంట్‌ జార్జ్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది.   జార్జ్‌కి వ్యతిరేకంగా నమోదైన కేసును మూసి వేయాలంటూ సిబిఐ వేసిన పిటిషన్‌ కొట్టేసిన కొర్టు జార్జ్‌పై విచారణ కొనసాగించటానికి కావలసిన ఆదారాలు ఉన్నాయని అభిప్రాయపడింది. సీబిఐ ప్రత్యేక కోర్టు జడ్జీ జెపియస్‌ మాలిక్‌ మాలిక్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. 1984 నవంబర్‌ నుంచి 1990 డిసెంబర్‌ మధ్య కాలంలో జార్జ్‌ ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారని 2000 సంవ్సతరంలో కేసు నమోదయింది.. రాజీవ్‌గాందీకి ప్రైవేట్‌ కార్యదర్శిగా వ్యవహరించారు జార్జ్‌. ప్రభుత్వోద్యోగిగా ఉండి భారీ ఆస్తులను కూడబెట్టుకోవడంతో పాటు.. బ్యాంక్‌లో 1.5 కోట్ల రూపాయల నగదు కూడాబెట్టారని గతంలో సిబిఐ ఆరోపించింది. కానీ ఇప్పుడు అదే సిబిఐ కేసును మూసి వేయాలంటూ కోర్టుకు నివేదికను సమర్పించింది. కానీ సిబిఐ వాదనను తప్పుపట్టిన  కోర్టు జార్జ్‌ పై విచారణ జరిపి నివేదికను అందచేయాలని సిబిఐని ఆదేశించింది.. ఆగస్టు 30న అతన్ని వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుపరచాలని ఆదేశించింది.

సీమంధ్ర మంత్రులు కిం కర్తవ్యం

  కాంగ్రెస్ అధిష్టానం ఒకవైపు రాష్ట్ర విభజన గురించి యోచిస్తుంటే మరోవైపు సమైక్యగానం చేస్తున్న మంత్రులందరూ ఈరోజు మినిస్టర్స్ క్వార్టర్స్ లో సమావేశమయి రాష్ట్రవిభజనను ఏవిధంగా అడ్డుకోవాలనే ఆలోచనలు చేసారు. పరిస్థితి ఇంతవరకు వచ్చిన తరువాత, ఇప్పుడు తమ రాజీనామాలు కేంద్రనిర్ణయాన్ని మార్చలేవని మంత్రి టీజీ వెంకటేష్ స్వయంగా అంగీకరించారు. అటువంటప్పుడు రాజీనామాలు చేసి అధిష్టానం ఆగ్రహానికి గురికావడం ఎందుకనే ఆలోచన కూడా వారిలో మొదలయింది. అందువల్ల రాజీనామాల ఆలోచనలు పక్కనబెట్టి ఆఖరి ప్రయత్నంగా డిల్లీ వెళ్లి రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచాలని కోరుతూ కేంద్రానికి మరోమారు విజ్ఞప్తి చేయాలని వారు నిశ్చయించుకొన్నారు.కానీ, అవసరమయితే పదవులకు రాజీనామాలు చేసేందుకు కూడా వెనకాడబోమని వారు చేపుతున్నపటికీ, అది కేవలం వృధా ప్రయాస మాత్రమేనని వారికి తెలుసు.సమావేశం అనంతరం వారు ముఖ్యమంత్రిని, పీసీసీ అధ్యక్షుడిని కలిసి సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను వారికి తెలియజేసి, అధిష్టానాన్ని రాష్ట్ర విభజన చేయకుండా ఒప్పించమని కోరినట్లు తెలుస్తోంది. అయితే, విభజన అనివార్యం అని తెలిసినప్పుడు వారు అటువంటి ప్రయత్నాలు చేయడంకంటే, తమ పార్టీకి అన్నివిధాల సహకరించి విభజన సజావుగా, సీమంధ్ర రాష్ట్ర ప్రజలకు పూర్తి న్యాయం జరిగేలా కృషిచేయడం మంచిదేమో.

కిరణ్ కుమార్ రెడ్డికి డిల్లీ నుండి మళ్ళీ పిలుపు

  బహుశః కేంద్రం తెలంగాణా ఏర్పాటు చేసేందుకు సన్నధం అవుతూ ఆ ప్రక్రియలో భాగంగా మళ్ళీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, ఉపముఖ్యమంత్రి దామోదరను, పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణను ఈనెల 26వ తేదీన డిల్లీకి రావలసిందిగా ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర విభజన జరుగుతున్నట్లయితే, ఇటువంటి సమయంలో సమైక్యాంధ్ర కోసం వాదిస్తున్నకిరణ్ కుమార్ ను ముఖ్యమంత్రిగా కొనసాగించడం ఎంత మాత్రం తగదని, అతని వల్ల తెలంగాణా ఏర్పాటులో సమస్యలు ఏర్పడవచ్చని, అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డిని పదవిలోంచి తొలగించి, ఈ సంధి కాలంలో ఇరుప్రాంతాలకు ఆమోదయోగ్యుడయిన మరొకరిని తాత్కాలికంగా ముఖ్యమంత్రిగా నియమించాలని, (కిరణ్ కుమార్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న) ఉపముఖ్యమంత్రి దామోదర రాజానరసింహ మరియు జైపాల్ రెడ్డి అధిష్టానాన్ని కోరినట్లు, (ఆయనను మొదటి నుండి వ్యతిరేకిస్తున్న) బొత్ససత్యనారాయణ కూడా వారికి తన మద్దతు తెలుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వారి వాదనకు బలం చేకూరుస్తున్నట్లు సచివాలయంలో తెలంగాణకు భూములకు సంబంధించిన ఫైళ్ళను కొందరు సీమంధ్ర ఉద్యోగులు, నేతలు తగలబెట్టేస్తున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరామ్ తీవ్ర ఆరోపణలు చేసారు. ఈ నేపద్యంలో వారినిరువురినీ డిల్లీకి రమ్మని కాంగ్రెస్ ఆదేశించడంతో కిరణ్ కుమార్ రెడ్డికి ఉద్వాసన తప్పదని పుకార్లు మొదలయ్యాయి.   కానీ, ఈ నెల 28న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగబోతోంది గనుక, రాష్ట్ర విభజనపై అంతిమ నిర్ణయం తీసుకొనే ముందు ఆయన నుండి మరిన్నిసలహాలు, సూచనలు స్వీకరించాలనే ఉద్దేశ్యంతోనే వారిని డిల్లీకి పిలిపించి ఉండవచ్చును తప్ప, తనకు అత్యంత విధేయుడయిన కిరణ్ కుమార్ రెడ్డికి ఉద్వాసన చెప్పే అవకాశం లేదు. మరో 8నెలలో ఎన్నికలను పెట్టుకొని కాంగ్రెస్ అధిష్టానం అటువంటి నిర్ణయం తీసుకోకపోవచ్చును.   అయినా రాష్ట్ర విభజన ఖచ్చితంగా జరుగుతుందా లేదా అనే విషయంపై కేవలం ఊహాగానాలే తప్ప ఇంతవరకు ఖచ్చితమయిన సమాచారం లేదు. అంటే, రాష్ట్ర విభజన చేయదలచుకోకపోతే మరింత సమయం పొందేందుకుగాను కాంగ్రెస్ అధిష్టానం ‘రెండవ యస్.ఆర్.సి.’ లేదా ‘రాయల తెలంగాణా’ వంటి ఆలోచనలు కూడా చేసే అవకాశాలున్నాయి. అదే జరిగేమాటయితే కిరణ్ కుమార్ రెడ్డిపై మరింత బాధ్యత పెరుగుతుందే తప్ప, ఆయనని తొలగించడం జరుగదు.   ఏమయినప్పటికీ, వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసి కాంగ్రెస్ తన నిర్ణయం ప్రకటించేవరకు ఈ సస్పెన్స్ సీరియల్ కొనసాగక తప్పదు. అంతవరకు ఇటువంటి ఆసక్తికరమయిన ట్విస్టులు తప్పవు మరి.

నైతికవిలువలకు తిలోదకాలు

  ఇటీవల కాలంలో వివిధ పార్టీల శాసనసభ్యులు, యంపీలు పార్టీలు మారుతున్నపటికీ తమ శాసన సభ, పార్లమెంటు సభ్యత్వాలు మాత్రం వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎవరయినా ఒక పార్టీని వద్దనుకొన్నపుడు, ఆ పార్టీ ద్వారా దక్కిన శాసనసభ, పార్లమెంటు సభ్యత్వం కూడా వదులుకొంటే హుందాగా ఉండేది. కానీ, నేడు రాజకీయ పార్టీలలో అటువంటి నైతిక విలువలు పాటించేవారు అరుదుగా కనిపిస్తుంటారు.   నిజానికి అటువంటి వారిపై సదరు పార్టీలు స్పీకర్ కు పిర్యాదు చేసిన వెంటనే విచారణ జరిపి అనర్హత వేటు వేయాలి. కానీ, కేంద్రంలో,రాష్ట్రంలో కూడా అధికారంలోఉన్న కాంగ్రెస్ పార్టీ, అటువంటి వారి మద్దతుతోనే మనుగడ సాధిస్తున్నందున వారిపై పిర్యాదు చేయకుండా వారిపై అనర్హత వేటు పడకుండా చూసుకొంటూ లోపాయికారిగా వారి మద్దతు పొందుతోంది.   ఉదాహరణకు ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పితెరాసలో చేరిన కాంగ్రెస్ యంపీలు మందా జగన్నాధం, వివేక్ ఇద్దరూ కూడా ఇంత వరకు తమ పదవులను అంటిపెట్టుకొనే ఉన్నారు. నిజానికి వారు పార్టీ వీడిన వెంటనే వారిపై కూడా అనర్హత వేటు వేయాలి. కానీ ఈ కారణాలతోనే వారిపై వేటు వేయలేదు. కేంద్రం యొక్క ఆ బలహీనత కారణంగానే వారు ఒకవైపు తెరాస సభ్యులుగా, మరో వైపు కాంగ్రెస్ యంపీలుగా కొనసాగుతున్నారు. వారు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళే ఆలోచనలు చేస్తున్నాట్లు సమాచారం. ఉద్యమం కోసమే తెరాసలో జేరమని చెపుతున్నవారు, తమకు పదవులు తృణప్రాయమని ఎన్ని గొప్పలు చెప్పుకొన్నపటికీ, నేటికీ వారు తమ పదవులను భద్రంగా అట్టేపెట్టుకొన్నారు. వాటిని పొందడం కోసం తాము ఎన్నికలలో చేసిన ఖర్చులను, తమ పదవులవల్ల వచ్చే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వారు ద్వంద పార్టీ విధానం అవలంబిస్తుంటే, ప్రభుత్వ మనుగడకు వారి మద్దతు ఎంతో అవసరం గనుక వారిపై వేటు వేయకుండా ప్రభుత్వం కూడా ఈ అనైతిక విధానాలకు ఆమోదం తెలుపుతోంది.   ఈవిధంగా ఒక వ్యక్తి ఏక కాలంలో రెండు పార్టీలలో సభ్యత్వం కలిగి ఉండటం అనైతికమేనని అందరికీ తెలిసినప్పటికీ, ఆ అనైతికతను కూడా నేడు ఆమోదించే స్థాయికి మన రాజకీయాలు దిగజారిపోయాయి. శాసనసభ జరిగినంత కాలం అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరినొకరు దూషించుకొంటూ, వాగ్వాదాలు చేసుకొంటూ విలువయిన సభాకాలాన్ని, అంత కంటే విలువయిన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంటారు. కానీ సభ నిరవధిక వాయిదా పడినప్పుడు ప్రభుత్వం అందించే వేల రూపాయల నజరానాలు నిస్సిగ్గుగా అందుకొంటారు. పూర్తి పతనావస్థకు చేరుకొన్న మన రాజకేయాలలో నైతిక విలువలు ఆశిస్తే భంగపాటు తప్పదు.

పాఠ్యాంశంగా అల్ ఖైదా సాహిత్యం

  ఓ కవి  కాదేది కవితకనర్హం చెప్పినట్టు. మన ఇండియాలో కాదేది వివాదానికనర్హం అన్నట్టుగా తయారైంది ఇండియా పరిస్థితి.. రాజకీయాలు, సినిమాలే కాదు ఆఖరికి విద్యావ్యవస్థ కూడా వివాదాలకు వేదిక అవుతుంది.తాజాగా ఓ యూనివర్సిటి చేసిన నిర్వాకంతో మరో సారి విద్యా వ్యవస్థలో వివాదాలు తలెత్తాయి.. కాలికట్ యూనివర్శిటీలోని డిగ్రీ విద్యార్ధుల పాఠ్యాంశాల్లో అల్ ఖైదా నేత రాసిన ఓ కవితను చేర్చడం వివాదాస్పదం అయింది. నిషిద్ధ అల్ ఖైదా తీవ్రవాద సంస్థకు చెందిన ఇబ్రహీం అల్ రుబాయిష్ ఈ కవితను రాశాడు. అమెరికా లోని గ్వాంటనామో బే జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో రుబాయిష్ ఈ కవితను రాశాడు.  'ఓడ్ టు ద సీ (సముద్రానికి నివేదన)' పేరుతో రాసిన ఈ గీతం ఇప్పుడు కాలికట్ వర్శిటీ సిలబస్ లో కనిపించడంతో నిరసనలు వెల్లువెత్తాయి. తక్షణమే ఈ సాహిత్యాన్ని పాఠ్య పుస్తకాల్లోంచి తొలగించాలని పలు విద్యాసంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ కోసం వేట సాగిస్తున్న సమయంలో.. ఆఫ్ఘన్-పాక్ సరిహద్దుల్లో అమెరికా దళాలకు పట్టుబడ్డ రుబాయిష్ కొంతకాలం పాటు గ్వాంటనామో బే జైల్లో ఉన్నాడు. తరువాత అతడిని సౌదీ అరేబియా జైలుకు తరలించారు. 2006లో అక్కడి నుంచి తప్పించుకున్న రుబాయిష్.. ప్రస్థుతం అల్ ఖైదాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

గంగుల వితండ వాదన

  ఇటీవల తెదేపాను వీడి తెరాసలో జేరిన తెదేపా కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ పై తెదేపా స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు పిర్యాదు చేయడంతో ఆయనపై అనర్హత వేటు ఎందుకువేయరాదో తెలుపమంటూ స్పీకర్ ఆయనకీ నోటీసు జారీ చేసారు. విచారణకు హాజరయిన కమలాకర్ తాను ఎటువంటి పార్టీ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడలేదని, తానూ నేటికీ తెదేపా శాసన సభ్యుడిగానే కొనసాగుతున్నానని, అందువల్ల తనపై అనర్హత వేటువేయడం సమంజసం కాదని వాదించారు. స్పీకర్ ఆయన కేసుని వాయిదా వేసారు. తెదేపా టికెట్ పై శాసనసభ సభ్యుడిగా ఎంపికయిన గంగుల, తెదేపా ద్వారా తనకు దక్కిన సభ్యత్వం వదులుకోవాలనుకోవట్లేదు. కానీ ఆ పార్టీలో సభ్యుడిగా మాత్రం కొనసాగేందుకు ఇష్టపడట్లెదు. అందుకే తెరాసలోకి మారారు. మరి అటువంటప్పుడు తానూ పార్టీ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడలేదని వాదించడం వితండవాదం కాక మరేమిటి?

ఫైళ్ళు తగలబెట్టేస్తున్నారు!

      సచివాలయంలో తెలంగాణకు భూములకు సంబంధించిన ఫైళ్ళు తగలబెట్టేస్తున్నారని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరామ్ ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని.. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ వస్తుందన్న భయంతో సీమాంధ్ర నేతలు తెలంగాణకు సంబంధించిన ఫైళ్ళను తగుగలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.   విభజనకు రంగం సిద్ధమవుతున్న సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రం విడిపోతే రెండు ప్రాంతాలకూ లాభమేనని కోదండరాం అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే చట్టబద్ధంగా తీర్చుకోవచ్చునన్నారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న సీమాంధ్ర నేతలు ఇప్పుడు రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదన్నారు. గురువారం నిర్వహించ తలపెట్టిన ధర్నాను ఆగస్టు 1కి వాయిదా వేశామని తెలిపారు. పంచాయితీ పూర్తిగా ముగిసిన తర్వాత ఫలితాల గురించి స్పందిస్తానని కోదండరాం చెప్పారు.

తెలంగాణ పై బొత్స కొత్త వ్యాఖ్య

      సీమాంధ్ర వ్యక్తిగా రాష్ట్రం యథాతథంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని, అన్నదమ్ములు విడిపోతానంటే ఇంటి పెద్ద ఎలా ఆలోచిస్తాడో తమ పార్టీ అధిష్టానం ఇప్పుడు ఆలాగే ఆలోచిస్తోందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీని గెలిపించినందుకు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఏకగ్రీవాల్లో కాంగ్రెసు పార్టీయే ఎక్కువ స్థానాలను సాధించిందన్నారు. మూడు అంచెల ఎన్నికలు పూర్తయ్యేసరికి కాంగ్రెసు పార్టీయే ముందంజలో ఉంటుందన్నారు.   తెలంగాణపై... విభజన సమస్యను రాజకీయాలతో ముడిపెట్టవద్దని బొత్స అన్నారు. రాజకీయ అవసరాల కోసం విభజన అంశాన్ని లేవనెత్తడం సరికాదన్నారు. ముఖ్యమంత్రిని ఏ ఒక్క ప్రాంతానికి ఆపాదించవద్దని కోరారు. సీమాంధ్ర వ్యక్తిగా తాను రాష్ట్రం యథాతథంగా ఉండాలని కోరుకుంటానని అయితే, అధిష్టానం నిర్ణయానికి మాత్రం కట్టుబడి ఉంటానని చెప్పారు. విభజన జరిగితే అభివృద్ధి ఆగిపోతుందనేదే తన ఆందోళన అన్నారు. ఓ కుటుంబంలోని అన్నదమ్ములు విడిపోతామంటే కుటుంబ పెద్ద ఎలా ఆలోచిస్తాడో కాంగ్రెసు పార్టీ అలాగే ఆలోచిస్తోందన్నారు.  

సాక్షి తప్పుడు ప్రచారం

      కాంగ్రెస్ హయాంలో ప్రపంచంలో ఎక్కడా లేనంతగా అవినీతి జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అవినీతిపై కాంగ్రెస్ నోరు విప్పడం లేదని మండిపడ్డారు. అవినీతి, అరాచకాలకు మరోపేరు వైసీపీ అని చంద్రబాబు దుయ్యబట్టారు. సాక్షి తప్ప మీడియా అంతా టీడీపీ గెలిచించదనే రాసాయని, ఒకప్పుడు అరాచకాలు, అవినీతే అనుకున్నాం. ఇప్పుడు అబద్దాలు, అసత్యాలు కూడా చెబుతోందన్నారు. వైసీపీ ఒకటిన్నర జిల్లా పార్టీని అని బాబు ఎద్దేవా చేశారు. దొంగ బంగారం అమ్మారని ఆరోపణ వచ్చిన సిద్ధార్థరెడ్డిని సస్పెండ్ చేసిన వైసీపీ జగన్ విషయంలో ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ డీఎన్ఏ ఉన్న పార్టీ వైసీపీ అని బాబు తెలిపారు. టీఆర్ఎస్, వైసీపీ విలీనం అవుతాయనే ఉద్దేశ్యంతో ఆ పార్టీలకు వచ్చిన స్థానాలను కూడా కలుపుకుని తమకే అధిక మెజార్టీ వచ్చిందని బొత్స చెబుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని కాంగ్రెస్ భ్రమపడింది. వరదల వల్ల నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకోవాలని బాబు కోరారు. ప్రజలే తీర్పు ఇచ్చిన తర్వాత సర్వేలు ఏవిధంగా ప్రామాణికం అవుతాయని ప్రశ్నించారు.నూటికి వెయ్యి శాతం అధికారంలోకి వస్తున్నామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ఆఫర్ ని బీజేపీ అందుకోగలదా

  కర్ణుడి చావుకి వేయి శాపాలు, వేయి కారణాలు అన్నట్లు, మోడీకి కూడా బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా పేరు ఖాయం చేసుకోవడానికి అన్నిఅవాంతరాలు, అభ్యంతరాలు, విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే, ఆ అవకాశం ఇతరులకు ఎందుకు ఈయడమని బీజేపీ నేతలే ఆపని స్వయంగా చక్కబెడుతున్నారు. ప్రస్తుతం బీజీపీని ఎన్నికలలో గెలిపించగలమని భరోసా ఇచ్చే నాయకుడు ఆ పార్టీలో ఒక్కడు కూడా లేకపోయినప్పటికీ, అందుకు సిద్దపడిన మోడీని అందరూ కలిసి క్రిందకి లాగుతున్నారు. మోడీ విషయంలో బీజేపీ రెండుగా చీలిపోయి కొట్టుకొంటుంటే, ఒడ్డున కూర్చొన్న కాంగ్రెస్, జేడీ (యు) వంటి పార్టీలన్నీఅవకాశం దక్కినప్పుడల్లా యధాశక్తిన మోడీపై నాలుగు రాళ్ళు వేస్తున్నాయి.   మరో ఐదు నెలల్లో మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ‘జన్ ఆశీర్వాద్ యాత్ర’ పేరుతో ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పార్టీ సీనియర్ నేతలయిన అద్వానీ, వాజ్‌పేయి, మురళిమనోహర్ జోషీ, సుష్మ స్వరాజ్ ఫొటోలతో కూడిన బ్యానర్లు, గోడ పత్రికలు ఏర్పాటు చేశారు. కానీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న నరేంద్రమోడీ ఫొటో మాత్రం ఎక్కడా కనపడలేదు. ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఉన్న మోడీని ఆ సభకు ఆహ్వానించలేదు. ఇదే విషయం గురించి మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే, “ఇది రాష్ట్రానికి సంబందించిన కార్యక్రమం,” అని క్లుప్తంగా జవాబిచ్చారు. “మోడీని ఆహ్వానించారా?” అంటే జాతీయ నేతలందరికీ ఆహ్వానాలు పంపామని చెప్పడం చూస్తే మోడీ పట్ల ఆయన అభిప్రాయం ఏమిటో అర్ధం అవుతుంది. శివరాజ్‌సింగ్ చౌహాన్ అద్వానీ అనుచరుడిగా అందరికీ సుపరిచితుడు. అందువల్ల అతను కూడా మోడీని వ్యతిరేఖించడంలో ఆశ్చర్యం లేదు.   పార్టీలో ఇటువంటి రాజకీయాలు కొనసాగడం వలన, బీజేపీ పట్ల ప్రజలలో అపనమ్మకం కలగడం సహజం. కాంగ్రెస్ తన ఐదేళ్ళ పాలనలో అన్నిరంగాలలో తీవ్ర వైఫల్యాలు చవిచూస్తూ, అనేక కుంభకోణాలలో చిక్కుకొని అవినీతి మరకలు అంటించుకొని అత్యంత బలహీన పరిస్థితిలో ఉన్న ఈ తరుణంలో, దానికి ఏకైక ప్రత్యామ్నాయంగా ఉన్న బీజేపీ ఈవిధమయిన అంతః కలహాలతో కాంగ్రెస్ అందిస్తున్న ఒక సువర్ణావకాశాన్నిదూరం చేసుకోబోతున్నట్లు కనబడుతోంది.