పంచాయతీలో వైకాపాకి షాక్
posted on Jul 24, 2013 @ 10:59AM
పంచాయతీ మొదట విడత ఎన్నికల్లో అధిక స్థానాలు మావేనంటూ వైకాపా నేతలు చేసిన ప్రకటనలు ఫలించలేదు. ఆ పార్టీకి కంచుకోటగా భావిస్తున్న రాయలసీమలోనూ వైఎస్ఆర్. కాంగ్రెస్ ఎక్కువగా ప్రభావం చూపలేకపోయింది. కడపలో తప్ప మిగిలిన మూడు చోట్ల వైకాపా వెనకబడింది. చిత్తూరు, అనంతపురం,కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్, టిడిపిల కంటే వెనకబడింది.
తెలంగాణాలో అయితే వైకాపా పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలో ప్రభావం లేకపోయింది. మహాబూబ్ నగర్ లో మాత్రం ఆలంపూర్, గద్వాల్ వంటి నియోజకవర్గాలలో స్థానిక నాయకత్వ ప్రభావ౦తో 80కి పైగా స్థానాలను కైవసం చేసుకుంది. తర్వాత జరిగే రెండు విడతల్లో దాదాపు పార్టీ ప్రభావం కనిపించని పరిస్థితి నెలకొందని అంటున్నారు.
ఆంధ్రాలోనూ తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో కొద్దిపాటి ఆధిక్యాన్ని కనబరిచిన మిగిలిన చోట్ల ఆ స్థాయి ప్రభావాన్ని చూపలేకపోయింది. అయితే తర్వాత జరిగే రెండు విడతల ఎన్నికల్లో ఈ మాత్రం పలితాలు రాబట్టడం పార్టీకి కష్టమేనని అంటున్నారు.