7 గంటలకు తెలంగాణపై ప్రకటన

  కొద్ది సేపటి క్రితం ముగిసిన యుపీయే మిత్ర పక్షాల సమావేశంలో పాల్గొన్న అన్నిభాగస్వామ్య పార్టీలు తెలంగాణా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ తీసుకొన్న నిర్ణయానికి తమ ఆమోదం తెలిపాయి. దాదాపు 50 నిమిషాలు సాగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సహా కాంగ్రెస్ పెద్దలందరూ మరియు యుపీయే భాగస్వాములయిన అజిత్ సింగ్, శరద్ పవర్, ఫరూక్ అబ్దుల్లా, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన అజిత్ సింగ్ తెలంగాణ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొన్నామని తెలిపారు.   ప్రస్తుతం సోనియా గాంధీ నివాసంలో కీలకమయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం మొదలయింది. అయితే, ఈ కమిటీలో ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి సభ్యులు కాకపోవడం చేత వారిని ఈ సమావేశానికి ఆహ్వానించలేదు. తెలంగాణా ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకొన్న కాంగ్రెస్ అధిష్టానం కేవలం తన నిర్ణయాన్ని ఆమోదించడానికి మాత్రమే ఈ సమావేశం నిర్వహిస్తోంది.   అ తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారికంగా తెలంగాణా ఏర్పాటు చేస్తున్నట్లు ఒక ప్రకటన చేస్తుంది. రేపు జరగనున్నకేంద్ర క్యాబినెట్ సమావేశంలోయుపీయే మరియు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలు తీసుకొన్ననిర్ణయాన్నిఆమోదం పొందిన తరువాత, దానిని రాష్ట్రపతి అనుమతికి పంపుతారు. అప్పుడు రాష్ట్రపతి రాష్ట్ర శాసనసభకు ఆ ప్రతిపాదనను పంపి దానిపై తీర్మానం కోరుతారు. రాష్ట్ర శాసనసభ తెలంగాణా బిల్లుకు అనుకూలంగా తీర్మానం చేసినట్లయితే, అప్పుడు దానిని పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఒకవేళరాష్ట్ర శాసనసభ తెలంగాణాను వ్యతిరేఖిస్తూ తీర్మానం చేసినప్పటికీ, కేంద్రందే అంతిమ నిర్ణయం గనుక యుపీయే ప్రభుత్వం తెలంగాణా బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెడుతుంది. పార్లమెంటు ఆమోదం పొందిన తరువాత రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలవుతుంది.   ఇప్పుడు రాష్ట్ర విభజన ఖాయమని తెలిసిపోవడంతో, ఇక హైదరాబాద్ విషయంలో కాంగ్రెస్ ఏవిధమయిన నిర్ణయం తీసుకొంటుందనే విషయం తేలవలసి ఉంది. అయితే ఆ విషయంపై ఇప్పటికిప్పుడు ప్రకటన చేయక పోవచ్చును. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు మాత్రమే సూత్రప్రాయంగా ఒక ప్రకటనతో సరిపెట్టవచ్చును.

కొద్ది సేపట్లో తెలంగాణ పై ప్రకటన

        యూపీఏ సమన్వయ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం యుపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధి నివాసంలో సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం సుమారు గంట, గంటన్నరపాటు జరగవచ్చునని భావిస్తున్నారు. ఆ తర్వాత ఏడు గంటల ప్రాంతంలో సీడబ్ల్యూసీ సమావేశంలో వెల్లడైన అభిప్రాయాలపైనా, తీర్మానం గురించీ అధికారికంగా మీడియా సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది.   తెలంగాణా అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం అంతిమ నిర్ణయం ప్రకటించే క్షణాలు సమీపిస్తుండడంతో ప్రధాని డాక్టర్ మన్‌మోహ న్ సింగ్ నివాసం వద్ద పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలతో సమన్వయ కమిటీ సమావేశం దాదాపు గంటసేపు జరిగింది. గతంలో ఎప్పుడూ ప్రధాని ఇంటివద్ద ఇంత పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేయలేదు. తెలంగాణాపై ఏం నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తితో ప్రధాని ఇంటి సమీపంలో మీడియా ప్రతినిధులు గుమికూడారు.

తెలంగాణ పై నిర్ణయం జరిగిపోయింది: సోనియా

      ప్రత్యేక తెలంగాణ పై నిర్ణయం జరిగిపోయిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సీమాంధ్ర నేతలకు స్పష్టం చేశారు. అయితే అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగే విధంగా నిర్ణయం ఉంటుందని కూడా ఆమె చెప్పారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని నేతలకు సోనియా సూచించారు. కాంగ్రెస్ ఎవరికి వ్యతిరేకం కాదని ప్రజలకు చెప్పాలని ఆమె అన్నారు. ఈ రోజు సోనియా గాంధీని కలిసిన సీమాంధ్ర నేతలను ఆమె బుజ్జగించినట్లు సమాచారం. తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని, ఈ పరిస్థితుల్లో వెనక్కి వెళ్లలేమని ఆమె వారితో చెప్పినట్టు తెలియవచ్చింది. ఈ ఒక్కరోజుతో అంతా అయిపోందని అనుకోవద్దని ఆమె నచ్చ చెప్పినట్లు సమాచారం.

ఉత్కంఠ: యూపిఎ సమావేశం ప్రారంభం

      ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో యూపిఎ సమన్వయ కమిటీ భేటి ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్, షిండే చిదంబరం, అజిత్ సింగ్ హాజరయ్యారు. అంతకముందు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్య నారాయణ ప్రధాని నివాసానికి చేరుకున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వార్తల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు టివిలకు అతుక్కుపోయారు. రాష్ట్ర పరిణామాల పైన ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్న తమ బంధువుల నుండి సమాచారం తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.  

టి పై నిర్ణయం తీసుకోవచ్చు..తీసుకోకపోవచ్చు

      తెలంగాణ రాష్ట్రంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ లో ఏకాభిప్రాయం రాకపోతే నిర్ణయం తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చునని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. తెలంగాణ సమస్య చాలా ఏళ్ళుగా అంటే 1956 నుంచి పెండింగ్‌లో ఉందని, దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. తెలంగాణకు సంబంధించి ముసాయిదా సిద్ధమయిందని, దానిని సీడబ్ల్యూసీలో ప్రవేశపెడతామని షిండే చెప్పారు.   ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని సుశీల్ కుమార్ షిండే తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు తెలంగాణపై హస్తినలో కాంగ్రెస్ అగ్రనేతల మంతనాలు ముమ్మరంగా సాగుతున్నాయి.  

టి.బిల్లుపై సుష్మాకు ప్రధాని ఫోన్

      తెలంగాణపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో తెలంగాణ బిల్లుకు మద్దతివ్వాలని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు, ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్‌ కోరారని ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు, అంబర్ పేట శాసన సభ్యుడు కిషన్ రెడ్డి విలేకరులతో చెప్పారు. దీంతో తెలంగాణ ఏర్పాటు తధ్యం అని తేలిపోయింది. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలపాలని సుష్మ స్వరాజ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పారు. తాము హైదరాబాదు రాజధానికి పది జిల్లాలతో కూడిన తెలంగాణపై బిల్లు పెడితే మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు.

సెంటిమెంట్ గౌరవించాలి: టిపై చిరంజీవి

      రాష్ట్ర విభజన పై ఈరోజు నిర్ణయం వస్తుందన్న నేపథ్యంలో ముగ్గురు కేంద్రమంత్రులు, ముగ్గురు పార్లమెంటు సభ్యులు మధ్యాహ్నం పార్టీ అధ్యక్షురాలు సోనియాను కలుసుకున్నారు. చిరు, పళ్లం రాజు, జెడి శీలం, కనుమూరి బాపిరాజు తదితరులు ఉన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.   అన్ని ప్రాంతాల సెంటిమెంట్ లను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని, పార్టీ, ప్రజల భవిష్యత్తు ,సెంటిమెంటును పరిగణనలోకి తీసుకోవాలని కోరామని వారు అన్నారు. అందరికి న్యాయమైన నిర్ణయం జరుగుతుందన్న నమ్మకం కలిగిందని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. రాహుల్ తోకూడా తాము సమావేశం అయ్యామని, అందరూ తమకు సమానమేనని ఆయన స్పష్టం చేశారని అన్నారు. ఎవరికి అన్యాయం జరిగిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించామని చిరంజీవి తెలిపారు. ఇరు ప్రాంతాల భవిష్యత్తు ముఖ్యమన్నారు. తనకు అందరూ సమానమే అన్నారు. ఇరువర్గాల సెంటిమెంట్‌ను అర్థం చేసుకోవాలన్నారు. తమకు తమ భవిష్యత్తు ముఖ్యం కాదని ప్రజలు, పార్టీ భవిష్యత్తు ముఖ్యమన్నారు.

టి ఎఫెక్ట్: 15 సీమాంద్ర మంత్రులు రిజైన్!

      సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తే పదిహేను మంది సీమాంద్ర మంత్రులు రాజీనామాకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్‌ను కలిసిన అనంతరం మంత్రి గంటా శ్రీనివాస రావు విలేకరులతో మాట్లాడారు. నేషనల్ కాన్పరెన్సు కూడా తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పిన విషయాన్ని గమనిస్తే పార్టీ అధిష్టానం తమ వైఖరి మార్చుకుంటుందని భావిస్తున్నామని ఆయన అన్నారు.   రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఫలితం వస్తే పదిహేను మంది మంత్రులం రాజీనామా లేఖలపై సంతకాలు చేసి సిద్ధంగా ఉన్నామన్నారు.సమైక్య రాష్ట్రానికి మంత్రులుగా ఉన్నామని, విభజన నిర్ణయం జరిగాక మంత్రులుగా కొనసాగడం సరికాదని భావిస్తున్నామని అన్నారు.తమ అభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే రాజీనామా ఆమోదించాలని తమ లేఖలను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇచ్చినట్లు చెప్పారు. రాయలసీమకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నామని మరో మంత్రి ఎరాసు ప్రతాపరెడ్డి చెప్పారు. రాయలసీమ ఎమ్మెల్యేలతో సమావేశం జరపాలని నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు.

రాష్ట్ర విభజనపై సీమాంద్ర నేతల అల్టిమేటం

      రాష్ట్ర విభజన విషయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని సీమాంధ్ర నేతలు కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి తేల్చి చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏకపక్ష నిర్ణయాలు జరిగితే పార్లమెంటులో తేల్చుకుంటామని అన్నట్లుగా తెలుస్తోంది. సీమాంద్ర నేతలు ఈరోజు ఉదయం రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. రాష్ట్ర విభజన కూడదని, అదే జరిగితే దేనికైనా సిద్ధమని తేల్చి చెప్పినట్లుగా సమాచారం. తమ మౌనం మరోరకంగా ఊహిస్తే తగిన ఫలితం ఉంటుందని చెప్పారు. ఆహార బిల్లుకు మద్దతిచ్చే అంశంపై పునరాలోచించాల్సి ఉంటుందని ఘాటుగా చెప్పినట్లుగా తెలుస్తోంది. తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోమని తాము చెప్పమని కానీ, శాస్త్రబద్దంగా ఉండాలని డిమాండ్ చేశారు. ఎస్సార్సీ ద్వారా విభజించాలని కోరారు.  రాష్ట్ర విభజన పై శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఏమైనట్లని ప్రశ్నించారు. వాటిని ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని నిలదీశారు. ఏ ప్రాతిపదికన విభజన చేస్తున్నారో స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ డే: డెసిషన్‌ ఎలా ఉండబోతుంది

      ప్రత్యేక రాష్ట్రం దిశగా కాంగ్రెస్‌ వేగం పెంచిందిజ దశాబ్దాలుగా నలుగుతున్నసమస్యకు ఈ రోజు ఓ పరిష్కారం చూపించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్‌ యూపిఏ భాగస్వామ్య పక్షాలతో చర్చించనుంది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రదాని నివాసంలో జరగనున్న సమన్వయ కమిటీ మీటింగ్‌లో కాంగ్రెస్‌ తన నిర్ణయానికి భాగస్వామ్య పక్షాలను ఒప్పించే ప్రయత్నం చేయనుంది..   చాలా రోజులుగా కొద్దిరోజుల్లో అని చెబుతున్న సిడబ్ల్యూసి మీటింగ్‌ను కూడా ఈ రోజే నిర్వహించడానికి రెడీ అయింది.. సాయంత్ర కో ఆర్డినేషన్‌ కమిటీ మీటింగ్‌ ముగియగానే ఐదున్నర గంటలకు సోనియా నివాసంలో సిడబ్ల్యూసి మీటింగ్‌ జరగనుంది. ఈ మీటింగ్‌ ముగియగానే తెలంగాణపై కాంగ్రెస్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించనుంది. ఇప్పటికే యుపిఏ భాగస్వామ్య పక్షాలు తెలంగాణ ఏర్పాటుకు సమ్మతించగా మిగతా పక్షాలను కూడా ఈ రోజు ఒప్పించిన ఓ నిర్ణయం వెలువరించాలనుకుంటుంది కాంగ్రెస్‌.. అయితే కాంగ్రెస్‌ నిర్ణయం ఎలా ఉండబోతుంది అన్న దాని మీదే ప్రదానంగా చర్చ జరుగుతుంది. పది జిల్లాల తెలంగాణా? అదనంగా రెండు జిల్లాలు కలిపిన రాయల తెలంగాణా? హైదరాబాద్‌ను ఎంతకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తారు? కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తారా? ఇలా ఎన్నో ప్రశ్నలకు ఈ రోజు సాయంత్రం ఓ సమాధానం దొరకనుంది. అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి, హైదరాబాద్‌ను కొంత కాలంపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించనున్నారట.

కిరణ్ రాజీనామా చేయలేదు

      రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన వార్తలను ఆయన కార్యాలయం ఖండించింది. నిన్న రాత్రి పదకొండు గంటలకు ముఖ్యమంత్రి కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అయితే కిరణ్ మాత్రం రాష్ట్ర విభజన పై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. సిఎంవో విడుదల చేసిన ప్రకటనలో... తాను అధిష్టానానానికి రాజీనామా సమర్పించేసినట్లు ఎలాంటి నిర్ధారణ, ఆధారాలు లేకుండా ఎలా రాసేస్తారని ఆయన అడిగారు. ఏదైనా ఉంటే నా వివరణ తీసుకోవాలని, ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు కథనాలు ప్రచురించడం సమంజసం కాదని ప్రకటనలో ముఖ్యమంత్రి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి అలాంటి ఆలోచనల్లో లేరని కూడా సిఎంవో స్పష్టం చేసింది.

తెలంగాణా ఏర్పాటుపై దిగ్విజయ్ సానుకూల సంకేతాలు

  రేపు రాష్ట్ర విభజనపై ఖచ్చితంగా తుది నిర్ణయం ప్రకటిస్తామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్ స్ఫష్టం చేశారు. ఈ విషయమై ఇప్పటికే అన్ని వర్గాలతో చర్చలు ముగిసినందున ఇక రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాష్ట్ర విభజనపై తుది నిర్ణయం ప్రకటిస్తామని ఆయన తెలిపారు. దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు శాసనసభలో తీర్మానం తప్పని సరి కాదని, అది కేవలం ఒక రాజ్యంగ విధానం మాత్రమేనని చెప్పడం గమనిస్తే రాష్ట్ర విభజన ఖాయమయినట్లు తెలుస్తోంది. డిల్లీ నుండి వస్తున్న తాజా సమాచారం ప్రకారం తెలంగాణా ప్రజలు కోరుకొంటున్న విధంగానే 10 జిల్లాలతో కూడిన తెలంగాణా ప్రకటించవచ్చునని తెలుస్తోంది. అయితే, హైదరాబాద్ ను రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చేసి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన సజావుగా పూర్తయ్యి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని ఏర్పాటు చేసుకొనే వరకు, అంటే కనీసం 4 లేదా5 సం.ల వరకు హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచే అవకాశం ఉంది. తెలంగాణా గవర్నర్ కే హైదరాబాద్ బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉంది.

అమ్మకానికి రాజ్యసభ సీట్లు

  మరోసారి ఓ కాంగ్రెస్ ఎంపి సంచనల వ్యాఖ్యలతో వివాదాస్పదమయ్యాడు. 100 కోట్లు ఉంటే రాజ్యసభ సభ్యుడు కావచ్చు అంటూ ప్రకటించిన సదరు ఎంపి తనకు మాత్రం కేవలం 80 కోట్లకే ఆ అవకాశం దక్కిందని ప్రకటించాడు. హర్యన నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యుడు భీరేందర్ సింగ్ ఈ సంచలన వ్యాఖలు చేశారు. అయితే తన వ్యాఖ్యలపై దుమారం రేగుతుందని గుర్తించిన సింగ్ వెంటనే నాలుక కరుచుకున్నా ఈ లోపు జరగాల్సి న నష్టం జరిగిపోయింది.. దీంతో లోక్ సభ సమావేశాలు దగ్గర పడుతున్ననేపధ్యంలో బిజిపికి కాంగ్రెస్ ను విమర్శించటానికి మరో అస్త్రం దొరుకినట్టయింది. ఇప్పటికే ఈ విషయం పై స్పందించిన బిజిపి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను భ్రష్టు పట్టింస్తుందని తీవ్రంగా విమర్శించింది.

పది జిల్లాల తెలంగాణే..?

  కేంద్రం తెలంగాణ విషయం తేల్చేయటానకే సిద్దం అయింది. రేపు జరగనున్న సీడబ్ల్యూసి మీటింగ్ లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఇప్పటికే వినిపిస్తున్న వార్తల ప్రకారం పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రానికే కేంద్రం మొగ్గుచూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సీయంతో సహా రాష్ట్ర నాయకత్వానికి ఆ దిశగా సంకేతాలను కూడా అందించినట్టుగా తెలుస్తుంది. దీంతో సీమాంద్ర నాయకత్వం ఆలోచనలో పడింది. రేపు ప్రకటన సమైక్యాంద్రకు వ్యతిరేకంగా ప్రకటన వెలువడిన నేపధ్యంలో తమ కార్యచరణ ఎలా ఉండాలి అన్న దానిపై చర్చిస్తున్నారు. ఇప్పటి వరకు అందుతున్నసంకేతాలను బట్టి పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రన్నే రేపు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించనుంది అన్న వార్త బలంగా వినిపిస్తుంది.

లక్ష కోట్లు: కొండాపై జగన్ ఆగ్రహం

      కొండా సురేఖ తీరుపై పార్టీ నేతలతో చంచల్ గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్ర విభజన పై ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, పార్టీ పై మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన విమర్శలు నేపధ్యంలో వైయస్ఆర్.  కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ, పార్టీ సీనియర్ నేతలు మైసూరా రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు జైలులో ఉన్న జగన్ ని కలిసి, దాదాపు గంటకు పైగా చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహ౦ జగన్ వారికి చెప్పినట్లుగా తెలుస్తోంది. కొండా సురేఖ, ఇతర తెలంగాణ నేతల హెచ్చరికలు, సమైక్యాంధ్ర నేతల రాజీనామాల అంశం కూడా చర్చకు వచ్చింది.

రేపే విడుదల

  తెలంగాణ పై తేల్చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అయింది.. రేపు 4 గంటలకు యుపిఎ సమన్వయ కమిటీ మీటింగ్ నిర్వహించనున్న అధిష్టానం ఆ తరువాత వెంటనే ఐదున్నర గంటలకు  సిడబ్ల్యూసి మీటింగ్ కూడా నిర్వహించడానికి రెడీ అవుతుంది.. వర్కింగ్ కమిటీ మీటింగ్ పూర్తవగానే నిర్ణయం వెలువడుతుందన్నారు రాష్ట్రవ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితు ఉద్రిక్తంగా మారుతున్నాయి.. ఇప్పటికే సీమాంద్ర ప్రాంతంలో భారీ ఆందోలనలు జరుగుతుండటంతో కేంద్ర బలగాలను రాష్ట్రానికి పంపుతున్నారు. ఇప్పటికే 1200 బలగాలు సీమాంద్ర ప్రాంతాల్లో ఉండగా, మరో 1000 బలగాలను రాష్ట్రనికి పంపుతున్నారు. ఇప్పటికే డిజిపి, ఛీఫ్ సెక్రటరీలతో చర్చించిన కేంద్ర హోంశాఖ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొవటానికి రెడీ అవుతున్నారు. రేపు ప్రకటన వెలువడనున్ననేపథ్యంలో పరిస్థితులు క్షణ క్షణానికి మారుతున్నాయి.

జగన్ రిమాండ్ పొడిగింపు

      వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, ఓఎంసి, ఎమ్మార్ కేసు నిందితుల రిమాండును సిబిఐ ప్రత్యేక కోర్టు ఆగస్టు 12 వరకు పొడిగించింది. జగన్ తదితరులను కోర్టు వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించారు. జగన్, విజయసాయి రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందం, గాలి జనార్ధన్ రెడ్డి, సునీల్ రెడ్డి తదితరుల రిమాండును పొడిగించారు.   జగన్ ఆస్తులు, ఓఎంసి, ఎమ్మార్ కేసుల్లో కోర్టుకు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డి, బిపి ఆచార్య, ఎల్వీ సుబ్రహ్మణ్యం, కోనేరు రాజేంద్ర ప్రసాద్, నిత్యానంద రెడ్డిలు హాజరయ్యారు.