చంద్రబాబు కష్టం ఫలించిందా
గత రెండేళ్లుగా గడ్డు కాలం ఎదుర్కొన్నతెలుగుదేశం పార్టీ ఎట్టకేలకు మొన్న జరిగిన పంచాయితీ ఎన్నికలలో ఘన విజయం సాధించడంతో మళ్ళీ ఆ పార్టీ దారిన పడుతున్నట్లు కనబడుతోంది. ఇందుకు ప్రధాన కారణాలు ఆ పార్టీ తెలంగాణా అనుకూల వైఖరి ప్రకటించడం, అదే సమయంలో చంద్రబాబు తన సీమంధ్ర నేతలని అదుపుతప్పకుండా ఉంచగలగడం, ఆయన తన శక్తికి మించి శ్రమపడి పాదయాత్ర చేయడం, పంచాయితీ ఎన్నికలను కూడా సాధారణ ఎన్నికలంత సీరియస్ గా తీసుకొని పకడ్బందీ వ్యూహాలతో పార్టీ శ్రేణులకు మార్గదర్శనం చేయడం, అంతే స్పూర్తితో పార్టీ క్యాడర్లు కూడా పనిచేయడంవంటివన్నీకలిసి పంచాయితీ ఎన్నికలలో ఆ పార్టీకి ఘనవిజయం సాధించిపెట్టాయి.
మొదట్లో తెదేపా రెండు ప్రాంతాలలో పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర విభజనపై రెండు కళ్ళ సిద్ధాంతం పాటించినప్పటికీ, అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా తీసుకోవడంతో తెలంగాణా ప్రాంతంలో ఆ పార్టీ పరిస్థితులు క్రమంగా మెరుగుపడ్డాయి. (నేటికీ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర విభజనపై కుమ్ములాడుకొంటుంటే, వైకాపా తన వైఖరి ప్రకటించడానికి కూడా జంకుతోంది.) అదే సమయంలో ఆయన తెలంగాణాలో పాదయాత్ర చేయడం కూడా పార్టీకి కలిసివచ్చింది.
ఆ సమయంలో తెరాస, తెదేపాను దాని అధ్యక్షుడు చంద్రబాబును ఎంతగా విమర్శలు చేసినప్పటికీ, ఆయన తన సీమంద్రా నేతలను కట్టడి చేయడంతో, తెలంగాణా ప్రజలు తెరాస మాటలు నమ్మలేదు. దానితో చంద్రబాబులో, తెదేపా నేతలలో, క్యాడర్లలో కొత్త ఉత్సాహం వచ్చింది. తత్ఫలితంగా సీమంధ్ర ప్రాంతంలో కంటే తెలంగాణాలోనే ఆయన పాదయాత్ర మరింత ఉత్సాహభరితంగా, దిగ్విజయంగా సాగింది. ఆయన తన పాదయాత్రలో మారుమూల గ్రామాలలో కార్యకర్తలను కూడా కలుస్తూ, జిల్లాలవారిగా సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తూ ముందుకు సాగడం వలన పాదయాత్ర వలన పార్టీకి ప్రయోజనం చేకూరింది.
ఇక, విశాఖలో నిర్వహించిన బహిరంగ సభ ఊహించిన దానికంటే చాలా విజయవంతం అయ్యింది. పాదయాత్ర ముగించిన తరువాత చంద్రబాబు కార్యాలయానికి చేరుకొన్న వెంటనే ముందుగా పార్టీని చక్కదిద్దే పనిలో పడ్డారు. నేతలకి, కార్యకర్తలకి మధ్య చక్కని సమన్వయం ఏర్పరచి పంచాయితీ ఎన్నికలకి ముందు నుండే అందరినీ సన్నధం చేయడంతో విజయం సాధించగలిగారు.