కిరణ్ కుమార్ రెడ్డికి డిల్లీ నుండి మళ్ళీ పిలుపు
posted on Jul 24, 2013 @ 8:43PM
బహుశః కేంద్రం తెలంగాణా ఏర్పాటు చేసేందుకు సన్నధం అవుతూ ఆ ప్రక్రియలో భాగంగా మళ్ళీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, ఉపముఖ్యమంత్రి దామోదరను, పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణను ఈనెల 26వ తేదీన డిల్లీకి రావలసిందిగా ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర విభజన జరుగుతున్నట్లయితే, ఇటువంటి సమయంలో సమైక్యాంధ్ర కోసం వాదిస్తున్నకిరణ్ కుమార్ ను ముఖ్యమంత్రిగా కొనసాగించడం ఎంత మాత్రం తగదని, అతని వల్ల తెలంగాణా ఏర్పాటులో సమస్యలు ఏర్పడవచ్చని, అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డిని పదవిలోంచి తొలగించి, ఈ సంధి కాలంలో ఇరుప్రాంతాలకు ఆమోదయోగ్యుడయిన మరొకరిని తాత్కాలికంగా ముఖ్యమంత్రిగా నియమించాలని, (కిరణ్ కుమార్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న) ఉపముఖ్యమంత్రి దామోదర రాజానరసింహ మరియు జైపాల్ రెడ్డి అధిష్టానాన్ని కోరినట్లు, (ఆయనను మొదటి నుండి వ్యతిరేకిస్తున్న) బొత్ససత్యనారాయణ కూడా వారికి తన మద్దతు తెలుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వారి వాదనకు బలం చేకూరుస్తున్నట్లు సచివాలయంలో తెలంగాణకు భూములకు సంబంధించిన ఫైళ్ళను కొందరు సీమంధ్ర ఉద్యోగులు, నేతలు తగలబెట్టేస్తున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరామ్ తీవ్ర ఆరోపణలు చేసారు. ఈ నేపద్యంలో వారినిరువురినీ డిల్లీకి రమ్మని కాంగ్రెస్ ఆదేశించడంతో కిరణ్ కుమార్ రెడ్డికి ఉద్వాసన తప్పదని పుకార్లు మొదలయ్యాయి.
కానీ, ఈ నెల 28న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగబోతోంది గనుక, రాష్ట్ర విభజనపై అంతిమ నిర్ణయం తీసుకొనే ముందు ఆయన నుండి మరిన్నిసలహాలు, సూచనలు స్వీకరించాలనే ఉద్దేశ్యంతోనే వారిని డిల్లీకి పిలిపించి ఉండవచ్చును తప్ప, తనకు అత్యంత విధేయుడయిన కిరణ్ కుమార్ రెడ్డికి ఉద్వాసన చెప్పే అవకాశం లేదు. మరో 8నెలలో ఎన్నికలను పెట్టుకొని కాంగ్రెస్ అధిష్టానం అటువంటి నిర్ణయం తీసుకోకపోవచ్చును.
అయినా రాష్ట్ర విభజన ఖచ్చితంగా జరుగుతుందా లేదా అనే విషయంపై కేవలం ఊహాగానాలే తప్ప ఇంతవరకు ఖచ్చితమయిన సమాచారం లేదు. అంటే, రాష్ట్ర విభజన చేయదలచుకోకపోతే మరింత సమయం పొందేందుకుగాను కాంగ్రెస్ అధిష్టానం ‘రెండవ యస్.ఆర్.సి.’ లేదా ‘రాయల తెలంగాణా’ వంటి ఆలోచనలు కూడా చేసే అవకాశాలున్నాయి. అదే జరిగేమాటయితే కిరణ్ కుమార్ రెడ్డిపై మరింత బాధ్యత పెరుగుతుందే తప్ప, ఆయనని తొలగించడం జరుగదు.
ఏమయినప్పటికీ, వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసి కాంగ్రెస్ తన నిర్ణయం ప్రకటించేవరకు ఈ సస్పెన్స్ సీరియల్ కొనసాగక తప్పదు. అంతవరకు ఇటువంటి ఆసక్తికరమయిన ట్విస్టులు తప్పవు మరి.