తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కి కేసీఆరే అవరోధమా
రాష్ట్ర విభజన జరిగిన తరువాత తెలంగాణాలో పనిచేస్తున్న ఆంధ్ర ప్రాంత ఉద్యోగులందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోక తప్పదు. వారికి వేరే ఆప్షన్లు ఉండవన్న కేసీఆర్ మాటలు తెలంగాణా ప్రక్రియకు అవరోధం కలిగించేలా ఉన్నాయని ఆ పార్టీ నుండి సస్పెండ్ అయిన విజయశాంతి అన్నారు. నిన్నమొన్నటి వరకు కేసీఆర్ కు చెల్లెలుగా అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆమె బహుశః కేసీఆర్ మనసులో ఆలోచనలని సరిగ్గా అంచనా వేసారని చెప్పవచ్చును.
కాంగ్రెస్ పార్టీ ఆఖరి నిమిషంలో వచ్చి కేసీఆర్ చేతిలోంచి తెలంగాణా అంశం ఎత్తుకెళ్ళిపోయి కేసీఆర్ కలలను కల్లలు చేసింది. ఆ తరువాత రాష్ట్ర విభజనపై అత్యంత కీలక నిర్ణయం తీసుకొంటున్నప్పుడు కూడా అతనిని పూర్తిగా పక్కనపెట్టి స్వయంగా నిర్ణయం తీసుకొంది. ఆ సమయంలో కేసీఆర్ ఏవిధంగా అసహాయ స్థితిలోతన ఫారం హౌస్ కే పరిమితమయిపోయారో అందరికీ తెలుసు.
కేంద్రం తెలంగాణా ఈయదని దృడంగా నమ్మిన కేసీఆర్ రానున్నఎన్నికలలో తెలంగాణా సెంటిమెంట్ ను ఉపయోగించుకొని 15యంపీ సీట్లు, 100 శాసనసభ సీట్లు కైవసం చేసుకొని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను శాశించే స్థాయికి ఎదుగుదామని కన్నకలలను కాంగ్రెస్ సర్వ నాశనం చేసింది. చివరికి తెలంగాణాలో తన పార్టీ ఉనికి కూడా ప్రశ్నార్ధకంగా మార్చివేసి, విలీనం కూడా చేయక తప్పని పరిస్థితులు కల్పించిన కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ కు మనసులో అక్కసు ఉండటం సహజమే.
అయితే, కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చేసిన తరువాత దానిని తప్పు పట్టడానికి కానీ నిందించడానికి గానీ అవకాశం లేదిప్పుడు. అయితే కాంగ్రెస్ పార్టీని ఇదేవిధంగా తన పని తానూ చేసుకొని పోనిస్తే, ఇన్నేళ్ళుగా కేసీఆర్ కష్టపడి సంపాదించుకొన్న కీర్తి ప్రతిష్టలను కూడా కాంగ్రెస్ హైజాక్ చేసుకుపోవడం ఖాయం. బహుశః ఆ ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణా ప్రక్రియను వీలయినంత త్వరితంగా, సజావుగా పూర్తి చేయాలని తొందరపడుతోంది.
కాంగ్రెస్ గనుక ఈ ప్రయత్నంలో సఫలం అయితే, ఇక టీ-కాంగ్రెస్ నేతల ముందు కేసీఆర్ అతని తెరాస నేతలు ఎవరూ కూడా నిలువలేరు. టీ-కాంగ్రెస్ నేతలు కలిసికట్టుగా పనిచేస్తే అది ఎంత గొప్పగా ఉంటుందో చెప్పడానికి వారు నిర్వహించిన ‘తెలంగాణా సాధన సభ’ ఒక గొప్ప ఉదాహరణ. తెలంగాణా సాధించి మంచి ఊపు మీద ఉన్న వారు గనుక నిజంగా మనసుపెట్టి రంగంలోకి దిగితే, ఇక తెలంగాణాలో కేసీఆర్ గురించి, తెరాస గురించి మాట్లాడే వారుండరు.
తెలంగాణా సాధించి “తెలంగాణా రాష్ట్ర పిత”గా అరుదయిన గౌరవం పొందాలని కలలుగన్న కేసీఆర్, ఇటువంటి పరిణామాలు బహుశః కలలో కూడా ఊహించుకొని ఉండరు. గానీ, కాంగ్రెస్ పార్టీ తన కళ్ళెదుటే, తన ప్రమేయం లేకుండానే అన్ని పనులు చకచకా చక్కబెట్టేస్తుంటే కేసీఆర్ ఎంత బాధ పడుతున్నారో అర్ధం చేసుకోవచ్చును. కానీ, ప్రజలందరూ కోరుకొంటున్న తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు జరుగుతున్న ఈ తరుణంలో దానిని అడ్డుకొంటే ఏమవుతుందో కూడా ఆయనకీ తెలుసు. అందుకే అందుబాటులో ఉన్న ఇటువంటి ఆయుధాలను బయటకి తీసి ప్రయోగిస్తున్నారు.
తెలంగాణా ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు ఆంధ్రప్రాంత ఉద్యోగులే ప్రధాన అడ్డంకిగా నిలుస్తున్నారని అన్యోపదేశం చేస్తూ మరో కొత్త ఉద్యమానికి ఆయన రంగం సిద్దం చేసుకొంటున్నారు. ఉద్యమాలు చేసిన రికార్డు తప్ప ఏవిధమయిన అధికారిక హోదా లేకపోయినప్పటికీ, ఆయన తనే తెలంగాణా రాష్ట్రానికి మొట్ట మొదటి ముఖ్యమంత్రి అన్న రీతిలో ప్రభుత్వోద్యోగ నియామకాలు, ప్రమోషన్లు, తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్దీకరణల గురించి హామీలు గుప్పిస్తున్నారు. అసలు తన పార్టీ ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితులో ఉన్న ఆయన ఈవిధమయిన హామీలు ఈయడం, తన మాటకారితనంతో ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూడటం గమనిస్తే ఆయనకు తెలంగాణా రాష్ట్రం ఏర్పడాలనే కోరిక కంటే తన ఉద్యమాలు కొనసాగాలనే కోరికే ఎక్కువగా ఉన్నట్లు అర్ధం అవుతోంది.
అయితే, అటువంటి వారిని నిలవరించేందుకు సమర్దులయిన నేతలు, రాజకీయ పార్టీలు ఉన్నాయనే సంగతి ఆయన గుర్తుంచుకొని, ఇకనయినా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో అవరోధాలు కల్పించకుండా ఉంటే అటు తెలంగాణా, ఇటు సీమంధ్ర ప్రజలకి మేలు చేసిన వారవుతారు.