ఆంధ్ర ఉద్యోగులకు కేసీఆర్ తొలి హుకుం
posted on Aug 2, 2013 @ 9:00PM
తెలంగాణా ఏర్పడితే హైదరాబాదులో స్థిరపడిన లక్షలాది ఆంధ్రా ప్రాంతవాసులకు ఎటువంటి నష్టం జరగదని వారి రక్షణకు తాము హామీ ఉంటామని తెరాసతో సహా అన్ని రాజకీయ పార్టీలు బల్లగుద్ది మరీ చెపుతున్నపటికీ ప్రజలు మాత్రం వారి మాటలు నమ్మడం లేదు.
తమ భవిష్యత్తు పట్లా తీవ్ర ఆందోళన చెందుతున్నవారి భయాలు నిజమని నిరూపిస్తున్నట్లు ఈ రోజు కేసీఆర్ మాట్లాడారు. “ఆంధ్రప్రాంత ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రానికి వెళ్లిపోక తప్పదని, ఇందులో వేరే ఆప్షన్స్ ఉండవని” ఆయన అన్నారు. “అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నడపడానికి కూడా ఉద్యోగులు అవసరం ఉంటుంది గనుక వారు తప్పనిసరిగా వెళ్ళిపోవలసి ఉంటుందని, వారు వెళ్ళిపోగానే వారి స్థానంలోకి తెలంగాణా ఉద్యోగులు ప్రమోషన్ ల ద్వారా భర్తీ చేస్తారని, అప్పుడు క్రింద తరగతిలో ఏర్పడిన ఖాళీలలో తెలంగాణా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తానని, అందుకు తానూ హామీ ఇస్తున్నానని” ఆయన అన్నారు.
అయితే, హైదరాబాదులోనే అనేక దశాబ్దాలుగా స్థిరపడిన వేలాది ఉద్యోగులు హైదరాబాదునే తమ స్వస్థలంగా భావించడం సహజం. మరి అటువంటి వారు ఇప్పుడు ఆంధ్రా తిరిగి వెళ్ళిపోవాలని కేసీఆర్ చెప్పడం హుకుం జారీ చేయడమే అవుతుంది. ఈ కారణంగానే సీమంధ్ర ప్రాంత నేతలు హైదరాబాద్ పై పట్టుదలగా ఉన్నారు. ఇంకా రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలుకాకముందే కేసీఆర్ ఈవిధంగా మాట్లాడటం గమనిస్తే ఇక మున్ముందు తమ పరిస్థితి ఏమిటని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక యాదృచ్చికంగా ఈ రోజు ఉదయమే హైదరాబాదులో పనిచేస్తున్నఆంధ్ర ప్రాంత ఉద్యోగులు, కేంద్రం తమ సమస్యలను భయాలను లెక్కలోకి తీసుకోకుండా ఏకపక్షంగా తెలంగాణా ప్రకటించడాన్నినిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. వారి భయాలను మరింత పెంచుతున్నట్లు ఈ రోజు కేసీఆర్ మాట్లాడారు. ఇటువంటి పరిస్థితుల్లో సీమంధ్ర నేతలు హైదరాబాద్ పై మరింత పట్టుదలకు పోయినా ఆశ్చర్యం లేదు.
అయితే, రాజకీయ అనుభవజ్ఞుడయిన కేసీఆర్ ఇటువంటి సంధికాలంలో ఈవిధంగా అనాలోచితంగా ఈమాటలు అని ఉంటారని భావించలేము. తన చేతిలోంచి తెలంగాణా అంశాన్ని కాంగ్రెస్ హైజాక్ చేసి, తన ప్రమేయం లేకుండానే తెలంగాణా ప్రకటించేసి, తన ప్రతిష్టని, తన పార్టీ ఉనికిని సవాలు చేసిన కాంగ్రెస్ పార్టీపై ఆయన రగిలిపోతున్నారు. ఇప్పుడు ఇటువంటి మాటలతో సమైక్యవాదులను రెచ్చగొట్టడం ద్వారా వారిపై ఒత్తిడి తెచ్చి, కాంగ్రెస్ తెలంగాణాపై ఇచ్చిన మాటపై మళ్ళీ పునరాలోచనలో పడేట్లు చేయగలిగితే మళ్ళీ తన ఉద్యమాలు కొనసాగించుకోవచ్చునని భావిస్తున్నారేమో! లేదా, ఈవిధమయిన మాటలతో హైదరాబాద్ కోసం పట్టుబడుతున్న సీమంధ్ర నేతలను మరింత రెచ్చగొట్టి మళ్ళీ ఉద్యమాలు చేపట్టెందుకో ఆయన ఆలోచనలు చేస్తున్నారేమో తెలియదు. ఏమయినప్పటికీ, అకారణంగా కేసీఆర్ ఇటువంటి మాటలు అని ఉండకపోవచ్చును.