మా టీవీ దాడి వెనుక ఎవరున్నారో తెలుసు: అల్లు అరవింద్
నిన్న మా టీవీ మరియు రామానాయుడు స్టూడియోల మీద కొందరు తెలుగు టీవీ కళాకారులు దాడి చేసారు. తెలుగు చానళ్ళలో వస్తున్న అనువాద సీరియల్స్ వెంటనే నిలిపివేయాలని వారు చాలా రోజుల నుండి కోరుతున్నారు. తమిళ అనువాద సీరియల్స్ ప్రసారం చేసే జెమినీ టీవీతో సహా మిగిలిన అన్ని చాన్నాళ్ళ యాజమాన్యాలు ఒప్పుకొన్నపటికీ, అచ్చ తెలుగు టీవీచానల్ అని చెప్పుకొనే మాటీవీ, తెలుగు సినీరంగంలో అనేక పురస్కారాలు అందుకొన్న డా.రామానాయుడికి చెందిన స్టుడియోలో మాత్రం తమిళ అనువాద సీరియల్స్ ప్రసారం, షూటింగ్ కార్యక్రమాలు జరుగుతుండటం వారికి ఆగ్రహానికి ప్రధాన కారణంగా కనబడుతోంది.
మా టీవీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకరయిన అల్లు అరవింద్ నిన్న తమ కార్యాలయం మీద దాడి జరిగిన తరువాత మీడియాతో మాట్లాడుతూ ‘మూడు రోజుల క్రితమే వారితో చర్చలు జరిగాయి. నడుస్తున్న సీరియల్స్ ని అర్ధంతరంగా ఆపడం నిర్మాతలకు నష్టమే కాకుండా, అనేక మంది కళాకారులు సాంకేతిక నిపుణులు ఇబ్బందులు పడతారు. ఇదే విషయం వారు కూడా అంగీకరించి వీలయినంత త్వరలోముగించమని చెప్పి వెళ్ళిపోయారు. కానీ, మళ్ళీ ఈ రోజు వారు అకస్మాత్తుగా మా కార్యాలయం మీద దాడి చేసారు. దీనివెనుక కొందరు వ్యక్తుల ప్రోత్సాహం ఉందని మాకు తెలుసు. కానీ వారు ఇటువంటి హింసాత్మక చర్యలకు పాల్పడితే వారే ఇబ్బందులు పడతారని తెలుసుకోవాలి,” అని అన్నారు.
ఆయన హెచ్చరించినట్లే ఈరోజు మాటీవీపై దాడి చేసినవారిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సెక్షన్147, 148, 149, 341, 452, 427 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక అల్లు అరవింద్ ‘తెర వెనుక ఎవరున్నారో తనకు తెలుసు’నని చెప్పడం బహుశః దర్శకుడు దాసరి నారాయణ రావును ఉద్దేశించే అయి ఉండవచ్చును. ఎందుకంటే, రాష్ట్రంలో సినిమా ధియేటర్లన్నీ ఓ నలుగురు పెద్ద నిర్మతల గుప్పిట్లో ఇరుక్కుపోయాయని, అదే విధంగా ఆ నలుగురు సినిమా రంగంలో మర్రి వృక్షంలా విస్తరించిపోయి మరెవరినీ బ్రతకనీయకుండా చేస్తున్నారని దాసరి గతంలో తీవ్ర ఆరోపణలు చేసారు. ఆ నలుగురిలో రామానాయడు, అల్లు అరవింద్ కూడా ఉన్నారని బహిరంగ రహస్యమే.
బహుశః ఆ కోపంతోనే దాసరి నారాయణరావు ‘ఆ నలుగురిని’ వ్యతిరేఖించే మరికొందరు చిన్ననిర్మాతలతో కలిసి ఈ విధంగా టీవీ కళాకారులను వెనుక నుండి ప్రోత్సహిస్తున్నారని అల్లు అరవింద్ అభిప్రాయపడుతున్నట్లు ఉంది. అదీగాక, ఈ ఉద్యమానికి దాసరి నారాయణ రావు మొదటి నుండి బహిరంగంగానే మద్దతు పలుకుతున్నారు కూడా. ఏమయినప్పటికీ, తెలుగు టీవీ చానళ్ళలో తెలుగు కార్యక్రమాలు రూపొందించుకోలేని దౌర్భాగ్యం మనకి తప్పట్లేదు. అయినా అందుకు వారెవరూ కూడా సిగ్గుపడట్లేదు.