కేసీఆర్ వలలో కాంగ్రెస్ చేపలు విలవిలా
తెలంగాణ కాంగ్రెస్ నేతల హడావుడి తాటాకు మంటల్లాంటిదని మరోసారి ఋజువు చేసారు. తెరాస అధ్యక్షుడు కేసీఆర్ పలకరించగానే ఉబ్బితబ్బిబయిపోయిన వారందరూ ఒకరింటికి మరొకరు పేరంటాలకి వెళుతున్నట్లు ఓ రెండు మూడు రోజులు హుషారుగా తిరిగేసి చాలా హడావిడే చేశారు. కానీ, స్వపక్షం నుండి వస్తున్న విమర్శలను, మీడియాలో తమపై వస్తున్న విశ్లేషణలు చూసిన తరువాత గాలి తీసేసిన బెలూన్స్ లాగయిపోయారు వాళ్ళందరూ.
అసలు కేసీఆర్ కాంగ్రెస్ నేతల సహాయం కోరి వచ్చేడా? లేక వారితో రహస్య సమావేశాలు జరిపి తద్వారా కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టడానికేవచ్చేడా అనే అనుమానం కూడా కలుగుతోంది. నిన్న ఆ పార్టీ నాయకుడు కే.తారకరామారావు మాట్లాడుతూ “తమ పార్టీని బలపరుచుకోవడం ఎంత ముఖ్యమో ఎదుటపార్టీని బలహీనపరచడం కూడా అంతే ముఖ్యం” అని చెప్పిన మాటలువింటే కేసీఆర్ వ్యూహాత్మకంగానే మీడియా వాళ్ళ కంట్లో పడేవిదంగానే వారితో సమావేశానికి తరలిరావడం చూస్తే, వారందరినీ కేసీఆర్ ఆడుకొని వదిలేసాడనుకోవలసి ఉంటుంది.అయినా కూడా కేసీఆర్ ఆడిన ఈ ఆటలో తమదేపై చెయ్యని భ్రమలో ఉన్న కాంగ్రెస్ నేతలు, ఇంకా తెరాస వైపే చూస్తున్నారు.
అయితే కేసీఆర్ రాజేసిన ఈ ఎన్నికల వేడిని భరించాలంటే మళ్ళీ కాంగ్రెస్ గొడుగు క్రిందే సేదతీరడం మంచిదని అర్ధం చేసుకొని, తాము తెరాసలో జేరడంపై వచ్చిన వార్తలన్నీ తిరిగి మీడియాకే అంకితం చేసిపడేశారు కాంగ్రెస్ నేతలు. కానీ, మరోపక్క కేసీఆర్ ఇస్తున్న బంపర్ ఆఫర్ మాత్రం మనసులో ఇంకా ఊరిస్తూనే ఉండడంతో మనసొక చోట మనువొకచోటా అన్నట్లుంది వారి పరిస్థితి. అందువల్లే మళ్ళీ, ఒక వివేకవంతమయిన యంపీ మాట్లాడుతూ, త్వరలో తమ అధిష్టానం తెలంగాణ విషయం కనుక తేల్చకపోతే మళ్ళీ (భవిష్యత్ కార్యాచరణ) తాటాకులు మంటేసుకొంటామని హెచ్చరిస్తున్నారు. అలాగని ఎవరూ కూడా తెరాసలోకి జంపింగ్ తీసుకొంటామని దైర్యంగా, ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు.
ఇప్పుడు వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ తాము నిఖార్సయిన కాంగ్రెస్ వాదులమని చెప్పుకోలేని పరిస్థితి. తమ పార్టీ వారితో కంటే తెరాస వారితోనే భుజాలు రాసుకొని తిరగడం సౌకర్యంగా భావిస్తున్న వారిని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరూ నమ్మడం లేదు. అదే విధంగా వారు కూడా తమ పార్టీని నమ్మడం లేదిప్పుడు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే స్వయంగా ప్రభుత్వ విప్ జగ్గారెడ్డిచేత తమపై దాడి చేయిస్తున్నారని, ఆయనే కేంద్రానికి తప్పడు నివేదికలు పంపిస్తున్నారని పెద్దపల్లి ఎంపీ జి వివేక్ ఆరోపించడమే ఇందుకు ఒక ఉదాహరణ.
ఇటు స్వంత పార్టీలో ఇమడలేక, అటు తెరాస వైపు వెళ్ళే దైర్యం చేయలేక తెలంగాణ కాంగ్రెస్ యంపీలు చాలా ఇబ్బందికరమయిన పరిస్థితుల్లో ఉన్నారిప్పుడు. ఇది వారికి కేవలం ఇబ్బంది మాత్రమే అయితే ఎలాగో భరించేవారే, కానీ, అది తమ రాజకీయ భవిష్యత్ కూడా సవాలుగా మారడంతో ఇప్పుడు ఎవరిని నమ్ముకోవాలో అర్ధం కాక తలపట్టుకొన్నారు.
కానీ ఇప్పుడు వారు తెలుసుకోవలసిన ముఖ్యమయిన విషయం ఒకటుంది. ఎన్నికల హడావుడిలో పడిన కేసీఆర్ మరో ఏడాది వరకు తెలంగాణ ఊసెత్తడు గనుక, ఆయన వెనుకే లక్ష్మణుడిలా తిరిగే కోదండరాముడు కూడా గమ్మునే ఉంటాడు. కనుక తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా నిజాయితీగా తమ పార్టీనే అంటిపెట్టుకొని, మళ్ళీ సోనియమ్మను ప్రసన్నం చేసుకొని పార్టీ టికెట్స్ సంపాదించుకొని దైర్యంగా ఎన్నికలలో పోటీ చేయడమే ఉత్తమం.
ఉద్యమం అని ఊగిపోయిన కేసీఆర్, కోదండరాములే ఉద్యమానికి ఎన్నికల శెలవులు ప్రకటించేసినప్పుడు, కాంగ్రెస్ నేతలు వారిని, వారి ఉద్యమాన్ని చూసి భయపడటం అనవసరం. మాటనిలకడలేని కేసీఆర్ వంటి వారిని నమ్ముకొని తమ రాజకీయ జీవితాలు పాడు చేసుకోవడం కంటే కన్నతల్లి వంటి సోనియమ్మని, దేశాన్నిమార్చలేకపోయినా పార్టీని మాత్రం మార్చి పడేస్తానని గుర్రం ఎక్కివస్తున్న యువరాజు రాహుల్ గాంధీని నమ్ముకోవడం వారికి అన్ని విధాల మేలు.