సమైక్య సెంటిమెంట్ కోసం నేతల పోటా పోటీలు
ఒకప్పుడు తెలంగాణా రాష్ట్ర సాధనలో తామే ముందుండాలని రాజకీయనేతలందరూ పోటీలు పడేవారు. అయితే, కాంగ్రెస్ తెలంగాణా ప్రకటన చేసేయడంతో వారందరూ రాజకీయ నిరుద్యోగులుగా మారిపోగా, ఇప్పుడు ఆ అవకాశం సీమంధ్ర నేతలకి, జేఏసీలకి దక్కింది.
ఇక సమైక్యాంధ్ర సెంటిమెంటును అందిపుచ్చుకొనేందుకు మూడు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన త్యాగాలకు మారుపేరయిన వైకాపా అందరి కంటే ముందుగా త్యాగాలు చేసేసి రోడ్డేక్కగానే, ఆ త్యాగాల రేసులో తామెక్కడ వెనుకబడిపోతామోననే భయంతో కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగింది. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున ఎందుకు మేస్తుందన్నట్లు, తల్లి పిల్లా కాంగ్రెస్ లను చూసి తెదేపా నేతలు కూడా చేలోకి దిగిపోయారు.
వారందరూ ఒకరిని చూసి మరొకరు భయపడుతూ, ‘సమైక్యాంధ్ర మహా రక్షక’ బిరుదు కోసం ఒకరితో మరొకరు పోటీలు పడుతుంటే, వారికి దీటుగా ఉద్యమాలు చేస్తున్న ప్రజలు మాత్రం వారెవరినీ నమ్మకపోవడం విచిత్రం. కానీ రాజకీయ నేతలు మాత్రం తాము ప్రజాభీష్టం మేరకే రాజీనామాలు చేసి ఉద్యమంలో దిగామని చెపుకోవడం విశేషం. ఈ కారణంగానే వారు కూడా పార్టీల వారిగా జనాలని పోగేసుకొని ఎదుట పార్టీనే లక్ష్యంగా చేసుకొని ఉద్యమాలు చేస్తున్నారు.
ప్రజల అద్వర్యంలో నడుస్తున్న ఉద్యమాలు రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తుంటే, సదరు పార్టీల నేతృత్వంలో సాగుతున్న ఉద్యమాలు మాత్రం ఎదుట పార్టీ వల్లనే రాష్ట్ర విభజన జరిగిందని, ఎదుట పార్టీలో వారు ఎప్పుడెప్పుడు ఏవిధంగా రాష్ట్ర విభజనకోసం ప్రయత్నాలు చేసింది వివరిస్తూ, వారు ఆంధ్ర ద్రోహులని కేవలం తాము మాత్రమే ‘మహా సమైక్య రక్షక’ బిరుదుకు అన్ని విధాల అర్హులమని నిరూపించుకొనే పనిలో పడ్డారు.
అయితే, వారిలో ఏ ఒక్కరూ కూడా తెలంగాణా ఏర్పాటుని దైర్యంగా వ్యతిరేఖించకుండా, అవ్వ కాదు బామ్మ అన్నట్లు తెలంగాణా పేరెత్తకుండా జాగ్రత్త పడుతూనే రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ చేసిన ప్రకటనను వ్యతిరేఖిస్తున్నారు.
ఇప్పుడు వారు లేవనెత్తుతున్న అనుమానాలను, భయాలను, సమస్యలను ఆనాడు అఖిలపక్ష సమావేశంలో కూడా అడిగి ఉండవచ్చును. ఒకవేళ అందుకు అనుమతి లేదనుకొంటే అప్పుడు హోంమంత్రికి ఇచ్చిన లేఖలో లికిత పూర్వకంగా తమ అభ్యంతరాలను తెలియజేసి వాటిని నివృత్తి చేసిన తరువాతనే తాము రాష్ట్ర విభజనపై తమ అభిప్రాయం చెపుతామనో లేక అంగీకరిస్తామనో చెప్పి ఉండవచ్చును.
కానీ, అప్పుడు అందరూ ముందుగా తమ నిర్ణయం చెప్పేస్తే రాజకీయంగా తామెక్కడ నష్ట పోతామనో, లేక ఎదుట పార్టీ తమపై రాజకీయంగా ఎక్కడ పైచేయి సాధిస్తుందనో భయంతో ఆ బాధ్యతను కాంగ్రెస్ పైకి నెట్టి చేతులు దులుపుకొని చక్కావచ్చారు. తీరా చేసి ఇప్పుడు కాంగ్రెస్ తన నిర్ణయం ప్రకటించిన తరువాత గత 5 దశాబ్దాలలో జరిగిన సంఘటనలను, నివేదికలను, లేఖలను ప్రస్తావిస్తూ వితండ వాదనలు చేస్తూ ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
దీనిని ప్రజలు గమనించలేరనే భ్రమలో నేతలు రాజకీయ చదరంగం ఆడుతున్నారు. అయితే, ప్రతీ ఐదేళ్ళకోసారి జరిగే పరీక్షలలో ప్రజలు ఎప్పుడు నెగ్గుతూనే ఉండగా రాజకీయ పార్టీలే ఓడిపోతున్న సంగతిని గుర్తుంచుకొంటే, వారు ఈవిధంగా ప్రజలని మభ్య పెట్టే ప్రయత్నాలు చేయరేమో.