టిడిపి సీమాంధ్ర ఎంపీల రాజీనామా
posted on Aug 2, 2013 @ 7:27PM
సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు కొణకళ్ల నారాయణ, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, శివప్రసాద్, సీఎం రమేష్, సుజనా చౌదరిలు తమ పదవులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరిగితే సహించేది లేదని కొనకళ్ల నారాయణ అన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ రాజకీయ లబ్ది కోసం ఇష్టమొచ్చినట్లు ప్రకటనలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
రాష్ట్ర విభజనపై స్పష్టమైన క్లారిటీ లేదని, ఏక పక్ష నిర్ణయం తీసుకోవడంతో సీమాంధ్ర ప్రజలు నష్టపోతున్నారని కొణకళ్ల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడ్డానికి ప్రజల్లోకి వెళ్ళి ఉద్యయం చేస్తామని, కేంద్రం దిగివచ్చే వరకు ఉద్యమం ఆపేదిలేదని ఆయన స్పష్టం చేశారు.
పార్లమెంటు సభ్యులుగా ఉండి ఏం చేయలేని పరిస్థితి ఉన్నందున తాము రాజీనామాలు చేస్తున్నామన్నారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించకుండా డిగ్గీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెసు పార్టీ తీరు దొంగే.. దొంగ దొంగ అన్నట్లుగా ఉందన్నారు. తమ ప్రాంతానికి న్యాయం చేసేందుకు కేంద్రం దిగి వచ్చే వరకు తాము ఉద్యమిస్తామన్నారు. వైయస్సే తెలంగాణకు అనుకూలమని కాంగ్రెసు పార్టీ నేతలే చెబుతున్నారన్నారు. చర్చలు జరపకుండా కాంగ్రెసు తమ నిర్ణయాన్ని ప్రజల పైన రుద్దారన్నారు.