పాక్ దుశ్చర్యపై అధికార విపక్షాలు యుద్ధం

  రెండు రోజుల క్రితం కొందరు తీవ్రవాదులు మరియు పాకిస్తాన్ సైనికులు కలిసి జమ్మూ కాశ్మీర్ సరిహద్దు జిల్లా పూంచ్ వద్ద భారత్ భూభాగంలోకి జొరబడి ఐదుగురు సరిహద్దు భధ్రతా సిబ్బందిని కాల్చి చంపారు. ఈ విషయాన్నీభారత ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రం సింగ్ స్వయంగా దృవీకరించారు. అయితే, రక్షణ మంత్రి ఏకే ఆంథోనీ ఈ విషయాన్నీలోక్ సభకు వివరిస్తూ “కొందరు తీవ్రవాదులు మరియు పాకిస్తాన్ సైనికుల దుస్తులలో ఉన్న మరికొందరు వ్యక్తులు కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టారని” చెప్పడంతో ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలు తెలియజేసాయి.   ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రం సింగ్ స్వయంగా “తీవ్రవాదులతో కలిసి పాక్ సైనికులు భారత సైనికులపై దాడి చేసి హతమార్చారని” స్పష్టంగా దృవీకరించినప్పుడు, మరి రక్షణ మంత్రి పాక్ సైనికులను తప్పుపట్టకపోగా, వేరెవరో వ్యక్తులు పాక్ సైనికుల దుస్తులలో వచ్చినట్లు పేర్కొంటూ, మన సైనికులను పొట్టన బెట్టుకొన్న పాక్ సైనికులను ఎందుకు వెనకేసుకు వస్తున్నారని నిలదీశారు. అసలు ఆర్మీ చీఫ్ చెప్పిన మాటలను ఎందుకు మార్పు చేశారు? మన భూభాగంలోకి జొరబడి మన సైనికులను పొట్టన బెట్టుకొంటున్న పాక్ సైనికులకీ, పాక్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ది చెప్పకపోగా వారిని ఎందుకు వెనకేసుకు వస్తున్నారు? వారిని ప్రసన్నం చేసుకోవలసిన అవసరం మనకేమవసరం? అని బీజేపీ ప్రశ్నించింది. రక్షణ మంత్రి ఆంథోనీ యావత్ భారత ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్లమెంటును స్తంభింపజేసింది.   సాక్షాత్ రక్షణ మంత్రే ఆవిధంగా చెప్పడం వలననే పాకిస్తాన్ ప్రభుత్వం అది తమ సైనికుల పని కాదని, ఆదాడితో తమకు ఎటువంటి సంబంధం లేదని, అసలు తమ సైనికులు అటువంటి తప్పులు ఎన్నడూ చేయరని, ఉభయ దేశాల మధ్య 2002 జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని తామెన్నడూ జవదాటలేదని, భారత్ సైనికులే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని తిరిగి ప్రత్యారోపణలు చేసింది.   పాక్ ప్రభుత్వం తప్పించుకోవడానికి, తిరిగి ఈవిధంగా ప్రత్యారోపణలు చేయడానికి రక్షణ మంత్రి ఆంథోనీ చేజేతులా అవకాశం కల్పించారని అందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తూ ఉభయ సభలను స్తంభింపజేసింది. దీనితో రక్షణలో పడిన రక్షణ మంత్రి మళ్ళీ పూర్తి వివరాలతో వచ్చి సభకు తెలియజేస్తానని హామీ ఇచ్చారు.   బీజేపీ చేస్తున్న ఈ దాడి నుండి తనను తానూ ఎలాకాపాడుకోవాలా అని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే ఆపార్టీని ఏవిధంగా ఈ వ్యవహారంలో దోషిగా నిలబెట్టాలా అని బీజేపీ విశ్వప్రయత్నాలు చేసింది. అయితే, రెండు పార్టీలు కూడా పాక్ చేతిలో మన సైనికులు చనిపోయారనే బాధ కానీ, అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే చర్చకానీ, పాక్ ప్రభుత్వానికి భారత్ ప్రభుత్వం తరపున తీవ్ర హెచ్చరిక జారీ చేయాలనీ కానీ ఆలోచించకపోవడం చాలా విచారకరం.   దేశ రక్షణ విషయంలో కూడా ఈవిధంగా రెండు ప్రధాన పార్టీలు రాజకీయ చదరంగం ఆడుకోవడం పాక్ సైనికుల దుశ్చర్యకంటే కూడా హీనాతిహీనమయినది. గతంలో కూడా పాక్ సైనికులు తీవ్రవాదులతో కలిసి భారత భూభాగంలోకి జొరబడి ఇద్దరు బారత సైనికుల తలలు నరికి అందులో ఒకరి తల తమ వెంట తీసుకుపోయారు. అప్పుడు కూడా ఈ రెండు పార్టీలు ఇదేవిధంగా పార్లమెంటు సాక్షిగా కత్తులు దూసుకొన్నాయి తప్ప ఆ సంఘటన నుండి ఎటువంటి గుణపాఠం నేర్చుకోలేదు. కనీసం అందుకు సిగ్గు కూడా పడలేదు.   పైగా ఇప్పుడు మరో సారి అదే డ్రామా మొదలుపెట్టాయి. ఎంత గంభీరమయిన సమస్యనయినా కేవలం రాజకీయకోణం లోంచి మాత్రమే చూడగలిగే ఇటువంటి నేతలున్నంత కాలం పాక్, చైనా, శ్రీలంక అన్ని దేశాలు కూడా నిర్భయంగా దాడికి పాల్పడుతూనే ఉంటాయి. ఇటువంటి ఘటనలు జరిగినసారి మన రాజకీయ పార్టీలు ఇదే తంతు నిర్వహించి చేతులు దులుపుకొంటునే ఉంటాయి.

కమిట్మెంట్ లేని కమిటీలు దేనికోసం?

....సాయి లక్ష్మీ మద్దాల       ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ అధిష్టానం తరఫున ఈరోజు ఒక అధికారిక ప్రకటన చేశారు. అదేమంటే సీమాంద్రలో విభజన ప్రకటన వెలువడిన అనంతరం వెల్లువెత్తిన ఉద్యమ సెగల దృష్ట్యా ఒక కమిటీని వేస్తున్నాం అని. ఈ కమిటీకి కేంద్ర రక్షణ శాఖ మంత్రి AK ఆంటోని చైర్మన్ గా ఉంటారని,వీరప్పమొయిలి,అహమద్ పటేల్,గులాంనబీ ఆజాద్ అనబడే ముగ్గురు వ్యక్తులతో కలిపి మొత్తం నలుగురు వ్యక్తులతో ఈ కమిటి ఉంటుందని ప్రకటించటం జరిగింది. ఈ కమిటి యొక్క కార్యాచరణ ఏమిటి అంటే,సీమాంద్ర ప్రజల అభ్యంతరాలు తెలుసుకోవటం ,విద్యార్ధి జెఎసి తో,ఉద్యోగస్తుల జెఎసి తో,మరియు వివిధ వర్గ ప్రజలతో సమావెశమై వారి అభిప్రాయ సేకరణ చేయటం. అయితే మొన్న CWC చేసిన తీర్మానం వాయిదా వేస్తారా అంటే, లేదని CWC చేపట్టిన తీర్మాన ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉండదని చెబుతున్నారు. మరి ఈ కమిటీ ఎవరి కంటి తుడుపు కోసమని ఆ ప్రాంత ప్రజలు అనుకోవాలి? ఎపి ఎన్జీవోలు సమ్మె విరమించుకోవాలని దిగ్విజయ్ సింగ్ పిలుపునిచ్చారు. అలాగే సీమాంద్ర ప్రాంత ప్రజలకు కూడా పిలుపునిచ్చారు. కమిటీ ద్వారా ఏ కార్యాచరణ అయితే చేపట్టాలని అనుకుంటున్నారో దాని గురించి ప్రకటన వెలువరించక ముందు ఎందుకు ఆలోచించ లేదు? ఒక ప్రాంతం లో వీరి నిర్వాకం కారణంగా ఆగ్రహ జ్వాలలు ఉవ్వెత్తున లేచి,అక్కడి ప్రజాజీవనం స్తంభించిన తరువాత కాని తమకి ఈ కమిటీ డ్రామా గుర్తుకొచ్చినందుకు వారినేమనాలి. అయినా విభజన ప్రకటనకు ముందు విభజన అనే వ్యవహారానికి పూర్తిగా వ్యతిరేకించినది కేంద్ర రక్షణశాఖ మంత్రి AKఆంటోని. మరి ఇప్పుడు ఆయనే చైర్మన్ గా ఉండబోయే కమిటీ ద్వారా సీమాంద్ర ప్రాంత ప్రజలకు చేకూరబోయే ప్రయోజనం ఏమిటి   కాని ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం మరో కమిటీ కూడా వేసింది. అదే 2014 ఎన్నికల మానిఫెస్టో కమిటీ. మళ్ళి దీనిలో సభ్యులుగా ఉండే వారు బొత్స, కిరణ్, ఉండవల్లి. ఈ కమిటీకి చైర్మన్ మళ్ళి ఆంటోనీనే. కాని ఈ కమిటీకి సభ్యులుగా ఉన్న కిరణ్, బొత్స, ఉండవల్లులను ఏమనాలి? మొన్నటి వరకూ సమైఖ్యాంద్ర కోసం తామేదో కష్టపడిపోతున్నట్లు నాటకాలాడిన వీరిని ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా కాంగ్రెస్ అధిష్టానం నియమించినదంటే, వీరంతా అధిష్టానానికి పాదాక్రాంతులనే కదా అర్థం.     అంటే ఒక పక్క అభద్రతా భావంతో,తమ భవిష్యత్తు ఏమవుతుందోననే ఆందోళనతో ఉన్న ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వకుండా,మరోసారి ఇలాంటి కమిటీలతో అంటే ఎన్నికలే పరమావధిగా ప్రజలముందుకు వెళ్ళే అర్హత సదరు నేతలకు ఎక్కడిది?ప్రజలు కలిసుండాలని కోరుకుంటుంటే విడిపోవాలని కోరుకునే నీచమైన నేతలు బహుశా చరిత్రలో వీరే కావొచ్చు. ఏది ఏమైనా ఈ మొత్తం వ్యహారాన్ని బట్టి ప్రజలకు పూర్తిగా అర్ధమైంది ఏమంటే బొత్స,కిరణ్ కుమార్ రెడ్డి,ఉండవల్లి మాత్రం సమైఖ్యాంద్ర ద్రోహులు అని.

నలుగురు స‌భ్యుల‌తో హైలెవ‌ల్ క‌మిటీ

  ఎట్టకేల‌కు సీమాంద్రలో జ‌రుగుతున్న ఉద్యమాల‌పై కాంగ్రెస్ హైక‌మాండ్ స్పందించింది. ఆంద్రప్రదేశ్ విభ‌జ‌న‌పై న‌లుగురు స‌భ్యుల‌తో హైలెవ‌ల్ క‌మిటీని ప్రక‌టించింది అధిష్టానం. ఈ సారి క‌మిటీలో కూడా రాష్ట్రానికి సంభందించిన ఎవ‌రికీ స్థానం క‌ల్పించ‌కుండా కాంగ్రెస్ త‌న మార్క్ చూపించింది. బుధవారం ప్రక‌టించిన క‌మిటీలో ఎకె ఆంటనీ, దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్‌లు ఉన్నారు. న‌లుగురు స‌భ్యులున్న ఈ క‌మిటీకి ఆంటోని నేతృత్వం వ‌హిస్తారు. వీరు ముందుగా సీమాంద్రుల అభిప్రాయాల‌ను విని వాటిపై పూర్తి స్ధాయి నివేదిక సిద్దం చేయ‌నున్నారు. ముఖ్యంగా ఈ క‌మిటీ సీడ‌బ్ల్యూసి స‌మావేశం త‌రువాత రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై ఆరాతీయ‌నుంది. ఈ మేరుకు కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు జ‌నార్ధన్ ద్వివేది ఓ ప్రక‌ట‌న విడుద‌ల చేశారు. అయితే ఈ క‌మిటీ కేవ‌లం సీమాంద్రుల అభ్యంతరాలు విన‌డానికా లేక రాష్ట్ర విభ‌జ‌న ప్రక్రియ‌లో భాగంలో క‌మిటీని వేశారా అన్న విష‌యం మాత్రం చెప్పలేదు.

మహా నాయకుడు KCR హత్యకు కుట్ర

      తెలంగాణా జాతి పిత, త్యాగశీలి, మహానాయకుడు తెరాస అధ్యక్షుడు KCRని హత్య చేయడానికి కుట్ర జరుగుతుందని హరీష్ రావు ఆందోళన చెందుతున్నారు. కానీ... KCRని హత్య చేసే అవసరం ఎవరికి ఉంది? KCR ని హత్య చేస్తే.... 1.  సెపరేట్ తెలంగాణా ప్రక్రియ ఆగిపోదు. 2. తెలంగాణా ఉద్యమం ఆగిపోదు. 3. అసలు డిల్లీ పెద్దలు సెపరేట్ తెలంగాణా ఏర్పాటు గురించి KCRని సంప్రదించడమే లేదు. అది! ఆయనకున్న ఇంపార్టేన్స్. 4. ఇక ఉద్యమం విషయానికి వస్తే.... ప్రస్తుతం తెలంగాణా ఉద్యమం KCR చేతిలో లేనే లేదు. 5. సెపరేట్ తెలంగాణా ఒకవేళ ఏర్పడిన దానికి ముఖ్యమంత్రి KCR కానే కాడు. అంతే కాదు... అతని కుటుంబ సభ్యులు ఎవ్వరికీ తెలంగాణా ప్రభుత్వంలో ఏ రకమైన పాత్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వదు. మరి KCR ని హత్య చేసే అవకాశం ఎవరికి ఉంటుంది? సీమాంధ్ర వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఈ మధ్య KCR అడ్డదిడ్డమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దానివల్ల వచ్చే తెలంగాణా రాష్ట్రం కూడా రాకుండా పోతుందని తెలంగాణా నాయకులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణా రాష్ట్రం చేజారిపోతే అది KCR వల్లే చేజారిపోతుందని వారు ఆందోళన చెందుతున్నారు. మరి KCR ని హత్య చేసే అవసరం ఎవరికి ఉన్నట్లు...?         

ధ‌ర్మాన, స‌భిత‌ల‌కు ఊర‌ట‌

  ధ‌ర్మాన స‌భితా ఇంద్రారెడ్డిల‌కు సిబిఐ కోర్టులో ఊర‌ట ల‌భించింది. అధికార దుర్వినియోగానికి పాల్పడార‌న్న అభియోగాల‌ను ఎదుర్కొంటున్న వీరికి నాంప‌ల్లి కోర్టులో అనుకూల తీర్పు వ‌చ్చింది. ధ‌ర్మాన, స‌భితల‌ను త‌మ క‌స్టడికి అప్పగించాలంటూ కోరిన సిబిఐ వాద‌న‌ను కోర్టు కొట్టి వేసింది. జ‌గ‌న్ అక్రమాస్తుల కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఈ ఇద్దరు సాక్షుల‌ను బెందిరించి తారుమారు చేసే అవ‌కాశం ఉందంటూ సిబిజఐ చేసిన ఆరోప‌ణ‌ను కోర్టు తోసి పుచ్చింది. సిబిఐ దాఖ‌లు చేసిన మెమోపై వాదోప‌వాద‌న‌లు విన్న కోర్టు ధ‌ర్మాన స‌భిత‌ల‌ను వాద‌న‌ను స‌మ‌ర్ధించింది. గ‌తంలో వారు మంత్రులుగా ఉన్నారు క‌నుక సాక్షులను ప్రభావితం చేసే అవ‌కాశం ఉంది కాని వారు ఇప్పుడు ప‌ద‌వుల‌లో లేరు గ‌నుక ఆ అవ‌కాశం లేద‌ని భావించిన కోర్టు ధ‌ర్మాన స‌భిత‌ల క‌స్టడికి నిరాక‌రించింది.

మన హీరోలు జీరోలా ?

      సినిమాలో మన హీరోలు ఎడమ చేత్తో వంద మందిని తంతారు. ఎక్కడైనా చిన్న అన్యాయం జరిగితే న్యాయం జరిగేదాకా వీరంగాలు వేస్తారు. అన్యాయాల్ని, అక్రమాల్ని అసలు సహించారు. ప్రపంచంలో ఎవరికీ లేనంత ఆత్మాభిమానం కూడా వారికి వుంటుంది. మరి నిజ జీవితంలో  సీమాంద్ర ప్రజలకు అన్యాయం జరిగేలా హైదరాబాద్ తో సహా ప్రత్యేక తెలంగాణా ప్రకటన ఢిల్లీ పెద్దలు చేసి వారం రోజులు దాటినా, ఒక్కరు కూడా స్పందించలేదు. నిజానికి మన హీరోలంతా సీమాంద్ర కి చెందిన వారే. మరి వాళ్ళు  ఢిల్లీ పెద్దల చర్యని ఎందుకు ఖండించలేదు? వాళ్ళ హీరోయిజమంతా సినిమాలా వరకేనా ? నిజ జీవితంలో వాళ్ళు జీరోలేనా ?       కచ్చితంగా జీరోలే !! తెరమీద రచయితలు రాసిన పవరఫుల్ డైలాగులు వల్లిస్తూ వాళ్ళ డూప్ లతో ఫైట్స్ చేయిస్తారు.. వీళ్ళు ఒట్టోట్టి ఫైట్స్ చేస్తారు. అది చూసి వాళ్ళ పిచ్చి అభిమానులు వారిని వెర్రిగా అభిమానిస్తారు. వాళ్ళ కటౌట్ లకి పూల దండలతో, పాలాభిషేకాలు ! ఎనిమిది రోజులుగా ఒక్క మాట మాట్లాడని వారికి అంతా అర్హత ఉందా ? తెలంగాణా గురించి మాట్లాడితే వాళ్ళ సినిమాలు ఆడనివ్వారని భయమా ? వాళ్ళని  ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళు మాట్లాడక పోతే జనం ఎలాగూ వాళ్ళ సినిమాలు ఆడనివ్వరు. నిజానికి మన హీరోలకంటే రజనీకాంత్, సూర్య, విక్రం లాంటి తమిళ హీరోలకే మన ఆంధ్రాలో ఎక్కువ క్రేజ్ వుంది. ఇంకా మేము గొప్ప హీరోలం అనుకుంటే అది వారి భ్రమ మాత్రమే. మన నిర్మాతలూ ఏం తీసిపోలేదు. ఒకవేళ తెలంగాణా నేతలు పొమ్మంటే " ఓ... అలాగే... మేం విశాఖపట్నం పోయి స్టూడియోలు  నిర్మించుకుంటాం" అంటూ చీము, నెత్తురూ లేని వాళ్ళలా వ్యాఖ్యలు చేస్తారు. దేశంలో అతి పెద్దదైన మన తెలుగు సినిమా పరిశ్రమ నుండి ఒక్కళ్ళూ పెదవి విప్పకపోవడం  సిగ్గులేని తనం. 

వైకాపాకు శ్రీశైలం గౌడ్ రాజీనామా

      తెలంగాణలో వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. తెలంగాణ పై వైకాపా యూ టర్న్ తీసుకుందని ఆ పార్టీ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ రాజీనామా చేశారు. దీంతో తెలంగాణ నుంచి ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే కూడా తప్పుకున్నట్లయింది. కుత్బుల్లాపూర్ నుంచి ఆయన ఇండిపెండెంటుగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారు. ఇటీవలే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరారు. ఇప్పటికే పలువురు నేతలు మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ, జిట్టా బాలకృష్ణా రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తదితరులు రాజీనామా చేశారు. తాజాగా కూన తన రాజీనామాతో హైదరాబాదులోని జగన్‌కు షాక్ ఇచ్చారు.

కెసిఆర్ కు జెడ్ప్లస్ రక్షణ కల్పించాలి

      తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై హత్యయత్నం కుట్ర విషయంలో ప్రభుత్వం మౌనంగా ఉండడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్రావు మండిపడ్డారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి, డీజీపి ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. కెసిఆర్ కు వెంటనే జెడ్ప్లస్ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాకుండా అల్లకల్లోలం సృష్టించడానికి కొందరు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కెసిఆర్ హత్యకు కుట్ర జరుగుతుందనే విషయాన్ని మూడు రోజుల కిందట పోలీసు ఇంటెలిజెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసినా, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని హరీష్ రావు ఆరోపించిన విషయం తెలిసిందే.

తెలంగాణాలో మొట్ట మొదటి ప్రభుత్వం ఎవరిది

  రాష్ట్ర విభజన ప్రక్రియ ఎటువంటి అవరోధాలు లేకుండా సజావుగా సాగితే డిశంబర్ నెలనాటికి పూర్తవుతుందని భావించవచ్చును. అప్పటికి సాధారణ ఎన్నికలు జరగడానికి ఇంకా మూడు లేదా నాలుగు నెలల సమయం మిగిలి ఉంటుంది. సాంకేతికంగా విభజన ప్రక్రియ పూర్తయితే, ఇక రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు కొలువు తీరవలసి ఉంటుంది. కానీ, అది మరిన్నికొత్త చిక్కు సమస్యలను తెచ్చేఅవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావించి విభజన ప్రక్రియను వ్యూహాత్మకంగా జాప్యం చేసినా లేక అనివార్య కారణాల వలన జాప్యం జరిగినా అప్పుడు ఎన్నికల వరకు రెండు రాష్ట్రాలను కేంద్రం తన అధీనంలోకి తీసుకొనే అవకాశం ఉంది. అయితే ఎన్నికలు మాత్రం రెండు రాష్ట్రాలలో వేరు వేరుగా జరగవలసి ఉంటుంది గనుక ప్రస్తుతం అధికారంలో ఉన్నకాంగ్రెస్ ప్రభుత్వం రెండు చోట్ల వేర్వేరు ప్రభుత్వాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.   అదే జరిగితే తెలంగాణాలో ఉన్న119మంది శాసన సభ్యులలో కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం 40మంది వరకు సభ్యులు ఉన్నారు. ప్రభుత్వం ఏర్పరచడానికి కనీసం 79 సభ్యులు అవసరం ఉంటారు. ఇప్పటికే మజ్లిస్ తన 9 మంది సభ్యులతో కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తెరాస కనుక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే ఆ పార్టీకి చెందిన 19 మంది శాసన సభ్యులు కలిస్తే మొత్తం 68మంది అవుతారు. ఒకవేళ తెరాస విలీనానికి ఇష్టపడకపోతే అప్పుడు ఆ పార్టీ మద్దతు కోరే అవకాశం ఉంది. విలీనం జరిగినా జరగకపోయినా ఈలోగానే దాదాపు 6 నుండి 8 మంది తెరాస శాసన సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కాంగ్రెస్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ తెరాస కాంగ్రెస్ లో విలీనానికి ఇష్టపడకపోతే మరి కొంత మంది ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే అప్పుడు తెరాసలో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే మిగులుతారు గనుక ‘తెరాస ప్రైవేట్ లిమిటడ్’ అని బోర్డు పెట్టుకోక తప్పదు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకి స్వతంత్ర అభ్యర్ధుల మద్దతు కూడా లభిస్తుంది. ఇంకా తప్పనిసరి పరిస్థితిలో, తెదేపా సభ్యులకు కూడా వలవిసిరినా ఆశ్చర్యం లేదు.   ఎన్నికలకి కేవలం మూడు నాలుగు నెలల వ్యవధిలో కొత్త ప్రభుత్వం సాధించేదేమీ ఉండకపోయినా, ఎన్నికల ముందు అధికారంలో ఉండటం వలన చాలా లాభాలు ఉంటాయి. అధికార పార్టీగా ఎన్నికలలో పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకొనే విధంగా చేయడానికి ఆ కొద్ది సమయం చాలా ఉపయోగపడుతుంది. గనుక కాంగ్రెస్ రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేయడం ఖాయం.

విభజన ప్రక్రియ ముందుకు సాగదు:లగడపాటి

      రాష్ట్ర విభజన ప్రక్రియ ముందుకు సాగదని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అంటున్నారు. ఈ విధంగా తమకు కేంద్రం నుంచి హామీ అందిందని ఆయన అన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతల వల్లే ఇన్నాళ్ళు రాష్ట్రం సమైఖ్యంగా వుందని అన్నారు. రాష్ట్ర విభజన్ ప్రక్రియ ఆగిపోయిందని, దీనిని అధికారికంగా ప్రకటించాలని లగడపాటి డిమాండ్ చేశారు.   ఈరోజు లగడపాటి నివాసంలో సీమాంధ్ర ఎంపీలు భేటి అయ్యారు. హర్ష కుమార్, ఎస్పీవై రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కెవిపి రామచంద్ర రావు, సాయి ప్రతాప్, అనంత వెంకట్రామి రెడ్డిలు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.ఎకె ఆంటోనీ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీకి తమ అభిప్రాయాలు, అనుమానాలను తెలియజేస్తామని అన్నారు. ఆంటోనీ కమిటీ నివేదిక ఇచ్చాకే విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు.

కేసీఆర్‌ హత్య ఆరోపణలపై సోమిరెడ్డి స్పందన

      కేసీఆర్‌ను హత్య చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న హరీష్‌రావు ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పందించారు. 'కేసీఆర్‌ను హత్య చేయాల్సిన అవసరం మాకు లేదు. అంతటివాళ్లు కూడా ఆంధ్రాలో లేరు తెలంగాణలోనే అలాంటి అవసరం ఎవరికైనా ఉందో మీకే తెలియాలి' అని వ్యాఖ్యానించారు.   సీమాంధ్ర ప్రాంతంలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి..12 నుంచి ఏపీఎన్జీవోలు, ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు.. విద్యా సంస్థలు, న్యాయస్ధానాలు పనిచేసే పరిస్థితి లేదు.. 5కోట్ల ప్రజల జన జీవనం ఆగిపోతే కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలకు బాధ్యత లేదా? చూస్తూ ఊరుకొంటారా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. నక్సల్స్ ఎజెండానే తమ ఎజెండా అని కేసీఆర్ చెబుతున్నారు. అంటే ఇంటికో తుపాకి ఇస్తారా లేక ఉచిత తుపాకి పథకం పెడతారా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ వ్యూహం

  కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకొనేందుకు అవసరమయిన యంపీలను అందించే రాష్ట్రాలలో మన రాష్ట్రం కూడా ప్రధానమయినది. కానీ, రాష్ట్రంలో ఒక వైపు తెలంగాణా, మరో వైపు తెదేపా, వైకాపాలు ఈసారి కాంగ్రెస్ కు బలమయిన సవాలు విసురుతున్నారు. ఈ మూడు సమస్యలని ఒకేసారి అధిగమించాలంటే వాటిని బలహీనపరచడమే మార్గం.   అందుకే బ్రిటిష్ వాళ్ళు ఒకనాడు మన దేశంలో దిగ్విజయంగా అమలు చేసిన ‘విభజించు, పాలించు’ సూత్రాన్నే కాంగ్రెస్ కూడా ఎంచుకొంది. దానితో ఊహించినట్లుగానే ముందుగా జగన్ మోహన్ రెడ్డి, ఆ తరువాత కేసీఆర్ ఈ ఆటలో అవుట్ అయిపోయారు. ఇక, మిగిలింది తెదేపా. ఆ పార్టీ నేతలు కూడా సమైక్యాంధ్ర ఉద్యమాలలో పాల్గొనడంతో ఈ రాజకీయ చదరంగంలో కాంగ్రెస్ పై చేయి సాధించలిగింది.   ముందుగానే అందరి దగ్గర రాష్ట్ర విభజనకు అంగీకారపత్రాలు తీసుకోవడం కూడా ఈ ఆటలో భాగమేనని అర్ధం అవుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్న వారందరికీ ఆ లేఖలు చూపి సమాధానం చెప్పమని నిలదీస్తూ, అటు తెలంగాణా, ఇటు సీమంధ్ర ప్రజల ముందు వారిని దోషులుగా నిలబెట్టగలుగుతోంది.   ఈ రాజకీయ చదరంగంలో ప్రస్తుతం కాంగ్రెస్ ఓడిపోతున్నట్లు కనిపిస్తున్నపటికీ, త్వరలోనే ప్రత్యర్ధులపై పైచేయి సాధించడం తద్యం. ఇప్పటికే తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేయక తప్పని పరిస్థితి కల్పించింది. ఇక కాంగ్రెస్ వ్యూహంలో భాగంగా రాజీనామాలు చేసి సమైక్యవాదంతో చెలరేగిపోతున్న తన సీమంద్రా నేతలతో చర్చల నాటకం మొదలుపెట్టేందుకు కాంగ్రెస్ ఒక కమిటీని కూడా ప్రకటించింది.   వారు ఆ కమిటీ తో వరుస సమావేశాలవుతూ డిమాండ్స్ చేస్తుంటే, కాంగ్రెస్ వారికి తలోగ్గుతున్నట్లు నటిస్తూ ఒకటొకటిగా వరాలు ప్రకటిస్తూ ఉద్యమాన్ని కూడా చల్లార్చడం ఖాయం. రాష్ట్ర విభజన ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యేవరకు ఈ డ్రామా కొనసాగించిన తరువాత, కేంద్రం మెడలువంచి తాము చాలా భారీవరాలు రాబట్టామని చెప్పుకొంటూ సీమంద్రా కాంగ్రెస్ నేతలు కూడా తమ రాజీనామాలు వెనక్కు తీసుకోగానే, కాంగ్రెస్ ఎన్నికల గంట కొట్టేస్తుంది.   దానితో ఎన్నికలకి సిద్దంగా లేని ప్రతిపక్షాలు అడ్డుగా దొరికిపోతాయి. వెంటనే అవి కూడా ఉద్యమం పక్కనపడేసి ఎన్నికలు, టికెట్స్ హడావుడిలో పడతాయి. కానీ అప్పటికే సమయం మించిపోతుంది. ఎందుకంటే, కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాలో పోటీ చేయడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్య కాదు. కానీ తెదేపా, వైకాపా, తెరాసలకు మాత్రం చాల కష్టమే.   కాంగ్రెస్ పార్టీ ఈ స్కెచ్ అంతా ముందే సిద్దం చేసుకొన్న తరువాత, తెలంగాణా సాధన సభ పెట్టించేసి కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఇవ్వబోతున్నట్లు లాంచన ప్రకటన చేసేసి, వెన్వెంటనే కోర్ కమిటీలు, వర్కింగ్ కమిటీలు అంటూ కొంచెం హడావుడి చేసి వారం వర్జ్యం అన్నీ చూసుకొని, ఎప్పుడో చాలకాలం క్రితమే తీసుకొన్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ప్రకటించేసింది.   ఊహించినట్లుగానే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు హటాత్తుగా మీదపడబోతున్న ఎన్నికల సంగతి మరిచి ఉద్యమాలు చేసుకొంటూ ‘సమైక్య చాంపియన్ షిప్’ కోసం పోటీలు పడుతున్నాయి. అవి ఈ ఏమరపాటుగా ఉన్న తరుణంలోనే ఎన్నికలకు వెళితే వాటిని పూర్తిగా దెబ్బ తీయవచ్చునని కాంగ్రెస్ వ్యూహం. చాలా క్రితమే రాహుల్ గాంధీ దూతలు రాష్ట్రంలో పర్యటించి గెలుపు గుర్రాల పేర్లను నమోదు ప్రక్రియను కూడా పూర్తి చేసి ఆయన చేతిలో పెట్టడం గమనిస్తే కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల ఎన్నికలకి పూర్తిగా సన్నాహాలు పూర్తిచేసుకొన్న తరువాతనే రాష్ట్ర విభజన ప్రకటన చేసినట్లు అర్ధం అవుతోంది.   వీలయినంత వేగంగా రాష్ట్ర విభజన ప్రక్రియను, దానితో బాటే సమాంతరంగా చర్చల డ్రామాను కూడా పూర్తి చేసి, డిసెంబరు నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలతో బాటు సాధారణ ఎన్నికలను కూడా నిర్వహిస్తే ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో పూర్తి అనుకూల ఫలితాలు రాబట్టవచ్చునని కాంగ్రెస్ వ్యూహం.

నిమ్మగ‌డ్డకు తాత్కాలిక బెయిల్‌

  జ‌గ‌న్ అక్రమాస్తుల కేసులో చంచ‌ల్ కూడా జైలులో రిమాండ్ ఖైదిగా ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగ‌డ్డ ప్రసాద్‌కు బెయిల్ ల‌భించింది.వ్యక్తి గ‌త కార‌ణాల‌తో బెయిల్ కావాలంటూ నిమ్మగ‌డ్డ పెట్టుకున్న పిటిష‌న్ పై విచారించిన సిబిఐ కోర్టు 2 రోజుల పాటు తాత్కాలిక బెయిలును మంజూరు చేసింది. నిమ్మగ‌డ్డ బెయిలుకు సంభందించిన మంగ‌ళ వారం విచారించిన కోర్టు ఈ మేర‌కు ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే కేసులో జైళులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ బెయిల్ పిటిష‌న్ విచార‌ణ‌ను ఈ నెల 12కు వాయిదా వేసిన కోర్టు, మోపిదేవి ఆరోగ్య ప‌రిస్థితిపై నివేదిక ఇవ్వాల‌ని మెడిక‌ల్ బోర్డును ఆదేశించింది.

రిజ‌ర్వ్ బ్యాంక్ కొత్త గ‌వ‌ర్నర్‌

  సెప్టెంబ‌ర్ 4తో రిజ‌ర్వ్ బ్యాంక్ ప్రస్థుతం గ‌వ‌ర్నర్ దువ్వూరి సుబ్బారావు ప‌ద‌వీకాలం ముగుస్తుండ‌టంతో ఆ స్థానంలో కొత్త గ‌వ‌ర్నర్‌గా ర‌ఘురామ్ రాజ‌న్ బాధ్యత‌లు స్వీక‌రించ‌నున్నారు. ర‌ఘురామ్‌రాజ‌న్ రిజ‌ర్వ్ బ్యాంక్ 23వ గ‌వ‌ర్నర్‌గా బాద్యత‌లు చేప‌డ‌తారు. ఈయ‌న మూడేళ్ల పాటు ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. ప్రస్థుతం రాజ‌న్ భార‌త ప్రభుత్వానికి ప్రదాన ఆర్ధిక స‌ల‌హాదారుగా వ్యవ‌హ‌రిస్తున్నారు,  సాధారణంగా రిజర్వ్‌ బ్యాంకుకు ఐఏఎస్‌ అధికారిని మాత్రమే గవర్నర్‌గా నియమిస్తుంటారు. దువ్వూరి సుబ్బారావు , అంతకుముందున్న గవర్నర్‌ వై.వి.రెడ్డి ఇద్దరూ ఐఏఎస్‌ అధికారులే. త‌న‌కున్న అపూర్వ మేద‌స్సు కార‌ణంగానే రాజ‌న్ ఐఏఎస్ కాక‌పోయినా రిజ‌ర్వ్ బ్యాంక్ గ‌వ‌ర్నర్ ఎంపిక‌య్యారు. అసాధార‌ణ ప్రతిభావంతుడిగా రాజ‌న్‌కు పేరుంది. ప్రస్థుతం దేశం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ త‌రుణంలో రాజ‌న్ రిజ‌ర్వ్ బ్యాంక్ గ‌వ‌ర్నర్‌గా బాధ్యత‌లు తీసుకుకోవ‌టం మంచి ప‌రిణామం అంటున్నారు విశ్లేష‌కులు. అత్యంత చిన్న వ‌య‌సులోనే ఆర్బీఐ గ‌వ‌ర్నర్‌గా బాద్యత‌లు చేప‌డుతున్న వ్యక్తిగా కూడా రాజ‌న్ రికార్డ్ క్రియేట్ చేశారు.

కెసిఆర్ హ‌త్యకు కుట్ర

  తెలంగాణ ప్రక‌ట‌న నేప‌ధ్యంలో త‌మ నాయ‌కుడు కెసిఆర్‌కు ప్రాణ హాని ఉంద‌ని టిఆర్ ఎస్ పార్టీ ప్రక‌టించింది. ఈ మేర‌కు త‌మ ద‌గ్గ‌ర విశ్వస‌నీయ స‌మాచారం ఉంద‌న్న టిఆర్ఎస్ నాయ‌కులు కెసిఆర్‌కు జెడ్ ప్లస్ క్యాట‌గిరి సెక్యూరిటీ కావాల‌ని డిమాండ్ చేశారు.కెసిఆర్ మీద ఈగ వాలినా రాష్ట్రం అల్లక‌ల్లోలం అవుతుంద‌న్నారు ఆ పార్టీ నాయ‌కుడు ఈటెల రాజేంద‌ర్‌. కెసిఆర్‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగే అవ‌కాశం ఉంద‌న్న ఇంటిలిజ‌న్స్ రిపోర్ట్ ప్రభుత్వానికి అందింద‌న్న రాజేంద‌ర్ ఆయ‌న‌కు త‌గిన భ‌ద్రత క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు. కెసిఆర్ నాలుగున్నర కోట్ల ఆశాకిర‌ణం, అందుకే ఆయ‌నను హ‌తా మార్చాల‌ని విద్రోహ శ‌క్తులు ప్రయ‌త్రిస్తున్నాయ‌న్నారు. ఈ మేర‌కు ఇప్పటికే సుపారిలు కూడా అందాయ‌ని ఆ స‌మాచారం త‌మ ద‌గ్గర ఉంద‌ని అడిష‌న‌ల్ డిఐజి ఆ స‌మాచారాన్ని అందిస్తామ‌ని ప్రక‌టించారు. ఈ కుట్ర పై పూర్తి స్థాయి ద‌ర్యాప్తు జ‌రిపించ‌టంతో పాటు కెసిఆర్‌కు త‌గిన భ‌ద్రత క‌ల్పించాల‌న్నారు. కెసిఆర్‌కు ఏం జ‌రిగినా అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాద్యత వ‌హించాల‌న్నారు.

కాంగ్రెస్ మార్క్ క‌మిటీ

  తెలంగాణ ప్రక‌ట‌ణ‌తో అట్టుడుకుతున్న ప‌రిస్థితుల‌ను చక్కదిద్దేందుకు కాంగ్రెస్ మ‌రోసారి త‌న పాత అస్త్రాన్ని ప్రయోగించింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగ‌సి ప‌డ్డ ప్రతిసారి క‌మిటీ ఏరుతో కాల‌యాప‌న చేసిన కాంగ్రెస్ ఈసారి సీమాంద్ర అల్లర్ల చ‌ల‌క‌లార్చేందుకు అదే అస్త్రాన్ని వాడుతుంది. ప్రక‌ట‌న‌కు ముందే చేయాల్సిన ప‌నిని కాస్త ఆల‌స్యంగా ప్రక‌ట‌న త‌రువాత మొద‌లుపెట్టింది. ఈ క‌మిటీలో కూడా ఆంద్ర ప్రదేశ్‌నుంచి ఏ ఒక్కరికి స్ధానం క‌ల్పించ‌లేదు. క‌మిటీ స‌భ్యులుగా ఎకె ఆంటోని, దిగ్విజ‌య్‌సింగ్‌, వీర‌ప్పమొయిలీ ఇరు ప‌క్షాల వాద‌న‌ల‌ను విన‌నున్నారు. వివాద ర‌హితుడిగా పార్టీతో పాటు దేశ రాజ‌కీయాల్లో కూడా మంచి ప‌ట్టున్న ఆంటోనికి విలీనం స్పెష‌లిస్ట్‌గా కూడా పేరుంది, చిరంజీవి మూన్నాళ్ల ముచ్చట‌గా ముగించిన ప్రజారాజ్యం పార్టీ విలీనంలో కీల‌క పాత్ర పోషించారు. ప్రస్థుతం ఈయ‌న రాజ‌కీయ చ‌తుర‌త టిఆర్ఎస్ విలీనానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. ఇక ప్రస్థుతం రాష్ట్ర వ్యవ‌హారాల ఇంచార్జ్‌గా వ్యవ‌హ‌రిస్తున్న దిగ్విజ‌య్ సింగ్ విభ‌జ‌న స్పెష‌లిస్ట్ గ‌తంలో రాష్ట్రాలు విడిపోయిన సంద‌ర్భంలో ఆ రాష్ట్రాల‌తో పరోక్షంగానో ప్రత్యక్షంగానో సంబందం ఉన్న డిగ్గీ ఆంద్ర ప్రదేశ్ విష‌యంలో కూడా అంతే వేగంగా ప‌నిముగించేశారు. ఇక మూడో వ్యక్తి వీర‌ప్పమొయిలికి కూడా రాష్ట్ర ప‌రిస్ధితుల‌పై మంచి అవ‌గాహ‌న ఉంది. వైయ‌స్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి అత్యంత స‌న్నిహితుడిగా పేరున్న ఈయ‌న‌కు రాష్ట్రనాయ‌కుల‌తో స‌న్నిహిత సంభందాలు ఉన్నాయి. మ‌రి ఈ క‌మిటీ రాష్ట్రంలో పెల్లుబుకుతున్న ఆగ్రహ జ్వాల‌ల‌ను ఎంత‌వ‌ర‌కు చ‌ల్లారుస్తుందో చూడాలి.

స‌మ్మెకు స‌ర్వం సిద్దం

  రాష్ట్రంలో మ‌రో సారి స‌మ్మెసైర‌న్ మోగింది, గ‌తంలో స‌క‌ల జ‌రనుల స‌మ్మెతో కుదేల‌యిన రాష్ట్ర ఆర్ధిక వ్యవ‌స్థ మ‌రోసారి అదే ఉప‌ద్రవాన్ని ఎదుర్కొనబోతుంది. సీమాంద్ర పై ఎటూ తేల్చకుండానే తెలంగాణ ప్రక‌ట‌న చేసిన కాంగ్రెస్ అధిష్టానం ఇక మూల్యం చెల్లించ‌క త‌ప్పదంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. స‌మైక్యాంద్రకు మ‌ద్దతుగా ఈ నెల‌12 అర్ధరాత్రి నుంచి స‌మ్మెకు దిగుతున్నట్టుగా ఏపి ఎన్జీవోలు హెచ్చరించారు. అందుకు సంబందిచిన స‌మ్మె నోటిసును ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యద‌ర్శికి అంద‌చేశారు ఏపి ఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు. రాష్ట్ర విభ‌జ‌నపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణ‌యాన్ని వ్యతిరేఖిస్తూ స‌మ్మెకు దిగుతున్నట్టుగా అశోఖ్ బాబు వెల్లడించారు. రాష్ట్ర  విభ‌జ‌న జ‌రిగితే ఉద్యోగుల ప‌రిస్థితి ద‌య‌నీయంగా త‌యార‌వుతుంది, విద్యా ఉపాది అవ‌కాశాలు దెబ్బతింటాయ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. హైద‌రాబాద్ పై తెలంగాణ ప్రాంత వాసుల‌తో పాటు సీమాంద్ర వాసుల‌కు కూడా స‌మాన హ‌క్కులు ఉంటాయిని, త‌మ ప్రాంత ప్రజ‌ల మ‌నోభావాల‌నుతెలుసుకోకుండా ఏక ప‌క్షంగా విభ‌జ‌న చేయటం స‌రికాదు అన్నారు. ఏపీ ఎన్జీవోల‌కు మ‌ద్దతుగా 12 అర్ధరాత్రి నుంచి ఆర్టీసి బ‌స్సుల‌ను నిలిపివేస్తామ‌ని ఎన్ఎంయూ, ఈయులు మద్దతు తెలిపాయి.

విభజనతో ఆంధ్రాలో రియల్ బూమ్

  ప్రస్తుతం రాష్ట్ర విభజనతో సీమంద్రా ప్రాంతం అట్టుడుకుతున్నపటికీ, త్వరలోనే అంతా సద్దు మణిగి తిరిగి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తుంటే, రెండు రాష్ట్రాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పుంజుకొంటుందని, ముఖ్యంగా కొత్త రాజధాని, శాసనసభ, హైకోర్టు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు మొదలయిన నిర్మాణ కార్యక్రమాలు భారీ ఎత్తున జరుగబోతున్నందున ఆంధ్రప్రదేశ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పుంజుకొంటుందని ఆ రంగానికి చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, నిర్మాణ రంగం, దానిని అనుబంధంగా ఉన్న పరిశ్రమలకి, వ్యాపారాలకి ఆయా రంగంలో పనిచేస్తున్ననిపుణులకి, కార్మికులకి మంచి గిరాకి ఏర్పడుతుందని నిపుణులు చెపుతున్నారు. అదే విధంగా రాజధాని పరిసర జిల్లాలు కూడా త్వరితగతిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకొంటాయి, గనుక రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం దాదాపు 40 శాతం వరకు పెరుగుతుందని నిపుణుల అంచనా వేస్తున్నారు.   అయితే, ఇది వెన్వెంటనే మొదలవకపోయినా రానున్న 6 నుండి 8 నెలలో క్రమంగా పెరుగుతుందని, రానున్న ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత అది మరింత పుంజుకొని, రెండు మూడు సం.లలో పతాక స్థాయికి చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని బహుశః ఒంగోలు గుంటూరు మద్య ఎక్కడయినా ఏర్పరిచే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపద్యంలో ఆ పరిసర జిల్లాలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం రెట్టింపు అవుతుందని అంచనా.   ఇక విశాఖ, రాజమండ్రీ, తూర్పు, పశ్చిమ గోదావరి కర్నూలు, నెల్లూరు, తిరుపతి ప్రాంతాలలో కూడా దీని ప్రభావం బాగా కనిపిస్తుందని భావిస్తున్నారు. అయితే, విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం, చిత్తూరు వంటి ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మరీ భారీ పెరుగుదల ఉండకపోవచ్చును. కానీ, కొత్తగా రాష్ట్రం ఏర్పడిన కారణంగా 10 నుండి 15 శాతం పెరిగే అవకాశం ఉంటుందని నిపుణుల చెపుతున్నారు.   ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాలలో భూములు కొనుగోలు చేసి ఉంచుకొన్న ప్రవాసాంధ్రులు నిర్మాణ కార్యక్రమాలు చెప్పట్టే అవకాశం ఉందని, అదేవిధంగా మరనేక మంది భూములు కొనుగోలుకు ఆసక్తి చూపించే అవకాశం ఉందని ఊహిస్తున్నారు. ఇక రాష్ట్రానికి భారీ పరిశ్రమలు, పెద్ద పెద్ద విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు కూడా వచ్చే అవకాశం ఉంది గనుక రాష్ట్ర వ్యాప్తంగా భూముల కొరత ఏర్పడి ధరలకు రెక్కలు రావచ్చునని నిపుణులు చెపుతున్నారు.   ఇక, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ మొదలవగానే దేశ విదేశాల నుండి పెద్ద ఎత్తున పరిశ్రమలు, వ్యాపారాలు, మౌలిక వసతులు వంటి వాటిలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా చాలామంది చొరవ చూపవచ్చునని, కానీ అందుకు సుస్థిరమయిన ప్రభుత్వము, ఆకర్షణీయమయిన ప్రభుత్వ విధానాలు ఉన్నపుడే అభివృద్ధి శరవేగంతో జరుగుతుందని, ఒకవేళ మొదటి రెండు సం.లలో ప్రభుత్వం అస్థిరంగా ఉంటే కనుక, దాని ప్రభావం రాష్ట్రంపై చిరకాలం ఉండిపోయే ప్రమాదం ఉందని, అదే జరిగితే అభివృద్ధి నత్త నడకన సాగుతుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.   మంచి పరిపాలనా, వ్యాపార దక్షులుగా పేరున్నఆంధ్ర రాజకీయ నేతలు, వ్యాపారులు అందివచ్చిన ఈ సువర్ణావకాశాన్నిచక్కగా అందిపుచ్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడం ఖాయమని వారు దృడంగా చెపుతున్నారు.

సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఘర్షణ

      హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ లో ఉన్న జలసౌధ నీటి పారుదల కార్యాలయంలో తెలంగాణ ఉద్యోగులు..సీమాంధ్ర ఉద్యోగుల మధ్య తోపులాట జరగడంతో..అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బోజన విరామ సమయంలో టీ ఎన్‌జీవో ఉద్యోగులు ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఏపీ ఎన్‌జీవో ఉద్యోగులు విభజనకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రామాన్ని చేపట్టారు. ఏపీ ఎన్‌జీవో ఉద్యోగులు సమైక్య నినాదాలు చేయగా..వారికి పోటిగా టీ ఎన్‌జీవో ఉద్యోగులు తెలంగాణ నినాదాలు చేశారు. దీంతో ఉద్యోగుల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వివాదం జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారికి నచ్చజెప్పి ఇరు ప్రాంతాల ఉద్యోగులను శాంతింపజేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.