రాజీనామా డ్రామాలు
posted on Aug 3, 2013 @ 10:14AM
....సాయి లక్ష్మీ మద్దాల
రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఇప్పటివరుకు తెలంగాణాలో జరిగిన ఉద్యమం ఇప్పుడు సీమాంద్రలో జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారం నేపధ్యంలో సీమాంద్ర ప్రాంతంవారి భావోద్వేగాలను చల్లార్చటానికి అన్నట్లు ఆ ప్రాంత నేతలంత రాజీనామా బాట పట్టారు. ఐయితే ఇక్కడ ప్రజలకు అర్ధంకాని విషయం ఏమిటంటే,ఇంతకు ముందు అఖిల పక్ష సమావేశాలలో తమకెలాంటి అభ్యంతరం లేదని చెప్పిన పెద్దమనుషులు కనీసం విభజన ప్రక్రియ ఐన హేతుబద్ధంగా జరిపించలేని అసమర్ధులు ఇప్పుడెందుకు ఈ రాజీనామాల డ్రామాలతో మరోసారి ప్రజలకు నామాలు పెట్టాలని చూస్తున్నారు అని. ఇప్పుడున్న సీమాంద్ర నేతలలో ఎవరికైనా హైదరాబాదులో వ్యాపారాలు లేకుంటే ఈ రాజీనామాఊసే ఉండేది కాదు. మంత్రి పదవి రానంత వరకు సమైఖ్యాంద్ర అన్న కావూరి ఇప్పుడేమో మాట మార్చిన వైనం ప్రజలకు తెలియదు అనుకుంటే పొరబాటే. బొత్స సత్యనారాయణ వైఖరి మరీ అసహ్యం. రాష్ట్రం ఎప్పుడెపుడు విడిపోతుందా ఆంద్ర రాష్ట్రానికి తానెపుడు ముఖ్య మంత్రిని అవుతాన అన్న ద్యాసే తప్ప రాష్ట్రం ఏమై పోయినా ఆయనకు అఖర్లేదు.
ప్రత్యేక రాష్ట్రానికి కావలసిన నిధులు,నీళ్ళు,ఉద్యోగాలు,చదువులు,ఇతరత్రా పారిశ్రామిక అభివృద్ధికి కావలసిన కార్యాచరణ,కనీసం వీటి గురించైనా అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చి సీమాంద్ర ప్రాంత ప్రజలకు న్యాయం చేసి,వారికి భరోసా కలిగించ లేకపోయారు. అందుకనే కదా ఆ ప్రాంత ప్రజల ఉద్వేగాలు మిన్నంటుతున్నాయి. కనీసం రాజీనామాలు సమర్పించే విషయంలో కూడా చిత్తశుద్ది లేదు ఆయా రాజకీయనేతలకు. కొంతమంది స్పీకర్ కు రాజీనామాలు ఇస్తే, ఇంకొంతమంది పీసీసీ అద్యక్షుడికి ఇస్తున్నారు. ఇహ MP లు ,కేంద్ర మంత్రులు అయితే దిగ్విజయ్ సింగ్ కు సమర్పించారు. ఇదెక్కడి పద్ధతి అనుకోవాలి.
ఏది ఏమైనా నేడు సీమాంద్ర నేతలకు ఉన్నది వారి ప్రజల పట్ల అభిమానం ఎంత మాత్రం కాదు. వారి కున్న బాధంతా హైదరాబాదులో వారికున్న ఆస్తులు,వ్యాపారాలు ఏమైపోతాయోననే. ఛి ఛి వీళ్ళు నేతలు కాదునీచులు. . రాష్ట్రం విడిపోతున్నది అనే సమాచారం వారికి ముందే తెలిసినా,ఏదో ప్రజలకోసం చాలా కష్టపడిపోతున్నట్లు ఉండవల్లి రాజమండ్రి లో సభ నిర్వహించి తనకు ఎంతగొప్ప వాక్చాతుర్యముందో సినీ ఫక్కీలో చూపించాడు. ఏమీ కాదు అంతా మేం చూసుకుంటాం,మీకు అండగా మేమున్నాం అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించారు. గంట శ్రీనివాసరావు వైకాపా లో చేరటానికి మార్గం సుగమం చేసుకుని ఇప్పుడేదో ప్రజల కోసం త్యాగం చేస్తున్నట్లు రాజీనామా డ్రామాలు ఆడుతున్నాడు.
ఇంకా అందరి కంటే పెద్దమనిషి ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఈరోజు వరకు రాష్ట్రాన్ని సమైఖ్యంగా ఉంచటానికి అధిష్టానానికి ఏమి వివరించారో ప్రజలకు చెప్పే ప్రయత్నం చెయ్యలేదు సరికదా కనీసం రాష్ట్ర ప్రజలను క్షమాపణ అడిగే ప్రయత్నం కూడా చెయ్యలేదు. ఈరోజున ఉన్న రాజకీయ నేతలందరు అవేనీతి పరులే. ఈ విషయంలో అన్ని పార్టీలది అదే బాట. అందుకనే సోనియా గాంధి అంత నిరంకుశము గా దేశాన్ని ఏలుతోంది. ప్రతినేత తన స్వలాభం కోసం,తన స్వార్ధం కోసం ఆరు కోట్ల ప్రజానీకం బ్రతుకును,భవిష్యత్తును,జీవితాన్ని ఒక విదేశీయురాలి పాదాల చెంత తాకట్టు పెట్టారు. అయినా కాని వారికి ఒకటే ధైర్యం ఎలాగైనా వచ్చే ఎన్నికలలో ప్రజలను మభ్య పెట్టగలము మళ్ళి గద్దెనెక్క గలము అని.
నిజానికి ఈ నేతలలో ఎవరికైనా మళ్ళి 2014 ఎన్నికలలో నిలబడే అర్హత ఉందా అసలు?అందుకనే నేడు వీళ్ళు ప్రజలకు చేసిన అన్యాయానికి, మోసానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే, చేయాల్సింది రాజీనామాలు కాదు, రాజకీయ సన్యాసం. అవును ఈమాట ముందుగా సెలవిచ్చిన పెద్దమనిషి లగడపాటి. కాని ఈరోజు విషయానికి వచ్చేసరికి ఆయనకూడా మొహం చాటేసి,రాజీనామాతో సరిపెట్టుకున్నారు. కాబట్టి ప్రజలు పెట్టె ఓట్ల భిక్షతో గద్దెనెక్కి,ఆప్రజల జీవితాలనే నాశనం చేసే హక్కు ఈ రాజకీయ నీచులకు ఎవరిచ్చారు? అందుకనే ప్రజా కోర్టులో నిలబడితే వీరికిచ్చే తీర్పు రాజకీయ సన్యాసం. మళ్ళి జన్మలో వీరికి ఆ రాజకీయ పదవులను అనుభవించే అర్హత లేదు. ప్రజల నెత్తి మీద కూర్చుని పెత్తనం చేసే అర్హత అంతకన్నా లేదు. అందుకని ప్రజలు వీళ్ళ మీద ఒత్తిడి తేవలసింది రాజీనామాల కోసం కాదు రాజకీయ సన్యాసం కోసం. ఎందుకంటే ఇప్పుడున్న ఈ చెత్తంతా ఇహనైనా కొట్టుకుపోతే,కనీసం రాబోయే ఎన్నికల నుండైనా అంతో ఇంతో ప్రజల బాగుకోసం పాటుబడే వాళ్ళు వస్తారు.