కాంగ్రెస్ ప్రయోజనాల కోసమే నిర్ణయంలో జాప్యమా
posted on Aug 3, 2013 @ 8:25PM
కాంగ్రెస్ పార్టీ చరిత్రలో తీసుకొన్నఅత్యంత సాహసోపేత నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన. ఆ నిర్ణయం తీసుకొనేందుకు రాష్ట్రం చాలా భారీ మూల్యం కూడా చెల్లించక తప్పలేదు. అయినప్పటికీ, అందుకు తగిన ప్రతిఫలం మాత్రం కాంగ్రెస్ ఇవ్వలేకపోయింది. హైదరాబాదు విషయంపై నిర్దిష్ట ప్రణాళిక ఏదీ తెలియజేయకుండానే రాష్ట్ర విభజన చేస్తున్నట్లు ప్రకటించినందున, ఇప్పుడు సీమంద్రా ప్రాంతంలో అరాచక పరిస్థితులు తలెత్తాయి. అయితే, ఇటువంటి పరిస్థితులు అత్యంత సహజమని సాక్షాత్ దిగ్విజయ్ సింగ్ గారు శలవివ్వడం చాలా విస్మయం కలిగిస్తుంది. అంటే ఇటువంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీకి పూర్తి అవగాహన ఉన్నపటికీ, వాటిని ముందుగానే పరిష్కరించే ప్రయత్నమేదీ చేయకుండా రాష్ట్ర విభజన చేసినట్లు అర్ధం అవుతోంది.
తెలంగాణాపై మరింత తాత్సారం చేయడం వలన తనకి ఆ ప్రాంతంలో రాజకీయంగా నష్టం కలుగుతుందని గ్రహించినందునే ఆ పార్టీ అంత తక్కువ సమయంలో అంత త్వరగా నిర్ణయం ప్రకటించగలిగింది. గులాం నబీ ఆజాద్ ఏళ్ల తరబడి నాన్చిన ఈ వ్యవహారాన్నిదిగ్విజయ్ సింగ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ గా నియమితులయిన కొద్ది రోజులలోనే పరిష్కరించడం గమనార్హం.
అంటే ఇది రాత్రికి రాత్రి తీసుకొన్న నిర్ణయమేమీ కాదని అర్ధం అవుతోంది. కాంగ్రెస్ రాష్ట్ర విభజనపై చాలా కాలం క్రితమే ఒక రోడ్ మ్యాప్ సిద్దం చేసుకొని తగిన సమయం వరకు వేచి చూస్తూ, చర్చలు, కోర్ కమిటీల పేరిట కాలక్షేపం చేసి, ఆ సమయం రాగానే త్వర త్వరగా పావులు కదిపి తెలంగాణా ప్రకటన చేసేసింది.
ఇప్పుడు ప్రకటన చేయడం ద్వారా ఎన్నికలు దగ్గర పడేవరకు ఈ ప్రక్రియను కొనసాగించే అవకాశం ఉంటుంది. తద్వారా అటు కేసీఆర్ ని తెలంగాణా ప్రజలని తనకు అనుకూలంగా మలచుకోవచ్చును. సరిగ్గా ఎన్నికల గంట మ్రోగేసరికి రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తిచేసి ఆ వెంటనే ప్రజలలోకి వెళితే దాని పూర్తి ఫలితం పొందవచ్చునని కాంగ్రెస్ ఆలోచన కావచ్చును.రాజకీయంగా ఇది చాల చక్కటి ఆలోచనే.
అయితే అందుకు రాష్ట్రాన్ని మళ్ళీ అగ్ని గుండంలోకి త్రోయడం మాత్రం క్షమించరాని నేరం అని చెప్పక తప్పదు. రాష్ట్ర ప్రజలు ఏవిధంగా గొడవలు పడినా, ఉద్యమాలు చేసినా, రాష్ట్రం ఎంత నష్టపోయినా పరువలేదు కానీ, తన రాజకీయ ప్రయోజనాలకి మాత్రం ఎటువంటి నష్టం కలగకూడదని కాంగ్రెస్ వంటి పార్టీ ఆలోచించడం చాలా విచారకరం.