చిరంజీవి శపథం
posted on Aug 3, 2013 @ 7:05PM
ఈ రోజు మన చిరంజీవి గారు ఒక గొప్ప మాట శలవిచ్చారు. హైదరాబాదును శాశ్విత రాజధాని చేయకపోతే తానూ కూడా రాజీనామాకు సిద్దం అని. అయితే అంతకు ముందు రోజే రాజీనామాల వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండబోదనే గొప్పనిజాన్ని కూడా ఆయన నోటితోనే శలవిచ్చారు. బహుశః కాంగ్రెస్ నీళ్ళు బాగా వంటబట్టడం వలననే నాలిక ఆవిధంగా మెలికలు తిప్పడం సాధ్యం అవుతోందేమో. ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరించాలనే ఆలోచన కంటే ఈ సమయంలో ఏవిధంగా మాట్లాడితే రాజకీయంగా తనకు ప్రయోజనం చేకూరుతుందనే ఆలోచనే ఆయనలో ఎక్కువ కనిపిస్తోంది. అందుకే ఆయన హైదరాబాదును శాశ్విత రాజధాని చేయకపోతే రాజీనామాకు చేస్తానని ఇప్పుడు శలవిస్తున్నారు. అయితే, కేంద్రం హైదరాబాద్ పై తప్పనిసరిగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం అనివార్యమని తెలిసినందునే ఆయన ఆవిధంగా అని ఉండవచ్చును తప్ప ఎంతో ‘కష్టపడి’ సంపాదించుకొన్న కేంద్ర మంత్రి పదవిని ఆయన వదులుకొంటారని భావించలేము.
ఆయన రాజీనామా చేస్తారా లేదా అనే దాని కంటే అసలు అటువంటి కీలక పదవిలో ఉండి, రాష్ట్ర సమస్య పరిష్కారంలో ఏమి పాత్ర పోషించారనేదే ప్రజలకి ముఖ్యం. రాష్ట్ర విభజన ప్రకటన కూడా వచ్చేసిన తరువాత ఆయనని వెళ్లి సోనియాగాంధీతో మాట్లాడి నిర్ణయం వెనుకకు తీసుకొనేలా చేయమని ఎవరూ కోరట్లేదు. కానీ, రాజధానిపై రగులుతున్న మంటలని చల్లార్చేందుకు, లేదా అర్పివేసేందుకు తన వంతు కృషి ఏమి లేదా? అని మాత్రమే ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
తన ముద్దుల కొడుకు కారుకి అడ్డువచ్చిన ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను తన భద్రతా సిబ్బంది నడిరోడ్డు మీద చితక బాధినప్పటికీ నోరు మెదపని ఆయన, కేసీఆర్ ఆంధ్ర ఉద్యోగులను బయటకి పొమ్మని చెప్పడం భావ్యం కాదని శలవిచ్చారు. ఆయన వంటి రాజకీయ అనుభవజ్ఞుడు అటువంటి మాటలు మాట్లాడటం విచారకరమని చాలా పద్దతిగా శలవిచ్చారు.
ఇటువంటి ఖండనలు, అసంబద్దమయిన ప్రతిపాదనలు చేస్తూ కాలక్షేపం చేయడం కంటే, ఇటువంటి సమయంలో ఎటువంటి నిర్ణయం తీసుకొంటే ఉభయప్రాంతాల వారికి మేలు చేకూరుతుందో చెప్పగలిగే మేధావులను సమావేశ పరిచి వారి సలహాలను సూచనలను అటు కేంద్రానికి, ఇటు ఉభయ ప్రాంత నేతలకు తెలియజేసి తన పరపతిని సద్వినియోగ పరిస్తే ఆయన రాజీనామా చేసినంత పుణ్యం మూట కట్టుకోవచ్చును.