ఆఖరి బంతి వరకు ఆడుతా: స్టార్ బ్యాట్స్ మ్యాన్
సీమాంధ్ర కాంగ్రెస్ నేతల ‘స్టార్ బ్యాట్ మ్యాన్’ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్నమరో సిక్సర్ కొట్టారు. ఆఖరి బంతి పడేవరకు ఏ మ్యాచు ముగియదని ఆయన వ్యాఖ్యానించారు. అంటే రాష్ట్ర విభజన అంశంపై తుది వరకు పోరాటం కొనసాగిస్తానని చెప్పినట్లే అనుకోవచ్చును. సరిగ్గా అంతకు ముందు రోజే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ “ఆయన రాష్ట్రమంతటికీ ముఖ్యమంత్రి గనుక అందరినీ కలుపుకుపోవలసిన అవసరం ఉందని” హెచ్చరికలు జారీ చేసారు. అయినప్పటికీ, కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ సమైక్యవాదం వినిపించడం చూస్తే, ఇక అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవాలని సిద్దం అయినట్లే ఉన్నారు.
“రాజకీయ సమీకరణాలు, పార్టీల అభిప్రాయాల కంటే ప్రజాభిప్రయమే ముఖ్యమని, పార్టీలు కూడా తదనుగుణంగానే నడుచుకోవాలని ఆయన అన్నారు. “దాదాపు ఆరున్నర లక్షల మంది ఉద్యోగులు, మూడున్నర లక్షల మంది ప్రజలు గత రెండు నెలలుగా రోడ్ల మీద ఉండి చేస్తున్న ఉద్యమాలను, వారి ఆందోళనను పట్టించుకోకుండా ముందుకు సాగితే పార్టీ తీవ్రంగా నష్టపోవడం ఖాయమని ఆయన స్పష్టం చేసారు.
హైదరాబాద్, విద్యుత్, ఉద్యోగాలు, నదీ జలాల పంపకాలలో వచ్చే సమస్యలకు పరిష్కారం చూపకుండా రాష్ట్ర విభజన చేయడం వలన సమస్యలు మరింత పెరుగుతాయే తప్ప తరగవని ఆయన మరో మారు స్పష్టం చేసారు. ఇంతవరకు నదీ జలాల పంపకాలపై వేసిన ఏ ట్రిబ్యునల్స్ కూడా సమస్యలను ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యంగా పరిష్కరించలేకపోయిన సంగతిని కేంద్రం గుర్తుంచుకోవలసిన అవసరం ఉందని అన్నారు. ఒక రాష్ట్రంలో ఏర్పరిచిన ప్రాజెక్టులను రెండు రాష్ట్రాలకి సమానంగా విడదీసి ఈయడం ఏవిధంగా సాధ్యమో కేంద్రమే ఆలోచించుకోవాలని” అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డి పట్ల తన అసంతృప్తిని బహిరంగంగానే వెలిబుచ్చినప్పటికీ ఆయన మరో మారు తన వైఖరిని ఈవిధంగా స్పష్టం చేయడంతో, ఇప్పుడుకాంగ్రెస్ అధిష్టానం ఆయనతో ఏవిధంగా వ్యవహరించాలనే సంగతి నిర్ణయించుకోవలసి ఉంటుంది.
ఇంతవరకు ఆయన సీమాంద్రా నేతలందరినీ రాజీనామాలు చేయకుండా పట్టి ఉంచారు. ఒకవేళ అధిష్టానం ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకొన్నా, లేదా విభజనపై ముందుకు వెళ్ళినా, ఆయనతో సహా అందరూ కూడా హెచ్చరిస్తున్నట్లుగానే తమ పదవుల నుండి తప్పుకోవచ్చును. అయినా కాంగ్రెస్ అధిష్టానం మొండిగా ముందుకు సాగితే వారందరూ పార్టీ నుండి తప్పుకొని మరో కొత్త పార్టీ పెట్టినా ఆశ్చర్యం లేదు. మరి కాంగ్రెస్ అధిష్టానం పరిస్థితిని అంతవరకు రానిస్తుందా లేక వేరే ఏమయినా ఉపాయం ఆలోచిస్తుందా? అనేది చూడాలి.