chandrababu

తూర్పు గోదావరిలోకి బాబు ప్రవేశం

  తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో తన పాదయాత్ర ముగించుకొని ఈ రోజు కొవ్వూరు-రాజమండ్రి మధ్యగల రెయిల్-కం-రోడ్ బ్రిడ్జ్ మీదుగా తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించనున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జిల్లా నేతలు, కార్యకర్తలు బ్రిడ్జ్ వద్ద ఉదయం నుండే ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు ఈ రోజు రాత్రికి రాజమండ్రీలో బస చేసి రేపటి నుండి తిరిగి తన పాదయాత్రను కొనసాగిస్తారు. గత ఆరు నెలలుగా నిర్వివిరామంగా పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు నాయుడు వచ్చే నెల 19వ తేదీన తన పాదయత్ర కు ముగింపు పలికి, తన పుట్టిన రోజు నాడు అంటే వచ్చే నెల 20న విశాఖపట్నంలో పార్టీ నిర్వహించబోయే ఒక భారీ బహిరంగ సభలో పాల్గొన్న తరువాత ఆయన హైదరాబాదు తిరిగి వెళ్ళిపోతారు. కొద్ది రోజుల విశ్రాంతి తీసుకొన్న తరువాత మళ్ళీ మిగిలిన రెండు జిల్లాలు-విజయనగరం మరియు శ్రీకాకుళం లను బస్సులో పర్యటిస్తారు.

America Rejects Modi Visa

మోడీకి వీసా ఇచ్చే సమస్యే లేదు ... అమెరికా

  గుజరాత్ బిజెపి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి అమెరికా ప్రభుత్వం వీసా నిరాకరించింది. దీనిపై అమెరికా విదేశాంగ మంత్రి రాబర్ట్ బ్లేక్ వివరణ ఇస్తూ బ్రిటన్ ప్రభుత్వం మోడీకి వీసా విషయంలో వైఖరి మార్చుకున్నా అమెరికా మాత్రం అలాంటి ఆలోచనలో లేదని, పునరాలోచించే ప్రసక్తే లేదని, గోద్రా అల్లర్ల కేసులో ఆయన పాత్ర ఉన్నదన్న ఆరోపణలు ఒక కొలిక్కివస్తేనే ఆయనకు వీసా మంజూరు చేసే విషయంలో పునరాలోచిస్తామని, తమ దేశ పర్యటన కోసం వీసా దరఖాస్తు చేకుంటే ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని వీసా మంజూరు చేయాలా వద్దా అన్న విషయం పరిశీలిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి రాబర్ట్ బ్లేక్ అన్నారు.

tdp

తెదేపా వైపు చూస్తున్న మజ్లిస్ ?

  వాపును చూసి బలుపనుకొన్న మజ్లిస్ పార్టీకి కిరణ్ సర్కార్ నుండి బయట పడిన తరువాత వాపుకి బలుపుకి ఉన్న తేడాను గ్రహించగలిగింది. అందువల్లే, జైలు నుండి బయటకి వచ్చిన తరువాత అక్బరుద్దీన్ మరెక్కడా కూడా అసందర్భ ప్రసంగం చేసే దైర్యం చేయలేదు, అదే విధంగా ఆ మధ్య మీడియాలో ఒక వెలుగు వెలిగిన అతని సోదరుడు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ కూడా మీడియాకు మొహం చాటేశాడు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినపుడే, ‘జగన్ మంచోడనే సర్టిఫికేట్’ కూడా జారీచేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపాలనే తమ మనసులో ఆలోచనలను మజ్లిస్ స్పష్టం చేసినప్పటికీ, మళ్ళీ తన మనసు మార్చుకొనడంవలననేమో, మొన్న ఆ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలుకకుండా ఓటింగులో తెదేపా పద్ధతినే అనుసరించింది.   ఈ సంకేతాలు అర్ధం చేసుకొన్నతెదేపా కూడా మజ్లిస్ పార్టీతో జత కట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతూ, మొట్ట మొదటి చర్యగా ఆ పార్టీ కోరుతున్నవిధంగా వచ్చేనెలలో జరగనున్న హైదరాబాద్‌ స్థానిక సంస్థ ఎన్నికల్లో మజ్లిస్‌కు మద్దతునివ్వాలని టీడీపీ నిర్ణయించుకొన్నట్లు సమాచారం.   ఒకవేళ, వీరిరువురి ఎన్నికల పొత్తులు ఖాయం అయినట్లయితే అది వారికి మేలు చేయడమే కాకుండా, తెరాస, కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు కొత్త సవాలు విసురుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా బలమయిన ముస్లిం ఓటు బ్యాంకు గల మజ్లిస్, బలమయిన పార్టీ క్యాడర్ గల తెదేపాలు ఏకమయితే, వారి విజయావకాశాలు గణనీయంగా పెరగవచ్చును.   అయితే, ఈ పరిణామాలను చూస్తూ తెరాస, కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు చేతులు ముడుచుకొని కూర్చోవు గనుక, ఆ మూడు కూడా ఎన్నికల లోపుగానే చేతులు కలిపినా ఆశ్చర్యంలేదు. తెలంగాణా అంశంపై ఏదో ఒక నిర్దిష్టమయిన ప్రకటన చేసి తెరాసను, జగన్ మోహన్ రెడ్డిని జైల్లోంచి విడుదల చేసి వైకాపాను తనలో కలిపేసుకోవడమో లేక వారితో ఎన్నికల పొత్తులు పెట్టుకొని తెదేపా+మజ్లిస్+లెఫ్ట్+లోకసత్తా కూటమిని ఎదుర్కోవడమో కాంగ్రెస్ పార్టీ చేయవచ్చును.   కానీ, రాష్ట్రంలో అధికారం కోరుకొంటున్న జగన్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలు రెండూ కలిసిపనిచేయడం అసంభవం కావచ్చును. అదే జరిగితే, మళ్ళీ ఎన్నికలలో ముక్కోణపు పోటీ అనివార్యం కావచ్చును. తద్వారా వచ్చే ఎన్నికల తరువాత రాష్ట్రంలో ఏ పార్టీకి పూర్తీ మెజారిటీ లబించక రాష్ట్రం పరిస్థితి ఇంకా అద్వానంగా మారే అవకాశాలున్నాయి.

109 Indians In Italy Jails

ఇటలీ జైళ్ళలో మగ్గుతున్న 109మంది భారత పౌరులు

  ఇటలీ దేశం జైళ్ళల్లో సుమారు 109మంది భారత పౌరులు ఉన్నారని తెలిసింది. ఫిబ్రవరి 2010న రాజ్యసభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రభుత్వం సమాధానమిస్తూ ఇటలీ ప్రభుత్వం భారత పౌరులు జైళ్ళలో ఉన్న భారతదేశ పౌరుల వివరాలను గోప్యంగా ఉంచిందని, భారతపౌరులను ఎందుకు అరెస్ట్ చేసి జైళ్ళల్లో ఉంచారన్న విషయాన్ని ఎన్ని సార్లు అడిగినా ఇటలీ ప్రభుత్వం నుండి సరైన సమాధానం రాలేదని తెలిపింది. అలాగే గతేడాది నవంబర్ లో ఈ విషయమై ఎక్స్ టర్నల్ మినిష్టర్ సల్మాన్ కుర్షీద్ మాట్లాడుతూ ఎంతమంది భారతదేశ పౌరులను ఇటలీ ప్రభుత్వం జైళ్ళలో పెట్టిందో అన్న సమాచారం తమ దగ్గర లేదని, ఇటలీ ప్రభుత్వం తమ విన్నపాలను పట్టించుకోవడం లేదని తెలిపారు. అంటే గత రెండు సంవత్సరాలుగా ఇటలీ ప్రభుత్వం భారతదేశ పౌరులను విడుల చేయలేదని తెలుస్తుంది. నేరగాళ్ళు ఏ దేశానికి చెందినవారైనా ఆ దేశానికి గర్వకారణం కాదు కానీ, ఇటలీదేశ జైళ్ళలో భారతదేశ పౌరులను ఎందుకు పెట్టారో అన్న సమాచారం కూడా భారతదేశానికి లేకపోవడం విచారకరం. జైళ్ళలో వున్నవారిలో 95 శాతం మంది పంజాబ్ నుండి వెళ్ళిన వ్యవసాయ కూలీలు కాగా వీరంతా దొంగతనంగా దేశంలో ప్రవేశించినవారు, దొంగతనాలు, హత్యలు చేసినవారు. సుఖదేవ్ సింగ్ కంగ్ అనే సిక్కు నాయకుడి అంచనా ప్రకారం సుమారు 600 నుండి 700మంది భారత పౌరులు జైళ్ళల్లో ఉన్నారని, ఖచ్చితమైన అంకె తెలపటం కష్టమని ఆయన అంటున్నారు.

China Panchasheela Programmes With India

చైనా ఐదు సూత్రాల పథకం 'పంచశీల'

  చైనా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జి జంగ్ పింక్ వచ్చే వారంలో జరగనున్న బ్రిక్స్ దేశాల కూటమి సదస్సులో భారత ప్రధాని  మన్మోహన్ సింగ్ తో భేటీ కానున్నారు.ఈ సందర్భంగా భారత తో సంబంధాలను మరింత మెరుగు పరచుకునేందుకు ఐదు సూత్రాల (పంచశీల)కొత్త కార్యక్రమాలను ప్రధానికి వివరించనున్నారు. సరిహద్దు వివాదం సంక్లిష్టమైనదని దీనికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం సాధించేవరకూ స్నేహపూరిత చర్చలు కొనసాగిస్తామని, ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకూ ఇరుదేశాలు తమ మధ్య సంబంధాలకు విఘాతం కలగకుండా సరిహద్దుల వద్ద శాంతిని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు.ఇరుదేశాలు బహుళపక్ష వేదిక ద్వారా పరస్పరం సహకరించుకుంటూ వర్తమాన దేశాల చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందని జీ జింగ్ పింగ్ పేర్కొన్నారు.

MLA's Manhandled Police Officer

పోలీసును చితక్కొట్టిన ఎమ్మెల్యేలు

  వసాయి నియోజకవర్గ ఎమ్మెల్యే క్షితిజ్ ఠాకూర్ వాహనాన్ని బాంద్రా-వొర్లి ప్రాంతంలో సోమవారం సూర్యవంశి అనే పోలీసు అధికారి ఆపాడు. మంగళవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయం అనంతరం ఎమ్మెల్యే సద్దారు పోలీసు అధికారిపైన ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. పోలీసు అధికారి తన కారును నిలిపివేసి తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడని, తనపై అభ్యంతరకరంగా ప్రవర్తించిన పోలీసు అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే ఠాకూర్ డిమాండ్ చేశారు. ఆ సమయంలో పోలీసు అధికారి విజిటర్స్ గ్యాలరీలో కూర్చుని వుండగా గమనించిన ఎమ్మెల్యే పోలీసు అధికారి సూర్యవంశి వద్దకు దూసుకువెళ్ళగా అతనికి మరికొందరు ఎమ్మెల్యేలు తోడయ్యి పోలీసు అధికారిపై దౌర్జన్యానికి దిగి, అతన్ని చితకబాదారు. అక్కడే వున్న విధానసభ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుపడి సూర్యవంశిని బయటకు తీసుకుని వెళ్ళారు.

Retired Telugu Academy Chairman Dharma Rao Died

తుదిశ్వాస విడిచిన ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ధర్మారావు

  గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న తెలుగు అకాడమీ మాజీ చైర్మన్, భాషోద్యమ నేత, కాలమిస్టు చలమాల ధర్మారావు (79) మంగళవారం తెల్లవారుఝామున 12.50నిముషాలకు హైదరాబాద్ లోని కామినేని ఆసుపత్రిలో గుడిస్వాష విడిచారు. 1934 మార్చి 30వ తేదీన కృష్ణాజిల్లా పెద్ద అవుటపల్లిలో సీతారత్నమ్మ, నాగభూషణం దంపతులకు జన్మించిన ఆయన ఉస్మానియాలో పిజి చేసి కర్నూలు సచివాలయంలో, తరువాత హైదరాబాద్ సచివాలయంలో పలుశాఖలలో విధులు నిర్వర్తించారు. గోరాశాస్త్రి శిష్యునిగా ప్రసిద్దుడైన చలమాల ధర్మారావు నాలుగేళ్ల పాటు అధికార భాషాసంఘం కార్యదర్శిగా, ప్రభుత్వ సంయుక్త కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. సి.ధర్మారావుగారు 'రవ్వలు-పువ్వులు;, 'ప్రేమిచుకుందాం రండి' వంటి గ్రంథాలను రచించారు. పలు ప్రముఖ దినపత్రికలకు కాలమ్స్ అందించారు. ధర్మారావు మృతిపట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియచేశారు. బుధవారం ఉండిం అంబర్ పేట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుమారులు శ్రీనివాస్, రామ్మోహన్ తెలిపారు.

Ragging Of Norway Women

ఆగని కీచకపర్వం

  షిరిడీ సాయినాథుని దర్శనార్థం షిరిడీకి వెళ్తున్న నార్వేకు చెందిన మహిళకు నగరానికి చెందిన పలువురు కీచకులనుండి వేధింపులు ఎదురయ్యాయి. హైదరాబాద్ నుంచి షిరిడీకి ఓ ప్రైవేటు బస్సు బయలుదేరింది. నగరానికి చెందిన చిత్రం రంజిత్ కుమార్ (దిల్ షుక్ నగర్), రాయదుర్గం సాయికిరణ్ (గౌలిగూడ), పిరాజీ విజయ్ (బేగంబజార్), ఉప్పల్ చందర్ (కాచిగూడ) పిన్నింటి సుదర్శన్ రెడ్డి (సరూర్ నగర్) యువకులు బస్సులో ప్రయాణిస్తున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న నార్వే దేశ మహిళపై వీరి కన్నుపడింది. అంతే, ఇక వీరి ఆగడాలకు హద్దు లేకుండా పోయింది. వీరు ఆమెను తమ వెకిలి చేష్టలతో ఇబ్బందులకు గురిచేశారు. బస్సులోని మిగతా ప్రయాణీకులు అడ్డుచెప్పినా, డ్రైవర్, కండక్టర్ అడ్డుతగిలినా వీరు వారి మాటలను పట్టించుకోకుండా వీరిపైనే దౌర్జన్యానికి దిగారు. బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళా సూచన మేరకు డ్రైవర్ డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట నిలిపి, నిందుతులను పోలీసులకు అప్పచేప్పాడు. పోలీసులు వీరిని నిజామాబాద్ రెండో అదనపు ప్రథమశ్రేణి న్యాయమూర్తి రాధాకృష్ణ చౌహాన్ ఎదుట హాజరుపరచగా వీరిపై 290, 502, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, నిందుతులకు 14 రోజుల జుడీషియల్ కస్టడీ విధించి, నిజామాబాద్ జిల్లా జైలుకు తరలించారు.

Arrest Warrant Issued to Harsha Kumar

హర్షకుమార్ అరెస్ట్ కు వారెంట్ జారీ

  2004 ఎన్నికల్లో మలాపురం నుంచి ఎం.పి.గా పోటీ చేసిన హర్షకుమార్ ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ సందర్భంగా నగరంలో కొంతమంది ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులు హర్షకుమార్ కు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సభ వుడా చిల్డ్రన్స్ థియేటర్ లో ఏర్పాటు చేయగా హర్షకుమార్ విచ్చేసి సభా వేదికపై ఆసీనులయ్యారు. ఈ కార్యక్రమ జరుగుతుండగా కృష్ణస్వరూప్ అనే విద్యార్థికి హర్షకుమార్ మద్దతుదారులకు మధ్య గొడవ జరిగింది. హర్షకుమార్ సహా సభా వేదికపై వున్న పలువురు తనపై దాడిచేశారని కృష్ణస్వరూప్ కేసు దాఖలు చేశారు. మంగళవారం నాటి విచారణకు హర్షకుమార్ గైరుహాజరయ్యారు. దీంతో విశాఖపట్నం నాలుగో అదనపు ప్రధాన మెట్రోపాలిటన్ న్యాయమూర్తి హర్షకుమార్ పై అరెస్టు వారెంట్ జారీచేసి కేసును ఏప్రిల్ 10కి వాయిదా వేశారు.

Central Government In Crisis

సంక్షోభంలో కేంద్ర ప్రభుత్వం

  డిఎంకే అధినేత కరుణానిధి సంచలనాత్మక నిర్ణయంతో కేంద్రలోని యుపిఏ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. శ్రీలంకలోని తమిళుల ఊచకోతను ఖండిస్తూ పార్లమెంటులో తీర్మానం చేయటంతో పాటు శ్రీలంక యుద్ధనేరాలపై స్వతంత్ర దర్యాప్తునకు భారత్ పట్టుబట్టాలని కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్న డిఎంకే అధినేత కరుణానిధి మంగళవారం రాత్రి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. యూపీఏలోని అతిపెద్ద మిత్రపక్షమైన డిఎంకే తన మద్దతును ఉపసంహరించుకుంది. కేంద్రంలోని మంత్రిపదవులను సైతం త్యజిస్తామని కరుణానిధి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వానికి మద్ధతు ఉపసంహరిస్తూ టి.ఆర్. బాలు నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల డిఎంకే బృందం తమ అధినేత కరుణానిధి రాసిన లేఖను రాష్ట్రపతికి స్వయంతా అందజేశారు. బుధవారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను కలిసి మన్త్ర౪ఇపదవుల రాజీనామాలు సమర్పిస్తామని బాలు బృందం విలేఖరులకు తెలిపారు.యూపీఏ ప్రభుత్వానికి బయటనుండి కూడా మద్దతునిచ్చే ప్రసక్తే లేదని కరుణానిధి స్పష్టం చేశారు. ఈ నెల 21న జెనీవాలో జరగనున్న ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సమావేశానికి ముందుగా తమ డిమాండ్లను నెరవేరిస్తే తమ మద్దతుపై పునః పరిశీలిస్తామని కరుణానిధి పేర్కొన్నారు.

srilanka

శ్రీలంకతో టీంతో కరుణానిధి, జయలలిత ఐపీయల్ మ్యాచ్

  శ్రీలంక ప్రభుత్వం అక్కడి తమిళ ప్రజల మీద చేస్తున్న మారణ ఖాండకు వ్యతిరేఖంగా ఈనెల 21న జెనీవాలో జరుగనున్న మానవ హక్కుల సదస్సులో భారతదేశం తప్పనిసరిగా ఓటేస్తానని యుపీయే ప్రభుత్వం తనకు మాటివ్వనందుకు కరుణానిధి యుపీయే ప్రభుత్వంతో చెడుగుడు ఆడుకొంటుంటే, మరో వైపు అదే శ్రీలంక క్రికెట్ టీం కు చెందిన ఆరుగురు ప్లేయర్లు త్వరలో చెన్నైలో జరుగనున్న ఐపీయల్-6 మ్యాచులు ఆడేందుకు బయలుదేరుతున్నారు.   ఈ నేపద్యంలో అసలు వారిని మన తమిళ తంబిలు చెన్నైలో అడుగుపెట్టనిస్తారా అనే సందేహం కలగడం సహజమే. అయితే, కరుణానిధి ఎడ్డెం అంటే జయలలిత తెడ్డెం అంటుందనే సంగతి జగమెరిగిన రహస్యమే గనుక, తన ఆటగాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం తగిన రక్షణ కల్పించాలంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు తెలివిగా జయలలితకు ఒక లేఖ వ్రాసింది.   శత్రువు శత్రువు మిత్రుడన్నట్లు కరుణానిధికి శత్రువులు అందరూ జయలలితకు మిత్రుల కిందే లెక్క. వారు శ్రీలంక వారయినా సరే! గనుక వారిని కాపాడే బాధ్యత జయలలిత సంతోషంగా స్వీకరిస్తుందని శ్రీలంక క్రికెట్ బోర్డుకు తెలుసు గనుకనే తమ ఆటగాళ్ళు నిర్భయంగా వచ్చి చెన్నైలో ఆడుతారని ప్రకటించింది.   ఇదివరకు విశ్వరూపం సినిమా విడుదల సందర్భంలో కమల్ హాసన్ తో వీరిరువురూ ఏవిధంగా ఆడుకోన్నారో అందరికీ తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఐపీయల్ మ్యాచులలో వీరిరువురూ శ్రీలంక ఆటగాళ్ళతో ఏవిధంగా ఆడుకొంటారో వేచిచూడక తప్పదు.

upa

జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలినట్లు...

  ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీల రెండింటి పరిస్థితి జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలినట్లుంది. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం ఓడినందుకు సంతోషపడాలో లేక తమ ప్రభుత్వం మైనార్టీలో పడినందుకు బాధపడాలో తెలియని పరిస్థితి. తనకు వ్యతిరేఖంగా ఓటువేసిన 9 మంది జగన్ అనుచరులపై వేటు తప్పదని బింకాలు పలికిన కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ ఇద్దరూ కూడా మళ్ళీ తమ మాటలను మింగక తప్పేట్లు లేదు. అంతేకాక మళ్ళీ వారి దయా దాక్షిణ్యాలపైనే తమ ప్రభుత్వం మనుగడ సాగించవలసి రావడం అవమానకరం అయినా తప్పట్లేదు.   అక్కడ కేంద్రంలో తమిళ తంబి కరుణానిధి అకస్మాత్తుగా యుపీయే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి ప్రత్యామ్నాయ పార్టీల వైపు పరుగులు పెట్టిస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా అవిశ్వాస తీర్మానంలో ఓటేసిన 9 మంది జగన్ అనుచరులను పార్టీలోంచి పీకేయాల వద్దా? లేక వారిపై అనర్హత వేటువేయకుండా మరో ఆరు నెలలు తాత్సారం చేస్తూ వారి సాయంతోనే ప్రభుత్వాన్ని నెట్టుకు రావాలా? వంటి అనేక ధర్మసందేహాల చిట్టాతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ డిల్లీ బయలుదేరెందుకు తయారవుతుంటే, అక్కడ డిల్లీలో యుపీయే ప్రభుత్వం కరుణానిధి తుమ్మితే ఊడిపోయే ముక్కులా పరిస్థితులు ఇంతకంటే అద్వానంగా తయారయ్యాయి.   ఇంతవరకు యస్పీ, బీయస్పీలను పులుసులో కరివేపాకులా వాడుకొంటున్న యుపీయే ప్రభుత్వం, ఇప్పుడు తన మనుగడకోసం వాటిని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నంలో పడింది. ఇంతవరకు బయట నుండి మద్దతు ఇస్తున్న ఆ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐను అస్త్రంగా చేసుకొని తమను బెదిరించి మద్దతు పొందుతోందని బహిరంగంగానే చెపుతున్నాయి. తమిళ తంబి సగం కాచి వదిలేసిన ‘యుపీయే సాంబారులో’కి ఆ కరివేపాకు రెమ్మలు రెంటినీ కాంగ్రెస్ వేసుకోవాలంటే మళ్ళీ సీబీఐకి పని చెప్పక తప్పదేమో.   ఒకవైపు కేంద్రం మరో వైపు రాష్ట్రం రెండూ కూడా మైనార్టీలోపడటం కాంగ్రెస్ పార్టీకి నిజంగా చాలా ఇబ్బందే. అయినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా ప్రభుత్వానికి డోకాలేదు అంటూ మేకపోతు గాంభీర్యం మాత్రం ప్రదర్శించక తప్పట్లేదు. ప్రాంతీయ పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాలు నడపడం చాల కష్టమే అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ తనంతట తానూ పూర్తి మెజారిటీ సాదించలేదు కనుక ప్రాంతీయ పార్టీల దయా దాక్షిణ్యాలపై ఆధార పడక తప్పట్లేదు.   ఇటీవలే పార్టీ సారద్య బాద్యతలు చేప్పటిన యువనాయకుడు రాహుల్ గాంధీ, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తన గూటి నుండి బయటకి వచ్చిపార్టీని గట్టెకించే ప్రయత్నం ఎందుకు చేయట్లేదో తెలియదు. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడం యుపీయే ప్రభుత్వానికి కొత్త కాకపోయినప్పటికీ, ఆయనకు ఇంకా తగిన అనుభవం లేదు గనుక దూరంగా ఉంటున్నారో లేక వేరే కారణాలు ఏమయినా ఉన్నాయో తెలియదు కానీ, కాంగ్రెస్ పార్టీని, దేశాన్ని తన సారద్యంలో ఎక్కడికో తీసుకు పోవాలనుకొనే ఆయన తన సామర్ద్యం నిరూపించుకోవాలంటే ఇదే తగిన సమయం.

chandrababu padayatra

పాదయాత్ర కష్టాలు..బాబు కన్నీళ్లు

    నేడు పాదయాత్ర ప్రారంభానికి ముందు చంద్రబాబు పోలవరం నియోజకవర్గ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీకి చెందిన సీనియర్ నేత గరికపాటి రామ్మోహన రావు కార్యకర్తలకు బాబు పాదయాత్ర కష్టాలు ఏకరువు పెట్టారు. ఎంత కష్టంగా ఉన్నప్పటికి బాబు పాదయాత్ర చేస్తున్నారన్నారు. ఆయన కష్టాలను తాము కళ్లారా చూస్తున్నామని, ఎన్నో ఇబ్బందులకు ఓర్చుకొని బాబు పాదయాత్ర చేస్తున్నారన్నారు. చంద్రబాబు తల్లి బతికి ఉండి ఉంటే ఆయన పాదయాత్రను చూసి కన్నీళ్లు పెట్టేదని అన్నారు. అరవై నాలుగేళ్ల వయస్సులో చంద్రబాబు సాహసం చేస్తున్నారని, ఆయన ఎవరి కోసం ఇంత కష్టపడి పాదయాత్ర చేస్తున్నారో ప్రజలు, కార్యకర్తలు గుర్తించాలని గరికపాటి రామ్మోహన రావు అన్నారు. పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు కూర్చోవడానికి, నిలబడడానికి కూడా ఇబ్బందిగా ఉందన్నారు. అయినా, ఆయన ప్రజల కోసం ఇదంతా చేస్తున్నారన్నారు. గరికపాటి మాటలు కార్యకర్తలను, నేతలను ఉద్వేగానికి గురి చేశాయి. వేదిక పైనున్న చంద్రబాబు కూడా గరికపాటి మాటలకు ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన కళ్లలో నీళ్లు వచ్చాయి. చంద్రబాబు కళ్లలో నీళ్లు తిరగడం చూసిన కార్యకర్తలు మరింత ఉద్వేగానికి గురయ్యారు.   

యూపీఏ కు ప్రమాదం లేదు

        యూపీఏ ప్రభుత్వం నుంచి డీఎంకే వైదొలగడం వల్ల యుపిఏ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. యుపిఏ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని, అధికారంలో కొనసాగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కరుణానిధి డిమాండ్లను పరిశీలిస్తున్నామని, మిత్రపక్షాలతో చర్చలు జరుపుతున్నామని చిదంబరం పేర్కొన్నారు.   యూపీఏ ప్రభుత్వానికి తాము మద్ధతు ఉపసంహరించుకుంటున్నామని యూపీఏ భాగస్వామ్య పక్షం డీఎంకే ప్రకటించడంపై కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం స్పందించారు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం పడిపోయే ప్రమాదమేమీ లేదన్నారు. యూపీఏకు కావాల్సిన సంఖ్యా బలం ఉందని ఆయన తెలిపారు. శ్రీలంక తమిళల అంశంపై పార్లమెంట్లో తీర్మానానికి సంబంధించి డీఎంకేతో చర్చిస్తున్నామని చిదంబరం పేర్కొన్నారు. కరుణానిధి తన నిర్ణయంపై పునరాలోచించే సూచనలు ఉన్నాయని చిదంబరం ధీమా వ్యక్తం చేశారు.

బాబు పాదయాత్ర ముగింపుకు ముహూర్తం

        టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 'వస్తున్నా మీ కోసం' పాదయాత్రకు ముగింపు ముహూర్తం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. గాంధీ జయంతి నాడు మొదలు పెట్టిన పాదయాత్ర ను తన జన్మదినం రోజున ముగించాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 19 నాటి కి బాబు పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకోనుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏప్రిల్ 19న విశాఖ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 20న విశాఖలో జన్మదిన వేడుకలు జరుపుకున్న అనంతరం చంద్రబాబు హైదరాబాద్‌కు రానున్నారు.   అయితే ఆయన మే 1 వరకు పాదయాత్ర చేసి టీడీపీ దివంగత నేత ఎర్రన్నాయుడు ఊరు నిమ్మాడ దాకా వెళతారని ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం పాదయాత్ర ముగించి హైదరాబాద్ వచ్చి సమీక్షలు చేస్తారని, ఆ తరువాత మిగిలిపోయిన ఆరుజిల్లాలలో పాదయాత్ర చేయాలా ? లేక బస్సు యాత్ర చేయాలా ? అనేది నిర్ణయిస్తారని తెలుస్తోంది.  

కోర్ట్ లో లో౦గిపోయిన నిర్మాత బండ్ల గణేష్

    ఎన్టీఆర్ 'బాద్ షా' ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఈరోజు రాజేంద్రనగర్ కోర్టులో లొంగిపోయారు. 'బాద్ షా' ఆడియో ఫంక్షన్ లో తొక్కిసలాట జరిగి అభిమాని మరణించడంతో రాయదుర్గ పోలీసులు గణేష్ పై 304(ఎ) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. సరైన సదుపాయాలు కల్పించడంలో విఫలమైనందున వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో బండ్ల గణేష్తో పాటు బాద్షా ఆడియో ఫంక్షన్ నిర్వాహకుడు కూడా కోర్టులో లొంగిపోయాడు. తొక్కిసలాటలో మరణించిన అభిమానికి జూనియర్ ఎన్టీఆర్ ఐదు లక్షలు, నిర్మాత బండ్ల గణేష్ ఐదు లక్షలు చొప్పున రాజు తల్లి ఈశ్వరమ్మ కి మొత్తం పది లక్షలు ఆర్ధిక సహాయం చేశారు.