ధర్మ విజేత అంటే ....... ?
posted on Sep 26, 2013 @ 2:47PM
....సాయి లక్ష్మీ మద్దాల
అక్రమ ఆస్తుల కేసు విషయమై ఎట్టకేలకు 16 నెలల అనంతరం సి.బి.ఐ కోర్ట్ మంజూరు చేసిన షరతులతో కూడిన బెయిల్ పై జగన్ జైలునుండి బయటకు వచ్చాడు. ప్రస్తుత చట్టాల ఆధారంగా న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. సాక్ష్యాలను విచారించి జగన్ అక్రమ ఆస్తుల కేసులో నిర్దోషా కాదా అనేది న్యాయస్థానం నిర్ణయించ వలసి ఉంది. కేవలం బెయిల్ లభించి నంత మాత్రాన ఈ పరిస్థితులలో జగన్ ధర్మవిజేత అనటం ఎంతవరకు సమంజసం?
ఇక జగన్ బయటకు వస్తే రాజకీయాలలో చాలా మార్పులు వస్తాయి అనటం కూడా సరికాదు. ఒకసారి పార్లమెంట్ లో సమైఖ్యాంద్ర ప్లకార్డు పట్టుకొని,మరొకసారి అఖిలపక్ష సమావేశంలో విభజనకు అనుకూలంగా లెటర్ ఇచ్చి,మళ్ళి ఇప్పుడు సమైఖ్యాంద్ర కోసం సీమాన్ద్రలో ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతున్న నేపధ్యంలో మళ్ళి సమ న్యాయం అంటూ పరిపరి విధాలుగా తమ నిర్ణయాన్ని మార్చుకుంటూ తమకంటూ ఒక నిర్ణీత అభిప్రాయం లేని,వై. ఎస్.ఆర్. సి.పి ని ఏరకంగా సమైఖ్యాంద్ర కోసం చిత్తశుద్దితో ప్రయత్నిస్తుందని నమ్మాలి?నేటి ఆంధ్రప్రదేశ్ అనిశ్చిత స్థితికి కారణం జగన్ రాజకీయ పార్టీనే అని చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. కేవలం జగన్ను ఎదుర్కోవటానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఈ విభజన అంశాన్ని2009 లో తీసుకువచ్చింది అనే అభిప్రాయం చాలామంది ప్రజల మదిలో ఉంది. ఇక రాజకీయ స్వార్ధం కోసం రాజశేఖరరెడ్డి టి.డి.పి హయాం లో 41 మంది శాసనసభ్యుల సంతకాలతో విభజన అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం ముందుకు పంపారు అనే అభిప్రాయాన్ని వై.ఎస్.ఆర్.సి.పి నే ఖండించలేని పరిస్థితి ఉంది. ఇక రాజకీయ నాయకులను ప్రజలు నమ్మని ఈ పరిస్థితులలో సమైఖ్యాంద్రను తాను సాధించ గలనని జగన్ ప్రజలను ఎలా నమ్మించ గలడు?
ఇక జగన్ సోదరి షర్మిల విభజన జరిగితే సమైఖ్యాంద్ర కు కట్టుబడి ఉన్నందున సీమాన్ద్రలో వై.ఎస్.ఆర్.సి.పి నే ప్రజలు గెలిపిస్తారని,తెలంగాణలో తమ తండ్రి రాజశేఖర రెడ్డి ఏవిధంగా అభివృద్ధి నిమిత్తం ఎక్కువనిధులు సీమాంద్ర ప్రాంతం కంటే వెచ్చించారో తమ వద్ద గల ఆధారాలను చూపించి తెలంగాణలో కూడా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్ప్తోంది. ఈరోజున ప్రజలకు కావల్సింది విభజన అంశం ఏరకంగా వై.ఎస్.ఆర్.సి.పి కి ఉపయోగపడుతుంది అని కాదు, విభజన జరిగితే 2014 ఎన్నికల తరువాత కేంద్రంలో వై.ఎస్.ఆర్.సి.పి తన వైఖరి ఎటు అని. ఈ విషయంలో జగన్ తన వైఖరి చెప్పని పక్షంలో విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం తో కుమ్మక్కు ఐన కారణంగానే జగన్ కు బెయిల్ దొరికి,జైలు నుండి బయటకు వచ్చాడని ప్రజలు భావించే ప్రమాదముంది.
2014 ఎన్నికల తరువాత కేంద్రంలో యు.పి.ఎ ని బలపరిచే అవకాశం ఉందని స్వయంగా వై.ఎస్.ఆర్.సి.పి వారే అంగీకరిస్తున్నారు. విభజన విషయం లో సీమాంద్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని భావిస్తున్నారు. వారి ఆగ్రహావేశాలను వై.ఎస్.ఆర్.సి.పి సమైఖ్యాంద్ర నినాదంతో ఓట్లు కింద మార్చుకుని 2014 లో యు.పి.ఎ ని బలపరిస్తే అంతకు మించిన ప్రజాద్రోహం మరొకటి ఉండదు.