హైదరాబాద్ పై మూడు ఆప్షన్ లు

      ఈ రోజు జరగనున్న కోర్ కమిటీ భేటీలో తెలంగాణపై కీలక చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, హైదరాబాద్ ప్రతిపత్తిపై కొన్ని ప్రతిపాదనల గురించి షిండే కోర్ కమిటీ సభ్యులకు వివరిస్తారని తెలిసింది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని ఏ విధంగా చక్కదిద్దాలి? హైదరాబాద్ ప్రతిపత్తిపై ఏ నిర్ణయం తీసుకోవాలి? అనే విషయంపై కోర్ కమిటీ మంతనాలు జరుపనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.   హైదరాబాద్‌కు సంబంధించి మూడు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఒకటి... హైదరాబాద్‌ను చండీగఢ్ తరహా యూటీగా ప్రకటించి, రెండు రాష్ట్రాలకు రాజధానిగా చేయడం. రెండు...హైదరాబాద్‌కు ఢిల్లీ తరహా రాష్ట్ర ప్రతిపత్తి కల్పించి, రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉంచడం. మూడు... హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ప్రకటించి, ఆర్టికల్ 258ఏ కింద హైదరాబాద్‌లో శాంతి భద్రతల వంటి కొన్ని అధికారాలను కేంద్రం తన చేతిలో ఉంచుకుని, సీమాంధ్ర రాజధానిని కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం. హైదరాబాద్ ద్వారా వచ్చే ఆదాయాన్ని రెండు రాష్ట్రాలకు పంచడం. ఈ మూడు ప్రతిపాదనలకు కూడా వర్కింగ్ కమిటీ పేర్కొన్న పదేళ్లనే కాలపరిమితిగా సూచించే అవకాశం ఉందని తెలిసింది.  మొత్తానికి, ఈ మూడు ప్రతిపాదనల గురించి కోర్ కమిటీకి షిండే వివరించే అవకాశాలున్నాయి. ఆంటోనీ కమిటీ ఇప్పటిదాకా జరిపిన చర్చలను కూడా కోర్ కమిటీ సమీక్షిస్తుందని తెలిసింది.

అంతా అయోమయ విభజన

  రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం వేస్తున్న కుప్పిగంతులు చూస్తే చాలా నవ్వు వస్తుంది. కాంగ్రెస్ అధిష్టానం నేతలు ఒకరికొకరు పొంతన లేని మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ పట్ల ప్రజలలో మరింత చులకన భావం కలిగిస్తున్నారు. నిన్న సోనియా గాంధీ కార్యదర్శి విభజన ప్రకటన చేయడంలో తొందర పడ్డామని అభిప్రాయం వ్యక్తం చేస్తే, కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ సీమాంధ్ర నేతలతో మాట్లాడుతూ అంటోనీ కమిటీ నివేదిక వచ్చిన తరువాతనే టీ-నోట్ కేంద్ర క్యాబినెట్ ముందుకు వెళుతుందని హామీ ఇచ్చారు.   కానీ, ఈ రోజు హోంమంత్రి షిండే రంగ ప్రవేశం చేసి, ఆరోగ్యకారణాలతో తను ఇంతకాలంగా కార్యాలయానికి రాలేనందునే టీ-నోట్ పరిశీలించలేకపోయాయని, ఈ రోజు పరిశీలించి క్యాబినెట్ సమావేశంలో సమర్పిస్తానని అన్నారు. ఇక, వివిధ పనులతో, కారణాలతో పలువురు మంత్రులు బిజీగా ఉన్న కారణంగా రద్దయిన క్యాబినెట్ సమావేశం మళ్ళీ రేపు ఉదయం నిర్వహించబోతున్నట్లు తాజా సమాచారం.   కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన ప్రకటన చేయడం అయితే చేసింది గానీ, దానిని సజావుగా ఏ విధంగా పూర్తి చేయగలదో దానికే అర్ధం కాకుండా ఉంది. కనీసం ఇప్పటికయినా తన రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచించడం మాని, ఉభయ ప్రాంతాలకు చెందిన తన పార్టీ నేతలతో ఈవిషయంపై సమగ్రంగా చర్చించి, అందరినీ ఒప్పించుకోగలిగినా అడుగు ముందుకు వేయగలదు. లేకుంటే రానున్న ఎన్నికలలో ఇరుప్రాంతలలో ఘోర పరాభవం తప్పదు.   తాజా సమాచారం: సీమాంధ్రా యంపీలు, కేంద్ర మంత్రులు ఈ రోజు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ తో సమావేశం కానున్నారు. మరి ఈ సారి ఆయనేమి కొత్త మాట చెపుతాడో చూడాలి.

రెండో పెళ్లి గొడ‌వ నుంచి ల‌గ‌పాటికి ఊర‌ట‌

  కాంగ్రెస్ ఎంపి ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌కు సుప్రిం కోర్టు ఊర‌ట నిచ్చింది. రాజ‌గోపాల్ రెండో పెళ్లికి సంభందించిన పిటిష‌న్‌ను ఎలాంటి ఆదారాలు లేని కార‌ణంగా సుప్రిం కోర్టు కొట్టేసింది. 2004లో ఎన్నిక‌ల అపిడ‌విట్‌లో త‌న‌కు ఇద్దరు కుమారుల‌న్నట్టుగా తెల‌పిన ల‌గ‌డ‌పాటి త‌రువాత 2009లో మాత్రం త‌న‌కు ముగ్గురు కుమారుల‌ని మూడో కుమారుడి పేరు ఎల్ హ‌ర్మన్ అని పేర్కొన్నారు. దీంతో ల‌గ‌డపాటి రెండో పెళ్లి ఉదంతం తెర మీద‌కు వ‌చ్చింది. దీంతో ల‌గ‌డ‌పాటికి రెండో పెళ్లి జ‌రిగింద‌ని వారికి కుమారుడు కూడా జ‌న్మించాడ‌ని మైల‌వ‌రానికి చెందిన అడ్వకేట్ సుంక‌ర కృష్ణమూర్తి గతంలో రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా ఫిర్యాదు చేశారు. ల‌గ‌డ‌పాటి జానకి అనే యువ‌తిని రాజ‌గోపాల్ రెండో వివాహం చేసుకున్నార‌న్న లాయ‌ర్ వారి కుమారుడే హ‌ర్మోన్ అని పేర్కొన్నారు. రాజ‌గోపాల్, జాన‌కి దండ‌లు మార్చుకున్న ఫోటోను కూడా ఆయ‌న స‌మ‌ర్పించారు. అయితే ఈ సాక్షాలేవి చెల్లవ‌న్న కోర్టు స‌రైన సాక్షాలు లేని కార‌ణం కేసు కొట్టివేసింది.

రాజకీయ నేతల విషయంలో ఏపీఎన్జీవోలు వైఖరి మార్చుకొన్నారా

  ఏపీఎన్జీవోలు తమపై క్రమంగా రాజకీయ నేతల దాడి తీవ్రతరం అవుతుండటంతో కొంచెం వెనక్కి తగ్గినట్లున్నారు. రేపు విజయవాడలో భారీ ఎత్తున జరుగబోయే సమైక్యాంధ్ర సభకు రాజకీయ నేతలను తాము ఆహ్వానించకపోయినప్పటికీ, ఎవరయినా వస్తే వారిని కాదనకుండా సముచిత గౌరవం ఇస్తామని ఏపీఎన్జీవో నేతలు ప్రకటించారు.   కానీ, ఇది ఇరువురికీ ఇబ్బందులు సృష్టించడం తప్ప వేరే ఉపయోగం ఉండదు గనుక బహుశః రాజకీయ నేతలు కూడా ఈ సభకు దూరంగా ఉండవచ్చును. ఒకవేళ ఎవరయినా దైర్యంచేసి ప్రజలు, ఉద్యోగులు భారీ ఎత్తున పాల్గొనే ఈ సభకు వచ్చినా, వారి నుండి తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కొని అవమానకరంగా నిష్క్రమించాల్సి ఉంటుంది గనుక, నేతలు దూరంగానే ఉండవచ్చును.   అయితే ఏపీఎన్జీవోల సమ్మె పతాక స్థాయికి చేరుకొన్నఈ తరుణంలో వారికి బలమయిన ఒక రాజకీయ పార్టీ అండ ఉంటే చాలా మేలు చేయవచ్చును. కానీ, మూడు ప్రధాన పార్టీలలో వారు దేనిని ఎంచుకొన్నా ఊహించని కొత్త సమస్యలు ఏర్పడి, వారి మధ్య చీలికలు సృష్టించే ప్రమాదం ఉంది. అందువల్ల వారు అన్ని రాజకీయ పార్టీలను సమదూరంలో ఉంచవలసివస్తోంది. లేకుంటే సమైక్యాంధ్ర ఉద్యమం నేడు మరో విధంగా ఉండేది.ఏమయినప్పటికీ, ఏ రాజకీయ పార్టీ మద్దతు తీసుకోకుండా ఇన్ని రోజులు దాదాపు ఆరు లక్షల మంది ఉద్యోగులు, తీవ్ర ఆర్ధిక ఇబ్బందులను సైతం లెక్క జేయకుండా ఏక త్రాటిపై నడుస్తూ ముందుకు సాగడం నిజంగా అద్భుతమేనని చెప్పక తప్పదు.

త్వరలో చంద్రబాబు డిల్లీ యాత్ర

  బహుశః వైకాపా ఆరోపణలకు కొంచెం జంకినందునేమో చంద్రబాబు తన డిల్లీ యాత్రను వాయిదా వేసుకొని తన పార్టీ యంపీలను మాత్రమే డిల్లీ పంపి ఈడీ, విజిలన్స్ అధికారులకు తాను చెప్పదలచుకొన్నది వారిచే చెప్పించారు. అయితే, తను డిల్లీ బయలుదేరుతున్నట్లు ప్రకటించేసిన తరువాత, ఇప్పుడు వెళ్ళకపోతే నిజంగానే వైకాపా ఆరోపణలకు జడిసి వెళ్ళలేదనే మరో అపవాదు కూడా పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని భావించినందునో లేక ముందుగానే తన డిల్లీ ప్రయాణ తేదీలు ఖరారు చేసుకోవడం వలననో, చంద్రబాబు ఈ నెల 21న డిల్లీ బయలుదేరుతున్నారు. ఆయన తన పర్యటనలో ప్రధాని మన్మోహన్‌సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలను కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరించి, రాష్ట్ర విభజనపై అందరికీ అమోదయోగ్యమయిన విధంగా సత్వర నిర్ణయం తీసుకోమని వినతి పత్రం ఈయనున్నారు. అదేవిధంగా తన రెండు రోజుల పర్యటనలో ప్రతిపక్ష నేతలను కూడా కలిసి రాష్ట్ర పరిస్థితులపై వారితో చర్చించనున్నారు.   కానీ ఇప్పడు కూడా ఆయన  జగన్మోహన్ రెడ్డి బెయిలుపై కోర్టు 23న తీర్పు చెప్పబోతుండగా, సరిగ్గా దానికి రెండు రోజుల ముందే ఆయన డిల్లీ వెళుతున్నందున, మళ్ళీ వైకాపా ఆయనపై ఆరోపణల గుప్పించడం ఖాయం. ఎలాగూ వైకాపా నిందలు భరించక తప్పదు గనుక, మరి ఆయన కూడా సీబీఐ, ఈడీ, విజిలన్స్ అధికారులను కలిసి జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి మాట్లాడుతారో లేదో చూడాలి.

పేలుళ్లతో భయపెడుతున్నారు: ఎన్ఐఏ

  అక్తర్, భత్కల్‌లను ఇటీవలే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని జాతీయ దర్యాఫ్తు సంస్థ(ఎన్ఐఏ) గురువారం కోర్టుకు తెలిపింది. హైదరాబాదు - గోవా, హైదరాబాదు - బెంగళూరు జాతీయ రహదారులతో పాటు పలు ముఖ్య పట్టణాలలోను అక్తర్, భత్కల్‌ లు రెక్క నిర్వహించారని ఎన్ఐఏ తెలిపింది. పాకిస్తాన్ నుండి వచ్చే ఆదేశాల వల్ల భారత్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడుతూ, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఎన్ఐఏ తెలిపింది. దిల్‌సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో నిందితుడు అసదుల్లా అక్తర్‌ను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, కోర్టు అతనికి 17వ తేది వరకు రిమాండు విధించింది. దాంతో అతనిని చర్లపల్లి జైలుకు తరలించారు. దిల్‌సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో యాసిన్ భత్కల్ ఐదవ నిందితుడిగా ఉన్నాడు.

కాంగ్రెస్‌లో ఉల్లి లొల్లి

  కాంగ్రెస్ నాయ‌కుడు క‌పిల్ సిబాల్ ఉల్లిపాయ‌ల ధ‌ర‌లపై చేసిన స్టేట్‌మెంట్‌తో దూమారం లేవడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చ‌ర్యల‌కు దిగింది. ఉల్లి ధ‌ర‌లు పెరిగితే వ్యాపారుల‌ను అడ‌గాలిగాని ప్రభుత్వానికి ఏం సంబందం అంటు కపిల్‌సిబాల్ చేసిన వ్యఖ్యాల‌పై ఇత‌ర పార్టీల‌తో పాటు సామాన్యుల కూడా భ‌గ్గుమ‌న్నారు. దీంతో దిద్దుబాటు చ‌ర్యల‌కు దిగిన కాంగ్రెస్ రెండు, మూడు వారాల్లో త‌గ్గుతాయ‌ని కేంద్ర వ్యవ‌సాయ శాఖ మంత్రి శ‌ర‌ద్‌ప‌వార్ హామి ఇచ్చారు.మ‌హారాష్ట్రతో పాటు ఇత‌ర ప్రాంతాల్లో పండించిన కొత్త పంట మార్కెట్‌లోకి వ‌స్తుంద‌ని త‌రువాత ధ‌ర‌లు నియంత్రణ‌లోకి వ‌స్తాయ‌ని ప‌వార్ చెప్పారు.

తెలంగాణ నేత‌లతో సీమాంద్ర నాయ‌కుల చ‌ర్చ

  రాష్ట్ర విభ‌జ‌న‌పై కేంద్ర త‌న ప‌ని తాను చేసుకుపోతుంటే, ఇరు ప్రాంతాల్లో జ‌రుగుతున్న ఉద్యమాల‌ను ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు తెలంగాణ‌,సీమాంద్ర కాంగ్రెస్ నేత‌లు ముందుకు వ‌స్తున్నారు. ఈ మేర‌కు సీఎల్పీలో మంత్రి జానా రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాక‌ర్ రెడ్డి సీమాంద్ర మంత్రులు ఏరాసు ప్రతాప్ రెడ్డి, గంటా శ్రీనివాస్‌లు క‌లిసి చ‌ర్చలు జ‌రిపారు. తెలంగాణ ప్రక‌ట‌న‌తో పాటు త‌రువాత సీమాంద్రలొ జ‌రుగుతున్న ఉద్యమాల‌పై ఇరు ప్రాంత నేత‌లు చ‌ర్చ జ‌రిపిన‌ట్టు స‌మాచారం. దీంతో పాటు తెలంగాణ‌కు జ‌రిగిన అన్యాయంతో పాటు సీమాంద్రుల్లో నెల‌కొన్న భ‌యాందోళ‌న‌కు సంభందించి కూడా ఈ నేత‌లు చ‌ర్చించారు. రాష్ట్ర విభ‌జ‌నకు వ్యతిరేఖంగా ఉద్యమంలో తీవ్రంగా పాల్గొంటున్న గంటా, ఏరాసు లాంటి నేత‌లు తెలంగాణ నేత‌ల‌ను క‌ల‌వ‌టంతో ఈ  స‌మావేశం ప్రదాన్యం సంత‌రించుకుంది.

తెలంగాణ నోట్‌పై గ‌డికో మాట‌

రాష్ట్రవిభ‌జ‌న అంశంపై గంట‌కో ర‌కంగా మాట్లాడుతుంది కాంగ్రెస్‌. రాష్ట్రవిభ‌జ‌న నుంచి వెన‌క్కి త‌గ్గేది లేదు అంటునే సీమాంద్రుల‌కు విభ‌జ‌న జ‌ర‌గ‌దు అన్న హామి ఇస్తుంది. ఏక‌భ్రియం లేకుండా తెలంగాణ అంశంపై ముందుకు వెళ్లేది లేద‌ని అహ్మద్ ప‌టేల్‌, మొయిలీ చెప్పి 24 గంట‌లు కూడా గ‌డ‌వ‌క ముందే తెలంగాణ నోట్ రెడీ అయిన‌ట్టుగా ప్రక‌టించారు హోం మంత్రి షిండే. ఇప్పటికే అధికారులు రెడీ చేసిన తెలంగాణ నోట్ త‌న వద్దకు వ‌చ్చింద‌న్న షిండే. రేపు ఆ నోట్‌ను ప‌రిశీల‌స్తామ‌న్నారు. నోట్ సంభందించి అధికారుల‌తో స‌మావేశం నిర్వహించిన త‌రువాత త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ ఉంటుంద‌ని ప్రక‌టించారు.

ఈగ విలన్ కి వలేస్తున్న కాంగ్రెస్ పార్టీ

  రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఈగ’ సినిమాలో విలన్ పాత్ర పోషించిన కన్నడ నటుడు సుదీప్ గురించి ఇప్పుడు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈగ సినిమా అమాంతం అతనికి జాతీయ స్థాయిలోమంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఇక కర్ణాటక రాష్ట్రంలో, కన్నడ సినిమా పరిశ్రమలోఅతని పేరు మారు మ్రోగిపోతోంది. మరి అటువంటి వ్యక్తి మీద రాజకీయ పార్టీలు కన్నుపడటం సహజమే గనుక అన్ని రాజకీయ పార్టీలు ఆయనని తమ పార్టీలోకి ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కానీ, ఆయన కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.   కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య స్వయంగా ఆహ్వానించడంతో బుధవారం ఉదయం సుదీప్ బెంగళూరులో ఆయన అధికారిక నివాసం ‘కృష్ణ’కు వెళ్లి దాదాపు అర్ధ గంట సేపు ఆయనతో సమావేశమయ్యారు. రానున్న సాధారణ ఎన్నికలలో సుదీప్ ను కాంగ్రెస్ అభ్యర్ధిగా పార్లమెంటుకు పోటీ చేయించాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య భావిస్తున్నట్లు సమాచారం. అయితే, వారి సమావేశ వివరాలు ఇంకా తెలియలేదు.   రాజకీయాల పట్ల ఆసక్తి చూపిస్తున్న సందీప్ ఇటీవల జరిగిన కర్ణాటక శాసన సభ ఎన్నికలలో జగలూర్ నుండి సుదీప్ పోటీ చేయాలని భావించినప్పటికీ, ఆ సమయానికి ఏ రాజకీయ పార్టీలో జేరాలో నిర్ణయించుకోకపోవడంతో ఎన్నికలలో పోటీ చేయలేదు. కానీ బీదర్ నుండి పోటీ చేసిన అశోక్ ఖేని అనే అభ్యర్ధికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. బహుశః వచ్చే సాధారణ ఎన్నికలలో సుదీప్ కాంగ్రెస్ యంపీగా పోటీ చేయవచ్చును.

గణేష్ నిమజ్జనానికి వరుణుడి అడ్డు!

  గణేశ నిమజ్జనాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో గణేష్ విగ్రహాలు నిమజ్జనానికి ముస్తాబయ్యాయి. కానీ ఈ ఏడాది గణేష్ నిమజ్జనంకు భారీ వర్షం అడ్డుపడటంతో, వినాయక విగ్రహాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్‌తో పాటు, 21 చెరువులలోనూ గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతుంది. గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం 71 భారీ క్రేన్లను ఉపయోగిస్తున్నారు. గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకొని భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు రక్షణతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బలగాలు మోహరించారు.

మిస్ అమెరికాకు విందు ఆహ్వానం...?

  మిస్ అమెరికాగా గెలుపొందిన నీనా దావులూరిను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌లు వైట్ హౌస్‌లో జరిగే విందుకు ఆహ్వానిస్తారని ఆశిస్తున్నట్లుగా అమెరికా మాజీ దౌత్యవేత్త ఒకరు తెలిపారు. విజయవాడకు చెందిన తెలుగమ్మాయి నీనా దావులూరి అమెరికాలో సగర్వంగా మిస్ అమెరికాగా గెలుపొంది... అందాల కిరీటాన్ని దక్కించుకుంది. ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ... ఒబామా, మన్మోహన్ సింగ్ భేటీ నేపథ్యంలో జరిగే విందుకు నీనాను కూడా ఆహ్వానిస్తే బాగుంటుందని, అదే విధంగా ప్రవాస భారతీయుల సేవలను రెండు దేశాలు కూడా గుర్తించినట్టు ఉంటుందని అన్నారు.

తెలంగాణపై తొందరపడ్డాం

  తెలంగాణ విభజన ప్రకటన తరువాత వెళ్లువెత్తిన నిరసనలతో కేంద్ర సందిగ్దంలో పడింది. మొదట సీమాంద్రలో జరుగుతున్న నిరసనలను లైట్‌ తీసుకున్న కేంద్ర 50 రోజుల తరువాత కూడా నిరసనలు కొనసాగుతుండటంతో కేంద్ర ఇప్పుడు పునరాలోచనలో పడింది. విభజన నిర్ణయంపై తొందర పడ్డామని అంగీకరించిన అహ్మద్‌ పటేల్‌. సీమాంద్రలో పరిస్థితి ఇలా మారుతుందని అంచనాలవేయలేకపోయామన్నారు. బుధవారం సోనిమా గాందీ రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్‌తో సమావేశం అయిన సీమాంద్ర ప్రాంత ఎంపిలు, కేంద్ర మంత్రులు ఆ ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమ తీవ్రతను అహ్మద్‌పటేల్‌కు వివరించారు. అయితే తెలంగాణ ఏర్పాటు నిర్ణయం పై ఆలోచిస్తున్నామన్న ఆయన ఇప్పట్లో ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోయినా వెనక్కు కూడా వెళ్లలేమని తేల్చి చెప్పారు. ఇప్పట్లో రాష్ట్ర విభజన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని, ఆంటోని కమిటీ నివేదిక వచ్చిన తరువాత తదుపరి కార్యచరణ ఉంటుందిని తేల్చి చెప్పారు. తరువాత వీరప్పమొయిలితో కూడా భేటి అయిన సీమాంద్ర నాయకులకు ఇదే హామి లభించింది.

సమైక్య కాంగ్రెస్ నేతలు ఒంగోలులో భూముల కొనుగోళ్ళు

  ఈ రోజు ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో ఒక ఆసక్తికరమయిన కధనం వచ్చింది. కొందరు కాంగ్రెస్ నేతలు ఒకవైపు సమైక్యాంధ్ర ఉద్యమాలు చేస్తూనే, మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధానిగా ఏఏ ప్రాంతాలు కేంద్రం పరిశీలనలో ఉన్నాయో తెలుసుకొనేందుకు డిల్లీలో సంబందిత నేతలు, అధికారులు, కార్యాలయాలు చుట్టూ తిరిగి భోగట్టా చేసి కొత్త రాజధానికి పరిశీలనలో ఉన్న ప్రాంతాలుగా చెప్పబడుతున్నఒంగోలు, గుంటూరు తదితర ప్రాంతాలలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలుచేస్తున్నట్లు సమాచారం.   ఒక సీనియర్ కాంగ్రెస్ నేత ఒంగోలు వద్ద దాదాపు 1400 ఎకరాల భూమిని విభజన ప్రకటన వెలువడిన తరువాత కొనుగోలు చేసినట్లు ఆ పత్రిక పేర్కొంది. అదేవిధంగా గుంటూరులో గల చిలుకలూరిపేట-ఒంగోలు మద్య భూములను కూడా అయన కొన్నట్లు ఆ పత్రిక పేర్కొంది.   ఒకవైపు భారీ ఎత్తున భూములు కొనుగోలు చేస్తూనే మరోవైపు జోరుగా సమైక్యాంద్రా ఉద్యమాలు సాగించడం ద్వారా, ఇప్పుడప్పుడే రాష్ట్ర విభజన జరిగే అవకాశాలు లేవనే భావన ప్రజలలో కలుగజేసి, తద్వారా తమ కొనుగోళ్ళు పూర్తయ్యేవరకు భూమి ధరలు పెరగకుండా అదుపులో ఉండేలా సదరు నేతలు జాగ్రత్త పడుతున్నట్లు ఆ పత్రిక పేర్కొంది. ఇక, రాష్ట్ర విభజన జరగడం అనివార్యమని తెలిసి ఉన్నపటికీ, అది బయటపెట్టకుండా ప్రజలతో కలిసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనడం ద్వారా వారి అభిమానం సంపాదించుకొని వచ్చే ఎన్నికలలో విజయం సాధించవచ్చుననే ఆలోచన కూడా ఉంది. ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన వాగ్వాదంలో ఈ విషయాలన్నీ బయటకి పొక్కినట్లు ఆ పత్రిక పేర్కొంది.

రాజకీయ మద్దతులేని ఏపీయన్జీవోలు చులకనయ్యారా

  తెలంగాణా ఉద్యమంలో కీలకపాత్ర వహించిన టీ-ఎన్జీవోలు తెరాస నుండి రాజకీయ మద్దతు కూడా తీసుకోవడంతో వారు ఒక బలీయమయిన శక్తిగా నిలిచారు. అందువల్ల ప్రభుత్వము కానీ, కాంగ్రెస్, తెదేపా, వైకాపాలు గానీ వారి వంక కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోయాయనేది బహిరంగ రహస్యమే. కానీ, ఏపీఎన్జీవోల విషయంలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్దంగా జరుగుతోంది.   వారు ఏ రాజకీయ పార్టీ మద్దతు స్వీకరించేందుకు ఇష్టపడలేదు. కారణం సీమాంధ్రలో తెరాస వంటి ఉద్యమ పార్టీ లేకపోవడమే. ఒకవేళ వారు ఏ రాజకీయ పార్టీ మద్దతు స్వీకరించినా మిగిలిన పార్టీలు వారిని తమ బద్ధ శత్రువులుగా పరిగణిస్తాయి. కానీ వారి ఏపార్టీ మద్దతు తీసుకోకపోయినా అందరికీ ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోయారు. కారణం, వారు అన్నిపార్టీలకి చెందిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులను రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని గట్టిగా కోరడమే.   పదవులను వదులుకోవడానికి ఎంత మాత్రం ఇష్టపడని సీమాంధ్ర నేతలకు ఇప్పుడు ఏపీయన్జీవోలు శత్రువులుగా మారిపోయారు. అందువల్ల వారిపట్ల చులకన భావం కూడా వారి మాటలలో వ్యక్తమవుతోంది. మంత్రి పార్ధ సారధి సమైక్యాంధ్ర ఉద్యమంలోకి రౌడీ మూకలు జొరబడుతున్నాయని, దాని వల్ల ఉద్యమానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. ఇక వైకాపా నేత దాడి వీరభద్రరావు ఏపీఎన్జీవో నాయకుడు అశోక్ బాబు రాజీనామాల విషయంలో రోజుకొక ప్రకటన చేస్తున్నారని విమర్శించారు.   అదేవిధంగా సమైక్యవాదుల చేతిలో పరాభవం ఎదుర్కొన్న కావూరి, చిరంజీవి, సుబ్బిరామి రెడ్డి, క్రుపారాణీ తదితరులు కూడా వారిపట్ల ఆగ్రహంతో ఉన్నారు. పదేపదే తమను రాజినామాల కొరకు ఒత్తిడి చేయడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే క్రమంగా రాజకీయ పార్టీ నేతలు ఒకరొకరుగా ఏపీఎన్జీవోలపై విమర్శలు మొదలుపెట్టారు. బహుశః వారికి ఎటువంటి రాజకీయ అండదండలు లేకపోవడం వలనే వారిని విమర్శించడానికి దైర్యం చేయగలుగుతున్నారను కోవచ్చును.   ఏపీఎన్జీవోల నాయకుడు అశోక్ బాబు, ఈ విమర్శలకు బదులు ఇస్తూ తాము వ్యక్తిగతంగా ఎవరినీ వ్యతిరేఖించడం లేదని, కేవలం ప్రజాప్రతినిధుల రాజకీయ నిర్ణయాలను, ఆలోచనలను మాత్రమే తప్పుపడుతున్నామని అన్నారు. ప్రజలందరూ సమైక్యాంద్ర కోసం ఉద్యమాలు చేస్తుంటే, ప్రజాప్రతినిధులు పదవులు పట్టుకొని వ్రేలాడటంలో ఔచిత్యం ఏమిటో వారే చెప్పాలని ఆయన ఘాటుగా బదులిచ్చారు. ఇక తాము ఎవరి యాత్రలకు, సమావేశాలకు అడ్డుపడమని ఎవరికీ పిలుపునీయలేదని , ఒకవేళ ఉద్యోగులు నిజంగా క్రమశిక్షణను పక్కన బెడితే రాజకీయ నాయకులు ప్రజలలో తిరగడం కూడా కష్టమవుతుందని తెలుసుకోవాలని ఆయన అన్నారు.   రాజకీయ పార్టీలన్నిటినీ తాము సమదూరంలో పెడుతున్నామని, అంత మాత్రాన్న తమ శక్తిని తక్కువగా అంచనా వేసి భంగపడవద్దని ఆయన ఉద్యోగులను విమర్శిస్తున్న రాజకీయనేతలను గట్టిగా హెచ్చరించారు.

టీ-నోట్ కి టైముంది: మొయిలీ

  రాష్ట్ర విభజన అంశం రోజుకొక కొత్త మలుపు తిరుగుతూ అంతూ పొంతూ లేని ఒక సస్పెన్స్ టీవీ సీరియల్లాగా సాగుతోంది. ఈ జాప్యంతో రాష్ట్రంలో పరిస్థితి నానాటికి జటిలమవుతున్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ఎటూ తేల్చుకోలేక దానిని మరింత నాన్చడం వలన మరిన్నికొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక ఉభయ ప్రాంతల నేతలకు సర్దిచెప్పడానికి కాంగ్రెస్ అధిష్టానం చెపుతున్నమాటలు, పార్టీకి ఏవిధంగాను సహాయపడకపోగా, పార్టీపై రెండు ప్రాంతాల ప్రజలలో అపనమ్మకం కలుగజేస్తోంది.   సీమాంధ్ర యంపీలు, కేంద్ర మంత్రులు టీ-నోట్ పై వివరణ కోరేందుకు నిన్నఅంటోనీ కమిటీలో సభ్యుడయిన వీరప్పమొయిలీని కలిసినపుడు, ఆయన అంటోనీ కమిటీ నివేదిక సమర్పించిన తరువాత, అందులో సీమాంధ్ర ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు పేర్కొన్న అన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకొన్నతరువాతనే టీ-నోట్ సిద్దం చేసి కేంద్రమంత్రి వర్గ సమావేశంలో ప్రవేశ పెట్టబడుతుందని వారికి తెలిపారు. సోనియా గాంధీ ఇరుప్రాంతలకు న్యాయం చేస్తారని ఆయన హామీ ఇచ్చారు.   మొయిలీ హామీ చూస్తే ‘టీ-నోట్ ఇప్పుడప్పుడే క్యాబినెట్ ముందుకు రాబోదని’ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర మంత్రులతో చెప్పిన విషయాన్ని దృవీకరిస్తున్నట్లుగానే ఉంది

మంత్రి గీతారెడ్డి తొలగింపుకు తెదేపా ఒత్తిడి

  రాష్ట్ర విభజన అంశంతో ఇప్పటికే తల బొప్పి కట్టి ఉన్నకాంగ్రెస్ పార్టీకి, నిన్నసీబీఐ చార్జ్ షీట్లో మంత్రి గీతారెడ్డి పేరు చేర్చడం, మరో వైపు డీజీపీ దినేష్ రెడ్డిపై సీబీఐ విచారణ మొదలవడంతో ప్రతిపక్షాలకు మరోమారు అడ్డుగా దొరికిపోయింది. ఈ రోజు తెదేపా నేతలు గవర్నర్ నరసింహన్‌ను కలిసి, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏ-9వ నిందితురాలిగా పేర్కొనబడిన మంత్రి గీతారెడ్డిని వెంటనే పదవిలోంచి తొలగించవలసిందిగా వినతిపత్రం సమర్పించారు. ఇక సీపీఐ నేత నారాయణ మరో అడుగు ముందుకు వేసి, డీజీపీ దినేష్ రెడ్డిని కూడా తొలగించాలని డిమాండ్ చేసారు.   ఇంతకు ముందు ధర్మాన, సబితలపేర్లు సీబీఐ చార్జ్ షీట్లోకి ఎక్కినప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వారిని ఎంత వెనకేసుకు వచ్చినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించకపోవడంతో వారిరువు చాలా అవమానకర పరిస్థితుల్లో తమ పదవులకు రాజీనామాలు చేయవలసి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు గీతారెడ్డి వంతు వచ్చింది. సబితా రెడ్డి హోంమంత్రి పదవి నుండి దిగిపోయిన తరువాత కిరణ్ కుమార్ రెడ్డి, గీతారెడ్డికి తాత్కాలికంగా ఆ బాధ్యతలు అప్పగించారు. అందువల్ల ఇప్పుడు ఆమె కూడా ఇదివరకు సబితారెడ్డి ఎదుర్కొన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులనే ఎదుర్కోవలసి వస్తోంది. గనుక ఆమె హోంశాఖను తిరిగి ముఖ్యమంత్రికి అప్పగించవచ్చును, లేదా మంత్రి పదవికి రాజీనామా చేయవచ్చును.   జగన్మోహన్ రెడ్డి బెయిలు కోసం దరఖాస్తు చేసుకొన్నఈ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ సమస్య రావడం యాదృచ్చికమే అయినప్పటికీ, ఇప్పుడు గీతారెడ్డిని ఉపేక్షిస్తే తేదేపాకు మరో కొత్త అస్త్రం అందించినట్లవుతుంది. గనుక కాంగ్రెస్ అధిష్టానం ఆమెను పదవి నుండి తప్పుకోమనే అవకాశాలే ఎక్కువని చెప్పవచ్చును. బహుశః కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు హోంశాఖ అంతగా అచ్చిరావట్లేదేమోననిపిస్తోంది.

తెలంగాణా, సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమావేశం త్వరలో

    ఇంతవరకు తెలంగాణాలో, ఇప్పుడు సీమాంధ్రలో ప్రజలు ఉద్యమిస్తున్నపుడు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, తమ తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు రెండు వర్గాలుగా చీలి ఏ ఎండకి ఆ గొడుగు పడుతూ రాష్ట్రాన్నిరావణకాష్టంగా మార్చడంలో తమ వంతు కర్తవ్యం చాల చక్కగా నిర్వహించారు. విభజన తరువాత తెరాస, తెదేపా, వైకాపాలు మూడు చరిత్ర పుటల్లోకలిసిపోతే, రెండు ప్రాంతాలలో తమ పార్టీయే ఏక చత్రధిపత్యం వెలగబెట్టేయవచ్చునని కాంగ్రెస్ కలలుకంది. కానీ, రాష్ట్రంలో కధ అడ్డం తిరిగింది.   విభజన చేయనందుకు తెలంగాణా ప్రజలు, చేస్తున్నందుకు సీమాంధ్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణా ప్రకటన వెలువడినప్పుడు టీ-కాంగ్రెస్ నేతలకి నీరాజనాలు పట్టిన అక్కడి ప్రజలు, ప్రకటన వెలువడిన 50రోజుల తరువాత కూడా విభజన ప్రక్రియ ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు పడిఉండటంతో, వారిని అనుమానంగా చూస్తున్నారు.   ఇక, విభజన జరుగుతోందని ముందుగానే తెలిసి ఉన్నపటికీ దానిని అడ్డుకోకుండా ప్రజలను మభ్యపెడుతూ కాలక్షేపం చేసిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, ప్రజలు, ఉద్యోగులు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఉద్యమాలు సమ్మెలు చేస్తుంటే, నేతలు మాత్రం ఇప్పటికీ తమ పదవులను పట్టుకొని వ్రేలాడుతుండటంతో ప్రజలు వారిని తరిమికొడుతున్నారు.   విభజనతో మట్టి కొట్టుకుపోతాయని భావించిన మూడు ప్రాంతీయ పార్టీలు కూడా మరింత బలపడి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే అసలు దోషిగా ప్రజల ముందు నిలబెడుతున్నాయి. కాంగ్రెస్ అనుకొన్నది ఒకటి, జరుగుతున్నది మరొకటి. ఇక, ఇదేవిధంగా ముందుకు సాగితే రానున్నఎన్నికలలో గెలవడం సంగతి దేవుడెరుగు, కనీసం ప్రజల మధ్యకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుందని భావించిన సీమాంధ్ర, తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఈ సమస్యలనుండి బయటపడేందుకు తమ మధ్య ఉన్న ప్రాంతీయ విభేదాలను పక్కన బెట్టి అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని నిశ్చయించుకొన్నారు. బహుశః ఈ రెండు మూడు రోజుల్లోనే వారు సమావేశమవ్వవచ్చును.   రాష్ట్ర విభజనలో తలెత్తే సమస్యల గురించి చర్చించి, అందరికీ ఆమోదయోగ్యంగా రాష్ట్ర విభజన ఏవిధంగా చేయవచ్చుననే అంశంపై వారు చర్చించబోతున్నట్లు సమాచారం. విభజన సంగతి చర్చించడం సంగతి ఎలా ఉన్నపటికీ వారందరూ ముందుగా తమపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఏవిధంగా ఎదుర్కోవాలి? రెండు ప్రాంతాలలో తమ పార్టీని ఏవిధంగా కాపాడుకోవాలి? రెండు ప్రాంతాలలో ప్రజలకు ఏవిధంగా నచ్చజెప్పాలి? వంటి అంశాలను చర్చించడానికే ప్రాధాన్యం ఇస్తారని వేరే చెప్పనవసరం లేదు. ఒకవైపు రాష్ట్ర ప్రజలు అవస్థలు పడుతుంటే, కాంగ్రెస్ నేతలు తమ సమస్యలను చర్చించుకోవడానికి రెండు ప్రాంతాలలో తమ పార్టీని కాపాడుకోవడానికి సమావేశం అవబోడం ప్రజలకు మరింత ఆగ్రహం కలిగించవచ్చును.   రాష్ట్రంలో రాజకీయ ఆధిపత్యం సాధించేందుకు ఇంతవరకు డివైడ్ అండ్ రూల్ సిద్ధాంతం అమలుచేసిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు తన ఉనికిని కాపాడుకోవడానికి ఐకమత్యమే మహాబలమని తన ఇరు ప్రాంతాల నేతలను ఒకచోటకు చేర్చే ప్రయత్నాలు మొదలుపెట్టడం విశేషమే.