మ్యాచ్ ఎప్పుడో అయిపోయింది: శ్రీధర్ బాబు
posted on Sep 26, 2013 @ 11:18AM
ఆఖరి బంతి పడేవరకు మ్యాచ్ పూర్తవదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ “తెలంగాణా మ్యాచ్ ఎప్పుడో పూర్తయిపోయింది. మ్యాచ్ పూర్తయిపోయిన తరువాత ఇక ఆఖరి బంతి పడదు. కాంగ్రెస్ నేతలందరూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయానికి తప్పని సరిగా కట్టుబడి ఉండాలని” ఆయన అన్నారు.
ఇప్పటికే చాలా మంది తెలంగాణా కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పదవిలోంచి తప్పించి, రాష్ట్రపతి పాలన విధించయినా రాష్ట్ర విభజన ప్రక్రియను వీలయినంత వేగంగా పూర్తి చేయాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా పేరున్న మంత్రి శ్రీధర్ బాబు ఇంతవరకు ఆయనకు వ్యతిరేఖంగా ఎన్నడూ వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఇప్పుడు ఆయన కూడా ముఖ్యమంత్రికి దూరం జరిగినట్లు ఈ వ్యాఖ్యలతో అర్ధం అవుతోంది.
సీమాంధ్ర శాసన సభ్యులు, మంత్రులు సమైక్య హడావుడిలో తిరుగుతుంటే, మరో పక్క టీ-కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రికి దూరంగా మసులుతున్నారు. అదేవిధంగా లక్షలాది ఉద్యోగులు కూడా సమ్మె బాట పట్టి రెండు నెలలు కావస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పరిపాలన కొనసాగడం అసాధ్యమని స్పష్టమవుతోంది. అయినప్పటికీ, కాంగ్రెస్ పెద్దలు రాష్ట్రంలో పరిస్థితులు భేషుగ్గా ఉన్నాయని శలవిస్తూ ప్రజలకి మరింత ఆగ్రహం కలిగిస్తున్నారు.