మ‌రో ఉద్యమానికి కెసిఆర్ పిలుపు

  స‌మైక్యాంద్ర ఉద్యమం ఉదృతంగా న‌డుస్తున్న నేప‌ధ్యంతో తెలంగాణ నాయ‌కులు కూడా ఉద్యమ కార్యచ‌ర‌ణ సిద్దం చేస్తున్నారు. ఇందులో భాగంగా శ‌నివారం టీఆర్ఎస్ అధినేత కేసిఆర్‌తో ఓయూ జేఎసి నాయ‌కులు స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా విద్యార్ధుల‌తో చ‌ర్చించిన కెసిఆర్ ప్రత్యేఖ రాష్ట్రంపై కీల‌క వ్యాఖ్యలు చేశారు. వ‌చ్చే నెల 5లోపు కేభినెట్ నోట్ వ‌స్తుంద‌న్న కెసిఆర్, హైద‌రాబాద్ పై కేంద్ర వైఖ‌రి ఎలా ఉండ‌బోతుందో కూడా తెలిపారు. హైద‌రాబాద్ లా అండ్ ఆర్డర్ తో పాటు రెవెన్యూకు సంబందించిన అన్ని అధికారాలు కేంద్రం త‌న వ‌ద్దే ఉంచుకునే అవ‌కాశం ఉంద‌న్నారు. తాము కోరుకున్న తెలంగాణ ఇది కాద‌న్న కెసిఆర్ మ‌రో ఉద్యమానికి విద్యార్ధులు సిద్దం కావాల‌ని పిలుపునిచ్చారు.

ఆరునెల‌ల పాటు స‌మ్మెలు నిషేదం

  తెలంగాణ ప్రక‌ట‌న‌తో సీమాంద్ర జిల్లాల్లో ఎగ‌సి ప‌డ్డ స‌మ్మెల‌ను క‌ట్టడి చేయ‌టానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయ‌త్నిస్తుంది. స‌మ్మె మొద‌ల‌యిన ద‌గ్గర నుంచి ఉద్యోగ సంఘాల‌తో చ‌ర్చలు జ‌రుపుతున్న ప్రభుత్వం. ఎంత‌కీ చ‌ర్చలు ఫ‌లించ‌క‌పోవ‌టంతో కోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టు కూడా ఉద్యోగ సంఘాల మీద ఎటువంటి చ‌ర్యల‌కు ఆదేశాలు ఇవ్వక పోవ‌డంతో ఇప్పుడు మ‌రో ఆయుదాన్ని ప్రయోగించింది ప్రభుత్వం. ఆరు నెల‌ల పాటు మున్సిపాలిటీ, కార్పోరేష‌న్‌ల‌లో స‌మ్మెల‌ను నిషేదిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. శ‌నివారం జారి అయిన ఈ జీవో ఆ రోజు నుంచి అమలు అవుతుంద‌ని ప్రక‌టించింది. ప్రస్థుతం రాష్ట్రంలో ఉన్న 162 మున్సిపాలిటీలు, 19 కార్పోరేష‌న్‌ల‌లో శ‌నివారం నుంచి స‌మ్మెలు నిషేదం.

గన్నవరం నుండి బాలకృష్ణ పోటీ

వచ్చే సాధారణ ఎన్నికలలో శాసనసభకు పోటీ చేస్తానని నందమూరి బాలకృష్ణ చాలా కాలం క్రితమే ప్రకటించారు. మొదట ఆయన కృష్ణ జిల్లా గుడివాడ నుండి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆయన గన్నవరం నుండి పోటీ చేయాలనుకొంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఆయన గన్నవరం నుండే పోటీ చేసేందుకు రంగం సిద్ధం అవుతోందని తెలుస్తోంది.   ప్రస్తుత తెదేపా సిట్టింగ్ యం.యల్.ఏ. దాసరి బాలవర్ధన్ కు కృష్ణాజిల్లా సహకార పాలసంఘం అద్వర్యంలో నడుస్తున్న విజయ డెయిరీ బోర్డులో కీలక పదవి కట్టబెట్టి, ఆయన స్థానం బాలకృష్ణకు కేటాయించాలని తెదేపా ఆలోచిస్తున్నట్లు సమాచారం. కానీ, తెదేపా సీనియర్ నేత వల్లభనేని వంశీ గన్నవరం సీటు తనకే కేటాయించాలని మొదటినుండి కోరుతున్నారు.   ఒకవేళ గన్నవరం సీటు తనకి ఇవ్వనట్లయితే రాజకీయాలు వదిలిపెట్టి పోతానని వంశీ ఇదివరకు అన్నారు. మరి ఇప్పుడు బాలకృష్ణ గన్నవరం నుండి పోటీకి దిగితే వంశీ వేరే చోటి నుండి పోటీ చేయడానికి ఇష్టపడతాడా? లేక పార్టీకి గుడ్ బై చెప్పి వైకాపాలోకి వెళ్ళిపోతారా అనేది టికెట్స్ కేటాయింపు మొదలయితే గానీ తెలియదు.  

సీమాంధ్ర యంపీలు రాజీనామాలకు సిద్ధం

  సమైక్యాంధ్ర ఉద్యమాలతో అట్టుడుకుతున్న సీమాంద్రాలో అడుగుపెట్టలేని పరిస్థితుల్లో డిల్లీలో తచ్చట్లాడుతున్న సీమాంధ్ర యంపీలు, కేంద్ర మంత్రులు నిన్నకాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్, షిండే, మనిష్ తివారీ, చాకో తదితరులు రాష్ట్ర విభజన ఖాయం అంటూ వరుసపెట్టి చేసిన ప్రకటనలతో వారు మరింత ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకొన్నారు. దానికితోడు నిన్ననే ఏపీఎన్జీవోలు మరో మారు విజయవాడలో భారీఎత్తున ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సమైక్య సభను నిర్వహించి ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించడం, అదే మాటను నేడు వారు హైకోర్టుకి కూడా ఖరాఖండిగా తెలియజేయడంతో, పదవులు పట్టుకొని వ్రేలాడుతున్న స్వార్ధ రాజకీయ నేతలుగా తమపై ముద్ర పడుతుందని ఆందోళన చెందుతున్నారు.   ఇక దిగ్విజయ్ సింగ్ “మీరు రాజీనామాలు చేయడలచుకొంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు”నని చెప్పడంతో సీమంధ్ర యంపీలు ఉండవల్లి, రాయపాటి, లగడపాటి, సాయిప్రతాప్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, వెంకటరామిరెడ్డి, ఎస్పీవైరెడ్డిలు తమ పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. వారు ఈనెల 24న స్పీకర్ కలిసేందుకు అపాయింట్మెంటు కూడా తీసుకొన్నారు. అదేరోజు వారు తమ రాజీనామాలను ఆమోదింపజేసుకొంటామని చెపుతున్నారు. కేంద్రమంత్రులు మాత్రం ఇంకా రాజీనామాలపై ఊగిసలాటలో ఉన్నట్లు సమాచారం. అయితే సీమాంధ్ర యంపీలు నిజంగా రాజీనామాలు చేయబోతున్నారా లేదా? అనే సంగతి బహుశః 24న తేలిపోవచ్చును.

సమ్మె కొనసాగింపుకే ఎన్జీవోల మొగ్గు

  ఏపీఎన్జీవోల నిరవధిక సమ్మెపై హైకోర్టులో దాఖలయిన కేసు నాలుగవ రోజు కూడా కొనసాగింది. ఉద్యోగులు ఇన్నిరోజులు సమ్మె చేయడం భావ్యం కాదని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అందువల్ల వెంటనే సమ్మె విరమించమని కోర్టు కోరింది. అయితే, తాము కేంద్రం తన నిర్ణయం మార్చుకోనేంతవరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని వారు కోర్టుకు తేల్చి చెప్పారు. కోర్టు ఈ కేసును మళ్ళీ సోమవారానికి వాయిదా వేసింది. ఆ రోజునే కోర్టు తన తీర్పు వెలువరించే అవకాశం ఉంది.   నిన్న కేంద్రమంత్రి మనిష్ తివారీ, హోంమంత్రి షిండే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ మరియు ఏఐసీసీ ప్రతినిధి చాకో రాష్ట్ర విభజన చేసి తెలంగాణా ఏర్పాటు చేయడం తధ్యమని ఖరారు చేసిన నేపధ్యంలో ఏపీఎన్జీవోలు ఇప్పటికీ అంతే పట్టుదలగా వ్యవహరించడం విశేషమే. ఉద్యోగుల ఈ నిర్ణయంతో నేరుగా ఇప్పుడు రాజకీయ నేతలు, పార్టీలపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఇంతవరకు మూడు ప్రధాన పార్టీలను ఉపేక్షిస్తున్న ఉద్యోగ సంఘాలు, ఇక నుండి నేరుగా వారిని డ్డీ కొనే ప్రయత్నం చేయవచ్చును. దానివల్ల ముఖ్యంగా కాంగ్రెస్, తెదేపా నేతలకు ఇబ్బందులు తప్పవు. ఇంత జరుగుతున్నా రాజీనామాలు చేసేందుకు నిరాకరిస్తున్న కాంగ్రెస్ నేతలు, సమైక్యంద్రాపై నోరుమెదపని తెదేపా ముందుగా ఇబ్బందులో పడవచ్చును.   ఇక వైకాపాను కూడా ఉద్యోగులు నమ్ముతున్నట్లు దాఖలాలులేవు. సమ్మె కాలానికి ఉద్యోగులకు జీతాలు, బోనసులు ఇస్తామని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఇచ్చిన ఆఫరును ఏపీఎన్జీవోల నాయకుడు అశోక్ బాబు నిర్ద్వందంగా తిరస్కరించడమే అందుకు ఉదాహరణ. సీమాంధ్రలో రాజకీయంగా పైచేయి సాధించడానికే వైకాపా సమైక్యాంధ్ర ఉద్యమాలు చేస్తోందని వారు భావించడమే అందుకు ప్రధాన కారణం.   ఏమయినప్పటికీ, యన్జీవోలు సమైక్యాంధ్ర ప్రకటన వెలువడే వరకు సమ్మె కొనసాగించాలని దృడ నిశ్చయం ప్రదర్శించడం రాజకీయపార్టీలపై తీవ్ర ప్రభావం చూపబోతోంది.

చంద్రబాబు డిల్లీ యాత్ర రాజకీయాలకోసం కాదుట

  చంద్రబాబు శనివారం డిల్లీ చేరుకొన్నారు. తాను ఇప్పుడు రాజకీయాలు మాట్లాడేందుకు రాలేదని ప్రధాని డా.మన్మోహన్ సింగ్ మరియు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలను కలిసి రాష్ట్రంలో పరిస్థితులు వివరించి, వారిని ఈ విషయంలో జోక్యం చేసుకొని పరిస్థితులు చక్కదిద్దవలసిందిగా కోరేందుకే వచ్చానని అన్నారు. ఆయన వెంట పార్టీకి చెందిన సీమాంద్రా, తెలంగాణా నేతలు కూడా వెళ్లి ప్రధానిని, రాష్ట్ర పతిని కలుస్తారు. ఆ తరువాత వారు డిల్లీలో ప్రతిపక్ష జాతీయ నేతలను కలిసిరాష్ట్రంలో పరిస్థితులు వారికీ వివరించి, పరిస్థితి చక్కదిద్దమని ప్రభుత్వంపై ఒత్తిడి తేవలసిందిగా వారిని కోరనున్నారు.   ఇక పనిలోపనిగా బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా మోడీని ఎంపిక చేసినందుకు శుభాకాంక్షలు తెలిపే మిషతో బీజేపీ అగ్రనేతలను కూడా కలిసి రెండు పార్టీల మధ్య పొత్తులకు మార్గం సుగమం చేయవచ్చును. ఒకవేళ ఈవిషయమై రెండు పార్టీల మధ్య అవగాహన ఏర్పడినప్పటికీ ఇప్పటికిప్పుడు అంతిమ నిర్ణయం తీసుకొనే అవకాశం లేదు. ఎందుకంటే దాని వలన రెండు పార్టీలకు లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. తెదేపా, బీజేపీలు చేతులు కలుపుతున్నట్లు గ్రహిస్తే వెంటనే కాంగ్రెస్, వైకాపాలు తదనుగుణంగా తమ వ్యూహాలు మార్చుకొనే అవకాశం ఉంటుంది.   ఇక ఇప్పటికే తెలుగు తమ్ముళ్ళు ఈడీ మరియు విజిలన్స్ అధికారులని కలిసి జగన్ వ్యవహారం గుర్తు చేసి వచ్చారు గనుక చంద్రబాబు మళ్ళీ ఆ ప్రయత్నం చేయకపోవచ్చును. కానీ జగన్ బెయిలు పిటిషనుపై సీబీఐ కోర్టు తన తీర్పును సోమవారం నాడు వెలువరించనున్నఈ సమయంలో చంద్రబాబు డిల్లీలో మఖాం వేయడంతో వైకాపా మళ్ళీ ఆయనపై ఆరోపణలు గుప్పిస్తోంది.

లగడపాటికి సమైక్య సెగ..ఉద్రిక్తత

      ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు సమైక్య సెగ తగిలింది. ఆటోనగర్‌లో సమైక్యాంధ్రకు మద్దతుగా లారీ ఓనర్ల దీక్షకు సంఘీభావం తెలిపేందుకు దీక్షాశిబిరానికి వచ్చిన ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ను సమైక్యవాదులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేసి రావాలని సమైక్యవాదులు డిమాండ్ చేశారు. అయితే తాను ఎందుకు విజయవాడ వచ్చింది?రాజీనామాల గురించి తమ వైఖరి ఏమిటో వివరించడానికే వచ్చానని లగడపాటి వివరించడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో లగడపాటి అనుచరులు, సమైక్యవాదులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి జరపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

రాష్ట్రపతి వద్దకు ఎంపీల సతీమణులు

      సమైకాంధ్ర ప్రదేశ్ కోసం ఏపీ ఎన్జీఓలు చేస్తున్న ఉద్యమంలోకి రాజకీయ నాయకులను రానీయకపోవడంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమకు తాముగా పోరాడుతున్నారు. అయినా వారికి సీమాంధ్రుల నుండి సెగల తప్పడంలేదు. వారు చేస్తున్న ప్రయత్నానికి మరింత బలం, పాపులారిటీ రావడం కోసం సీమాంధ్ర రాజకీయ నాయకుల సతీమణులను కూడా ఉద్యమంలోకి దించుతున్నారు. గతంలో వీరంతా రాష్ట్ర గవర్నర్ ని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వినతి పత్రం సమర్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి పోరాటం ఢిల్లీకి కూడ చేరబోతుంది.     సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలకు మద్దతుగా వారి సతీమణులు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవనున్నారు. ఈ రోజు మధ్యాహ్నానం వీరు ప్రణబ్ ముఖర్జీని కలవడానికి అపాంట్ మెంట్ తీసుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, విభజించే దిశగా ఏ చర్యలూ తీసుకోవద్దని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరనున్నారు. వీరు ఢిల్లీ వెళ్లడాన్ని చూస్తే కాంగ్రెస్ నేతలు తమ కుటుంబాలతో సహా సమైక్య రాష్ట్రం కోసం కృషి చేశామని చెప్పుకోవడాని తప్ప వీరు ఢిల్లీ వెళ్ళి ప్రయోజనం లేదని, ఒకవేళ సీమాంధ్ర కాంగ్రెస్ వారు నిజంగా సమైక్యరాష్ట్రం కోరుకుంటే అధిష్టాన్ని దిక్కరించి, పార్టీకి పదవులకు రాజీనామా చేస్తే సరిపోతుంది కదా ? ఇలా కుటుంబాలను రోడ్డు పైకి తేవడం దేనికి అని సీమాంధ్ర ప్రజలు అనుకుంటున్నారు.

కేసీఆర్...చరిత్ర తెలుసుకో

      'తెలంగాణ ఉద్యమం 50 సంవత్సరాల నుంచి ఉందా? చరిత్ర తెలుసుకోండి! తెలుగు జాతి ఐక్యంగా ఉండాలనే ఉద్యమానికి వందేళ్ల చరిత్ర ఉంది. అసలు తెలుగు జాతి ఎందుకు విడిపోవాలి? తెలుగు మన భాష. రాయలసీమలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, కోస్తాలో ఉన్నా అందరూ ఆంద్రులే. వారంతా మాట్లాడేది తెలుగే. ఇది విభజనవాదులు తెలుసుకోవాలి'' అని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు నలమోతు చక్రవర్తి సూచించారు.     'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభలో ఆయన ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. 'తెలంగాణవాలె జాగో... ఆంధ్రావాలే బాగో' అని గతంలో నినదించిన కేసీఆర్‌పై మండిపడ్డారు. దీనిని తిరగరాద్దామంటూ... 'తెలుగువాలే జాగో... కేసీఆర్ బాగో' అని నినదించారు. విభజన ఆగాలంటే సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్నారు. "1913-1914లోనే విజయవాడలో విశాలాంధ్ర మహాసభకు అంకురార్పణ జరిగింది.   అప్పట్లో కాంగ్రెస్ స్వాతంత్య్రం కోసం పోరాడితే, దానికి సమాంతరంగా తెలుగుజాతి ఐక్యత కోసం విశాలాంధ్ర మహాసభ ఉద్యమించింది'' అని తెలిపారు. హైదరాబాద్‌పై అవగాహన లేని వారు రకరకాల వాదనలు చేస్తున్నారని విమర్శించారు. "కులీ కుతుబ్ షాహీలు, ఆ తర్వాత నిజాంల పాలనలో తెలుగువారంతా కట్టిన పన్నులవల్లే హైదరాబాద్‌లో నిర్మాణాలు జరిగాయి. ఇప్పుడున్న హైటెక్ సిటీ మాత్రమే కాదు... గోల్కొండ, చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం అన్నీ మనవే'' అని నొక్కిచెప్పారు.

కాంగ్రెస్ హస్తంలో బీజేపీ కమలం విలవిలా

  కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్ధుల గత చరిత్రలను త్రవ్వి తీసి అందులో లోపాలను, వారు చేసిన తప్పులను వెతికి పట్టుకొని వారిని రాజకీయంగా దెబ్బ తీయడం కొత్తేమి కాదు. ఇంతవరకు అనేక మందిపై విజయవంతంగా ప్రయోగించిన ఈ ఆయుధాన్నేమళ్ళీ మరోమారు మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే. సింగ్ పై ప్రయోగించింది.   ఆయన హయాంలో ఆర్మీలో నెలకొల్పిన ఒక ప్రత్యేక గూడచార వ్యవస్థ నిధులు దుర్వినియోగం చేయడమే కాకుండా ఒమర్ అబ్దుల్లా యొక్క జమ్మూ మరియు కాశ్మీర్ ప్రభుత్వాన్ని కూలద్రోసేందుకు కుట్రలు పన్నిందని, అందువల్ల దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు సీబీఐ విచారణకు ఆదేశించాలని, లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా హోంమంత్రికి మార్చ్ నెలలో ఇచ్చిన ఒక నివేదికను ప్రస్తావిస్తూ, నిన్న కేంద్ర మంత్రి మనిష్ తివారీ, “ఇది చాలా సున్నితమయిన, కీలకమయిన దేశరక్షణకు సంభందించిన విషయం. అందువల్ల దీనిపై సమగ్రం విచారణ జరిపి, ఇందులో దోషులు ప్రస్తుతం సర్వీసులో ఉన్నవారయినా రిటైర్ అయినవారయినా వదిలిపెట్టేదిలేదు,” అని మీడియాకు తెలియజేసారు.   కాంగ్రెస్ పార్టీ ఈ విషయం ప్రకటించేందుకు ఎంచుకొన్నసమయం గమనిస్తే అది తన ప్రత్యర్ధుల చేతిని మెలి పెట్టి లొంగ దీసుకోవాలని ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. వీకే. సింగ్, బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటింపబడిన నరేంద్ర మోడీతో కలిసి ఇటీవల రివారీలో జరిగిన ఒక బహిరంగ సభలో పాల్గొనడమే అందుకు కారణమని బీజేపీ ఆరోపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో అందరూ తేడాయేనా

  కాంగ్రెస్ అధిష్టానం తన రాష్ట్ర నేతలను నియత్రించడంలో విఫలమవడం కొత్త విషయమేమీ కాదు. వారి క్రమశిక్షణా రాహిత్యానికి వారు ప్రజాస్వామ్యమని ముద్దు పేరు పెట్టుకొని సమర్ధించుకొంటారు కూడా. బహుశః కేంద్ర నాయకులలో ఈ ప్రజాస్వామ్యం కొంచెం ఎక్కువేననిపిస్తుంది. ఒకే అంశంపై పదిమంది నేతలు పది రకాలుగా మాట్లాడటం కాంగ్రెస్ సంస్కృతి అని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నమాట నిజమని ఒప్పుకోక తప్పదు.   రాష్ట్ర విభజనపై సీమాంధ్ర, తెలంగాణా నేతలు రెండు రకాలుగా మాట్లాడుతుంటారు. సీమాంధ్ర యంపీలు రాజీనామాలు చేద్దామని చెపుతుంటే, రాకరాక వచ్చిన మంత్రి పదవులను వదులుకొని ఏమి సాధిస్తామని కేంద్రమంత్రులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.   ఇక వీరి పరిస్థితి ఇలా ఉంటే సోనియా గాంధీ కార్యదర్శి షకీల్ అహ్మద్ ‘రాష్ట్ర విభజన ప్రకటన చేసి తొందరపడ్డామేమో!’ అని అంటే, ‘పార్టీ నిర్ణయాన్నిప్రభుత్వం కూడా ఆమోదించింది,విభజన ఖాయం!’ అని మనిష్ తివారి కుండ బ్రద్దలు కొడతాడు. వాయలార్ రవి ‘అంటోనీ కమిటీ నివేదిక వచ్చిన తరువాతనే టీ-నోట్ క్యాబినెట్ ముందుకు వెళుతుందని’ చెప్పిన కొద్దిసేపటికే హోంమంత్రి షిండే ‘టీ-నోట్ రెడీ, త్వరలో క్యాబినెట్ ముందుకి’ అని ప్రకటిస్తారు. మరో మంత్రి గారు మధ్యలో దూరి ‘టీ-నోట్ కి అంటోనీ కమిటీకి ఒకదానితో మరొకదానికి అసలు సంబంధమే లేదని’ శలవిస్తారు.   దిగ్విజయ్ సింగ్ సీమాంద్రా కాంగ్రెస్ యంపీలను ఒకపక్క ఒదారుస్తూనే, ‘తెలంగాణా ప్రక్రియ ఆగే ప్రసక్తిలేదు, మాటంటే మాటే! ఎన్నికలలోగా తెలంగాణా పక్కా!’ అని గిల్లి వదిలిపెడతారు. “అలాగయితే మేము రాజీనామాలు చేస్తామని” సీమాంధ్ర నేతలు బెదిరిస్తే “ఈ తాటాకు చప్పుళ్ళకు భయపడబోమని” దిగ్విజయ్ సింగ్ బదులిస్తారు.   మరో చాకు లాంటి పెద్దాయన చాకో వచ్చి ‘వాళ్ళు ప్రజల పోరు పడలేక అలాగంటున్నారు గానీ వాళ్ళు నిజంగా రాజీనామాలు చేస్తారా ఏమిటీ?’ అని వారిని సమర్దిస్తునాడో లేక విమర్శిస్తునాడో తెలియకుండా గిల్లుతాడు.   రాష్ట్ర విభజన చేసేస్తున్నామని ప్రకటించి ఇప్పటికి 50రోజులయినా ఇంకా అడుగు ముందుకు వేయడానికి సాహసించలేని కాంగ్రెస్ నేతలు కచ్చితంగా ఎన్నికలలోగా విభజించిపడేస్తామని బల్ల గుద్ది మరీ హామీ ఇస్తున్నారు. హైదరాబాదుపై ఏమి చేయాలో పాలుపోక మా దగ్గిర మూడు ఆప్షన్స్, ముప్పై మూడు ఆప్షన్స్ ఉన్నాయని తమ అయోమయ పరిస్థితిని బయటపెట్టుకొనే పెద్దమనుషులు, ‘హైదరాబాద్ విషయంలో అందరికీ అమోదయోగ్యమయిన నిర్ణయం తీసుకొంటాము, అందరికీ న్యాయం చేస్తాము’ అంటూ మీడియా ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తారు.   ఏవిషయంలోనైనా అనుమానాలు వస్తే ఆ అంశంపై ముందుగా మీడియాకు లీకులు ఇచ్చి జనం నాడి తెలుసుకొనే ప్రయత్నం చేసే వాళ్ళే ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నామని చెపుతుంటారు. అయినా ఎటువంటి నిర్ణయమూ తీసుకోకుండానే తీసుకొంటున్నట్లు వారు చేసే హడావుడికి మాత్రం లోటు ఉండదు. దాదాపు రెండు నెలలుగా రాష్ట్రం పూర్తిగా స్తంభించిపోయినా ‘అంతా ప్రశాంతంగా అండర్ కంట్రోల్లో’ ఉందని ప్రకటించి చేతులు దులుపుకొంటారు.   ఏమయినప్పటికీ అసలు ఒకే అంశంపై ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడటమే చాల గొప్ప విషయమని నమ్మక తప్పదు. నిజం చెప్పాలంటే మంచి క్రియేటివిటీ ఉన్నవాళ్ళే కాంగ్రెస్ నేతలవుతారేమో! ఆ లెక్కన వీళ్ళు నటులు కాబోయి రాజకీయ నాయకులయ్యారని చెప్పవలసి ఉంటుంది.

జగన్ బెయిలుకి ఉద్యమ కారణమే అడ్డుపడుతుందా

    అక్రమాస్తుల కేసులో అరెస్టయిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బెయిలు పిటిషను మరో మూడు రోజుల్లో కోర్టు ముందుకు రానున్న తరుణంలో, సీబీఐ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించి వచ్చేనెల 3 వరకు అతని జ్యుడిషియల్ రిమాండ్‌ను పొడిగించింది. ఈసారి తప్పకుండా అతనికి బెయిలు దొరుకుతుందని అతని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు దృడంగా నమ్ముతున్నారు.   ప్రస్తుతం సీబీఐ తుది చార్జ్ షీట్ కూడా వేయడం పూర్తయిపోయింది గనుక, ఇక అతనికి బెయిలు ఇవ్వడం అనివార్యం అవుతుందని అందరూ భావిస్తున్నారు. కానీ, సీబీఐ మాత్రం షరా మామూలుగానే అతనికి బెయిలు ఇస్తే తమ దర్యాప్తుకి ఆటంకం కలుగుతుందని వాదించడం విశేషం. తుది చార్జ్ షీట్లు కూడా వేసిన తరువాత సీబీఐ తన దర్యాప్తు కొనసాగుతుందని, జగన్మోహన్ రెడ్డికి బెయిలు ఇస్తే దానికి ఆటంకం కలుగుతుందని చెప్పడం చూస్తే, సీబీఐ ఈ కేసుని మరికొంత కాలం సాగదీసేందుకే నిశ్చయించుకొన్నట్లుగా భావించవలసి ఉంటుంది. మరి వైకాపా ఆరోపిస్తున్నట్లు ఒకవేళ ఇందులో కాంగ్రెస్ ప్రమేయం ఉండి ఉంటే, బహుశః డిల్లీ నుండి సీబీఐకి ఇంకా ఎటువంటి నిర్దిష్ట సూచనలు రాలేదని భావించవలసి ఉంటుంది.   జగన్మోహన్ రెడ్డి తన బెయిలు పిటిషనులో ప్రస్తుతం సమైక్యాంధ్ర కోసం తమ పార్టీ చేస్తున్న ఉద్యమాల గురించి పేర్కొని, పార్టీ అధ్యక్షుడిగా వాటిని ముందుండి నడిపించవలసిన బాధ్యత తనపై ఉంది గనుక తనకు బెయిలు మంజూరుచేయవలసిందిగాకోరడం బహుశః పెద్ద పొరపాటు అవుతుందేమో!   ఒకవేళ అతనికి కోర్టు బెయిలు మంజూరు చేసినట్లయితే, సమైక్యాంధ్ర ఉద్యమం మరింత తీవ్రతరమవుతుందని అర్ధం అవుతోంది. ఇప్పటికే ఈ ఉద్యమాలతో, ఉద్యోగుల సమ్మెతో తలబొప్పికట్టిపోయిన కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పడు తనకి బెయిలు మంజూరు చేస్తే ఆ అగ్నికి ఆజ్యం పోస్తానని అతను స్పష్టంగా చెపుతున్నపుడు మరి కాంగ్రెస్ అధిష్టానం అందుకు మార్గం సుగమం చేస్తుందని అనుకోలేము. ఒకవేళ బెయిలు విషయంలో కాంగ్రెస్ ప్రమేయం ఏమీ లేదనుకొన్నాబహుశః కోర్టు కూడా బెయిలు నిరాకరించినా ఆశ్చర్యం లేదు. జగన్మోహన్ రెడ్డి తన బెయిలు దరఖాస్తులో ఈ కారణం పేర్కొని తప్పు చేసాడేమో?

రాష్ట్ర నాయకుల "రహస్య లిపి''

      - డా. ఎబికె ప్రసాద్   [సీనియర్ సంపాదకులు]       కవి శ్రీరంగం నారాయణ బాబు అనేక సంవత్సరాల క్రితం ఓ పాట రాశాడు. రంగూన్ (బర్మా)తో వర్తక, వ్యాపార లావాదేవీలు మన రేవు పట్టణాలనుంచి జరుగుతున్నప్పుడు ఓ జానపద దంపతుల జంట మధ్య నడిచిన సంభాషణకు అక్షర రూపమిచ్చాడు : "రంగమెళితే నేటి రంగైనవోడ!  నే      రంగమెళితే నేటి అచ్చరాల నీ పేరే పచ్చాపొడుసుకొన్నాను     సాటుమాటుగ దాన్ని సదివించుకొన్నాను  రంగమెళితే నేటి? ...'' ఇక్కడ 'రంగం' అంటే రంగూన్ అనే. ఎవడిగోలవాడిదే అన్నట్టుగా తొలి రోజుల్లో మన కవిత్వం మనమేగాని యితరులకు తెలియకుండా వుండాలనే ఊహ ఉండేది మన కవులకు! ఈ దుస్థితిని కనిపెట్టి తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు అలాంటి "దుస్థితి''ని "రంగూను ఉత్తరాల''తో పోల్చుతూ వుండేవారు! ఇంతకీ ఈ "రంగూన్ ఉత్తరాల'' కథాకమామీషు ఏమిటి?! ఆనాటి ఆంధ్రదేశంలో శ్రీకాకుళం నుండి గోదావరి జిల్లాల వరకూ ఒకప్పుడు రంగూన్ తో భారీస్థాయిలో వ్యాపార లావాదేవీలు జరుగుతుండేవి. మొగలాయీలు, నిజాంపాలకులు కూడా తెలంగాణా తెలుగుప్రాంతంలో సముద్రప్రాంతం లేనందున మచిలీపట్నం, కాకినాడ రేవుల నుంచే వర్తక, వ్యాపారాలు నిర్వహించుకునే వారు! నాటి వర్తక వ్యాపారానికి సంబంధించిన పరస్పర ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ రహస్య (సంకేత) లిపిలో సాగుతుండేవట. ఆ 'లిపి' చాలావరకు తెలుగు, ఉర్దూలే అయినప్పటికీ ఆ లిపిని అటు ఇటూ కూడా ఉత్తరాలు పంపేవారికి, అందుకునేవారికి మాత్రమే అర్థం చేసుకోగలిగేవాళ్ళట. అంటే, వ్యాపార రహస్యాలు వెల్లడి కాకుండా ఈ ప్రత్యేక 'లిపి' వాడేవారట! చాలామందికి గుర్తుందో లేదో మన చిన్నప్పుడు ఆట పాటల్లో ఉన్న పిల్లలు పెక్కుమంది 'క' భాషలో (సంకేత భాష) ఇతరులకు తెలియకుండా వాడుతూ వుండేవారు సరదాగా! కాని ఇప్పుడు అలాంటి భాష ఏదో రాష్ట్ర విభజన సమస్యపైన అటు కేంద్ర నాయకులకూ, ఇటు దశదిశా తెలియకుండా ప్రజల్ని సొంత ఎజెండాలతో వేధిస్తున్న పార్లమెంటు సభ్యులకు, శాసనసభ సభ్యులకూ, "సొంత పార్టీలు'' పెట్టుకుని యుతవలో, ప్రజలలో భ్రమలు గొలిపే రాజకీయ నాయకులకూ మధ్య "ఆసులో గొట్టాం''లా ఢిల్లీ చుట్టూ తిరుగుతూ జరుపుతున్న "రాజకీయ వ్యాపార లావాదేవీలు'' కూడా "రంగూన్'' ఉత్తరాల మాదిరే నడుస్తున్నాయి! కాని 'వాళ్ళ' మోసపు సంభాషణ మాత్రం మనకు తెలియదు! రాష్ట్ర విభజన సమస్యపై వీళ్ళు ఇక్కడ రాష్ట్రప్రజలకు చెప్పేదొకటి, ఢిల్లీ పరుగెత్తి అక్కడ నాయకత్వం చెవిలో ఊది వచ్చేదొకటీ! భాషాజ్ఞానం నుంచే గాక, చరిత్ర పాఠాలను కూడా పాఠ్యప్రణాళికల్నుంచి ఎత్తించి వేయించిన ఘనులు మన పాలకులు!   అలాగే ఆంధ్రప్రదేశ్ చరిత్ర, తెలుగుజాతి చరిత్ర తెలియని ఆ చరిత్రలో బొత్తిగా సంబంధం లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం తెలుగుజాతిని అవమానిస్తూ రాష్ట్ర నాయకుల్ని తన చుట్టూ గానుగెద్దుల్లాగా తిప్పుకుంటున్నా రాష్ట్రనాయకులకు సిగ్గులేదు. ఇది దుర్భరం! తెలుగువారికి అవమానకరం. డాక్టర్ అంబేడ్కర్ పదేపదే హెచ్చరించినట్టుగా పార్లమెంటులో మెజారిటీ స్థానాలు దక్కించుకునే కోరికను సఫలం చేసుకునేందుకు కాంగ్రెస్ ఇన్నాళ్ళుగా ఆడుతూ వచ్చిన నాటకం మూడు ఉత్తరాది రాష్ట్రాలకు పార్లమెంటులో ఉన్న సంఖ్యాబలం మీద ఆధారపడి, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను ఉత్తరాదివారు దెబ్బతీస్తున్నారన్న భావన దక్షిణాది వారిలో కలిగే ప్రమాదం ఉందని మరచిపోరాదు. ఎంతసేపూ ఉత్తరప్రదేశ్ కు చెందిన 80-85 సీట్లపైన, మధ్యప్రదేశ్, బీహార్ స్థానాలపైన కాంగ్రెస్ దృష్టి పెట్టడంవల్లనే అనేక దఫాలుగా ఆ పార్టీ సంక్షోభాలు ఎదుర్కొనక తప్పడంలేదు! ఈ గుర్తింపు, జ్ఞానం కాంగ్రెస్ నాయకత్వానికి ఇప్పటికీ లేదు. కనుకనే తమ లాభలబ్ది కోసం ఎక్కడికక్కడ తాడూబొంగరం లేని రాజకీయ విధానాలతో, కుట్రలతో 'వోటు-సీటు' ప్రయోజనాలతో ప్రజలను విభజించి తమ పబ్బం గడుపుకునే స్థానికపార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ఉండటం.   పైగా తెలుగుజాతి చరిత్ర గురించి, అది చరిత్రలో భాషా వ్యాప్తి ద్వారా, వందల, వేల సంవత్సరాల స్వీయ సంస్కృతీ విభావంతో మగధనుంచి మచిలీపట్నందాకా [మూడు ప్రాంతాలూ] శాతవాహన, కాకతీయ, విజయనగర యుగాల దాకా విలసిల్లిందని తెలియని కాంగ్రెస్ అధిష్ఠానవర్గంలోని తెలుగేతర "మాయలమారుల'' దుష్టచతుష్టయం [దిగ్విజయ్ సింగ్, గులామ్ నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, తాజాగా ఆంటోనీ] తొమ్మిది కోట్ల మంది తెలుగుప్రజల భావితవ్యంతో జూదమాడుతున్నారు! ఈ విషయం తెలిసి కూడా కేవలం పదవులకోసం జాతి విశాల ప్రయోజనాల కోసం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, పచ్చి అవకాశవాద రాజకీయాల్లోకి జారుకున్న కొన్ని ప్రతిపక్షాల నాయకులూ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.   రాజకీయ శక్తిగా రాష్ట్రప్రజా బాహుళ్యంలోని వివిధ సామాజిక వర్గాలకు చెందిన సమస్త ప్రతినిధుల సమక్షంలో చర్చలు జరపకుండా కేవలం ఒక రాజకీయపార్టీకి చెందిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకపక్షంగా చేసిన రాష్ట్ర విభజన తీర్మానాన్ని కాలదన్ని రాష్ట ప్రయోజనాలను, తెలుగుజాతి ఐక్యతనూ కాపాడవలసిన ప్రధాన పార్టీల రాష్ట్రనాయకులు చొల్లుకబుర్లతోనూ, పనికిమాలిన "ప్రత్యామ్నాయ ప్రతిపాదనలతో''నూ కాలక్షేపం చేస్తున్నారు. కేంద్ర కాంగ్రెస్ స్వార్థబుద్ధితో చేసిన చారిత్రిక తప్పిదాన్ని తిప్పికొట్టే భారమూ, బాధ్యత, ఉద్యోగ, కార్మిక, కర్షక, విద్యార్థులు, యువత, మహిళాది వర్గాలపైన రాజకీయ పార్టీల స్వార్థపర నాయకులు మోపేశారు!   ఒకడు ప్రజల "ఆత్మగౌరవా''న్ని ఢిల్లీ వీథుల్లో కేంద్ర పాలకులకు పాదాక్రాంతం చేశాడు; ఇంకొకడు తన స్వార్థంకోసం, ముఖ్యమంత్రి పదవి కోసం ఆవురావురుమని అంగలార్చి, ఆ అవకాశం చివరికి తన చేజారిపోతుందన్న బెంగతో ఢిల్లీలో అనేకరోజుల తరబడి కాంగ్రెస్ నాయకత్వంతో రహస్య మంతనాలు జరిపి తన వేర్పాటువాదం ద్వారా విభజన ప్రక్రియ కోసం "సెలైన్ సత్యాగ్రహం'' తతంగాన్ని నడిపి కేంద్రాన్నీ, ప్రజలనూ మభ్యపెట్టిన స్థానిక పార్టీ మోసగాడైన 'దొర'; ఇంకొకడు పేరుకు 'వామపక్షం' అని చాటుకొంటూనే, తెలుగుజాతిని ఒక్క తాటిపైకి తెచ్చిన తెలంగాణా రైతాంగ సాయుధపోరాట స్ఫూర్తిని గాలికి వదిలేసిన వారు;ఇక మరొకడు ఇదీ అదీ గాదు "అత్తమీద కోపాన్ని దుత్తమీద తీర్చుకు''న్నట్టుగా ఒక మాజీముఖ్యమంత్రి కొడుకుమీద దుగ్ధనుతన ఆస్తిపాస్తుల రక్షణార్థం, కేంద్రానికి మోకరిల్లి తనపై వచ్చిన ఆర్థిక నేరారోపణలనుంచి ఎలాగోలా బయటపడడం కోసం కాంగ్రెస్ అధిష్ఠానంతో తెలుగుజాతి విభజన ప్రతిపాదనకు స్వయం లేఖ ద్వారా దొంగచాటుగా మద్ధతు తెలిపివచ్చి, ఇప్పుడు "సమన్యాయం'' కల్పించాలన్న భట్టిప్రోలు పంచాయితీతో కాలక్షేపం చేస్తూ రాష్ట్రపర్యటనకు బయలుదేరి ఆత్మగౌరవం కోల్పోయి అడుగడుగునా అభాసుపాలవుతున్న ఒక రాష్ట్ర మాజీముఖ్యమంత్రీ!   ఈ అవకాశవాద రాజకీయాలను దళిత, బహుజనవర్గాలకు కూడా పాకించడం  - వీళ్ళు ప్రజాక్షేమం కోరిన రాజకీయులు కారనీ, సంపన్న రాక్షససంతతి అనీ మరొకసారి నిరూపితమయింది! ఇక మరో పోర్ఫేసర్ ఉన్నాడు, ఆయనగారు ముఖ్యమంత్రినీ, ఇతర మంత్రులనూ జీతాలు తీసుకోవటం మానేసి, రాజీనామాలు చేసి బయటకు రమ్మంటూ తాను మాత్రం పిల్లలకు పాఠాలు చెప్పడం మానేశాడు, యూనివర్సిటీనుంచి నెలవారీ జీతం [లక్షరూపాయలకు పైగానేనని ఉస్మానియా వర్గాలు] క్రమం తప్పకుండా పొందుతూ ఒక వేర్పాటు సంయుక్త కార్యాచరణ సంస్థకు నాయకస్థానంలో ఉన్నాడు. అయినా వేర్పాటువాద స్థానిక పార్టీపెట్టిన నాయకుడికీ, సంయుక్త కార్యాచరణ పేరిట వేరొక కుంపటి పెట్టిన ఈ ప్రొఫెసర్ కూ మధ్య పడిచావక [ఎందుకు పడటంలేదో చెప్పకుండా] ఎవరి దుకాణం వారు నడుపుకుంటున్నారు. ఉభయ వర్గాలు బెదిరింపుల ద్వారా వసూళ్లు మాత్రం చేసుకుంటున్నారని ఆ రెండు క్యాంపుల్లోని వారూ పరస్పరం ఆరోపించుకుంటున్నారు! ముఖముఖాలు చూసుకోకపోయినా "కలిసే ఉన్నట్టు''గా ప్రజల్ని మాత్రం మోసగిస్తున్నారు. టాంక్ బండ్ విధ్వంసకాండకు కారణం నీవంటే నీవని వాదించుకున్నారు. ఇక స్థానిక పార్టీ నాయకుడైన 'దొర' ఊసరవెల్లి మాదిరిగా పొంతన లేకుండా వేర్వేరు ప్రకటనల ద్వారా ప్రాంతప్రజలను మభ్యపెడుతున్నాడు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం రేపో, మాపో వస్తుందని దాదాపు సంవత్సరకాలంగా ఊరిస్తూనే ఉన్నాడు! ఆ నమ్మకం సడలి పోయింతరువాత తేదీలు జరుపుకుంటూ వెడుతూన్నాడు ఇంతకూ కాంగ్రెస్ అధిష్ఠానంతో జరిపిన చర్చలు ఏమి హామీపడ్డాడో ఇతడు తెలియదుగాని, సమస్యను "వాయిదాల రత్తయ్య''లా నానబెట్టడంలో అధిష్ఠానంతో 'మిలాఖత్' అవుతున్నాడు! విఫలమైన, మసకబారిన తన 'గౌరవాన్ని'' నిలబెట్టుకునే తాపత్రయంలో కాంగ్రెస్ లో తన పార్టీని "విలీనం'' చేస్తానని యిచ్చిన హామీ విషయంలో కూడా ప్రజల్ని మోసగించడానికిగాను ఒక్కోసారి ఒక్కో ప్రకటన చేస్తున్నాడు.   మొదట్లో హైదరాబాద్ తో కూడిన 10 జిల్లాలస్వతంత్ర రాష్ట్రమైతేనే "ఒప్పుకుంటా''నని చెప్పిన ఈ మాటకారి హైదరాబాద్ ప్రతిపత్తిపైన కూడా తన వైఖరిని క్రమంగా మార్చుకుంటూ వస్తున్నాడు; ముందు పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను ఉంచడానికి కూడా అంగీకరించని ఈయన, హైదరాబాద్ ప్రతిపత్తిపైన వచ్చిన మూడు రకాల కేంద్ర ప్రత్యమ్నాయాలలో తాను దేనికి సుముఖమో చెప్పకుండా దాటవేస్తూ "ఉమ్మడి రాజధానిగా రెండేళ్ళకు మించి ఒప్పుకునేది లేదని'' కొత్త ప్లేటు పెట్టాడు. కాంగ్రెస్ లో తన పార్టీ కలిసిపోవాలంటే ముందు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు పెట్టాలని, ఆ తర్వాత తన పార్టీని 'గంగ' (కాంగ్రెస్)లో కలిపేస్తానని బీరాలు పలికిన ఈ అవకాశవాద నాయకుడు ఇక "ప్రత్యేక రాష్ట్ర్త''బిల్లు పార్లమెంటు ముందుకు రాకపోవచ్చుననీ, అయితే 'హైదరాబాద్' అంశం తెలంగాణా ప్రజలు కోరుకుంటున్నట్టుగా  ఉండకపోవచ్చు''ననీ ఏదైనా "కిరికిరి పెట్టే అవకాశముందనీ'' "ఫామ్ హౌస్ నాయకుడు'' నెమ్మదిగా బయటపడ్డాడు!   అంటే, ఈ "దొర''నిత్యం కాంగ్రెస్ అధిష్ఠానంతో ఎలా మంతనాలు సాగిస్తున్నాడో, వ్యవహారమంతా రకరకాల ప్రభావాలకు లోనైన వ్యక్తిగా ఫామ్ హౌస్ నుంచే ఎలా నడిపిస్తున్నాడో రాష్ట్రప్రజలందరికీ దాచినా దాగని సత్యంగా గుట్టు బయట పడిపోయింది! ఇప్పుడతని బాధంతా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందో లేదోనన్న బాధకన్నా, ఏర్పడకపోతే తనను తెలంగాణా ప్రజలనుంచే చుట్టుముట్టే భయంకర పరిస్థితుల్ని తాను చవిచూడవలసి వస్తుందేమానాన్న విచారమే ఎక్కువగా ఆయన్ని పట్టిపీడిస్తోంది! కనుకనే కాంగ్రెస్ అధిష్ఠానం తద్వారా స్థానిక కాంగ్రెస్ నాయకత్వాలు "కుడితిలో పడిన ఎలుకలా'' కొట్టుకు చస్తున్నాయి! అంటే దారితప్పిన నాయకులందరికీ అధిష్ఠానం ఏం చెబుతుందో ప్రజలకు తెలియదు, అన్ని రకాల నాయకులు, మంత్రులు, ఎం.పీ.లూ, ఎం.ఎల్.ఎ.లూ తిరిగి అక్కడ ఏం చెప్పారో, ఇక్కడ జనాలకు ఏమి చెబుతున్నారో ప్రజలకు తెలియదు; ఏతావాతా రాష్ట్ర సమస్య తేలకుండా, అలా మరికొన్నాళ్ళు నానుతూ ఉంటుంది! నాయకుల మంతనాల రహస్య లిపిని బద్ధలు కొట్టాల్సినవారు ప్రజలే!

సమ్మె ఆపుతారా లేదా చెప్పండి: హైకోర్టు

  ఏపీఎన్జీవోల సమ్మెపై వరుసగా మూడవ రోజు కూడా హైకోర్టులోఇరుపక్షాల మధ్య సుదీర్గ వాదనలు జరిగాయి. అయితే, మధ్యలో కోర్టు కలుగజేసుకొని ప్రభుత్వోద్యోగులు భాద్యతతో వ్యవహరిస్తూ ప్రజలకు సేవ చేయాలని, కానీ వారు చేస్తున్ననిరవధిక సమ్మెవలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఏపీఎన్జీవోల తరపున వాదిస్తున్నలాయర్ మోహన్ రెడ్డి అందుకు బదులిస్తూ, ఉద్యోగుల సమ్మెను కేవలం సమ్మెగా కాకుండా తమ హక్కుల కోసం చేస్తున్న పోరాటంగా చూడాలని చెపుతూ, గతంలో తెలంగాణా ఉద్యోగులు కూడా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకోసం నెల రోజులు పైగా సకల జనుల సమ్మెచేసిన సంగతిని ఈ సందర్భంగా ఆయన కోర్టుకు గుర్తు చేసారు. ప్రస్తుతం ఉద్యోగులు చేస్తున్న సమ్మెలో ప్రజలందరూ కూడా స్వచ్చందంగా పాల్గొంటున్న సంగతిని కోర్టు గమనించాలని విన్నవించుకొన్నారు. కానీ, కోర్టు మాత్రం ఆయన వాదనలతో ఏకీభవించలేదు. ప్రభుత్వం లేదా అందులో ఒక వ్యవస్థ తమ కర్తవ్యం సమర్ధంగా నిర్వహించడంలో విఫలమయినప్పుడు కోర్టు జోక్యం చేసుకొని దానిని చక్కదిద్దవలసి వస్తుందని స్పష్టం చేసింది. ఉద్యోగులు సమ్మె విరమించుకుంటున్నారా లేదా? అనే సంగతిని రేపటి వాయిదాలో తప్పనిసరిగా స్పష్టం చేయాలని సూచిస్తూ కేసును రేపటికి వాయిదా వేసింది.

జగన్ రిమాండ్ పొడిగింపు

      అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్‌ను నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం అక్టోబర్ 3కు పొడిగించింది. ఈరోజుతో జగన్ రిమాండ్ ముగియడంతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. అలాగే విజయసాయిరెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, బహ్మానందరెడ్డిలను కూడా విడియో కాన్‌ఫ్రోన్స్ ద్వారా కోర్టు విచారణ జరిపి అక్టోబర్ 3 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజి మంత్రులు దర్మాన ప్రసాదరావు, సభితా ఇంద్రారెడ్డిలు ఈరోజు ఉదయం కోర్టులో హాజరైయ్యారు. సిబిఐ ఇప్పటికి ఈ కేసులో 10 చార్జిషీట్లను దాఖలు చేయగా అందులో 5 చార్జీషీట్లు ఈ నెలలో వేసిన విషయం తెలిసిందే.

కావూరి,లగడపాటి పై విజయమ్మ అరోపణలు

      రాష్ట్ర విభజనకే ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావుకు కేంద్రంలో మంత్రి పదవిని...విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు కొన్ని కాంట్రాక్టు పనులు ఇచ్చారని తమకు తెలిసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు విజయమ్మ ఆరోపించారు. విభజన విషయంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలను ప్రశ్నించని విజయమ్మ ఇప్పుడు లగడపాటి, కావూరిల మీద ఆరోపణలు చేయడం ఆసక్తిగా ఉంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో కోట్ల మంది ప్రజలు రోడ్ల మీదకు వస్తే కాంగ్రెస్ – తెలుగుదేశం పార్టీలలో ఎలాంటి చలనమూ లేదని, చంద్రబాబు నాయుడు ఇచ్చిన లేఖ మూలంగానే తెలంగాణ ఇచ్చారని విజయమ్మ అన్నారు. కాంగ్రెస్ నేతలు అధిష్టానం ముందు ఒకమాట – బయట ఒకమాట చెబుతున్నారని, తెలంగాణకు వ్యతిరేకంగా జైలులో ఉన్న జగన్ తో పాటు తాను, తమ పార్టీ ఎమ్మెల్యేలు అంతా రాజీనామాలు చేశారని ఆమె అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు నిరసనగా ముఖ్యమంత్రి, మంత్రులు అంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే శాసనసభ సమావేశం పెట్టి తెలంగాణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని విజయమ్మ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ అధిష్టానానికి అగ్నిపరీక్షలు

  ఈ రోజు కేంద్ర క్యాబినెట్ కీలక సమావేశం జరగనుంది. ఇందులో తెలంగాణా పై నోట్ ప్రవేశపెట్టే అవకాశం లేన్నపటికీ హోంశాఖ నోట్ పై తయారుచేసిన ముసాయిదాపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సమావేశంలో నోట్-ముసాయిదాపై తుది నిర్ణయం తీసుకొన్నట్లయితే, త్వరలో విభజన ప్రక్రియ జోరందుకోవచ్చును.   టీ-నోట్ పై అడుగు ముందుకు వేస్తే వెంటనే రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్న సీమాంధ్ర యంపీలకు దిగ్విజయ్ సింగ్, వారికి భయపడి వెనకడుగువేసే ప్రసక్తే లేదని స్పష్టం చేయడమే కాకుండా ఇచ్చిన మాట ప్రకారం రానున్నఎన్నికలలోగా విభజన ప్రక్రియను తప్పకుండా పూర్తి చేస్తామని ప్రకటించిన నేపధ్యంలో ఈ రోజు సమావేశంలో ఆ దిశగానే కేంద్రం అడుగులువేయవచ్చును.   ఇది కాంగ్రెస్ పార్టీకే కాక, సీమాంధ్ర యంపీలకు,మంత్రులకు, శాశనసభ్యులకు అందరికీ అగ్ని పరీక్షగా మారనుంది. ఒకవేళ వారు రాజీనామాలు చేస్తే, ప్రభుత్వం పడిపోయే పరిస్థితి కల్పించడమే కాకుండా, ఎందరు వ్యతిరేఖిస్తున్నాముందుకే సాగుతున్నదుకు కాంగ్రెస్ పార్టీ పట్ల సీమాంధ్రలో వ్యతిరేఖ భావనలు మరింత పెరిగే అవకాశం ఉంది.   ఇక మరో ఏడు నెలలో సాధారణ ఎన్నికలను పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను చేజేతులా కూల్చుకొంటే అది పార్టీకి, నేతలకీ ఇద్దరికీ తీవ్ర నష్టం కలిగించడం ఖాయం. అలాగని రాష్ట్ర విభజనకే మొగ్గు చూపుతున్న అధిష్టానాన్నివెనకేసుకు వస్తే ఇప్పటికే ప్రజల నుండి తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కొంటున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు రానున్న ఎన్నికలలో ప్రజల మద్దతు పొందడం కష్టం. పైగా తెదేపా, వైకాపాలు వారి పరిస్థితిని మరింత క్లిష్టం చేయడం ఖాయం. కనుక కాంగ్రెస్ అధిష్టానానికి ఇది మరో పెద్ద అగ్ని పరీక్షే నని చెప్పవచ్చును.   ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం-రాష్ట్ర విభజన, హైదరాబాద్ అంశం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మనుగడ, రాష్ట్రంలో పార్టీ ఉనికిని కాపాడుకోవడం వంటి అన్నిఅంశాలను ఒకేసారి నేర్పుగా పరిష్కరించుకోవలసి ఉంటుంది.

సమైక్యాంద్ర కు మద్దత్తు గా డల్లాస్ ప్రవాసాంద్రుల ఉద్యమాలు !

      మన రాష్ట్రము లో జరుగుతున్న సమైక్యాంద్ర మద్దత్తుగా ప్రవసాంద్రులు కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు! స్థానిక జల్సా రెస్టారెంటు లో జరిగిన ప్రవాస ఆంధ్రుల ముఖ్య సమావేశం లో తెలుగు జాతిని విడగొట్ట వద్దూ అంటూ సమైక్యాంద్ర కోసం ఆంధ్ర ప్రదేశ్ లో పోరాడుతున్న ప్రజలకు మద్దత్తుగా ప్రవాసాంద్రులు "సమైక్యాంద్ర పరి రక్షణ సమితి" ని ఏర్పాటు చేసినారు . సమైక్యాంద్రకు మద్దత్తుగా ప్రవాసాంద్రులు "సమైక్యాంద్ర  పరి రక్షణ సమితి " ఆద్వర్యములో  వివిధ రకాల ఉద్యమాలు చేయాలనీ ఈ సమావేశం లో నిర్ణ యించారు.  ఈ నెల సెప్టెంబర్ 29 వతేదీ న దాదాపు 1500 మందితో పెద్ద ఎత్తున  సమైక్యాంద్ర వన భోజనాలు నిర్వహించి తెలంగాణా ,రాయల సీమ ,కోస్తాంద్ర  ప్రత్యెక వంటకాలతో  వంట వార్పూ నిర్వహించి తెలుగు జాతి అంతా ఒక్కటిగా వుండాలి అనే సందేశాన్ని చాటి చెపుతున్నాము  అన్నారు .వివిధ సాంసృతిక కార్యక్రమాలు నిర్వ హించ నున్నారు .  సమైక్యాంద్ర వన భోజన కార్యక్రమానికి  కోఆర్డినేటర్  గా సుదీర్ చింతమనేని వ్యవహరిస్తారు . ----------------------------------------------------------------------------------------------- అదేవిధముగా  తెలుగు జాతి ఐక్యత ,సమైక్యాంద్ర కోసం "ఫ్రవాసాంద్ర పాదయాత్ర " గాంధీ జయంతి రోజున నిర్వహిస్తున్నారు. టెక్సాస్ రాష్ట్రములోని అన్ని ప్రాంతాల నుంచి  సమైక్యాంద్ర కు మద్దత్తుగా  హ్యూస్టన్ ఇండియన్ కాన్సులేట్ ఎదుట ధర్నా నిర్వహించి ఆంధ్రప్రదేశ్ ను ఒక్కటిగానే ఉంచాలని విభజన ఆపాలి అంటూ మెమొరాండం ఇవ్వనున్నారు  . ఈ సమావేశములో  Dr కొర్సపాటి  శ్రీధర్ రెడ్డి , వేణు పావులూరి ,ప్రతాప్ రెడ్డి , చంద్ర కాజ, లోకేష్ నాయుడు , అజయ్ గోవాడ, సుగన్ చాగర్లమూడి, కోడూరు కృష్ణా రెడ్డి , రమణా రెడ్డి,సుదీర్ చింతమనేని,  చిల్లకూరు గోపి,వెంకట శరణు,భావి రెడ్డి శ్రీనివాస్ , కిరణ్ తుమ్మల, ఎన్ ఎం ఎస్ రెడ్డి ,శివ బలుసు, వెంకట నారపల,శ్రీనివాస్ అడ్డా ఇతర ప్రవాసాంద్ర ప్రముఖులు  పాల్గొన్నారు.