కేసీఆర్ సవాలుకి మోడీ లొంగుతారా?

  పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలపడాన్ని నిరసిస్తూ తెరాస ఇచ్చిన తెలంగాణా బంద్ పిలుపుకు ఊహించినట్లే మంచి స్పందన వచ్చింది. ఆర్టీసీ బస్సులు డిపోల నుండి బయటకు రాలేదు. తెలంగాణకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టబోతున్న కేసీఆర్ స్వయంగా బందుకు పిలుపీయడంతో ప్రభుత్వోద్యోగులు కూడా విధులను బహిష్కరించి బందులో పాల్గొంటున్నారు. తెరాస కార్యకర్తలు మళ్ళీ జెండాలు పట్టుకొని రోడ్లమీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. అందువల్ల తెలంగాణా దాదాపు స్తంభించిపోయింది. ముఖ్యమంత్రి పదవి చేపడుతున్న ఒక వ్యక్తి, అధికార పార్టీ స్వయంగా బందులకు పిలుపీయడం, వ్యాపార సంస్థలకు, పారిశ్రామిక వేత్తలకు ఏ విధమయిన సంకేతాలు పంపుతుందనే ప్రశ్నకు, మాటల మాంత్రికులయిన కేసీఆర్ కుటుంబ సభ్యులు చాలా ధీటయిన సమాధానమే చెప్పవచ్చును. కానీ, కేసీఆర్ ఈ విధంగా బంద్ కు పిలుపివ్వడం ద్వారా, కొత్తగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన నరేంద్ర మోడీకి కూడా సవాలు విసిరినట్లయింది.   మోడీ ప్రభుత్వం తీసుకొన్న మొట్ట మొదటి నిర్ణయాన్నే కేసీఆర్ ఈవిధంగా బహిరంగంగా సవాలు చేస్తుంటే, ఎన్నో భారీ అంచనాల నడుమ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన నరేంద్ర మోడీ కూడా వెనక్కి తగ్గకపోవచ్చును. ఈ వ్యవహారం మరింత ముదిరినట్లయితే, మోడీ ప్రభుత్వం తెలంగాణాపట్ల సవతిప్రేమ చూపించే అవకాశం ఉంది. పోలవరం ముంపు గ్రామాల గురించి యూపీఏ హయంలో నోరు మెదపని కేసీఆర్, ఇప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ను ఆమోదించిన తరువాత వ్యతిరేఖించడం వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బందులకు పిలుపీయడం, ప్రభుత్వోద్యోగులను అందులో పాల్గొనమని ప్రోత్సహించడం, ఇరుగు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రులతో, చివరికి ప్రధానమంత్రితో, కేంద్రప్రభుత్వంతో కయ్యానికి కాలు దువ్వడంవల్ల తెలంగాణాకు ప్రతికూలాంశాలుగా మారే అవకాశం ఉంటుంది కనుక కేసీఆర్ సమస్యలను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోనేందుకే ప్రాధాన్యం ఇవ్వడం మేలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

త్వరలో పార్లమెంటు సమావేశాలు

  నిన్న జరుగవలసిన కేంద్రమంత్రి వర్గం సమావేశం ఈరోజు జరుగబోతోంది. మొదటి సమావేశంలోనే నల్లదనం వెలికి తీతకు సుప్రీంకోర్టు రిటర్డ్ జడ్జ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు, పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకొన్న మోడీ క్యాబినెట్, ఈరోజు సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతోందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు జరిగే సమావేశంలో లోక్ సభకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పేర్లు ఎంపిక, పార్లమెంటు సమావేశాల తేదీలను ఖరారు చేయబోతున్నట్లు తెలుస్తోంది.   స్పీకర్ పదవికి మాజీ కేంద్రమంత్రి సుమిత్రా మహాజన్ పేరు బీజేపీ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. పార్లమెంటు సమావేశాలు రెండు విడతలుగా నిర్వహించే అవకాశం ఉంది. మొదటి విడతలో జూన్ 4 నుండి మూడు రోజులు సమావేశాలు నిర్వహించ వచ్చును. తరువాత మళ్ళీ కొన్ని రోజుల వ్యవధి తరువాత రెండో విడతలో వారం-పది రోజులు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. మొదటి రెండు రోజుల సమావేశాలలో కొత్తగా ఎన్నికయిన పార్లమెంటు సభ్యుల ప్రమాణస్వీకారం, మూడో రోజు ఉభయసభలను ఉద్దేశ్యించి రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. రెండో విడత సమావేశాలలో సాధారణ బడ్జెట్ మరియు రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చును. పార్లమెంటు సమావేశ తేదీలు ఈరోజు జరిగే మోడీ మంత్రివర్గ సమావేశంలో ఖరారు కావచ్చును.

బాబు ప్రమాణ స్వీకారానికి చురుకుగా ఏర్పాట్లు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన వచ్చేనెల 8న ఉదయం 11.40 గ.లకు విజయవాడ-గుంటూరు మధ్యగల నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో ప్రమాణస్వీకారం చేయనున్నటు నిన్న మహానాడులో స్వయంగా ప్రకటించారు. అందుకోసం చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.   చంద్రబాబు ఇకపై అక్కడి నుండే హైదరాబాదుకు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు గనుక, స్థానిక నాగార్జున నగర్ లో కొత్తగా రెండు హెలీప్యాడ్ లు నిర్మిస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంతంలో ఇప్పటికే రెండు కంపెనీల రిజర్వు పోలీసు దళాలు చేరుకొని భద్రతా ఏర్పాట్లు నిమగ్నమయ్యాయి. వాటికి అదనంగా త్వరలో హైదరాబాదు నుండి మరో నాలుగు కంపెనీల రిజర్వు పోలీసు దళాలు చేరుకోబోతున్నాయి.   గండిపేటలో తెదేపా నిర్వహించిన మహానాడు సమావేశాలకే రాష్ట్రం నలుమూలల నుండి నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడిబొడ్డున జరుగబోయే చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి అన్ని జిల్లాల నుండి చాలా ప్రజలు, కార్యకర్తలు చాలా భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. ప్రమాణస్వీకారం చేస్తున్న ప్రాంతం విజయవాడ-గుంటూరు హైవేకు చాలా దగ్గరలో ఉన్నందున అక్కడికి చేరుకోవడం చాలా సులువు గనుక ఊహించిన దానికంటే చాలా భారీ ఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉంది. అందువలన తెదేపా నేతలు, పోలీసులు కూడా అందుకు తగ్గటే విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు విజయవాడ-గుంటూరు ప్రాంతాల తెదేపా నేతలతో ఈవిషయమై చర్చించనున్నారు. ఆ తరువాత ఆయన ఒకటి రెండు రోజుల్లో డిల్లీ వెళ్ళే అవకాశం ఉంది. రాష్ట్ర విభజనలో సంక్లిష్టంగా మారనున్న పలు అంశాలను మోడీకి వివరించి, ఇరుప్రాంతలకు నష్టం జరగకుండా పరిష్కరించేందుకు మోడీ సహకారం కోరేందుకు ఆయన వెళుతున్నట్లు తాజా సమాచారం.

రేపు తెలంగాణ బంద్: కేసిఆర్ పిలుపు

      తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రాలో కలుపుతూ కేంద్ర కేబినెట్ రేపు ఆర్డినెన్స్‌ను జారీ చేస్తుందని భావిస్తున్న ఆయన బంద్‌కు పిలుపునిచ్చారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని కోరారు. ముంపు గ్రామాలపై కేంద్ర కేబినెట్ పాస్ చేసే ఆర్డినెన్స్‌ను కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తూన్నారు. ఈ అప్రజాస్వామికమైన ఆర్డినెన్స్‌ను ఆమోదించవద్దని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కేంద్రం వైఖరిని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు.

మాటల యుద్ధం మొదలైంది

      స్మృతి ఇరానీకి మానవ వనరుల శాఖ అప్పగించడంపై కాంగ్రెస్ విమర్శలు కురిపించింది. 12వ తరగతి చదివిన వ్యక్తికి మానవ వనరుల శాఖ బాధ్యతలా? అని ఏఐసీసీ నేత అజయ్ మాకెన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏం కేబినెట్ మోడీది. మానవ వనరుల శాఖా మంత్రి కనీసం డిగ్రీ కూడా చదివి లేరు అంటూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. మానవవనరుల శాఖ బాధ్యతలు అనుభవం ఉన్నవారికి అప్పగించాల్సిందని ఎన్సీపీ నేత తారిఖ్ అన్వర్ అభిప్రాయపడ్డారు. అయితే, బీజేపీ మాత్రం ఎదురుదాడికి దిగింది. సోనియా విద్యార్హత ఏంటో చెప్పాలని జౌళీ శాఖ సహాయ మంత్రి సంతోష్ గంగ్వర్ డిమాండ్ చేశారు. దేశంలో విద్యకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు మానవనరుల శాఖ కిందకే వస్తాయి.

పోలవరంపై నాయుడుల కుట్ర

      పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలుపుతూ అక్రమంగా ఆర్డినెన్స్ తీసుకురావడానికి టిడిపి అధినేత చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కలిసి కుట్ర చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. అక్రమంగా ఆర్డినెన్స్ తెస్తే చూస్తూ ఊరుకోమని, నాయపోరాటం చేయడానికి సిద్దంగా వున్నామని హెచ్చరించారు. పోలవరంపై టీడీపీ ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. టీటీడీపీ నేతలు చంద్రబాబును నిలదీసి ఆర్డినెన్స్‌ను ఆపించాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి, చర్చలకే వార్‌రూం అని తెలిపారు. వార్‌రూంపై చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల గొంతు కోస్తున్నా టీటీడీపీ నేతలు ఆ పార్టీలో బానిసలుగా పడిఉన్నారని ధ్వజమెత్తారు.

ఎన్టీఆర్ కు భారతరత్న:మహానాడు తీర్మానం

      దివంగత నేత, ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వలని మహానాడు తీర్మానం చేసింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ చొరవ తీసుకోవాలని టిడిపి అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చే వరకు కృషిచేస్తామని అన్నారు. పేదవారు లేని సమాజం తెలుగుదేశం పార్టీ ఆశయమని అదే ఎన్టీఆర్ కు అర్పించే నిజమైన నివాళి అన్నారు. గతంలో శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెడితే దానిని కాంగ్రెస్ పార్టీ ఆ పేరును మార్చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయం వివరించి విమానాశ్రయానికి ఎన్టీఆర్ అంతర్జాతీయ విమానాశ్రయంగా మారుస్తానని హామీ ఇచ్చారు.

అభివృద్దిలో పోటీపడాలి: బాలకృష్ణ

      నగరశివారులోని గండిపేటలో నిర్వహిస్తున్న మహానాడు రెండో రోజు ఘనంగా ప్రారంభమైంది. మహానాడు వేదిక వద్దకు చేరుకున్న చంద్రబాబు తొలుత ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ 91వ జయంతి సందర్భంగా టీడీపీ శ్రేణులు తెచ్చిన భారీ కేక్‌ను బాబు కట్‌ చేసి బాలకృష్ణకు తినిపించారు. మహానాడులో ఇవ్వలా పండుగ రోజని నటుడు, టిడిపి శాసన సభ్యుడు బాలకృష్ణ అన్నారు. అనాడు తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్ టిడిపి పార్టీని పెట్టారని గుర్తు చేశారు. బౌగోళిక౦గా విడిపోయినా మనమంతా తెలుగు వాళ్ళమేనని..అభివృద్దిలో రెండు రాష్ట్రాలు పోటీపడాలని సూచించారు. మహానాడుకి భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులకి బాలకృష్ణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

నల్లధనంపై మోడీ స్పెషల్ టీమ్

      ప్రధాని నరేంద్ర మోడీ పదవీ బాధ్యతలు స్వీకరి౦చిన తొలి రోజే తన మార్కును ప్రదర్శించారు. మోడీ టీమ్ తొలిరోజే కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు సూచనల మేరకు విదేశాల్లో ఉన్న భారతీయుల నల్లధనంపై దర్యాప్తు కోసం విశ్రాంత న్యాయమూర్తి ఎంబీ షా నేతత్వంలో ప్రత్యేక దర్యాప్తు బందం(సిట్)ను ఏర్పాటు చేసింది. వైస్‌చైర్మన్‌గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అర్జిత్ పసాయత్‌ను నియమించింది. ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరక్టర్ జనరల్, రెవెన్యూ కార్యదర్శి, సీబీఐ, రా, ఈడీ డైరెక్టర్లు, సీబీడీటీ చైర్మన్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌లను సిట్ సభ్యులుగా నియమించారు. క్యాబినెట్ భేటీలో ప్రధానంగా రెండు అంశాలపైనే చర్చించామని మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. సిట్ ఏర్పాటుతోపాటు గోరఖ్‌ధామ్ రైలు ప్రమాదంపై చర్చించామన్నారు. నల్లధనం వ్యవహారంలో కేంద్రం నిబద్ధతకు సిట్ ఏర్పాటే నిదర్శనమని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. సుప్రీంకోర్టు విధించిన గడువు బుధవారంతో ముగుస్తుండటంతో తొలిసమావేశంలోనే సిట్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. రైలు ప్రమాదాలకు సంబంధించి పూర్తి స్థాయిలో బుధవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో ఉన్నత స్థాయి సమీక్ష జరపనున్నట్లు ఆయన తెలిపారు.

తాత ఎన్టీఆర్ మళ్ళీ పుట్టాలి: జూ.ఎన్టీఆర్

      ఈ రోజు స్వర్గీయ ఎన్టీఆర్‌ 91వ జయంతి సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఘనంగా నివాళులర్పించారు. నందమూరి హరికృష్ణ ఆయన కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో కలిసి వచ్చి స్వర్గీయ ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన తాత ఎన్టీఆర్‌ ఇంకోసారి పుట్టాలని ఆకాంక్షించారు సినీ నటుడు జూ.ఎన్టీఆర్‌.   ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం వారి సంక్షేమం కోసం పోరాడారని, అందువల్ల తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోతున్నప్పటికీ, రెండు రాష్ట్రాలలో తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో కలిసి మెలిసి జీవించాలని, అభివృద్ధి సాధించాలని, అదే వారు స్వర్గీయ యన్టీఆర్ కి ఇచ్చే ఘన నివాళి అవుతుందని హరికృష్ణ అన్నారు.

బాబు మొహం చూసి ప్రజలు ఓటేయలేదు: లక్ష్మీ పార్వతి

  రాజకీయాలలో శాశ్విత మిత్రులు కానీ, శత్రువులు గానీ ఉండరని అందరూ అంటారు. కానీ కొందరు వ్యక్తులను చూస్తే ఆమాట నిజం కాదేమోననిపిస్తుంది. అటువంటి ‘ప్రియ శత్రువులు’ మన రాష్ట్ర రాజకీయనాయకులలో చాలా మందే ఉన్నారు. ఉదాహరణకు చంద్రబాబును లక్ష్మీపార్వతి ఎల్లపుడూ ద్వేషిస్తూనే ఉంటుంది. ఆమె ఏ సందర్భంలో ఏ విషయం గురించి మాట్లాడినా, చివరికి చంద్రబాబును విమర్శించడంతోనే ముగించడం ఆమెకు అలవాటు. కానీ, ఆమె విమర్శలను చంద్రబాబు ఎన్నడూ పట్టించుకొన్న దాఖలాలు లేవు. అయినప్పటికీ ఆమె తన అలవాటు ప్రకారం ఆయనపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.   ఈరోజు స్వర్గీయ యన్టీఆర్ 91వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో యన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి వచ్చిన లక్ష్మీ పార్వతి, అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మొన్న జరిగిన ఎన్నికలలో ప్రజలు చంద్రబాబు మొహం చూసి ఓట్లేయలేదని, వారు కేవలం స్వర్గీయ యన్టీఆర్ ని చూసి వేసారని అన్నారు. కనీసం ఇప్పుడయినా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి స్వర్గీయ యన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇచ్చేలా చేయాలని కోరారు. రాష్ట్రాభివృద్ధికి తనవంతు కృషి తాను చేస్తానని ఆమె అన్నారు.

స్వర్గీయ యన్టీఆర్ కి కుటుంబ సభ్యుల ఘన నివాళి

  ఈరోజు స్వర్గీయ యన్టీఆర్ 91వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు అందరూ ఆయనకు నివాళి అర్పించేందుకు హైదరాబాద్ లో యన్టీఆర్ ఘాట్ కు తరలివస్తున్నారు. హరికృష్ణ, ఆయన కుమారులు కళ్యాణ్ రామ్, జూ.యన్టీఆర్ లతో కలిసి వచ్చి స్వర్గీయ యన్టీఆర్ కు నివాళులు అర్పించారు.   ఈ సందర్భంగా హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ స్వర్గీయ యన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం వారి సంక్షేమం కోసం పోరాడారని, అందువల్ల తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోతున్నప్పటికీ, రెండు రాష్ట్రాలలో తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో కలిసి మెలిసి జీవించాలని, అభివృద్ధి సాధించాలని, అదే వారు స్వర్గీయ యన్టీఆర్ కి ఇచ్చే ఘన నివాళి అవుతుందని అన్నారు.   హరికృష్ణ కుమారుడు జూ.యన్టీఆర్ మాట్లాడుతూ, ఆ మహానుభావుడు స్వర్గీయ యన్టీఆర్ మళ్ళీ మరొకసారి తెలుగునేలపై పుట్టి, తెలుగునేలను పావనం చేయాలని కోరుకొంటున్నాని అన్నారు.   స్వర్గీయ యన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి, ఆయన కుమార్తె పురందేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు, హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణా రెడ్డి తదితరులు యన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి నివాళులు అర్పించారు. మరికొద్ది సేపటిలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, బాలకృష్ణ తదితరులు వచ్చి స్వర్గీయ యన్టీఆర్ కు నివాళులు అర్పించిన తరువాత అక్కడి నుండి నేరుగా గండిపేటలో జరుగుతున్న మహానాడు సమావేశానికి వెళతారు.

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు అయ్యింది. వచ్చేనెల అంటే జూన్ 8న ఉదయం 11.40 గం.లకు గుంటూరు వద్ద గల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో ప్రజల మధ్య ప్రమాణ స్వీకారం చేస్తారు. అంతకంటే ముందు తెదేపా శాసనసభ్యులు తిరుపతిలో సమావేశమయ్యి చంద్రబాబును తన శాసనసభా పక్షం నేతగా ఎన్నుకొంటారు. చంద్రబాబు జూన్ 8న ప్రమాణస్వీకారం చేసే వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రాష్ట్రపతి పాలనలోనే ఉంటుంది. కానీ జూన్ 2న తెలంగాణాకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తున్నందున, అదేరోజున అక్కడ రాష్ట్రపతి పాలన తొలగించబడుతుంది.

కేజ్రీవాల్ బెయిల్ తీసుకోవాల్సి౦దే..!

      బీజేపీ నేత నితిన్ గడ్కారీ పై అవినీతి ఆరోపణలు చేసినందుకు జైలుపాలయిన మాజీ డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి టైమ్ కలిసి రావడం లేదు. బెయిల్ బాండ్ ఇచ్చేందుకు నిరాకరించి జైల్లో వుండి ప్రజల్లో సింపతి కొట్టేద్దామని అనుకున్న కేజ్రీవాల్ కి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. కేజ్రీవాల్ తన కస్టడీ విషయమై ఢిల్లీ హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. కేజ్రీవాల్ దరఖాస్తును పరిశీలించిన ధర్మాసనం...'బెయిల్‌ తీసుకోడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు.. జైల్లోనే వుండాలని ఎందుకు అనుకుంటున్నారు..’ అని కోర్టు ప్రశ్నించేసరికి, విధిలేని పరిస్థితుల్లో కేజ్రీవాల్‌, బెయిల్‌ తీసుకోవడానికి ఒప్పుకున్నారు. ప్రజలు ఆయనను డిల్లీకి ముఖ్యమంత్రిని చేసి పాలించమని కోరితే, దానిని తృణీకరించిన ఆయన తీహార్ జైలులో ఉండేందుకే ఇష్టపడుతున్నట్లున్నారు. పాపం కోర్టు కూడా ఆయన ముచ్చట కాదనేసింది.

మహానాడులో హరి, బాలయ్యలే ప్రత్యేక ఆకర్షణ

    హైదరాబాద్ గండిపేటలో జరుగుతున్న తెలుగు దేశం పార్టీ 33వ మహానాడులో న౦దమూరి బ్రదర్స్ హరికృష్ణ, బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అందరికంటే ముందుగానే వేదిక దగ్గరకు వచ్చిన నందమూరి హరికృష్ణ నేతలందరిని పలకరిస్తూ సభ వేదికపైన సందడి చేస్తూ కనిపించారు. ఆ తరువాత చంద్రబాబుతో కలిసి బాలకృష్ణ వేదికపైకి వచ్చారు. వేదికపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. చంద్రబాబుతో విభేదాలున్నాయని భావిస్తున్న తరుణంలో హరికృష్ణ మహానాడుకి రావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఎన్నికలకు ముందు హరికృష్ణ, బాబు మధ్య విబేధాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే టిడిపి అధికారంలోకి వచ్చాక హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లు బాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు హరి మహానాడుకు హాజరయ్యారు. దీంతో నందమూరి కుటుంబంలో విభేదాలు తొలగిపోయాయని నందమూరి అభిమానులు, టిడిపి కార్యకర్తలు భావిస్తున్నారు.

మళ్ళీ పోలవరం ముంపు రగడ..!

      పోలవరం ముంపు ప్రాంతాల వివాదం మళ్ళీ మొదలైంది. పోలవరం ప్రాజెక్ట్ కు తాము వ్యతిరేకం కాదని, ఆర్టికిల్ మూడు కింద సరిహద్దులు మార్చాలి తప్ప, ఆర్డినెన్సు ల ద్వారా చేయజాలరని టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ అన్నారు. ఇప్పటికే తాను ఢిల్లీలో కొందరు అధికారులతో మాట్లాడాననీ, వారి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆర్డినెన్స్‌ తయారవుతోందనీ, అలా అర్డినెన్స్‌ తీసుకురావడం దుర్మార్గమనీ ఆయన అన్నారు. ఇరు రాష్ట్రాల శాసనసభల అంగీకారం లేకుండానే సరిహద్దులు మార్చరాదని కేసీఆర్‌ అంటున్నారు. పోలవరం డ్యాం నిర్మించే ప్రాంతంలో భూకంపం ముప్పు ఉందని నిపుణులు చెప్పారని, సీమాంధ్ర నీటి పారుదల నిపుణులే ప్రస్తుత డిజైన్ ను వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపారు.

అభివృద్ధి కోసం కష్టపడాలి: బాబు పిలుపు

    కష్టకాలంలో కష్టపడి పనిచేయాలి, ప్రతికూల పరిస్థితులను ప్రజా శ్రేయస్సుకు అనుగుణంగా మార్చుకోవాలి అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు. ప్రస్తుతం సీమాంధ్రలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని, అలాగే తెలంగాణాలో సామాజిక న్యాయాన్ని సాధించవలసిన అవసరం ఉన్నదని ఆయన గుర్తు చేశారు. ఈ 32 ఏళ్లలో అనేక దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయి, మనం జాతీయ పార్టీగా మారుతున్నాం అంటూ ప్రతి ఒక్కరం మరింత దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని ఆయన పిలుపు ఇచ్చారు. ప్రజలు మన మీద ఆశలు పెట్టుకున్నారు, రాష్ట్ర సమస్యల పరిష్కారంకోసం మనం రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలోకి తీసుకువెళ్లాలని ఆయన అన్నారు. సంక్షోభాలను మనం ఒక అద్భుత అవకాశంగా తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అభివృద్ధికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చుదిద్దుదాం, యువతకు మంచి భవితను ఇద్దాం, ఇదే ఇప్పుడు మన అందరి తక్షణ కర్తవ్యం అని చంద్రబాబు దిశానిర్దేశనం చేశారు.

మోడీ కేబినెట్‌: మంత్రులు..శాఖలు

      రాజ్‌నాథ్‌సింగ్‌ - హోంశాఖ సుష్మా స్వరాజ్‌ - విదేశీ వ్యవహారాల శాఖ అరుణ్‌ జైట్లీ - ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాలు, రక్షణ శాఖ వెంకయ్యనాయుడు - అర్బన్‌ డెవలప్‌మెంట్‌, హౌసింగ్‌, పేదరిక నిర్మూలన శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నితిన్‌ గడ్కరీ - రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, జాతీయ రహదారులు, షిప్పింగ్‌ సదానంద గౌడ - రైల్వే శాఖ ఉమా భారతి - నదీ జలాల శాఖ, గంగా పరిరక్షణ నజ్మా హెప్తుల్లా - మైనార్టీ ఎఫైర్స్‌ గోపీనాథ్‌ రావ్‌ ముండే - రూరల్‌ డెవలప్‌మెంట్‌, పంచాయితీ రాజ్‌, తాగునీటి శాఖ రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ - ఆహార, ప్రజా పంపిణీ మనేకా గాంధీ - మహిళా శిశు సంక్షేమ శాఖ అనంతకుమార్‌ - కెమికల్స్‌, ఫెర్టిలైజర్స్‌ రవిశంకర్‌ ప్రసాద్‌ - కమ్యూనికేషన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, న్యాయ శాఖ అశోక్‌ గజతిరాజు - పౌర విమాన యాన శాఖ అనంత్‌ గీతే - భారీ పరిశ్రమల శాఖ హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ - ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీస్‌ శాఖ నరేంద్ర సింగ్‌ తోమార్‌ - గనులు, ఉక్కు, లేబర్‌ అండ్‌ ఎంప్లాయిమెంట్‌ జువల్‌ ఓరమ్‌ - ట్రైబల్‌ ఎఫైర్స్‌ రాధామోహన్‌ సింగ్‌ - అగ్రికల్చర్‌ థావర్‌ చంద్‌ గెమ్లాట్‌ - సోషల్‌ జస్టీస్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ స్మృతి ఇరానీ - హ్యూమన్‌ రీసోర్సెస్‌ డెవలప్‌మెంట్‌ హర్షవర్ధన్‌ - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ స్వతంత్ర హోదా సహాయ మంత్రులు జనరల్‌ వీకే సింగ్‌ - డెవలప్‌మెంట్‌ నార్త్‌ ఈస్ట్‌ రీజియన్‌ (స్వతంత్ర), విదేశీ వ్యవహారాలు ఇంద్రజిత్‌ సింగ్‌ రావు - ప్లానింగ్‌ (స్వతంత్ర), స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ (స్వతంత్ర), రక్షణ శాఖ సంతోష్‌కుమార్‌ గంగ్వార్‌ - టెక్స్‌టైల్స్‌ (స్వతంత్ర), పార్లమెంటరీ వ్యవహారాలు, జల వనరుల శాఖ, గంగా పరిరక్షణ శిర్పాద్‌ ఎస్సో నాయక్‌ - కల్చర్‌, టూరిజం (స్వతంత్ర) ధర్మేంద్ర ప్రధాన్‌ - పెట్రోలియం, సహజ వాయువు (స్వతంత్ర) సర్బనంద సోనోవాల్‌ - స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, యూత్‌ ఎఫైర్స్‌ మరియు క్రీడలు (స్వతంత్ర) ప్రకాష్‌ జవదేకర్‌ - సమాచార, ప్రసార శాఖ (స్వతంత్ర), పర్యావరణ, అటవీ శాఖ (స్వతంత్ర), పార్లమెంటరీ వ్యవహారాలు పియూష్‌ గోయెల్‌ - పవర్‌, కోల్‌ (స్వతంత్ర) జితేంద్ర సింగ్‌ - సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎర్త్‌ సైన్సెస్‌ (స్వతంత్ర), పీఎంవో, పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ మరియు పెన్షన్స్‌, అణుశక్తి శాఖ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ నిర్మలా సీతారామన్‌ - కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (స్వతంత్ర), ఫైనాన్స్‌, కార్పొరేట్‌ ఎఫైర్స్‌ సహాయ మంత్రులు... జీఎం సిద్దేశ్వర - పౌర విమానయానం మనోజ్‌ సిన్హా - రైల్వే నిశ్చలానంద్‌ - రసాయనాలు, ఎరువులు ఉపేంద్ర కుషావహా - రూరల్‌ డెవలప్‌మెంట్‌, పంచాయితీరాజ్‌, తాగునీరు రాధాక్రిష్ణన్‌ - భారీ పరిశ్రమల శాఖ, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కీరన్‌ రిజ్జు - హోం శాఖ క్రిష్ణపాల్‌ - రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, హైవేస్‌, షిప్పింగ్‌ సంజీవ్‌ కుమార్‌ బాల్యన్‌ - వ్యవసాయం, ఫుడ్‌ ప్రోసెసింగ్‌ ఇండస్ట్రీస్‌ మన్సుక్‌భాయ్‌ ధంజీభాయ్‌ వాసవ - ట్రైబల్‌ ఎఫైర్స్‌ రావ్‌ సాహెబ్‌ దాదారావ్‌ దాన్వే - కన్జ్యూమర్‌ ఎఫైర్స్‌, ఫుడ్‌ అండ్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ విష్ణు దేవ్‌ సాయి - గనులు, స్టీలు, లేబర్‌ అండ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ సుదర్శన్‌ భగత్‌ - సోషల్‌ జస్టీస్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌

పి.వి.స్మారక చిహ్నం పెట్టిస్తా: మహానాడులో బాబు

      కాంగ్రెస్‌పై రాజీలేని పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీయేనని చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు. టీడీపీపై కుట్రపన్నినవారు భూస్థాపితమయ్యారని వెల్లడించారు. ఆనాడు ప్రధానిగా పివి నరసింహ రావు అయితే ఆయనకు గౌరవించడం కోసం ఎన్టీఆర్ పోటీ పెట్టలేదని,కాంగ్రెస్ మాత్రం పివిని అవమానించిందని అన్నారు. ఢిల్లీలో పీవీకి స్మారకచిహ్నం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ ఏ నాడు అధికారం కోసం పాకులాడలేదని, దేశం సుస్థిర పాలనకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. తాగు, సాగునీరు, మౌలిక వసతులకు ప్రాధాన్యత కల్పించామన్నారు. కాంగ్రెస్ అవినీతితోనే దేశ ప్రతిష్ట పోయిందని మండిపడ్డారు. దేశ సంపదను కొల్లగొట్టి విదేశాల్లో దాచుకున్నారని, అవినీతిపరులకు సహకరించి దేశాన్ని భ్రష్టుపట్టించారన్నారు. కాంగ్రెస్ పరిస్థితి ప్రాంతీయ పార్టీకన్నా హీనంగా ఉందని బాబు వ్యాఖ్యానించారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌కు 2 శాతం ఓట్లురాలేదని ఎద్దేవా చేశారు.