మళ్ళీ ఢిల్లీ పీఠ౦ ఎక్కేందుకు ఆమాద్మీ తయార్
రాజకీయాలలోకి ప్రవేశించిన ఏడాదిలోగానే డిల్లీ గద్దెను అధిష్టించి, యావత్ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించిన ఆమాద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్, అంతకంటే పదింతలు వేగంగా తన ప్రాభవం కోల్పోయారు. అత్యంత జనాదరణతో డిల్లీ పీటం అధిష్టించిన ఆయన, జనలోక్ పాల్ బిల్లుకి కాంగ్రెస్, బీజేపీలు మద్దతు ఇవ్వలేదనే వంక పెట్టుకొని కేవలం 49 రోజులలోనే ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని పదవి నుండి దిగిపోయి ప్రజలలో నవ్వులపాలయ్యారు. డిల్లీ వంటి అతిచిన్న రాష్ట్రాన్నే పాలించలేని ఆయన, ఏకంగా దేశాన్నే పాలించేసేందుకు సిద్దమయిపోయి, తన పార్టీని దేశవ్యాప్తంగా ఎన్నికల బరిలోకి దింపి మరోమారు అభాసుపలయ్యారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నంత కాలం కూడా ఆయనకు ప్రజల నుండి అనేక అవమానాలు ఎదురవుతున్నా పరిస్థితిని అర్ధం చేసుకోకుండా, ఏకంగా నరేంద్ర మోడీతోనే వారణాసిలో తలపడి మరోమారు భంగపడ్డారు. వరుసపెట్టి ఇన్నిసార్లు పరాభవం జరిగిన తరువాత కూడా ఆయనలో ఎటువంటి మార్పు రాలేదని రుజువు చేస్తూ, మళ్ళీ డిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గాను నిన్న డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను కలిసారు. తమ పార్టీకి మరోమారు అవకాశం ఇచ్చినట్లయితే డిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలమని ఆయనను కోరారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయిన 26 మంది యం.యల్యేలు తన వద్దలేనప్పటికీ, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తన 8మంది యం.యల్యేల మద్దతు ఇస్తుందనే గుడ్డి నమ్మకంతో కేజ్రీవాల్ గవర్నర్ ని కలిసారు. కానీ, ఆమాద్మీ పార్టీకి ఇక మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పడంతో మరోమారు అవమానం ఎదురయింది. అసలు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందో లేదో తెలుసుకోకుండానే ఆయన గవర్నర్ వద్దకు వెళ్ళడం ఒక పొరపాటయితే, అది సరిపోదన్నట్లుగా మళ్ళీ ఆయన తనకు బాగా తెలిసిన విద్య- ప్రజాభిప్రాయం కోరుతూ రిఫరెండం నిర్వహించేందుకు సన్నదమవుతున్నారు. ఇప్పటికే మసకబారిన తన ప్రతిష్టని, ఆమాద్మీ పార్టీ ప్రతిష్టని బహుశః మరొకమారు పరీక్షించి చూసుకోవాలని ప్రయత్నిస్తున్నారనుకోవాలి.