బాబు మొహం చూసి ప్రజలు ఓటేయలేదు: లక్ష్మీ పార్వతి
posted on May 28, 2014 @ 10:12AM
రాజకీయాలలో శాశ్విత మిత్రులు కానీ, శత్రువులు గానీ ఉండరని అందరూ అంటారు. కానీ కొందరు వ్యక్తులను చూస్తే ఆమాట నిజం కాదేమోననిపిస్తుంది. అటువంటి ‘ప్రియ శత్రువులు’ మన రాష్ట్ర రాజకీయనాయకులలో చాలా మందే ఉన్నారు. ఉదాహరణకు చంద్రబాబును లక్ష్మీపార్వతి ఎల్లపుడూ ద్వేషిస్తూనే ఉంటుంది. ఆమె ఏ సందర్భంలో ఏ విషయం గురించి మాట్లాడినా, చివరికి చంద్రబాబును విమర్శించడంతోనే ముగించడం ఆమెకు అలవాటు. కానీ, ఆమె విమర్శలను చంద్రబాబు ఎన్నడూ పట్టించుకొన్న దాఖలాలు లేవు. అయినప్పటికీ ఆమె తన అలవాటు ప్రకారం ఆయనపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
ఈరోజు స్వర్గీయ యన్టీఆర్ 91వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో యన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి వచ్చిన లక్ష్మీ పార్వతి, అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మొన్న జరిగిన ఎన్నికలలో ప్రజలు చంద్రబాబు మొహం చూసి ఓట్లేయలేదని, వారు కేవలం స్వర్గీయ యన్టీఆర్ ని చూసి వేసారని అన్నారు. కనీసం ఇప్పుడయినా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి స్వర్గీయ యన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇచ్చేలా చేయాలని కోరారు. రాష్ట్రాభివృద్ధికి తనవంతు కృషి తాను చేస్తానని ఆమె అన్నారు.